సాక్షి, న్యూఢిల్లీ: ఎంబీబీఎస్ కోర్సులో రెన్యువల్ అనుమతి కోసం నకిలీ పేషెంట్లను చూపారన్న కారణంగా వికారాబాద్ జిల్లాకు చెందిన మహావీర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు సుప్రీంకోర్టు రూ.2 కోట్ల జరిమానా విధించింది. ఈ మేరకు జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే, జస్టిస్ లావు నాగేశ్వర్‌రావుతో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. 2018–19 విద్యా సంవత్సరం కోసం ఎంబీబీఎస్ ప్రవేశాల అనుమతి రెన్యువల్‌కు మహావీర్ సంస్థ దరఖాస్తు చేసుకుంది. ఈ నేపథ్యంలో 2017 నవంబర్ 8, 9 తేదీల్లో భారత వైద్య మండలి(ఎంసీఐ)కి చెందిన నిపుణుల కమిటీ తనిఖీ చేసింది.
ఈ తనిఖీలో కళాశాలలో అనేక లోపాలను గుర్తించిన కమిటీ మరో బ్యాచ్‌లో ప్రవేశాలు కల్పించేందుకు వీలుగా రెన్యువల్‌కు అనుమతి ఇవ్వరాదని కేంద్రానికి సిఫారసు చేసింది. ఈ లోపాలను వైద్య కళాశాలకు కూడా తెలిపింది. ఈ నేపథ్యంలో లోపాలను సరిచేసుకుంటూ సరిదిద్దిన చర్యలను చూపుతూ కళాశాల నివేదిక సమర్పించింది. తద్వారా మరోసారి తమ అభ్యర్థనను పరిశీలించాలని కళాశాల విన్నవించగా కేంద్రం అందుకు సమ్మతించి సమీక్షించాలని ఎంసీఐని కోరింది.
9 రకాల లోపాల గుర్తింపు..
ఈ నేపథ్యంలో 13 మార్చి 2018న మరోసారి తనిఖీ జరిగింది. రెండుసార్లు జరిగిన తనిఖీ నివేదికలను పరిశీలించిన ఎంసీఐ కార్యనిర్వాహక కమిటీ తీవ్రమైన లోపాలను గుర్తించింది. ఫ్యాకల్టీ 22 శాతం తక్కువగా ఉన్నారని, రెసిడెంట్ డాక్టర్లు 42.85 శాతం తక్కువగా ఉన్నారని గుర్తించింది. ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లు నిజమైన పేషంట్లు కాదని, చికిత్స అవసరమైనంత పరిస్థితి లేదని గుర్తించింది. ఇలా 9 రకాల లోపాలను గుర్తించింది. ఈ నేపథ్యంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ కళాశాలకు రెన్యువల్ అనుమతి ఇవ్వొద్దని కేంద్రానికి సిఫారసు చేసింది. ఈ సిఫారసును ఓవర్‌సైట్ కమిటీ ఆమోదించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆ కళాశాల సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీంతో తుది నిర్ణయం తీసుకునేలోపు మరోసారి సమీక్షించాలని సుప్రీం కోర్టు మే 23న ఉత్తర్వులు జారీచేసింది.
కేంద్రం అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకుని కళాశాలకు రెన్యువల్ అనుమతి ఇవ్వరాదన్న ఎంసీఐ సిఫారసును ఆమోదించింది. ఈ నేపథ్యంలో కళాశాల మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కాగా, నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికలో తాము జోక్యం చేసుకోబోమని, కేంద్రం నిర్ణయంలోనూ జోక్యం అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని ఇన్‌పేషెంట్లుగా ఉంచుకోవాల్సిన అవసరం లేదని, ఎలాంటి ఆరోగ్య సమస్యల్లేని వారిని ఆస్పత్రిలో చేర్పించి రెన్యువల్ తెచ్చుకోవాలని చూసిన కళాశాల యాజమాన్యం మోసపూరితమైన చర్యకు పాల్పడిందని పేర్కొంది. పిటిషన్‌ను కొట్టివేయడంతో పాటు ఆరోగ్యవంతులను పేషెంట్లుగా చూపిన కారణంగా నాలుగు వారాల్లోగా రూ.2 కోట్ల జరిమానా సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆన్ రికార్డ్స్ వెల్ఫేర్ ఫండ్‌లో జమ చేయాలని ధర్మాసనం ఆదేశించింది.
రెన్యువల్ కోసం నకిలీ రోగులు!
Published Thu, Aug 9 2018 1:31 AM | Last Updated on Tue, Oct 16 2018 2:57 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment