సాక్షి, హైదరాబాద్ : భారతీయ వైద్య మండలి(ఎంసీఐ)కి అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు డిసెంబర్‌లో జరగనున్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఈ ఎన్నికల్లో ఇటీవలే వివిధ రాష్ట్రాల నుంచి ఎంసీఐకి ఎన్నికైన సభ్యులు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులతో పాటు కార్యనిర్వాహక సంఘం(ఈసీ) సభ్యులు, పీజీ కమిటీ సభ్యులు ఎన్నుకోనున్నారు. మొత్తం 68 మంది ఓటింగ్‌లో పాల్గొంటారు. 9 మంది ఈసీ మెంబర్లను, ముగ్గురు పీజీ కమిటీ సభ్యులను ఎన్నుకుంటారు. డిసెంబర్ 10న ఢిల్లీలో సర్వసభ్య సమావేశం జరుగుతుంది. మరుసటి రోజు ఎన్నికలు నిర్వహిస్తారు. మన రాష్ట్రానికి ఈసారి ఈసీలో ప్రాతినిధ్యం దక్కే అవకాశం కనిపిస్తోంది.
2 దశాబ్దాలుగా ఎంసీఐలో మనకు సరైన ప్రాతినిధ్యం లేదు. మన రాష్ట్రం నుంచి ఈ ఏడాది ఎంసీఐ సభ్యులుగా డా.రమేష్‌రెడ్డి, డా.గుణశేఖర్, డా.గన్ని భాస్కరరావు, డా.వెంకటేష్ ఎన్నికయ్యారు. డా.పుట్టా శ్రీనివాస్ నామినేట్ అయ్యారు. ఈసీ లేదా పీజీ కమిటీ సభ్యులుగా వీరిలో కొందరు పోటీ చేస్తున్నారు. ఎంసీఐ అధ్యక్ష స్థానానికి కూడా పోటీకి దిగేందుకు ఒకరిద్దరు యత్నిస్తున్నారు. ఎంసీఐలో మనకు సముచిత స్థానం లేని కారణంగా గతంలో కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతులు, పీజీ సీట్ల పెంపు విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. కొత్త కార్యవర్గంలోనైనా ప్రాధాన్యం దక్కితే రాష్ట్రానికి మేలు జరుగుతుందని పలువురు వైద్య నిపుణులు భావిస్తున్నారు.