* ముగిసిన భారతీయ వైద్య మండలి(ఎంసీఐ) ఎన్నికలు
* ఉద్యమంలో పాల్గొంటున్నా సహకరించిన ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్/విజయవాడ: రాష్ట్రం నుంచి భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) సభ్యులుగా నలుగురు ఎన్నికయ్యారు. ప్రైవేటు వైద్య కళాశాలల అసోసియేషిన్ అధ్యక్షుడు డా. గన్ని భాస్కరరావు (25 ఓట్లు), రాష్ట్ర అకడమిక్ వైద్య విద్యా సంచాలకులు డా. వెంకటేష్ (22 ఓట్లు), నీలోఫర్ ఆస్పత్రికి చెందిన చిన్నపిల్లల శస్త్రచికిత్స నిపుణులు డా. రమేష్‌రెడ్డి (21 ఓట్లు), విశాఖపట్నం ఎన్‌ఆర్‌ఐ మెడికల్ కళాశాల అధ్యాపకుడు డా. గుణశేఖర్ (25 ఓట్లు) ఎంసీఐ సభ్యులుగా ఎన్నికైన వారిలో ఉన్నారు.
ఎంసీఐ సభ్యుల ఎన్నిక సోమవారం విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివ ర్సిటీలో ప్రశాంతంగా జరిగింది. 16 మంది అభ్యర్థులు ఈ పదవులకు పోటీ చేశారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అకడమిక్ సెనేట్ సభ్యులు వీరిని ఎన్నుకున్నారు. ఈ సెనేట్‌లో ముగ్గురు ఐఏఎస్ అధికారులు, స్విమ్స్, నిమ్స్ డెరైక్టర్లు, ఆయుష్ కమిషనర్‌తో పాటు మరో 57 మంది వివిధ ఆస్పత్రులకు చెందిన వైద్యులున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా హెల్త్ వర్సిటీ ఉద్యోగులు విధులు బహిష్కరిస్తున్నప్పటికీ .. రాష్ట్రానికి చెందిన సభ్యులు ఎంసీఐలో ప్రాతినిధ్యం వహించాలన్న ఆలోచనతో ఉద్యోగులు ఈ ఎన్నికకు సహకరించారు.
ఎన్నికలకు హాజరైన వారికి వర్సిటీ ఉద్యోగులు సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ పుష్పాలతో స్వాగతం పలికారు. దీంతో ఎన్నికలు ఎటువంటి గందరగోళం లేకుండా జరిగాయి. ఎన్నికలకు సహకరించినందుకు వీసీ డాక్టర్ ఐవీ రావు ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల అనంతరం యూనివర్సిటీ పాలకమండలి సమావేశం నిర్వహించారు. ఇందులో హెల్త్ యూనివర్సిటీ రెక్టార్‌గా పనిచేస్తున్న రమణమ్మ పదవీకాలం ఈ నెలాఖరులో ముగియనుండగా, మరో ఏడాది పొడిగించేందుకు నిర్ణయం తీసుకున్నారు.
ఇటీవల ఉద్యోగులకు ఇచ్చిన పదోన్నతులను పాలకమండలి ఆమోదించింది. త్వరలోనే దేశవ్యాప్తంగా ఎంసీఐకి కొత్త గవర్నింగ్ బాడీకి ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రం నుంచి ఎంపికైన నలుగురు సభ్యులకు ఎంసీఐ గవర్నింగ్ బాడీ ఎన్నికల్లో పాల్గొనే హక్కు ఉంటుంది. వీరి పదవీకాలం నాలుగేళ్ల పాటు ఉంటుంది. ఇలా సెనేట్ నుంచి ఎన్నికలు జరగడం మన రాష్ట్రంలోనే తొలిసారి అని కొత్తగా ఎన్నికైన ఎంసీఐ సభ్యుడు డా. గన్ని భాస్కరరావు తెలిపారు.
ఎంసీఐకి నలుగురు ఎంపిక
Published Tue, Aug 20 2013 4:20 AM | Last Updated on Fri, Sep 1 2017 9:55 PM
Advertisement
Advertisement