సాక్షి, విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) స్థానంలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను నిరసిస్తూ వైద్యులంతా ప్రధాని నరేంద్ర మోదీ ‘నమో’ యాప్‌కు ఫిర్యాదులు పంపాలని నిర్ణయించారు. ఇందుకోసం వారు ‘నమో యాప్’ను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. ఈ యాప్ ద్వారా దేశంలోని సుమారు 10 లక్షల మంది వైద్యులు తమ అభ్యంతరాలను ప్రధానికి పంపనున్నారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ) ఏర్పాటును దేశవ్యాప్తంగా వైద్యులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. డాక్టర్ల వైఖరిని దృష్టిలో ఉంచుకున్న కేంద్ర ప్రభుత్వం స్టాండింగ్ కౌన్సిల్‌కు పంపింది. మరోవైపు ఎన్‌ఎంసీపై వైద్యులు ఆందోళనలు చేపట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇందుకోసం వైద్య సంఘాల నేతలు, సీనియర్ వైద్యుల నేతృత్వంలో సమావేశాలు నిర్వహించాలని యోచిస్తున్నారు. ఎన్‌ఎంసీ బిల్లు ఆమోదం పొంది అమలులోకి వస్తే వైద్య రంగంలో అవినీతి మరింత పెరుగుతుందని వీరు చెబుతున్నారు. ఎన్‌ఎంసీలో ఉండే 25 మంది సభ్యుల్లో 20 మందిని వైద్యేతర రంగంలో ఉన్న వారిని ప్రభుత్వమే నామినేట్ చేసుకుంటుందని, ఐదుగురే వైద్యులుంటారని చెబుతున్నారు. మెజార్టీ సభ్యులు ప్రభుత్వం నామినేట్ చేసిన వారే కావడంతో ప్రభుత్వానికి విధేయులుగా ఉంటారని, దీంతో వైద్యరంగంతో సంబంధం లేని వారి నిర్ణయాలే అమలవుతాయని పేర్కొంటున్నారు. మెడికల్ కాలేజీల తనిఖీకి అప్పటికప్పుడే త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తారని, ఇది కూడా అవినీతికి దారితీస్తుందంటున్నారు. ప్రస్తుతం ఉన్న ఎంసీఐ విధానంలో లోపాలను సవరించాలని, లేదంటే ప్రక్షాళన చేయాలి తప్ప ఎన్‌ఎంసీకి ఆమోద్ర ముద్ర వేయడానికి వీల్లేదని తెగేసి చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment