సజన్ ప్రకాశ్‌కు ట్రోఫీ అందజేస్తున్న గుజరాత్ సీఎం భూపేంద్రభాయ్ పటేల్; స్వర్ణంతో హుసాముద్దీన్
అహ్మదాబాద్: జాతీయ క్రీడల్లో మళ్లీ సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు (ఎస్‌ఎస్‌సీబీ) జట్టే సత్తా చాటుకుంది. ‘సెంచరీ’ని మించిన పతకాలతో ‘టాప్’ లేపింది. సర్వీసెస్ క్రీడాకారులు మొత్తం 128 పతకాలతో అగ్రస్థానంలో నిలిచారు. ఇందులో 61 స్వర్ణాలు, 35 రజతాలు, 32 కాంస్యాలున్నాయి. అట్టహాసంగా ఆరంభమైన 36వ జాతీయ క్రీడలకు బుధవారం తెరపడింది.
28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 8000 పైచిలుకు అథ్లెట్లు ఈ పోటీల్లో సందడి చేశారు. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో 38, అక్వాటిక్స్‌లో 36 జాతీయ క్రీడల రికార్డులు నమోదయ్యాయి. ఆఖరి రోజు వేడుకలకు భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ముఖ్య అతిథిగా విచ్చేయగా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు పాల్గొన్నారు. తదుపరి జాతీయ క్రీడలకు వచ్చే ఏడాది గోవా ఆతిథ్యమిస్తుంది.
► వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఈ జాతీయ క్రీడలు గోవాలో జరగాలి. కానీ అనూహ్యంగా గుజరాత్‌కు కేటాయించగా... నిర్వాహకులు వంద రోజుల్లోపే వేదికల్ని సిద్ధం చేయడం విశేషం. పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ ఇండోర్ స్టేడియంలో ముగింపు వేడుకలు జరిగాయి.
► పురుషుల విభాగంలో ఎనిమిది పతకాలు సాధించిన కేరళ స్విమ్మర్ సజన్ ప్రకాశ్ (5 స్వర్ణాలు, 2 రజతాలు, 1 కాంస్యం) ‘ఉత్తమ క్రీడాకారుడు’గా... మహిళల విభాగంలో ఏడు పతకాలు సాధించిన కర్ణాటకకు చెందిన 14 ఏళ్ల స్విమ్మర్ హషిక (6 స్వర్ణాలు, 1 కాంస్యం) ‘ఉత్తమ క్రీడాకారిణి’గా పురస్కారాలు గెల్చుకున్నారు. గత జాతీయ క్రీడల్లోనూ (2015లో కేరళ) సజన్ ప్రకాశ్ ‘ఉత్తమ క్రీడాకారుడు’ అవార్డు అందుకోవడం విశేషం.
► చివరిరోజు తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ ‘పసిడి పంచ్’తో అలరించాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన హుసాముద్దీన్ సర్వీసెస్ తరఫున ఈ క్రీడల్లో పాల్గొన్నాడు. 57 కేజీల ఫైనల్లో హుసాముద్దీన్ 3–1తో సచిన్ సివాచ్ (హరియాణా)పై గెలిచాడు.
► ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఓవరాల్ చాంప్ సర్వీసెస్‌కు ‘రాజా భళీంద్ర సింగ్’ ట్రోఫీని అందజేశారు. సర్వీసెస్ నాలుగోసారి ఈ ట్రోఫీ చేజిక్కించుకుంది. 39 స్వర్ణాలు, 38 రజతాలు, 63 కాంస్యాలతో కలిపి మొత్తం 140 పతకాలు సాధించి రెండో స్థానంలో నిలిచిన మహారాష్ట్రకు ‘బెస్ట్ స్టేట్’ ట్రోఫీ లభించింది. ఓవరాల్‌గా సర్వీసెస్‌కంటే మహా రాష్ట్ర ఎక్కువ పతకాలు సాధించినా స్వర్ణాల సంఖ్య ఆధారంగా సర్వీసెస్‌కు టాప్ ర్యాంక్ దక్కింది.
► తెలంగాణ 8 స్వర్ణాలు, 7 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి మొత్తం 23 పతకాలతో 15వ స్థానంలో... ఆంధ్రప్రదేశ్ 2 స్వర్ణాలు, 9 రజతాలు, 5 కాంస్యాలతో కలిపి మొత్తం 16 పతకాలతో 21వ స్థానంలో నిలిచాయి. 2015 కేరళ జాతీయ క్రీడల్లో తెలంగాణ 8 స్వర్ణాలు, 14 రజతాలు, 11 కాంస్యాలతో కలిపి మొత్తం 33 పతకాలతో 12వ స్థానంలో... ఆంధ్రప్రదేశ్ 6 స్వర్ణా లు, 3 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి మొత్తం 16 పతకాలతో 18వ స్థానంలో నిలిచాయి.
హషికకు ట్రోఫీ ప్రదానం చేస్తున్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా
Comments
Please login to add a commentAdd a comment