రాజ్యాంగ పీఠంపై న్యాయ కోవిదుడు | Vice President Election 2022: Jagdeep Dhankhar is From Lawyer To Vice President | Sakshi
Sakshi News home page

రాజ్యాంగ పీఠంపై న్యాయ కోవిదుడు

Published Sun, Aug 7 2022 4:37 AM | Last Updated on Sun, Aug 7 2022 5:42 AM

Vice President Election 2022: Jagdeep Dhankhar is From Lawyer To Vice President - Sakshi

దేశ 14వ ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన జగదీప్‌ ధన్‌ఖడ్‌ వృత్తి రీత్యా లాయర్‌. రాజకీయాల్లోకి వచ్చినా సుప్రీంకోర్టు లాయర్‌గా పని చేస్తూనే వచ్చారు. ఎంపీ నుంచి గవర్నర్‌గా, అక్కడి నుంచి తాజాగా ఉపరాష్ట్రపతి దాకా జనతాదళ్, కాంగ్రెస్‌ల మీదుగా బీజేపీ దాకా ఆయనది ఆసక్తికర ప్రస్థానం.

రాజస్తాన్‌లోని ఝుంఝును జిల్లాలో కిథానా అనే కుగ్రామంలో జాట్ల కుటుంబంలో 1951 మే 18న ధన్‌ఖడ్‌ జన్మించారు. చదువులో చురుగ్గా ఉండేవారు. చిత్తోర్‌గఢ్‌ సైనిక స్కూలులో మెరిట్‌ స్కాలర్‌షిప్‌తో ప్రాథమిక విద్య, జైపూర్‌ మహారాజా కాలేజీలో డిగ్రీ చేశారు.

ఎల్‌ఎల్‌బీ పూర్తయ్యాక రాజస్తాన్‌ బార్‌ కౌన్సిల్‌లో 1979లో అడ్వకేట్‌గా నమోదు చేసుకున్నారు. 1990లో సుప్రీంకోర్టులో లాయర్‌గా ప్రాక్టీసు మొదలు పెట్టి మంచి గుర్తింపు సంపాదించారు. 2019లో పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ అయ్యేదాకా ప్రాక్టీస్‌ చేస్తూనే ఉన్నారు. సైనిక స్కూల్‌ చిన్నప్పట్నుంచే క్రమశిక్షణ నేర్పింది. రాజ్యాంగం, చట్టాలు, సెక్షన్లు కొట్టిన పిండి.

దేవీలాల్‌ అడుగు జాడల్లో  
యువకుడిగా ఉండగానే ధన్‌ఖడ్‌ జనతాదళ్‌లో చేరారు. ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ వ్యవస్థాపకుడు దేవీలాల్‌ అడుగుజాడల్లో నడిచారు. ఆయన ఆశీస్సులతో 1989లో ఝుంఝును నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. నాటి వీపీ సింగ్‌ సర్కార్‌ నుంచి దేవీలాల్‌ బయటికొచ్చినప్పుడు ధన్‌ఖడ్‌ ఆయన వెంటే నడిచారు. చంద్రశేఖర్‌ కేబినెట్‌లో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా చేశారు. పీవీ నరసింహారావు హయాంలో ఆయన విధానాలకు ఆకర్షితులై కాంగ్రెస్‌లో చేరారు.

రాజస్తాన్‌ కాంగ్రెస్‌లో అశోక్‌ గెహ్లాట్‌ హవా పెరుగుతూండటంతో 2003లో బీజేపీలో చేరారు. రాష్ట్ర బీజేపీలో వసుంధర రాజెకు దగ్గరయ్యారు. కానీ రాజకీయంగా పెద్దగా ఎదగలేదు. పదేళ్ల పాటు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. ఆ సమయంలో సుప్రీంకోర్టు లాయర్‌గా మంచి పేరు సంపాదించారు. 2019 జులైలో పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు.

జాట్ల నేత కావడం ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ ఆయన్ను ఎంచుకోవడంలో కీలకంగా నిలిచింది. లాయర్‌గా లోతైన పరిజ్ఞానం, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా అనుభవం అదనపు అర్హతలు మారాయి. ఎన్డీఏకు ఇంకా పూర్తి మెజారిటీ లేని రాజ్యసభలో త్వరలో కీలక బిల్లుల ఆమోదం ఉన్నందున న్యాయ, పాలనా, రాజ్యాంగపరంగా లోతుపాతులు తెలిసిన వ్యక్తి చైర్మన్‌గా ఉండనుండటం బీజేపీకి ఊరటే.

ప్రయాణాలంటే ఇష్టం
జగదీప్‌ భార్య సుదేశ్‌ సామాజిక కార్యకర్త. ఆర్థికశాస్త్రంలో పీజీ చేశారు. కుమార్తె కామ్నా సుప్రీంకోర్టు లాయర్‌ కార్తికేయ వాజపేయిని పెళ్లి చేసుకున్నారు. ధన్‌ఖడ్‌కు క్రికెట్, ప్రయాణాలు చాలా ఇష్టం. దేశ విదేశాలు విపరీతంగా తిరిగారు. కుటుంబంతో కలిసి ఎన్నో ప్రయాణాలు చేశారు. రాష్ట్రపతి ముర్ము మాదిరిగానే ఆయన కూడా ఆధ్యాత్మిక బాటలో ఉన్నారు.

రూ.4 లక్షల వేతనం
ఉపరాష్ట్రపతి రాజ్యాంగపరంగా దేశంలో రెండో అత్యున్నత పదవి. పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభ చైర్మన్‌గా కూడా ఉపరాష్ట్రపతి వ్యవహరిస్తారు. నెలకు రూ.4 లక్షల అందుతుంది. ఇతర భత్యాలు, అలవెన్సులు లోక్‌సభ స్పీకర్‌తో సమానంగా ఉంటాయి. ఉచిత బంగ్లా, ఉచిత వైద్యం, విమానాలు, రైళ్లలో ఉచిత ప్రయాణాలు, ల్యాండ్, మొబైల్‌ ఫోన్లు, వ్యక్తిగత సిబ్బంది, భద్రతా సిబ్బంది తదితర సదుపాయాలుంటాయి. పదవీకాలం ముగిశాక వేతనంలో సగం పెన్షన్‌ కింద వస్తుంది.  

మమతతో ఢీ అంటే ఢీ
పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీతో నిత్యం ఢీ అంటే ఢీ అంటూ ధన్‌ఖడ్‌ ఎప్పడూ వార్తల్లో నిలిచారు. బీజేపీ ఏజెంట్‌ అంటూ ఆయన్ను మమతా నిందించేవారు. తన లాయర్‌ పరిజ్ఞానంతో మమత సర్కారుని ఇరకాటంలోకి  పెట్టడానికి ప్రయత్నించేవారు. పరిస్థితి చివరికి గవర్నర్‌ స్థానంలో సీఎంను రాష్ట్ర పరిధిలోని యూనివర్సిటీల చాన్సలర్‌గా మారుస్తూ మమత చట్టం చేసేదాకా వెళ్లింది! ఇలా వారిద్దరూ ఉప్పూనిప్పుగా ఉన్న సమయంలోనే ధన్‌కడ్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే ఎంపిక చేసింది.

– నేషనల్‌ డెస్క్, సాక్షి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement