వసతులు లేకున్నా వైద్య కళాశాల!
సాక్షి, హైదరాబాద్: ఆస్పత్రి లేదు, వైద్యులు లేరు, రోగులు లేరు.. అయినా అక్కడ వైద్య కళాశాల ఏర్పాటుకు అనుమతిచ్చారు! ఎలాంటి వసతులు లేకపోయినా ప్రభుత్వమే ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్ మంజూరు చేసింది! రెండు తెలుగు రాష్ట్రాల్లో 11 కళాశాలలకు ఇలా ఆయా ప్రభుత్వాలు ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్లు మంజూరు చేయడంపై భారతీయ వైద్యమండలి(ఎంసీఐ) ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీచేసిన విషయం విదితమే. కొన్నిచోట్ల చిన్న గది కూడా లేకపోయినా ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్ మంజూరు చేశారు.
అలా మంజూరు చేసిన వాటిలో ఆంధ్రప్రదేశ్‌లో అపోలో ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్(చిత్తూరు), శ్రీనివాస ఎడ్యుకేషనల్ అకాడమీ(చిత్తూరు), నిమ్రా ఎడ్యుకేషనల్ సొసైటీ(జూపూడి), గాయత్రీ విద్యాపరిషత్ సొసైటీ(విశాఖపట్నం) ఉన్నాయి. తెలంగాణలో ఈఎస్‌ఐ మెడికల్ కళాశాలతోపాటు సెయింట్ అగస్టీన్ ఎడ్యుకేషనల్ సొసైటీ (పటాన్‌చెరు), ఆలేటి సునీత ఎడ్యుకేషనల్ సొసైటీ(మెదక్), బీఎంఎంటీ ఇన్‌స్టిట్యూట్(వికారాబాద్), ఆయాన్ మెడికల్ కళాశాల ఉన్నాయి.