నూఢిల్లీ : భారత క్రికెటర్ రవీంద్ర జడేజాను అర్జున అవార్డుకు సెలక్షన్ కమిటీ నామినేట్ చేసింది. 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో భారత్ ఓడిపోయినా, రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్‌షోతో అందరి మనస్సులు గెలుచుకున్న విషయం తెలిసిందే. హేమాహేమీలు వెనుదిరిగినా తన బ్యాటింగ్ నైపుణ్యంతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 59 బంతుల్లో 77 పరుగులు, రెండు వికెట్లు పడగొట్టి అందరిని ఆశ్చర్యపరిచాడు. కానీ ఆఖర్లో జడేజా, ధోనీ ఔటవ్వడంతో ప్రపంచకప్ నుంచి టీమిండియా నిష్క్రమించిన విషయం విదితమే. భారత్ తరఫున జడేజా 156 వన్డేలు, 41 టెస్టులు, 42 టీ20లు ఆడాడు. జస్టిస్ (రిటైర్డ్) ముకుందకమ్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ జడేజాతో పాటు మరో 18 మంది క్రీడాకారులను అర్జున అవార్డుకు నామినేట్ చేసింది. బీసీసీఐ ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు రవీంద్ర జడేజాతో పాటు, జస్ప్రిత్ బూమ్రాను, మహ్మద్ షమీలను కూడా సిఫార్సు చేసింది. జడేజాతో పాటు, మహిళా క్రికెటర్ పూనమ్ యాదవ్ కూడా ఈ జాబితాలో ఉన్నారు.
ట్రాక్ అండ్ ఫీల్డ్ స్టార్స్ తేజేందర్ పాల్సింగ్తూర్, మహ్మద్ అనాస్, స్వప్నా బార్మన్, ఫుట్‌బాల్ క్రీడాకారుడు గుర్‌ప్రీత్ సింగ్ సంధు, హాకీ ప్లేయర్ చింగ్లెన్సానా సింగ్ కంగుజమ్, షూటర్ అంజుమ్ మోద్గిల్ తదితరులను సెలక్షన్ కమిటీ నామినేట్ చేసింది. మరోవైపు దేశ అత్యున్నత క్రీడా అవార్డు.. రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్నకు దీపా మాలిక్ నామినేట్ అయ్యారు. ఈమె రియో పారాలింపిక్స్‌లో షాట్‌పుట్ విభాగంలో వెండి పతకాన్ని సాధించారు. దీపా మాలిక్ 2017లో పద్మశ్రీ, 2012లో అర్జున అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన బాక్సర్ మేరీ కోమ్ తన వ్యక్తిగత కోచ్ చోతేలాల్ యాదవ్‌కు ద్రోణాచార్య అవార్డు రానందున తనంతట తానే ఈ నామినేషన్ ప్రక్రియలో పాల్గొనలేదు. మరోవైపు రెజ్లర్ బజ్‌రంగ్ పునియా ఖేల్‌రత్న అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. ఈ అవార్డు మార్గదర్శకాల ప్రకారం.. ఓ క్రీడాకారుడు అంతర్జాతీయ స్థాయిలో నాలుగు సంవత్సరాలుగా స్థిరమైన ప్రదర్శన కనబరచాలి. అవార్డు సిఫారసు చేసే సంవత్సరంలో అత్యుత్తమంగా రాణించి ఉండాలి. వీటితో పాటు నాయకత్వ లక్షణాలు, క్రీడా నైపుణ్యం, క్రమశిక్షణను పరిగణనలోకి తీసుకుని అవార్డుకు నామినేట్ చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment