‘ఖేల్ రత్న’ అవార్డు అందుకున్న మను, గుకేశ్, హర్మన్‌ప్రీత్, ప్రవీణ్
32 మందికి ‘అర్జున’ పురస్కారం
జాతీయ క్రీడా పురస్కారాలు అందజేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
న్యూఢిల్లీ: ఆటల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన భారత క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2024 సంవత్సరానికిగాను జాతీయ క్రీడా పురస్కారాలు అందజేశారు. శుక్రవారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి అవార్డులు బహూకరించారు.
పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు నెగ్గిన మహిళా స్టార్ షూటర్ మనూ భాకర్ (హరియాణా), ప్రపంచ చెస్ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ (తమిళనాడు), భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (పంజాబ్), పారిస్ పారాలింపిక్స్ స్వర్ణ పతక విజేత ప్రవీణ్ కుమార్ (ఉత్తరప్రదేశ్)లకు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న’ పురస్కారం దక్కింది.
పారా స్విమ్మర్ మురళీకాంత్ పేట్కర్‌కు అర్జున అవార్డు (జీవిత సాఫల్య) అందిస్తున్న సమయంలో సెంట్రల్ హాల్ చప్పట్లతో మారుమోగింది. స్వతంత్ర భారత దేశంలో ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు నెగ్గిన తొలి అథ్లెట్‌గా రికార్డు సృష్టించిన 22 ఏళ్ల షూటర్ మనూ భాకర్ మాట్లాడుతూ... ‘దేశ అత్యున్నత క్రీడా పురస్కారం అందుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. నిదానమే ప్రధానం అని నేను నమ్ముతా. సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని పేర్కొంది.
‘కల నిజమైంది. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఖేల్ రత్న అవార్డు అందుకున్న రెండో చెస్ ప్లేయర్‌ను కావడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి మరెన్నో ఘనతలు అందుకునేందుకు ఇది మరింత స్ఫూర్తినిస్తుంది’ అని 18 ఏళ్లకే చదరంగ విశ్వ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన గుకేశ్ అన్నాడు. 32 మంది అథ్లెట్లకు అర్జున అవార్డులు దక్కగా... వారిలో 17 మంది పారాథ్లెట్‌లు ఉండటం విశేషం. ‘అర్జున అవార్డు’ దక్కిన వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన జ్యోతి యర్రాజీ (ఆంధ్రప్రదేశ్), జివాంజి దీప్తి (తెలంగాణ) కూడా ఉన్నారు.
జ్యోతి దక్షిణాఫ్రికాలో జరుగుతున్న శిక్షణ శిబిరంలో ఉండటంతో ఈ అవార్డుల కార్యక్రమానికి హాజరుకాలేదు. పారిస్ పారాలింపిక్స్‌లో పతకాలు నెగ్గిన దివ్యాంగ క్రీడాకారులకు అవార్డులు అందజేస్తున్న సమయంలో రాష్ట్రపతి సంప్రదాయాన్ని పక్కనపెట్టి... పారాథ్లెట్లకు సౌకర్యవంతంగా ఉండేందుకు తన స్థానం నుంచి ముందుకు రావడం ఆహుతులను ఆకర్షించింది. ‘ఖేల్ రత్న’ అవార్డు గ్రహీతలకు రూ. 25 లక్షలు... అర్జున, ద్రోణాచార్య పురస్కారాలు పొందిన వారికి రూ. 15 లక్షల చొప్పున నగదు బహుమతి లభిస్తుంది.
అవార్డీల వివరాలు
‘ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న’ అవార్డు: గుకేశ్ (చెస్) హర్మన్‌ప్రీత్ సింగ్ (హాకీ), ప్రవీణ్ కుమార్ (పారా అథ్లెటిక్స్), మనూ భాకర్ (షూటింగ్). ‘అర్డున’ అవార్డులు: జ్యోతి యర్రాజీ, అన్ను రాణి (అథ్లెటిక్స్), నీతు, స్వీటీ (బాక్సింగ్), వంతిక (చెస్), సలీమా టెటె, అభిషేక్, సంజయ్, జర్మన్‌ప్రీత్ సింగ్, సుఖ్‌జీత్ సింగ్ (హాకీ), రాకేశ్ కుమార్ (పారా ఆర్చరీ), ప్రీతి పాల్, జివాంజి దీప్తి, అజీత్ సింగ్, సచిన్ సర్జేరావు, ధరమ్‌వీర్, ప్రణవ్ సూర్మా, హొకాటో సెమా, సిమ్రన్, నవ్‌దీప్ సింగ్ (పారా అథ్లెటిక్స్), నితీశ్ కుమార్, తులసిమతి, నిత్యశ్రీ, మనీషా (పారా బ్యాడ్మింటన్), కపిల్ పర్మార్ (పారా జూడో), మోనా అగర్వాల్ (పారా షూటింగ్), రుబీనా (పారా షూటింగ్), స్వప్నిల్ కుసాలే, సరబ్‌జోత్ సింగ్ (షూటింగ్), అభయ్ సింగ్ (స్క్వాష్), సజన్ ప్రకాశ్ (స్విమ్మింగ్), అమన్ (రెజ్లింగ్).
‘అర్జున’ అవార్డు (లైఫ్‌టైమ్): సుచా సింగ్ (అథ్లెటిక్స్), మురళీకాంత్ పేట్కర్ (పారా స్విమ్మింగ్). ‘ద్రోణాచార్య’ అవార్డు: సుభాశ్ రాణా (పారా షూటింగ్), దీపాలి దేశ్‌పాండే (షూటింగ్), సందీప్ (హాకీ), మురళీధరన్ (బ్యాడ్మింటన్), అర్మాండో కొలాకో (ఫుట్‌బాల్).
Comments
Please login to add a commentAdd a comment