అయ్యో..అర్జున! | Controversial National Sports Awards | Sakshi
Sakshi News home page

అయ్యో..అర్జున!

Published Sat, Aug 19 2017 12:33 AM | Last Updated on Sun, Sep 17 2017 5:40 PM

అయ్యో..అర్జున!

అయ్యో..అర్జున!

∙ వివాదాస్పదమవుతున్న జాతీయ క్రీడా పురస్కారాలు 
∙ ఎంపికలో లోపించిన పారదర్శకత
∙ నిరాశలో నిజమైన అర్హులు  


దీపా మలిక్‌... రియో పారాలింపిక్స్‌ షాట్‌పుట్‌లో రజతం నెగ్గి వార్తల్లో నిలిచిన అథ్లెట్‌. అంతేకాదు పారాలింపిక్స్‌ చరిత్రలో పతకం సాధించిన తొలి భారత మహిళగానూ ఖ్యాతికెక్కింది. అయితే ఇటీవలి రాజీవ్‌ గాంధీ ఖేల్‌రత్న అవార్డుల జాబితాలో తన పేరు లేకపోవడం ఆమెను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. ఎందుకంటే ఆమెతో పాటే రియోలో పతకం నెగ్గిన దేవేంద్ర జజరియాకు  ఇప్పుడు అవార్డు దక్కబోతోంది మరి.  
ఇక భారత అగ్రశ్రేణి మోటార్‌ రేసింగ్‌ డ్రైవర్‌ గౌరవ్‌ గిల్‌ అయితే ఏకంగా ప్రభుత్వంపైనే విమర్శల బాణాన్ని ఎక్కుపెట్టాడు. అర్జున అవార్డుల కోసం తన క్రీడను పరిగణలోకి తీసుకోకపోవడం దారుణమంటున్నాడు. ఓ క్రికెటర్‌ పది మంచి బంతులు వేయగానే  అతనికి ‘అర్జున’ దక్కుతుందని.. ఇదో పెద్ద జోక్‌ అని రెండు సార్లు ఆసియా పసిఫిక్‌ ర్యాలీ చాంపియన్‌గా నిలిచిన గిల్‌ వ్యంగ్యంగా మాట్లాడాడు.

ఇక టెన్నిస్‌ డబుల్స్‌ ఆటగాడు రోహన్‌ బోపన్న ఎంతగా పేరు గడించినా ఇప్పటికీ అతనికి అర్జున దక్కలేదు. ఈసారి కూడా అతడి పేరును అఖిల భారత టెన్నిస్‌ సంఘం నామినేట్‌ చేయకపోవడం అతడిని ఆగ్రహానికి గురిచేసింది.
అసలు దేశంలోని ఆటగాళ్లంతా గర్వించదగ్గ స్థాయిలో ఉండాల్సిన ఈ క్రీడా  అవార్డులపై ఏడాదికేడాది ఇలా విమర్శలు ఎందుకు పెరుగుతున్నాయి? అవార్డుల కమిటీ తమ ఎంపికలో ఎలాంటి అంశాలను లెక్కలోకి తీసుకుంటుంది?  

సాక్షి క్రీడా విభాగం :  ప్రతీ ఏడాది జాతీయ క్రీడా అవార్డుల ప్రకటన, వాటితో పాటు వివాదం వెంట రావడం పరిపాటిగా మారిపోయింది. ఈసారి కూడా అదే మళ్లీ జరిగింది. కేంద్ర క్రీడా శాఖ ఓ వైపు ఈ విషయంలో పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని చెప్పుకుంటోంది. అయినా ‘ఈ అవార్డులు పూర్తిగా రాజకీయమైపోయాయి.. నీకు అవార్డు రావాలంటే సంబంధాలను పెంచుకోవాల్సిందే’ అనే అభిప్రాయం కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ఎందుకంటే ప్రతీసారి అర్జున, రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డుల ప్రకటన వెలువడగానే అసంతృప్తుల గళాలు కూడా ఎక్కువవుతున్నాయి. కొందరైతే కోర్టు మెట్లు కూడా ఎక్కాల్సి వస్తోంది. దేశం తరఫున ఆడి పతకాలు సాధించేందుకు తమ జీవితాన్ని పణంగా పెడుతున్నా ఎలాంటి గుర్తింపు రాకపోతే ఎలా అనేది వారి ఆవేదన. ప్రభుత్వం నుంచి ఓ చిన్న గుర్తింపు తమ ఇన్నేళ్ల కష్టాన్ని మరిచిపోయేలా చేస్తుందనేది నిరాదరణకు గురవుతున్న అథ్లెట్ల ఆశ. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘ఖేల్‌రత్న’ జాబితాలో తన పేరు లేకపోవడంతో దీపా మలిక్‌ కమిటీ అవార్డుల కమిటీ తీరును విమర్శించింది.

ఎందుకంటే పారాలింపిక్స్‌లో దేశానికి వచ్చిన పతకాలు నాలుగు. ఇందులో మరియప్పన్‌ తంగవేలు, దేవేంద్ర జజరియాలు స్వర్ణం సాధించారు. దీపా రజతం, వరుణ్‌ భటి కాంస్యం దక్కించుకున్నారు. ఇందులో దేవేంద్రకు అత్యున్నత క్రీడా పురస్కారం దక్కనుంది. ‘నా ప్రతిభ ఎందుకు మిగతా వారికన్నా తక్కువగా కనిపించింది. ఈ క్రీడల్లో పతకం సాధించిన తొలి మహిళగా నేను పేరు తెచ్చుకున్నాను. కనీసం ఆ గొప్పతనాన్ని కూడా గౌరవించకపోతే ఎలా?’ అని దీపా ప్రశ్నించింది. మరోవైపు భారత టాప్‌ ర్యాలీ డ్రైవర్‌ గౌరవ్‌ గిల్‌ అర్జున అవార్డు విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. నిజానికి మోటార్‌ రేసింగ్‌ను కేంద్రం అసలు ఓ క్రీడగానే భావించడం లేదు. ఇప్పటిదాకా ఒక్క రేసర్‌ కూడా అర్జునను దక్కించుకోలేదు. కేవలం రెండేళ్ల కిందటే కేంద్రం రేసింగ్‌ను గుర్తించింది. భారత్‌ నుంచి తొలి ఫార్ములావన్‌ డ్రైవర్‌గా నిలిచిన నరైన్‌ కార్తీకేయన్‌కు మాత్రం 2010లో పద్మశ్రీ దక్కింది. క్రికెటర్లు ఎప్పుడో ఒక్కసారి మెరుగ్గా ఆడినా అతడికి వెంటనే అర్జున దక్కడం ఎంతవరకు సబబని 35 ఏళ్ల గౌరవ్‌ ప్రశ్నించాడు.

నిజానికి క్రికెట్‌ ఒలింపిక్‌ క్రీడ కాకపోయినా ప్రతీ ఏడాది వారికి మాత్రం అవార్డులు దక్కుతుంటాయని అన్నాడు. ఇక  అర్జున కోసం గడువు లోపల తన పేరును కేంద్రానికి పంపకపోవడంతో అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా)పై డబుల్స్‌ స్టార్‌ రోహన్న బోపన్న విరుచుకుపడ్డాడు. గతంలోనూ తన విషయంలో ‘ఐటా’ ఇలాగే వ్యవహరించిందని జూన్‌లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ను గెలుచుకున్న బోపన్న తెలిపాడు. అయితే భారత్‌ తరఫున కనీసం ఆసియా క్రీడలు లేదా కామన్వెల్త్‌ క్రీడల్లో ఎలాంటి పతకం సాధించని బోపన్న పేరును ప్రతీసారి కమిటీ తిరస్కరిస్తోందని ‘ఐటా’ చెబుతోంది. ఏదేమైనా భారత క్రీడాభిమానుల్లో మాత్రం అవార్డీల ఎంపిక వ్యాపారంగా మారిపోతోందని, దీన్ని సమూలంగా మార్చాల్సి ఉందని అభిప్రాయపడుతున్నారు.

మిల్కా సింగ్‌ తిరస్కరణ...
2001లో అథ్లెట్‌ రచనా గోవిల్, జిమ్నాస్ట్‌ కల్పనా దేవ్‌నాథ్‌లకు అర్జున అవార్డులు ఇవ్వడాన్ని ఆసియా డిస్కస్‌ చాంపియన్‌ అనిల్‌ కుమార్‌ కోర్టులో సవాల్‌ చేశాడు. దీంతో రామనాథన్‌ కృష్ణన్, ప్రకాశ్‌ పదుకొనే, సునీల్‌ గావస్కర్‌లాంటి మేటి క్రీడాకారులు సెలక్షన్‌ కమిటీలో ఉండాలని కోర్టు అభిప్రాయపడింది. అదే ఏడాది దిగ్గజ అథ్లెట్‌ మిల్కా సింగ్‌ కూడా తనకు ఆలస్యంగా లభించిన జీవితకాల సాఫల్య పురస్కారాన్ని తీసుకునేందుకు నిరాకరించారు. తన స్థాయికి ఏమాత్రం సరితూగని వారితో కలిసి ఆ అవార్డును స్వీకరించలేనని తేల్చి చెప్పారు.

కోర్టు కేసులూ ఉన్నాయి
గత కొన్నేళ్లుగా కోర్టు కేసులు క్రీడా శాఖను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మనోజ్‌ కుమార్‌ పేరుతోనే ఉన్న మరో బాక్సర్‌ డోపింగ్‌కు పాల్పడితే... కపిల్‌దేవ్‌ నేతృత్వంలోని కమిటీ పొరపాటు పడి సీనియర్‌ బాక్సర్‌ మనోజ్‌ కుమార్‌ పేరును అర్జున జాబితా నుంచి తొలగించింది. ఈ విషయంలో మనోజ్‌ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాడు. కానీ మనోజ్‌ పేరును జాబితాలో చేర్చేందుకు రెండోసారి సమావేశం కావడానికి కమిటీ అంగీకరించలేదు. అయితే కోర్టు మాత్రం అతడికి అవార్డు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement