National sports awards
-
ప్రతిభకు పట్టం...క్రీడాకారులకు అందలం
న్యూఢిల్లీ: ఆటల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన భారత క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2024 సంవత్సరానికిగాను జాతీయ క్రీడా పురస్కారాలు అందజేశారు. శుక్రవారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి అవార్డులు బహూకరించారు. పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు నెగ్గిన మహిళా స్టార్ షూటర్ మనూ భాకర్ (హరియాణా), ప్రపంచ చెస్ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ (తమిళనాడు), భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (పంజాబ్), పారిస్ పారాలింపిక్స్ స్వర్ణ పతక విజేత ప్రవీణ్ కుమార్ (ఉత్తరప్రదేశ్)లకు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న’ పురస్కారం దక్కింది. పారా స్విమ్మర్ మురళీకాంత్ పేట్కర్‌కు అర్జున అవార్డు (జీవిత సాఫల్య) అందిస్తున్న సమయంలో సెంట్రల్ హాల్ చప్పట్లతో మారుమోగింది. స్వతంత్ర భారత దేశంలో ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు నెగ్గిన తొలి అథ్లెట్‌గా రికార్డు సృష్టించిన 22 ఏళ్ల షూటర్ మనూ భాకర్ మాట్లాడుతూ... ‘దేశ అత్యున్నత క్రీడా పురస్కారం అందుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. నిదానమే ప్రధానం అని నేను నమ్ముతా. సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని పేర్కొంది. ‘కల నిజమైంది. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఖేల్ రత్న అవార్డు అందుకున్న రెండో చెస్ ప్లేయర్‌ను కావడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి మరెన్నో ఘనతలు అందుకునేందుకు ఇది మరింత స్ఫూర్తినిస్తుంది’ అని 18 ఏళ్లకే చదరంగ విశ్వ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన గుకేశ్ అన్నాడు. 32 మంది అథ్లెట్లకు అర్జున అవార్డులు దక్కగా... వారిలో 17 మంది పారాథ్లెట్లు ఉండటం విశేషం. ‘అర్జున అవార్డు’ దక్కిన వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన జ్యోతి యర్రాజీ (ఆంధ్రప్రదేశ్), జివాంజి దీప్తి (తెలంగాణ) కూడా ఉన్నారు.జ్యోతి దక్షిణాఫ్రికాలో జరుగుతున్న శిక్షణ శిబిరంలో ఉండటంతో ఈ అవార్డుల కార్యక్రమానికి హాజరుకాలేదు. పారిస్ పారాలింపిక్స్‌లో పతకాలు నెగ్గిన దివ్యాంగ క్రీడాకారులకు అవార్డులు అందజేస్తున్న సమయంలో రాష్ట్రపతి సంప్రదాయాన్ని పక్కనపెట్టి... పారాథ్లెట్లకు సౌకర్యవంతంగా ఉండేందుకు తన స్థానం నుంచి ముందుకు రావడం ఆహుతులను ఆకర్షించింది. ‘ఖేల్ రత్న’ అవార్డు గ్రహీతలకు రూ. 25 లక్షలు... అర్జున, ద్రోణాచార్య పురస్కారాలు పొందిన వారికి రూ. 15 లక్షల చొప్పున నగదు బహుమతి లభిస్తుంది. అవార్డీల వివరాలు‘ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న’ అవార్డు: గుకేశ్ (చెస్) హర్మన్‌ప్రీత్ సింగ్ (హాకీ), ప్రవీణ్ కుమార్ (పారా అథ్లెటిక్స్), మనూ భాకర్ (షూటింగ్). ‘అర్డున’ అవార్డులు: జ్యోతి యర్రాజీ, అన్ను రాణి (అథ్లెటిక్స్), నీతు, స్వీటీ (బాక్సింగ్), వంతిక (చెస్), సలీమా టెటె, అభిషేక్, సంజయ్, జర్మన్‌ప్రీత్ సింగ్, సుఖ్జీత్ సింగ్ (హాకీ), రాకేశ్ కుమార్ (పారా ఆర్చరీ), ప్రీతి పాల్, జివాంజి దీప్తి, అజీత్ సింగ్, సచిన్ సర్జేరావు, ధరమ్వీర్, ప్రణవ్ సూర్మా, హొకాటో సెమా, సిమ్రన్, నవ్‌దీప్ సింగ్ (పారా అథ్లెటిక్స్), నితీశ్ కుమార్, తులసిమతి, నిత్యశ్రీ, మనీషా (పారా బ్యాడ్మింటన్), కపిల్ పర్మార్ (పారా జూడో), మోనా అగర్వాల్ (పారా షూటింగ్), రుబీనా (పారా షూటింగ్), స్వప్నిల్ కుసాలే, సరబ్జోత్ సింగ్ (షూటింగ్), అభయ్ సింగ్ (స్క్వాష్), సజన్ ప్రకాశ్ (స్విమ్మింగ్), అమన్ (రెజ్లింగ్). ‘అర్జున’ అవార్డు (లైఫ్‌టైమ్): సుచా సింగ్ (అథ్లెటిక్స్), మురళీకాంత్ పేట్కర్ (పారా స్విమ్మింగ్). ‘ద్రోణాచార్య’ అవార్డు: సుభాశ్ రాణా (పారా షూటింగ్), దీపాలి దేశ్‌పాండే (షూటింగ్), సందీప్ (హాకీ), మురళీధరన్ (బ్యాడ్మింటన్), అర్మాండో కొలాకో (ఫుట్‌బాల్). -
హర్మన్‌ప్రీత్ సింగ్‌కు ‘ఖేల్‌రత్న’ అవార్డు!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక జాతీయ క్రీడా పురస్కారాల ప్రకటనకు రంగం సిద్ధమైంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యం నేతృత్వంలోని 12 మంది సభ్యుల సెలక్షన్ కమిటీ అర్జున, ఖేల్‌రత్న, ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్ తదితర అవార్డులకు సంబంధించిన నామినేషన్ల జాబితాను ప్రభుత్వానికి అందించింది. మార్పులు లేకుండా దాదాపు ఇదే జాబితా ఖాయమయ్యే అవకాశం ఉంది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన భారత పురుషుల హాకీ జట్టు కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పేరును ‘ఖేల్‌రత్న’ పేరు కోసం ప్రతిపాదించారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలుచుకున్న జట్టులోనూ సభ్యుడైన 28 ఏళ్ల హర్మన్‌ప్రీత్... ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, చాంపియన్స్ ట్రోఫీ తదితర ప్రధాన ఈవెంట్లలో భారత్ పతకాలు గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. హర్మన్‌తో పాటు పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ పేరును కూడా కమిటీ ‘ఖేల్‌రత్న’ కోసం సిఫారసు చేసింది. పారిస్ పారాలింపిక్స్ హైజంప్ (టి64 క్లాస్)లో ప్రవీణ్ స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ప్రవీణ్ ఇదే విభాగంలో కాంస్యం సాధించాడు. మరోవైపు పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్యాలు సాధించిన షూటర్ మనూ భాకర్ పేరు ఖేల్‌రత్న జాబితాలో లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఒలింపిక్స్‌లో పతకాలు గెలుచుకున్న ప్లేయర్‌గా మరో చర్చ లేకుండా ‘ఖేల్ రత్న’ అవార్డుకు ఆమె అర్హురాలు. అయితే మనూ అవార్డు కోసం దరఖాస్తు చేసుకోలేదని క్రీడా మంత్రిత్వశాఖ వర్గాలు వెల్లడించాయి. దానిని మనూ తండ్రి రామ్‌కిషన్ ఖండించారు. తాను సరైన ఫార్మాట్లోనే అప్లికేషన్ అందించామని స్పష్టం చేశారు. ఒకవేళ దరఖాస్తు చేసుకోకపోయినా ... ప్రదర్శనను బట్టి అవార్డుకు ఎంపిక చేసే అధికారం జ్యూరీకి ఉంది. కాబట్టి మనూ సాధించిన ‘డబుల్ ఒలింపిక్ మెడల్’ ఘనతను బట్టి చూస్తే ఆలస్యంగానైనా ఆమె పేరు ఈ జాబితాలో చేరవచ్చు. ‘అర్జున’ జాబితాలో 30 మంది కమిటీ ప్రతిపాదించిన ‘అర్జున’ అవార్డీల జాబితాలో 13 మంది రెగ్యులర్ ఆటగాళ్లు, మరో 17 మంది పారా ఆటగాళ్లు ఉన్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో పతకాలు గెలుచుకున్న అమన్ (రెజ్లింగ్), సరబ్జోత్, స్వప్నిల్ కుసాలే (షూటింగ్) పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. పారా ఆటగాళ్లలో తెలంగాణకు చెందిన దీప్తి జివాంజికి ‘అర్జున’ దక్కనుండటం విశేషం. వరంగల్ జిల్లాకు చెందిన దీప్తి పారిస్ పారాలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగు (టి20)లో కాంస్యం గెలుచుకుంది. అంతకుముందు ఆసియా పారా క్రీడలు, వరల్డ్ చాంపియన్‌షిప్‌లలో ఆమె ఖాతాలో రెండు స్వర్ణాలు ఉన్నాయి. పారా షూటింగ్ కోచ్ సుభాష్ రాణా పేరును ‘ద్రోణాచార్య’ అవార్డు కోసం కమిటీ సిఫారసు చేసింది. ఈ జాబితాలో మరో కోచ్ అమిత్ కుమార్ సరోహా పేరు కూడా ఉండటం చర్చకు దారి తీసింది. అతను ఎప్పుడూ అధికారికంగా కోచ్‌గా పని చేయలేదని... పైగా ఇటీవల పారిస్‌లోనూ ఆటగాడిగా బరిలోకి దిగాడు కాబట్టి ద్రోణాచార్య అవార్డుకు అర్హుడు కాదని విమర్శలు వస్తున్నాయి. -
షమీకి అర్జున.. చిరాగ్, సాత్విక్‌లకు ఖేల్‌రత్న అవార్డులు
జాతీయ క్రీడా అవార్డులను కేంద్ర యువజన మరియు క్రీడల మంత్రిత్వ శాఖ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. ఈ ఏడాది వివిధ క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన 26 మంది క్రీడాకారులకు అర్జున అవార్డులు, బ్యాడ్మింటన్‌లో అత్యుత్తమంగా రాణించిన ఇద్దరికి మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డులు దక్కాయి. కొద్ది రోజుల క్రితం జరిగిన వన్డే ప్రపంచకప్‌లో అత్యుత్తమంగా రాణించిన మొహమ్మద్ షమీని అర్జున అవార్డు వరించగా.. చిరాగ్ చంద్రశేఖర్ షెట్టి, రాంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్‌లకు మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డులు దక్కాయి. అర్జున, ఖేల్‌రత్న అవార్డులతో పాటు కేంద్రం ద్రోణాచార్య (రెగ్యులర్, లైఫ్‌టైమ్), ధ్యాన్‌చంద్ (లైఫ్‌టైమ్ అఛీవ్మెంట్) అవార్డులను కూడా ప్రకటించింది. అవార్డు పొందిన వారందరూ వచ్చే ఏడాది (2024) జనవరి 9న భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకుంటారు. మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డులు 2023: చిరాగ్ చంద్రశేఖర్ షెట్టి (బ్యాడ్మింటన్) రాంకిరెడ్డి సాత్విక్‌సాయిరాజ్ (బ్యాడ్మింటన్) అర్జున అవార్డులు 2023: ఓజాస్ ప్రవీణ్ దియోటలే (ఆర్చరీ) అదితి గోపీచంద్ స్వామి (ఆర్చరీ) ఎం శ్రీశంకర్ (అథ్లెటిక్స్) పారుల్ చౌదరీ (అథ్లెటిక్స్) మొహమ్మద్ హుస్సాముద్దీన్ (బాక్సింగ్) ఆర్ వైశాలీ (చెస్) మొహమ్మద్ షమీ (క్రికెట్) అనూషా అగర్వల్లా (ఈక్వెస్ట్రియన్) దివ్యకృతి సింగ్ (ఈక్వెస్ట్రియన్ డ్రెస్సేజ్) దీక్షా దాగర్ (గోల్ఫ్) కృషణ్ బహదూర్ పాఠక్ (హాకీ) పుఖ్రంబం సుశీల చాను (హాకీ) పవన్ కుమార్ (కబడ్డీ) రీతు నేగి (కబడ్డీ) నస్రీన్ (ఖోఖో) పింకీ (లాన్ బౌల్స్) ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ (షూటింగ్) ఈషా సింగ్ (షూటింగ్) హరీందర్ పాల్ సింగ్ సంధు (స్క్వాష్) అహికా ముఖర్జీ (టేబుల్ టెన్నిస్) సునీల్ కుమార్ (రెజ్లింగ్) అంటిమ్ (రెజ్లింగ్) నౌరెమ్ రోషిబినా దేవి (ఉషు) శీతల్ దేవి (పారా ఆర్చరీ) ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి (బ్లైండ్ క్రికెట్) ప్రాచీ యాదవ్ (పారా కానోయింగ్) ద్రోణాచార్య అవార్డులు 2023 (రెగ్యులర్): లలిత్ కుమార్ (రెజ్లింగ్) ఆర్ బి రమేష్ (చదరంగం) మహావీర్ ప్రసాద్ సైనీ (పారా అథ్లెటిక్స్) శివేంద్ర సింగ్ (హాకీ) గణేష్ ప్రభాకర్ దేవ్రుఖ్కర్ (మల్లఖాంబ్) ద్రోణాచార్య అవార్డులు 2023 (లైఫ్‌టైమ్): జస్కీరత్ సింగ్ గ్రేవాల్ (గోల్ఫ్) ఈ భాస్కరన్ (కబడ్డీ) జయంత కుమార్ పుషీలాల్ (టేబుల్ టెన్నిస్) ధ్యాన్‌చంద్ అవార్డులు 2023 (లైఫ్‌టైమ్): మంజుషా కన్వర్ (బ్యాడ్మింటన్) వినీత్ కుమార్ శర్మ (హాకీ) కవిత సెల్వరాజ్ (కబడ్డీ) మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ 2023: గురునానక్ దేవ్ యూనివర్సిటీ, అమృత్సర్ (విజేత) లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, పంజాబ్ (మొదటి రన్నరప్) కురుక్షేత్ర విశ్వవిద్యాలయం, కురుక్షేత్ర (రెండో రన్నరప్) -
జిమ్నాస్టిక్స్‌లో ఏపీకి స్వర్ణం
సాక్షి, అమరావతి: ఏకలవ్య ఆదర్శ గురుకులాల విద్యార్థుల మూడవ జాతీయ క్రీడా పోటీల్లో ఆతిథ్య ఆంధ్రప్రదేశ్ జట్లు వివిధ విభాగాల్లో సత్తా చాటారు. విజయవాడలోని లయోలా కాలేజీ, గుంటూరు నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణాల్లో ఆదివారం పలు ఈవెంట్లలో పోటీలు జరిగాయి. జిమ్నాస్టిక్స్ అండర్–14 (బాలుర ఈవెంట్ ఫ్లోర్ ఎక్సర్సైజ్) విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన వి.లక్ష్మణ్‌రెడ్డి (ఆంధ్రప్రదేశ్) స్వర్ణపతకం సాధించారు. కె.క్రోనాల్ (మహారాష్ట్ర) రజతం, బి.ఆదిత్య (మధ్యప్రదేశ్) కాంస్య పతకాలు పొందారు. జిమ్నాస్టిక్స్ అండర్–14 (బాలికల ఈవెంట్ ఫ్లోర్ ఎక్సర్సైజ్) విభాగంలో బి.అమూల్య (తెలంగాణ) స్వర్ణం సాధించగా.. కె.తేజస్వి (ఆంధ్రప్రదేశ్) రజతం, ఎం.జ్యోతిక కాంస్యం గెలుచుకున్నారు. జిమ్నాస్టిక్స్ అండర్–19 (బాలుర ఈవెంట్ ఫ్లోర్ ఎక్సర్సైజ్)లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జె.చిరంజీవి, బాలికల విభాగంలో పి.సావిత్రి రజత పతకాలు సాధించారు. బి.రాజు (మధ్యప్రదేశ్) స్వర్ణం, డి.దేవ్ (మధ్యప్రదేశ్) కాంస్య పతకాలు సాధించారు. బాలికల విభాగంలో ఎ.వైష్ణవి (తెలంగాణ) స్వర్ణం, అంకిత (మహారాష్ట్ర) కాంస్య పతకాన్ని సాధించారు. కబడ్డీలో సత్తా చాటిన తెలంగాణ కబడ్డీ బాలుర విబాగంలో తెలంగాణ, కబడ్డీ పూల్–బి రెండో మ్యాచ్‌లో ఛత్తీస్‌గఢ్ విజయం సాధించాయి. బాలికల విభాగం పూల్–బీ కబడ్డీ పోటీల మొదటి మ్యాచ్‌లో తెలంగాణ, రాజస్థాన్ జట్లు విజయం సాధించాయి. బాలుర (అండర్–19) పూల్‌లో తెలంగాణ, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ జట్లు విజయం సాధించాయి. బాలికల (అండర్–19) పూల్‌లో తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర జట్లు విజయం సాధించాయి. ఆర్చరీలో చెలరేగిన మన్నెం వీరులు ఆర్చరీ 20 మీటర్ల కేటగిరీ అండర్–14 (బాలుర)లో 297 పాయింట్లతో రాజస్థాన్‌కు చెందిన ఆయూష్ చర్పోటా మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 291 పాయింట్లతో రెండో స్థానంలో జార్ఖండ్‌కు చెందిన ఆజాద్ కుశల్ బాస్కే, 289 పాయింట్లతో మూడవ స్థానంలో రాజస్థాన్‌కు చెందిన హిమ్మత్ ఖాదియా నిలిచారు. 20 మీటర్ల కేటగిరీ అండర్–14 (బాలికల)లో 288 పాయింట్లతో అగ్రస్థానంలో ఉత్తరాఖండ్‌కు చెందిన వైష్ణవి జోషి, 253 పాయింట్లతో రెండవ స్థానంలో తెలంగాణకు చెందిన సనప మమత, 242 పాయింట్లతో మూడవ స్థానంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బసాయ్ ప్రీతి నిలిచారు. 30 మీటర్ల కేటగిరీ అండర్ –14 (బాలుర)లో 299 పాయింట్లతో జార్ఖండ్‌కు చెందిన ఆజాద్ కుశల్ బాస్కే వీర విజృంభణ చేసి మొదటి స్థానంలో నిలిచాడు. 298 పాయింట్ల స్వల్ప తేడాతో రెండో స్థానంలో రాజస్థాన్‌కు చెందిన హిమ్మత్ ఖాదియా, 265 పాయింట్లతో మూడవ స్థానంలో రాజస్థాన్‌కు చెందిన రంజిత్ నిలిచారు. 30 మీటర్ల కేటగిరీలో అండర్ –14 (బాలికల)లో 232 పాయింట్లతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బసాయ్ ప్రీతి మొదటి స్థానం కైవసం చేసుకుంది. 226 పాయింట్లతో ఉత్తరాఖండ్‌కు చెందిన వైష్ణవి జోషి, 216 పాయింట్లతో తెలంగాణకు చెందిన సనప మమత రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఆర్చరీ గ్రూప్ (4) అండర్–14(బాలుర)లో 1,669 పాయింట్లతో రాజస్థాన్‌కు చెందిన హిమ్మత్ ఖాదియా, అయూష్ చర్పొట, రంజిత్, సునీల్ బృందం మొదటి స్థానంలో నిలిచింది. 1,399 పాయింట్లతో జార్ఖండ్, 1,383 పాయింట్లతో ఛత్తీస్‌గఢ్ బృందాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఆర్చరీ గ్రూప్ (4) అండర్–14 విభాగం (బాలికల)లో 1,166 పాయింట్లతో తెలంగాణ సనప మమత, మందరకల నవ్యశ్రీ, కుంజ భవ్యశ్రీ, పొట్ట ప్రవల్లిక బృందం మొదటి స్థానంలో నిలిచింది. 1,056 పాయింట్లతో ఉత్తరాఖండ్, 999 పాయింట్లతో ఆంధ్రప్రదేశ్ బృందాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. -
National Games 2022: సర్వీసెస్‌కు అగ్రస్థానం
అహ్మదాబాద్: జాతీయ క్రీడల్లో మళ్లీ సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు (ఎస్‌ఎస్‌సీబీ) జట్టే సత్తా చాటుకుంది. ‘సెంచరీ’ని మించిన పతకాలతో ‘టాప్’ లేపింది. సర్వీసెస్ క్రీడాకారులు మొత్తం 128 పతకాలతో అగ్రస్థానంలో నిలిచారు. ఇందులో 61 స్వర్ణాలు, 35 రజతాలు, 32 కాంస్యాలున్నాయి. అట్టహాసంగా ఆరంభమైన 36వ జాతీయ క్రీడలకు బుధవారం తెరపడింది. 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 8000 పైచిలుకు అథ్లెట్లు ఈ పోటీల్లో సందడి చేశారు. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో 38, అక్వాటిక్స్లో 36 జాతీయ క్రీడల రికార్డులు నమోదయ్యాయి. ఆఖరి రోజు వేడుకలకు భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ముఖ్య అతిథిగా విచ్చేయగా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు పాల్గొన్నారు. తదుపరి జాతీయ క్రీడలకు వచ్చే ఏడాది గోవా ఆతిథ్యమిస్తుంది. ► వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఈ జాతీయ క్రీడలు గోవాలో జరగాలి. కానీ అనూహ్యంగా గుజరాత్‌కు కేటాయించగా... నిర్వాహకులు వంద రోజుల్లోపే వేదికల్ని సిద్ధం చేయడం విశేషం. పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ ఇండోర్ స్టేడియంలో ముగింపు వేడుకలు జరిగాయి. ► పురుషుల విభాగంలో ఎనిమిది పతకాలు సాధించిన కేరళ స్విమ్మర్ సజన్ ప్రకాశ్ (5 స్వర్ణాలు, 2 రజతాలు, 1 కాంస్యం) ‘ఉత్తమ క్రీడాకారుడు’గా... మహిళల విభాగంలో ఏడు పతకాలు సాధించిన కర్ణాటకకు చెందిన 14 ఏళ్ల స్విమ్మర్ హషిక (6 స్వర్ణాలు, 1 కాంస్యం) ‘ఉత్తమ క్రీడాకారిణి’గా పురస్కారాలు గెల్చుకున్నారు. గత జాతీయ క్రీడల్లోనూ (2015లో కేరళ) సజన్ ప్రకాశ్ ‘ఉత్తమ క్రీడాకారుడు’ అవార్డు అందుకోవడం విశేషం. ► చివరిరోజు తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ ‘పసిడి పంచ్’తో అలరించాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన హుసాముద్దీన్ సర్వీసెస్ తరఫున ఈ క్రీడల్లో పాల్గొన్నాడు. 57 కేజీల ఫైనల్లో హుసాముద్దీన్ 3–1తో సచిన్ సివాచ్ (హరియాణా)పై గెలిచాడు. ► ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఓవరాల్ చాంప్ సర్వీసెస్‌కు ‘రాజా భళీంద్ర సింగ్’ ట్రోఫీని అందజేశారు. సర్వీసెస్ నాలుగోసారి ఈ ట్రోఫీ చేజిక్కించుకుంది. 39 స్వర్ణాలు, 38 రజతాలు, 63 కాంస్యాలతో కలిపి మొత్తం 140 పతకాలు సాధించి రెండో స్థానంలో నిలిచిన మహారాష్ట్రకు ‘బెస్ట్ స్టేట్’ ట్రోఫీ లభించింది. ఓవరాల్‌గా సర్వీసెస్‌కంటే మహా రాష్ట్ర ఎక్కువ పతకాలు సాధించినా స్వర్ణాల సంఖ్య ఆధారంగా సర్వీసెస్‌కు టాప్ ర్యాంక్ దక్కింది. ► తెలంగాణ 8 స్వర్ణాలు, 7 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి మొత్తం 23 పతకాలతో 15వ స్థానంలో... ఆంధ్రప్రదేశ్ 2 స్వర్ణాలు, 9 రజతాలు, 5 కాంస్యాలతో కలిపి మొత్తం 16 పతకాలతో 21వ స్థానంలో నిలిచాయి. 2015 కేరళ జాతీయ క్రీడల్లో తెలంగాణ 8 స్వర్ణాలు, 14 రజతాలు, 11 కాంస్యాలతో కలిపి మొత్తం 33 పతకాలతో 12వ స్థానంలో... ఆంధ్రప్రదేశ్ 6 స్వర్ణా లు, 3 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి మొత్తం 16 పతకాలతో 18వ స్థానంలో నిలిచాయి. హషికకు ట్రోఫీ ప్రదానం చేస్తున్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా -
జాతీయ క్రీడా పురస్కారాల దరఖాస్తులకు గడువు పెంపు
న్యూఢిల్లీ: జాతీయ క్రీడా పురస్కారాల దరఖాస్తులు సమర్పించేందుకు కేంద్ర క్రీడాశాఖ తుది గడువును మూడు రోజులు పెంచింది. ఇంతకుముందు ప్రకటించినట్లు ఈ నెల 27తో గడువు ముగియగా... తాజాగా వచ్చే నెల 1వ తేదీ (శనివారం) వరకు అర్హత గల క్రీడాకారులు, కోచ్‌లు, సంఘాలు, యూనివర్సిటీలు దరఖాస్తు చేసుకోవచ్చని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది నుంచి క్రీడాశాఖకు సంబంధించిన ప్రత్యేక పోర్టల్‌లో ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ‘భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ), స్పోర్ట్స్ అథారిటీ (సాయ్), జాతీయ క్రీడా సమాఖ్యలు, స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డులు, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రభుత్వాలు తమ నామినేషన్లను అక్టోబర్ 1లోపు ఆన్లైన్లో పంపాలి’ అని కేంద్ర క్రీడాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. -
ఘనంగా జాతీయ క్రీడాపురస్కారాల ప్రధానోత్సవం
-
రేపు జాతీయ క్రీడా అవార్డుల ప్రదానం
న్యూఢిల్లీ: గత ఏడాదికి సంబంధించిన క్రీడా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం రేపు జరగనుంది. 2020లో అవార్డుకు ఎంపికైన ఆటగాళ్లకు నగదు బహుమతి లభించినా కోవిడ్ కారణంగా ప్రభుత్వం అవార్డు జ్ఞాపికలను అందించలేకపోయింది. దాంతో ఈ కార్యక్రమాన్ని న్యూఢిల్లీలోని ఓ హోటల్లో రేపు నిర్వహించి వారికి ప్రత్యక్షంగా అవార్డులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతీ ఏటా క్రీడా దినోత్సవమైన ఆగస్టు 29న అవార్డులు ఇవ్వడం సాంప్రదాయంగా వస్తోంది. అయితే కరోనా ఆంక్షలతో అది సాధ్యం కాలేదు. చదవండి: బంగారంలాంటి బాక్సర్.. తజముల్ -
ఒలింపిక్స్ ముగిశాకే జాతీయ క్రీడా పురస్కారాలు
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ ముగిశాకే జాతీయ క్రీడా పురస్కారాల విజేతల వివరాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి. త్వరలోనే ఒలింపిక్స్ జరుగనున్న నేపథ్యంలో ఎంపిక కసరత్తు మాత్రం ఆలస్యం కానుందని క్రీడా శాఖ వర్గాలు తెలిపాయి. టోక్యోలో భారత అథ్లెట్ల ప్రదర్శన, పతక విజేతలను బట్టి పురష్కారాలను ఖాయం చేయాలని క్రీడా శాఖ భావి స్తోంది. ‘నామినేషన్లు వచ్చాయి. గడువు కూడా ముగిసింది. కానీ టోక్యో పతక విజేతలకూ ఇందులో చోటివ్వాలని గత సమావేశంలో నిర్ణయించాం. ఒలింపిక్స్ క్రీడలు ఆగస్టు 8న ముగుస్తాయి. ఆ తర్వాత మరోసారి సమావేశమై ఎంపిక ప్రక్రియపై తుది కసరత్తు పూర్తి చేస్తాం. ఒలింపిక్స్ ముగిసిన వారం పది రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయితే ఎప్పట్లాగే ఆగస్టు 29న అవార్డుల ప్రదానం జరుగుతుంది’ అని కేంద్ర క్రీడాశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. -
ఎన్ని సాధించినా అవార్డులు ఎందుకివ్వరు?!
క్రీడా పురస్కారాల సమయంలో ప్రతీసారి వివాదాలు, విమర్శలు సర్వ సాధారణమైపోయాయి. ఈసారీ సెలెక్షన్ కమిటీ ఏకంగా ఐదుగురు ‘రాజీవ్ ఖేల్‌రత్న’లను, 27 మంది ‘అర్జున’ విజేతల్ని ఎంపిక చేసింది. ఇంత మందిని ఎంపిక చేసినా నిఖార్సయిన అర్హుల్ని మరోసారి అవార్డులకు దూరం చేయడమే తీవ్ర విమర్శలకు దారితీసింది. –సాక్షి క్రీడా విభాగం యేటా జాతీయ క్రీడా అవార్డులంటేనే ఓ ప్రహసనంలా మారింది. దీనికి ఓ కమిటీ... ఓ కొలమానం అంటూ అన్నీ ఉన్నా... మరీ అర్హులు, అంతర్జాతీయ వేదికల్లో విజేతలు భారత క్రీడా పురస్కారాలకు ఎందుకు దూరమవుతున్నారో ఎవరికీ అంతుచిక్కని సమస్యలా మారింది. అందరూ ఆర్జీలు పెట్టుకున్నా... కొందరైతే సులభంగానే అవార్డులు కొట్టేస్తున్నారు. కానీ... ముఖ్యంగా విశేష ప్రతిభ కనబరిచిన వారైతే ఎందుకు ఖేల్‌రత్నాలు, అర్జున అవార్డీలు కాలేకపోతున్నారో? సమధానం లేని ప్రశ్నలా ఎందుకు మిగులుతున్నారో అర్థం కావడం లేదు. ‘జావెలిన్ త్రోయర్’ నీరజ్ చోప్రా కొన్నేళ్లుగా ‘ప్రపంచ పతకాలు’ సాధిస్తున్నాడు. కానీ భారత్‌లో ‘ఖేల్‌రత్న’ం కాలేదు. హాకీ ప్లేయర్ రూపిందర్ పాల్ సింగ్... ‘ట్రిపుల్ జంపర్’ అర్పిందర్ సింగ్ అంతర్జాతీయ వేదికలపై మెరుస్తున్నారు. అయినా అర్జునకు అనర్హులే! దివ్యాంగ షట్లర్ మానసి జోషి కాలు లేకపోయినా కదన కుతూహలంతో రాణిస్తోంది. ఎందుకనో అవార్డుల కమిటీనే మెప్పించలేకపోతోంది. వీళ్ల పతకాలు, ప్రదర్శన తెలిసిన వారెవరైనా సరే... ‘అర్హుల జాబితాలో ఉండాల్సింది వీరే కదా’ అనే అంటారు. కానీ వీళ్లు మాత్రం లేరు. (చదవండి: నా కష్టానికి దక్కిన ఫలం) ముమ్మాటికి చోప్రా ‘రత్న’మే... ఈ ఏడాది ఐదుగురు క్రీడాకారులు ప్రతిష్టాత్మక ‘రాజీవ్ ఖేల్‌రత్న’కు ఎంపికయ్యారు. చరిత్రలో ఐదుమందికి ఒకేసారి ‘ఖేల్‌రత్న’ లభించడం ఇదే మొదటిసారి. అయితే టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్ మనిక బత్రా కంటే చాంపియన్ అథ్లెట్ నీరజ్ జోప్రా ఈ పురస్కారానికి ఎన్నో రెట్లు అర్హుడు. ప్రపంచ రికార్డుతో జూనియర్ చాంపియన్‌షిప్ (2016)లో స్వర్ణం నెగ్గాడు. అదే ఏడాది దక్షణాసియా క్రీడల్లోనూ చాంపియన్. 2017లో ఆసియా చాంపియన్‌షిప్ విజేత, ఆ మరుసటి ఏడాది 2018 కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్. వరుసగా మూడేళ్లు అంతర్జాతీయస్థాయిలో విజేతగా నిలిచిన చోప్రా ఖేల్‌రత్నకు అనర్హుడు ఎలా అవుతాడో కమిటీనే చెప్పాలి. దీనిపై భారత అథ్లెటిక్స్ సమాఖ్య చీఫ్ అదిల్ సమరివాలా తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. మరో అథ్లెట్, ట్రిపుల్ జంపర్ అర్పిందర్ సింగ్ 2018 ఆసియా క్రీడల్లో బంగారు పతకం గెలిచాడు. కామన్వెల్త్ గేమ్స్, కాంటినెంటల్ కప్ ఈవెంట్లతో పతకాలు నెగ్గి త్రివర్ణాన్ని రెపరెపలాడించాడు. కానీ అవార్డుల కమిటీ ముందు డీలా పడిపోయాడు. (చదవండి: నిబంధనలు ఉల్లంఘిస్తే అంతే... ) రూపిందర్కూ అన్యాయమే... హాకీలో రూపిందర్ పాల్ సింగ్ స్టార్ ఆటగాడు. కానీ అవార్డుల విషయంలో ఆ ‘స్టార్’ తిరగబడింది. భారత హాకీలోనే అత్యుత్తమ డ్రాగ్ ఫ్లికర్లలో రూపిందర్ కూడా ఒకడు. మైదానంలో హాకీ స్టిక్‌తో చెమటలు కక్కే ఒంటితో ప్రత్యర్థులతో ముందుండి తలపడే ధీరుడు... అవార్డుల రేసులో మాత్రం వెనుకబడిపోయాడు. 2018 ఆసియా క్రీడల్లో భారత్ కాంస్యం గెలుపొందడంలో అతను కీలకపాత్ర పోషించాడు. కానీ పురస్కారం విషయంలో తిరస్కారానికి గురయ్యాడు. మానసి మెరిసినా... దివ్యాంగ షట్లర్ మానసి జోషి కూడా అర్జున కోసం దరఖాస్తు పెట్టుకున్నా... కమిటీ అనుగ్రహానికి దూరమైంది. 31 ఏళ్ల మానసి గత మూడు ప్రపంచ పారా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లలో పతకాలు సాధించింది. 2019లో స్వర్ణం నెగ్గి విశ్వవిజేతగా అవతరించిన మానసి 2017లో కాంస్యం, 2015లో రజతం గెలిచింది. అంతేకాకుండా 2018 ఆసియా పారా గేమ్స్‌లో కాంస్యం, 2016 ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం సొంతం చేసుకుంది. -
‘అర్జున’ ఒక్కరికే వస్తుందనుకున్నా...
హైదరాబాద్: కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసిన జాతీయ క్రీడా పురస్కారాల్లో ‘అర్జున అవార్డు’ కోసం తనతోపాటు తన భాగస్వామి చిరాగ్ శెట్టి పేరు కూడా ఉండటంపై ఆంధ్రప్రదేశ్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్ ఆనందం వ్యక్తం చేశాడు. 2019లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (మహారాష్ట్ర) జంట ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) సర్క్యూట్లో అద్భుత ఫలితాలు సాధించింది. థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్–500 టోర్నీలో టైటిల్ నెగ్గిన ఈ ద్వయం ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది. ఈ క్రమంలో పురుషుల డబుల్స్ ప్రపంచ చాంపియన్ జోడీని, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌లో ఉన్న జంటను సాత్విక్–చిరాగ్ ద్వయం ఓడించింది. ‘చాలా ఆనందంగా ఉంది. మా ఇద్దరిలో ఒక్కరికే అవార్డు వచ్చే అవకాశముందని, ఇద్దరికీ రాకపోవచ్చని ఎవరో చెప్పారు. అయితే అవార్డుల సెలక్షన్ కమిటీ మా ఇద్దరి పేర్లను కేంద్ర క్రీడా శాఖకు పంపించడంతో ఊరట చెందాను’ అని సాత్విక్ అన్నాడు. ప్రస్తుతం అమలాపురంలోనే ప్రాక్టీస్ చేస్తున్నానని తెలిపిన సాత్విక్... రెండు వారాలలోపు హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో జరుగుతున్న జాతీయ శిక్షణ శిబిరానికి హాజరవుతానన్నాడు. . తన అర్జున అవార్డును తల్లిదండ్రులకు, కోచ్‌లకు, తానీ స్థాయికి చేరుకోవడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన వారందరికీ అంకితం ఇస్తున్నానని ప్రపంచ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం పదో ర్యాంక్‌లో ఉన్న సాత్విక్ తెలిపాడు. 20 ఏళ్ల ప్రాయంలోనే ‘అర్జున’ అవార్డు వస్తుందని ఊహించలేదని... ఈ పురస్కారంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని సాత్విక్ పేర్కొన్నాడు. ‘టోక్యో ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడటంతో తీవ్రంగా నిరాశ చెందాను. కొంతకాలంగా మేమిద్దరం మంచి ఫామ్‌లో ఉన్నాం. మరో రెండు నెలల వరకు ఎలాంటి అంతర్జాతీయ టోర్నీలు లేవు. టోర్నీలు లేని సమయంలో ఏ క్రీడాకారుడికైనా ఇబ్బందిగానే ఉంటుంది. ప్రాక్టీస్ మొదలుపెట్టిన రెండు వారాల్లో మేము ఫామ్‌లోకి వస్తామని ఆశిస్తున్నాను’ అని సాత్విక్ వివరించాడు. -
జాతీయ క్రీడా పురస్కారాల కమిటీలో సెహ్వాగ్, సర్దార్
న్యూఢిల్లీ: జాతీయ క్రీడా అవార్డుల విజేతలను ఎంపిక చేసే సెలక్షన్ కమిటీని శుక్రవారం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నియమించింది. 12 మంది సభ్యుల ఈ కమిటీలో భారత మాజీ డాషింగ్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌తో పాటు భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్‌లు చోటు దక్కించుకున్నారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ ముకుందకమ్ శర్మ ఈ ప్యానల్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తారని పేర్కొంది. వీరితో పాటు రియో పారాలింపిక్స్ రజత పతక విజేత దీపా మలిక్, మాజీ టీటీ ప్లేయర్ మోనాలిసా బరువా మెహతా, భారత మాజీ బాక్సర్ వెంకటేశన్ దేవరాజన్, ‘సాయ్’ డైరెక్టర్ జనరల్ సందీప్ ప్రదాన్, సంయుక్త కార్యదర్శి ఎల్ఎస్ సింగ్, ‘టాప్స్’ సీఈవో రాజేశ్ రాజగోపాలన్, క్రీడా వ్యాఖ్యాత మనీశ్ బతావియా, క్రీడా పాత్రికేయులు అలోక్ సిన్హా, నీరూ భాటియా సెలక్షన్ కమిటీలోని ఇతర సభ్యులు. -
జాతీయ క్రీడా అవార్డులు ఆలస్యం!
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో ఈ ఏడాది జాతీయ క్రీడా అవార్డుల ప్రదానోత్సవం ఆలస్యం అయ్యే సూచనలు కనబడుతున్నాయి. వైరస్ వ్యాప్తి దృష్ట్యా సామూహిక వేడుకలపై నిషేధం ఉండటంతో ఈ కార్యక్రమాన్ని నెల లేదా రెండు నెలలు వాయిదా వేసే అవకాశముంది. భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని ప్రతీ ఏడాది ఆగస్టు 29న జాతీ య క్రీడా అవార్డులను ప్రభుత్వం అందజేస్తోంది. ఇప్పటివరకు అర్హుల జాబితా కూడా మంత్రిత్వ శాఖ సిద్ధం చేయలేదు. కనీసం సెలక్షన్ కమిటీని కూడా నియమించకపోవడం విశేషం. మరో వైపు హరియాణాకు చెందిన వుషూ ప్లేయర్ ‘శిక్షా’కు కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా 22 ఏళ్ల శిక్షా వ్యవసాయ కూలీగా మారడంతో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జాతీయ సంక్షేమ నిధి నుంచి ఆమెకు రూ. 5 లక్షలు మంజూరు చేశారు. -
గళమెత్తిన చెస్ క్రీడాకారులు
చెన్నై: క్రికెట్ క్రేజీ భారత్‌లో చదరంగం రారాజులూ ఉన్నారు. కానీ చెస్ ప్లేయర్లకు ఆదరణ అనేది ఉండదు. పాపులారిటీ పక్కనబెడితే ప్రభుత్వానికైతే అందరు ఆటగాళ్లు సమానమే కదా! మరి తమపై ఈ శీతకన్ను ఏంటని గ్రాండ్‌మాస్టర్లు (జీఎం) వాపోతున్నారు. అవార్డులు, పురస్కారాల సమయంలో (నామినేషన్లు) తామెందుకు కనపడమో అర్థమవడం లేదని మూకుమ్మడిగా గళమెత్తారు. నిజమే. చెస్ ఆటగాళ్ల గళానికి విలువ ఉంది. ఆవేదనలో అర్థముంది. కొన్నేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న చెస్ ప్లేయర్లను భారత ప్రభుత్వం తరచూ అర్జున, ద్రోణాచార్య అవార్డులకు విస్మరించడం ఏమాత్రం తగని పని. పైగా వీళ్లంతా వారి వారి సొంత ఖర్చులతోనే గ్రాండ్‌మాస్టర్ హోదాలు పొందారు. గ్రాండ్‌మాస్టర్లు (జీఎం), అంతర్జాతీయ మాస్టర్లు (ఐఎం)ల ఎదుగుదలకు అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) చేసేది శూన్యం. ఎలాంటి ఆర్థిక ప్రోత్సాహకం లేకపోగా... కనీసం సొంతంగా ఎదిగిన వారికి పురస్కారాలు ఇప్పించడంలోనూ నిర్లక్ష్యం వహించడం మరింత విడ్డూరం. 2014 చెస్ ఒలింపియాడ్‌లో కాంస్యం నెగ్గిన భారత జట్టులో సభ్యుడైన తమిళనాడు గ్రాండ్‌మాస్టర్ సేతురామన్ రెండేళ్లుగా ‘అర్జున’కు దరఖాస్తు చేసుకుంటున్నా ఫలితం లేదు. దాంతో అతను అవార్డు గురించి పట్టించుకోకుండా తన ఆటపై దృష్టి సారించాడు. ఇటీవలే చీఫ్ సెలక్టర్ పదవికి రాజీనామా చేసిన గ్రాండ్‌మాస్టర్ ఆర్బీ రమేశ్ తన శిక్షణతో పలువురు గ్రాండ్మాస్టర్లను తయారు చేశారు. ప్రపంచ చెస్‌లో జీఎం హోదా పొందిన రెండో అతి పిన్న వయస్కుడు ప్రజ్ఞానందతోపాటు జీఎంలు అరవింద్ చిదంబరం, కార్తికేయన్ మురళీ తదితరులను ఈయనే తీర్చిదిద్దారు. కానీ ఇప్పటికీ రమేశ్‌కు ‘ద్రోణాచార్య’ లభించలేదు. చెస్‌లో ఇప్పటివరకు ఇద్దరికే ‘ద్రోణాచార్య’ పురస్కారం దక్కింది. 1986లో రఘునందన్ వసంత్ గోఖలే, 2006లో ఆంధ్రప్రదేశ్ జీఎం హంపి తండ్రి కోనేరు అశోక్ ఈ అవార్డు సాధించారు. ప్రపంచస్థాయిలో పేరు తెస్తే చెస్ ఆటగాళ్లను పురస్కారాలతో గుర్తించకపోవడం దారుణం. భారతీయులు క్రికెట్‌ను అర్థం చేసుకుంటారు. అత్యున్నతస్థాయి చెస్ ఆడే దేశాలు 190 వరకు ఉన్నాయి. క్రికెట్లో మాత్రం 12 దేశాలకు టెస్టు హోదా ఉండగా.. ఇందులో తొమ్మిదింటికే అగ్రశ్రేణి జట్లుగా గుర్తింపు ఉంది. చెస్‌లో 2700 ఎలో రేటింగ్ ఉన్నవారు ప్రపంచ క్రికెట్లోని టాప్–25 ఆటగాళ్లతో సమానం. –విశాల్ సరీన్, కోచ్ జాతీయ క్రీడా పురస్కారాలు 1961లో మొదలుకాగా ... ఇప్పటి వరకు చెస్‌లో 17 మందికి ‘అర్జున’ దక్కింది. చివరిసారి 2013లో జీఎం అభిజిత్ గుప్తాకు ‘అర్జున’ వరించింది. తమిళనాడుకు చెందిన ఆధిబన్ ఖాతాలో గొప్ప విజయాలే ఉన్నాయి. 2014 చెస్ ఒలింపియాడ్‌లో కాంస్యం, 2010 ఆసియా క్రీడల్లో కాంస్యం, 2010 ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం, 2019 ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం, 2014 ఆసియా చాంపియన్‌షిప్‌లో రజతం, 2012లో అండర్–20 కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించాడు. అయినా ఇప్పటివరకు ఆధిబన్కు ‘అర్జున’ రాలేదు. బాధ పడాల్సిన విషయమేమిటంటే ‘అర్జున’ అవార్డు దరఖాస్తు పూరించేందుకు అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) కార్యాలయానికి వెళ్లగా అక్కడి సీనియర్ అధికారి నుంచి అవమానం ఎదురైంది. ‘ఏ అర్హతతో నువ్వు ‘అర్జున’ కోసం దరఖాస్తు చేసుకుంటున్నావు’ అని ఆధిబన్ను ఆయన ఎగతాళి చేయడం దారుణం. -
జాతీయ క్రీడా పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి
-
ఘనంగా జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం
-
ఘనంగా జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానం
♦ ‘ఖేల్‌రత్న’ అందుకున్న జజరియా, సర్దార్ సింగ్ ♦ ‘అర్జున’ స్వీకరించిన సాకేత్, జ్యోతి సురేఖ ♦ ప్రసాద్‌కు ‘ద్రోణాచార్య’ హకీమ్‌కు ‘ధ్యాన్‌చంద్’ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా జాతీయ క్రీడా పురస్కారాలను స్వీకరిస్తున్న దేవేంద్ర జజరియా, సర్దార్ సింగ్ (ఖేల్‌రత్న), సాకేత్ మైనేని, జ్యోతి సురేఖ (అర్జున), గంగుల ప్రసాద్ (ద్రోణాచార్య లైఫ్‌టైమ్ అచీవ్మెంట్), హకీమ్ (ధ్యాన్‌చంద్ అవార్డు) కుడి నుంచి... న్యూఢిల్లీ: హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా జరిగిన జాతీయ క్రీడా అవార్డుల పురస్కార కార్యక్రమం మంగళవారం వైభవంగా జరిగింది. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ వేడుకల్లో అత్యున్నత రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డును పారాలింపియన్ దేవేంద్ర జజరియాతో పాటు హాకీ సీనియర్ ఆటగాడు సర్దార్ సింగ్... రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకున్నారు. వీరికి జ్ఞాపికతో పాటు రూ.7.5 లక్షల చొప్పున చెక్‌ను అందించారు. 2004 ఏథెన్స్, 2016 రియో పారాలింపిక్స్‌లో స్వర్ణాలు సాధించిన తొలి భారత క్రీడాకారుడిగా జావెలిన్ త్రోయర్ జజరియా నిలిచాడు. ఇక గత కొన్నేళ్లుగా మిడ్ ఫీల్డర్ సర్దార్ సింగ్ భారత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే 17 మంది క్రీడాకారులు అర్జున అవార్డు దక్కించుకోగా... కౌంటీ మ్యాచ్‌ల్లో ఆడుతున్న కారణంగా క్రికెటర్ చతేశ్వర్ పుజారా ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయాడు. మిగతా వారంతా అర్జునను స్వీకరించారు. ఇందులో తెలుగు తేజాలు సాకేత్ మైనేని (టెన్నిస్), జ్యోతి సురేఖ (ఆర్చరీ) కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన జీఎస్ఎస్వీ ప్రసాద్ ‘ద్రోణాచార్య’ (లైఫ్ టైమ్ అచీవ్మెంట్)... ఫుట్‌బాల్ క్రీడాభివృద్ధికి గుర్తింపుగా తెలంగాణకు చెందిన ఒలింపియన్ సయ్యద్ షాహిద్ హకీమ్ ‘ధ్యాన్‌చంద్’ అవార్డులను అందుకున్నారు. రియో పారాలింపిక్స్ హైజంప్ (ఎఫ్46)లో స్వర్ణం సాధించిన మరియప్పన్ తంగవేలు అర్జున స్వీకరించేందుకు వస్తున్న సమయంలో ఆహుతుల నుంచి విశేష స్పందన కనిపించింది. రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ అవార్డును రిలయన్స్ ఫౌండేషన్ యూత్ స్పోర్ట్స్ తరఫున నీతా అంబానీ స్వీకరించారు. అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్ అవార్డు గ్రహీతలు జ్ఞాపిక, సర్టిఫికెట్లతో పాటు రూ. 5 లక్షల చొప్పున చెక్‌ను అందుకున్నారు. ‘దివ్యాంగ అథ్లెట్లకు ప్రోత్సాహం అందించాలి’ భారత పారా అథ్లెట్లకు ఇది చరిత్రాత్మకమైన రోజు అని దేవేంద్ర జజరియా అభిప్రాయపడ్డాడు. ‘నాలాంటి వారు భారత్‌లో ఐదు కోట్ల మంది అథ్లెట్లు ఉన్నారు. వారికి మరింత తోడ్పాటు అవసరం. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగ క్రీడాకారుల కోసం చాలా చేయాల్సి ఉంది’ అని 31 ఏళ్ల జజరియా కోరాడు. అవార్డు గ్రహీతలు ఖేల్‌రత్న: దేవేంద్ర జజరియా(పారాథ్లెట్, జావెలిన్ త్రో), సర్దార్‌సింగ్ (హాకీ). అర్జున: సాకేత్ మైనేని (టెన్నిస్), జ్యోతి సురేఖ (ఆర్చరీ), హర్మన్‌ప్రీత్ కౌర్ (క్రికెట్), ఖుష్బీర్ కౌర్, రాజీవ్ (అథ్లెటిక్స్), ప్రశాంతి సింగ్ (బాస్కెట్‌బాల్), దేవేంద్రో సింగ్ (బాక్సింగ్), బెంబేమ్ దేవి (ఫుట్‌బాల్), ఎస్ఎస్పీ చౌరాసియా (గోల్ఫ్), ఎస్వీ సునీల్ (హాకీ), జస్వీర్ సింగ్ (కబడ్డీ), ప్రకాష్ నంజప్ప (షూటింగ్), ఆంథోనీ అమల్‌రాజ్ (టీటీ), సత్యవర్త్ కడియాన్ (రెజ్లింగ్), తంగవేలు, వరుణ్ భటి (పారా అథ్లెట్స్). పుజారా (క్రికెట్). ద్రోణాచార్య: దివంగత డాక్టర్ ఆర్.గాంధీ (అథ్లెటిక్స్), జీఎస్ఎస్వీ ప్రసాద్ (బ్యాడ్మింటన్), బీబీ మహంతి (బాక్సింగ్), హీరానంద్ (కబడ్డీ), రాఫెల్ (హాకీ), సంజయ్ చక్రవర్తి (షూటింగ్), రోషన్ లాల్ (రెజ్లింగ్). ధ్యాన్‌చంద్: భూపిందర్ సింగ్ (అథ్లెటిక్స్), సయ్యద్ షాహిద్ హకీమ్ (ఫుట్‌బాల్), సుమరాయ్ టెటే (హాకీ). -
క్రీడా అవార్డుల నిబంధనల్లో మార్పులు!
వచ్చే ఏడాది నుంచి అమల్లోకి... న్యూఢిల్లీ: ప్రతీ ఏడాది జాతీయ క్రీడా అవార్డులు ప్రకటించడం... ఆ వెంటనే పలువురు క్రీడాకారుల నుంచి నిరసనలు వ్యక్తమవడం పరిపాటిగా మారింది. దీంతో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా, అర్హులైన వారందరికీ అన్యాయం జరగకుండా చూసేందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నడుం బిగించింది. ఈ నేపథ్యంలో అవార్డుల కోసం ఆటగాళ్ల ఎంపిక పద్ధతిని మార్చాలని ఆలోచిస్తోంది. ఆయా క్రీడా సమాఖ్యల ద్వారా నామినేట్ అయిన వారికే ఇప్పటిదాకా అవార్డులను ప్రకటిస్తున్నారు. కానీ అర్హులై ఉండి అలా నామినేట్ కాని వారిని కూడా ఎంపిక కోసం పరిగణనలోకి తీసుకోనున్నారు. ఈపాటికే కేంద్ర క్రీడా మంత్రి విజయ్ గోయల్ ఈ దిశగా చర్చలు ప్రారంభించారని సమాచారం. ‘వచ్చే ఏడాది నుంచి అవార్డుల పద్ధతిని మార్చాలనుకుంటున్నాం. త్వరలోనే కొత్త నిబంధనలు వస్తాయి. సమాఖ్యల ద్వారా నామినేట్ కానివారు... తాము సొంతంగా దరఖాస్తు పెట్టుకోని వారిలో కూడా నిజంగా అర్హులై ఉంటే వారినీ ఎంపిక చేస్తారు. ప్రతీ సెలక్షన్ కమిటీ సభ్యుడు కూడా నామినేట్ కాని అర్హుడైన అథ్లెట్‌పై నిర్ణయం తీసుకోవచ్చు. సభ్యుడి సలహా మేరకు ప్యానెల్ ఆ ఆటగాడి ప్రదర్శనపై ఓ అంచనాకు వస్తారు’ అని క్రీడా శాఖ అధికారి ఒకరు తెలిపారు. -
అయ్యో..అర్జున!
∙ వివాదాస్పదమవుతున్న జాతీయ క్రీడా పురస్కారాలు ∙ ఎంపికలో లోపించిన పారదర్శకత ∙ నిరాశలో నిజమైన అర్హులు దీపా మలిక్... రియో పారాలింపిక్స్ షాట్‌పుట్‌లో రజతం నెగ్గి వార్తల్లో నిలిచిన అథ్లెట్. అంతేకాదు పారాలింపిక్స్ చరిత్రలో పతకం సాధించిన తొలి భారత మహిళగానూ ఖ్యాతికెక్కింది. అయితే ఇటీవలి రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న అవార్డుల జాబితాలో తన పేరు లేకపోవడం ఆమెను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. ఎందుకంటే ఆమెతో పాటే రియోలో పతకం నెగ్గిన దేవేంద్ర జజరియాకు ఇప్పుడు అవార్డు దక్కబోతోంది మరి. ఇక భారత అగ్రశ్రేణి మోటార్ రేసింగ్ డ్రైవర్ గౌరవ్ గిల్ అయితే ఏకంగా ప్రభుత్వంపైనే విమర్శల బాణాన్ని ఎక్కుపెట్టాడు. అర్జున అవార్డుల కోసం తన క్రీడను పరిగణలోకి తీసుకోకపోవడం దారుణమంటున్నాడు. ఓ క్రికెటర్ పది మంచి బంతులు వేయగానే అతనికి ‘అర్జున’ దక్కుతుందని.. ఇదో పెద్ద జోక్ అని రెండు సార్లు ఆసియా పసిఫిక్ ర్యాలీ చాంపియన్‌గా నిలిచిన గిల్ వ్యంగ్యంగా మాట్లాడాడు. ఇక టెన్నిస్ డబుల్స్ ఆటగాడు రోహన్ బోపన్న ఎంతగా పేరు గడించినా ఇప్పటికీ అతనికి అర్జున దక్కలేదు. ఈసారి కూడా అతడి పేరును అఖిల భారత టెన్నిస్ సంఘం నామినేట్ చేయకపోవడం అతడిని ఆగ్రహానికి గురిచేసింది. అసలు దేశంలోని ఆటగాళ్లంతా గర్వించదగ్గ స్థాయిలో ఉండాల్సిన ఈ క్రీడా అవార్డులపై ఏడాదికేడాది ఇలా విమర్శలు ఎందుకు పెరుగుతున్నాయి? అవార్డుల కమిటీ తమ ఎంపికలో ఎలాంటి అంశాలను లెక్కలోకి తీసుకుంటుంది? సాక్షి క్రీడా విభాగం : ప్రతీ ఏడాది జాతీయ క్రీడా అవార్డుల ప్రకటన, వాటితో పాటు వివాదం వెంట రావడం పరిపాటిగా మారిపోయింది. ఈసారి కూడా అదే మళ్లీ జరిగింది. కేంద్ర క్రీడా శాఖ ఓ వైపు ఈ విషయంలో పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని చెప్పుకుంటోంది. అయినా ‘ఈ అవార్డులు పూర్తిగా రాజకీయమైపోయాయి.. నీకు అవార్డు రావాలంటే సంబంధాలను పెంచుకోవాల్సిందే’ అనే అభిప్రాయం కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ఎందుకంటే ప్రతీసారి అర్జున, రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డుల ప్రకటన వెలువడగానే అసంతృప్తుల గళాలు కూడా ఎక్కువవుతున్నాయి. కొందరైతే కోర్టు మెట్లు కూడా ఎక్కాల్సి వస్తోంది. దేశం తరఫున ఆడి పతకాలు సాధించేందుకు తమ జీవితాన్ని పణంగా పెడుతున్నా ఎలాంటి గుర్తింపు రాకపోతే ఎలా అనేది వారి ఆవేదన. ప్రభుత్వం నుంచి ఓ చిన్న గుర్తింపు తమ ఇన్నేళ్ల కష్టాన్ని మరిచిపోయేలా చేస్తుందనేది నిరాదరణకు గురవుతున్న అథ్లెట్ల ఆశ. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘ఖేల్‌రత్న’ జాబితాలో తన పేరు లేకపోవడంతో దీపా మలిక్ కమిటీ అవార్డుల కమిటీ తీరును విమర్శించింది. ఎందుకంటే పారాలింపిక్స్‌లో దేశానికి వచ్చిన పతకాలు నాలుగు. ఇందులో మరియప్పన్ తంగవేలు, దేవేంద్ర జజరియాలు స్వర్ణం సాధించారు. దీపా రజతం, వరుణ్ భటి కాంస్యం దక్కించుకున్నారు. ఇందులో దేవేంద్రకు అత్యున్నత క్రీడా పురస్కారం దక్కనుంది. ‘నా ప్రతిభ ఎందుకు మిగతా వారికన్నా తక్కువగా కనిపించింది. ఈ క్రీడల్లో పతకం సాధించిన తొలి మహిళగా నేను పేరు తెచ్చుకున్నాను. కనీసం ఆ గొప్పతనాన్ని కూడా గౌరవించకపోతే ఎలా?’ అని దీపా ప్రశ్నించింది. మరోవైపు భారత టాప్ ర్యాలీ డ్రైవర్ గౌరవ్ గిల్ అర్జున అవార్డు విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. నిజానికి మోటార్ రేసింగ్‌ను కేంద్రం అసలు ఓ క్రీడగానే భావించడం లేదు. ఇప్పటిదాకా ఒక్క రేసర్ కూడా అర్జునను దక్కించుకోలేదు. కేవలం రెండేళ్ల కిందటే కేంద్రం రేసింగ్‌ను గుర్తించింది. భారత్ నుంచి తొలి ఫార్ములావన్ డ్రైవర్‌గా నిలిచిన నరైన్ కార్తీకేయన్కు మాత్రం 2010లో పద్మశ్రీ దక్కింది. క్రికెటర్లు ఎప్పుడో ఒక్కసారి మెరుగ్గా ఆడినా అతడికి వెంటనే అర్జున దక్కడం ఎంతవరకు సబబని 35 ఏళ్ల గౌరవ్ ప్రశ్నించాడు. నిజానికి క్రికెట్ ఒలింపిక్ క్రీడ కాకపోయినా ప్రతీ ఏడాది వారికి మాత్రం అవార్డులు దక్కుతుంటాయని అన్నాడు. ఇక అర్జున కోసం గడువు లోపల తన పేరును కేంద్రానికి పంపకపోవడంతో అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా)పై డబుల్స్ స్టార్ రోహన్న బోపన్న విరుచుకుపడ్డాడు. గతంలోనూ తన విషయంలో ‘ఐటా’ ఇలాగే వ్యవహరించిందని జూన్‌లో ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్‌ను గెలుచుకున్న బోపన్న తెలిపాడు. అయితే భారత్ తరఫున కనీసం ఆసియా క్రీడలు లేదా కామన్వెల్త్ క్రీడల్లో ఎలాంటి పతకం సాధించని బోపన్న పేరును ప్రతీసారి కమిటీ తిరస్కరిస్తోందని ‘ఐటా’ చెబుతోంది. ఏదేమైనా భారత క్రీడాభిమానుల్లో మాత్రం అవార్డీల ఎంపిక వ్యాపారంగా మారిపోతోందని, దీన్ని సమూలంగా మార్చాల్సి ఉందని అభిప్రాయపడుతున్నారు. మిల్కా సింగ్ తిరస్కరణ... 2001లో అథ్లెట్ రచనా గోవిల్, జిమ్నాస్ట్ కల్పనా దేవ్‌నాథ్‌లకు అర్జున అవార్డులు ఇవ్వడాన్ని ఆసియా డిస్కస్ చాంపియన్ అనిల్ కుమార్ కోర్టులో సవాల్ చేశాడు. దీంతో రామనాథన్ కృష్ణన్, ప్రకాశ్ పదుకొనే, సునీల్ గావస్కర్‌లాంటి మేటి క్రీడాకారులు సెలక్షన్ కమిటీలో ఉండాలని కోర్టు అభిప్రాయపడింది. అదే ఏడాది దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ కూడా తనకు ఆలస్యంగా లభించిన జీవితకాల సాఫల్య పురస్కారాన్ని తీసుకునేందుకు నిరాకరించారు. తన స్థాయికి ఏమాత్రం సరితూగని వారితో కలిసి ఆ అవార్డును స్వీకరించలేనని తేల్చి చెప్పారు. కోర్టు కేసులూ ఉన్నాయి గత కొన్నేళ్లుగా కోర్టు కేసులు క్రీడా శాఖను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మనోజ్ కుమార్ పేరుతోనే ఉన్న మరో బాక్సర్ డోపింగ్‌కు పాల్పడితే... కపిల్‌దేవ్ నేతృత్వంలోని కమిటీ పొరపాటు పడి సీనియర్ బాక్సర్ మనోజ్ కుమార్ పేరును అర్జున జాబితా నుంచి తొలగించింది. ఈ విషయంలో మనోజ్ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాడు. కానీ మనోజ్ పేరును జాబితాలో చేర్చేందుకు రెండోసారి సమావేశం కావడానికి కమిటీ అంగీకరించలేదు. అయితే కోర్టు మాత్రం అతడికి అవార్డు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.