పీజీ వైద్య విద్య అడ్మిషన్లకు నోటిఫికేషన్
నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పీజీ వైద్య సీట్ల అడ్మిషన్లకు సోమ వారం నోటిఫికేషన్ విడుదలైంది. నీట్ పీజీ–2017, నీట్ ఎండీ ఎస్–2017 ప్రవేశ పరీక్షలో కటాఫ్ మార్కులు సాధించిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారి నుంచి మెరిట్ జాబితా తయారు చేసి మెడికల్ పీజీ, డిప్లమో, ఎండీఎస్ కోర్సుల్లో సీట్లు భర్తీ చేస్తామని కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ రిజిస్ట్రార్ టి.వెంకటేశ్వర్‌రావు వెల్లడించారు.
నిమ్స్ సహా రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని పీజీ వైద్య సీట్లు భర్తీ చేస్తారు. దరఖాస్తులను మంగళవారం ఉదయం 11 నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు. మరిన్ని వివరాలను www.knruhs.in, http://tsp gmed.tsche.in, http://tsmds.tsche.inల్లో చూడవచ్చు.
ఉమ్మడి కౌన్సెలింగ్..
ప్రభుత్వ సీట్లు, నాన్ మైనారిటీ, మైనారిటీల్లోని కన్వీనర్ కోటా పీజీ వైద్య సీట్లను నీట్ ర్యాంకుల ఆధారంగా ఉమ్మడి కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తామని తెలుపుతూ వైద్య ఆరోగ్యశాఖ సోమవారం నోటిఫి కేషన్ జారీచేసింది. కాగా, ఏయే కాలేజీల్లో ఎన్ని పీజీ సీట్లు ఉన్నాయో ప్రకటించాల్సి ఉంది.
► ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6%, బీసీలకు 29% రిజర్వేషన్ అమలుచేస్తారు.
► 30% క్లినికల్ పీజీ సీట్లను, 50% ప్రీ, పారా క్లినికల్ సీట్లను ఇన్ సర్వీస్ కోటాలో ఇస్తారు. అందులోనూ రిజర్వేషన్లు ఉంటాయి.
► రెండేళ్లు ఆపై గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన వైద్యులు, మూడేళ్లు ఆపైన గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసినవారు, ఆరేళ్లు, ఆపైన పట్టణాల్లో పనిచేసిన అభ్యర్థులు ఇన్‌సర్వీస్ కోటా రిజర్వేషన్లకు అర్హులు. దరఖాస్తులో ఆ వివరాలన్నీ నమోదు చేయాలి. పనిచేస్తున్నట్లు డీఎంఈ నుంచి ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి.
►కాంట్రాక్లు, ఔట్ సోర్సింగ్ వైద్యులు ఇన్‌సర్వీస్ కోటాకు అనర్హులు.
►85% సీట్లు స్థానికులకు, 15% సీట్లు స్థానికేతరులకు ఇస్తారు.
వెబ్‌కౌన్సెలింగ్ ద్వారా సీట్లను భర్తీ చేస్తారు. వెబ్‌కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన వారి వివరాలను వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు. ఎంపికైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను విశ్వవిద్యాలయా నికి ఇవ్వాల్సి ఉంటుంది. ∙ పీజీ కోర్సులో చేరిన వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసు చేయడానికి, కన్సల్టేషన్‌గా ఉండటానికి వీల్లేదు.