Kaloji Narayana Rao Health University
-
పనివేళల్లో ప్రైవేటు ప్రాక్టీస్ చేయొద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేట్, ప్రభుత్వ వైద్యకళాశాలల అధ్యాపకులు పనివేళల్లో ప్రైవేట్ ప్రాక్టీస్‌కు దూరంగా ఉండాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు అన్ని వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఉత్తర్వులు ఇచ్చింది. టీచింగ్ ఫ్యాకల్టీలు వారి పనివేళల్లో అంటే ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రాక్టీస్ చేయొద్దని జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ఉత్తర్వులు ఇచ్చింది. పనివేళల్లో ఎవరైనా వైద్యులు ప్రాక్టీస్ చేస్తున్నట్లు గుర్తించినట్లయితే, అది వైద్య నైతిక నియమావళిని ఉల్లంఘించినట్లుగా భావించి, వారి రిజిస్ట్రేషన్ నంబర్లను తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ మెడికల్ రిజిస్ట్రీ నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. -
మెడికల్ సీట్ల కేటాయింపుపై నివేదిక ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మొత్తం 54 మెడికల్ (ఎంబీబీఎస్, డెంటల్) కాలేజీల్లో సీట్ల కేటాయింపు, ఫలితాల ప్రకటనకు సంబంధించి పూర్తి వివరాలు తమకు సీల్డ్ కవర్లో అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని హైకోర్టు ఆదేశించింది. కొత్త మెడికల్ కాలేజీల్లోని కన్వినర్ కోటాలోని 100 శాతం ఎంబీబీఎస్ సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 72ను కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తెలంగాణ స్టేట్ మెడికల్ కాలేజెస్ అడ్మిషన్ రూల్స్‌కు సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం 2014, జూన్ 2 తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లో కన్వినర్ కోటాలోని 100 శాతం ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ కానున్నాయి. ఈ మేరకు జూలై 3న జీవో నంబర్ 72ను విడుదల చేసింది. అంతకు ముందు జాతీయ కోటా 15 శాతం పోగా.. మిగిలిన సీట్లలో 85 శాతం స్థానిక విద్యార్థులకు ఉండగా, మిగతా 15 శాతం అన్ రిజర్వుడ్‌గా ఉండేది. ఇందులో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా పోటీ పడేవారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఏపీ విద్యార్థులకు పోటీపడే అవకాశం ఉండదు. దీన్ని సవాల్ చేస్తూ ఏపీకి చెందిన గంగినేని సాయి భావనతో పాటు మరికొందరు తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం శనివారం విచారణ చేపట్టింది. పాత కాలేజీల్లో సీట్లు వస్తే సమస్యే లేదు.. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రిజర్వేషన్లను 10 ఏళ్ల పాటు కొనసాగించాలని పిటిషనర్ న్యాయవాది వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ వాదిస్తూ.. ‘రాష్ట్ర విభజన నాటికి 20 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. 2,850 సీట్లలో 15 శాతం కింద 313 సీట్లను కేటాయించాం. 2019లో నీట్ అమల్లోకి వచ్చాక.. జాతీయ కోటా కింద 540 సీట్లను రిజర్వు చేశాం. మొత్తం ఈ 853 సీట్లలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అవకాశం ఉంటుంది.’అని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషనర్లను 15 శాతం కోటా కింద చేర్చడానికి సాఫ్ట్‌వేర్‌ను సర్దుబాటు చేయాలని వర్సిటీని ఆదేశించింది. సవరణ తర్వాత సీల్డ్ కవర్లో కోర్టుకు నివేదిక సమరి్పంచాలని స్పష్టం చేసింది. ఒకవేళ పిటిషనర్లు పాత 20 మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధించగలిగితే సమస్య ఉండదని.. లేని పక్షంలో వర్సిటీ సమరి్పంచే నివేదికను పరిశీలించి తగిన ఆదేశాలు జారీ చేస్తామని చెబుతూ, విచారణ వాయిదా వేసింది. -
పీజీ మెడికల్ కన్వీనర్ కోటా సీట్లకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. 2023–24 వైద్య విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని పీజీ మెడికల్ సీట్ల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. విశ్వవిద్యాలయ పరిధిలోని కన్వినర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. జాతీయ స్థాయి అర్హత పరీక్ష(నీట్)– 2023లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నేటినుంచి 17వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ ఈ నెల 10వ తేదీ (సోమవారం) ఉదయం 10 గంటల నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వర్సిటీ వర్గాలు విజ్ఞప్తి చేశాయి. నిర్దేశిత దరఖాస్తు పూర్తి చేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ లో సమర్పించిన దరఖాస్తులు, సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. మెరిట్ జాబితా విడుదల అనంతరం వెబ్ ఆప్షన్లకు యూనివర్సిటీ మరో నోటిఫికేషన్ జారీచేస్తుంది. తదనుగుణంగా అభ్యర్థులు ప్రాధాన్యక్రమంలో ఆప్షన్లు నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం కౌన్సెలింగ్ ప్రక్రియ ఉంటుంది. ఇతర సమాచారానికి యూనివర్సిటీ వెబ్సైట్ www. knruhs. telangana.gov.in లో సంప్రదించాలని యూనివర్సిటీ తెలిపింది. జనరల్ కేటగిరీ విద్యార్థులకు కటాఫ్ స్కోర్ 291 మార్కులు అభ్యర్థులు నీట్ పీజీలో కటాఫ్ స్కోర్ లేదా అంతకంటే ఎక్కువ సాధించి ఉండాలి. జనరల్ కేటగిరీ విద్యార్థులకు కనీస అర్హత 50 పర్సంటైల్ కాగా, కట్ ఆఫ్ స్కోర్ 291 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థుల కనీస అర్హత 40 పర్సంటైల్ కాగా, కట్ ఆఫ్ స్కోర్ 257 మార్కులు, దివ్యాంగుల కనీస అర్హత 45 పర్సంటైల్ కాగా, కట్ ఆఫ్ స్కోర్ 274 మార్కులు సాధించి ఉండాలని వర్సిటీ వెల్లడించింది. ఇతర ముఖ్యాంశాలు ♦ అభ్యర్థి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపుపొందిన మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ లేదా తత్సమాన డిగ్రీ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ♦ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేదా స్టేట్ మెడికల్ కౌన్సిల్ నుంచి శాశ్వత నమోదు చేసుకొని ఉండాలి. ♦ కంపల్సరీ రొటేటింగ్ ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి. ♦ ఎంబీబీఎస్ చదివినవారు గుర్తింపు పొందిన మెడికల్ కాలేజీల నుండి వచ్చే నెల 11వ తేదీ లేదా అంతకు ముందు ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి. 11 ఆగస్టు 2023 నాటికి ఇంటర్న్‌షిప్ పూర్తి చేసే అభ్యర్థులు సంబంధిత మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ జారీ చేసిన సర్టిఫికెట్‌ను సమర్పించాలి. ♦ సర్విస్‌లో ఉన్న అభ్యర్థుల విషయంలో 30 జూన్ 2023 నాటికి వారు అందించిన సేవలను పరిగణలోకి తీసుకుంటారు. ♦ ఓసీ, బీసీ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు రూ.5500 ♦ పీజీ డిగ్రీ లేదా డిప్లొమా కోర్సులకు రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.5500 (బ్యాంక్ లావాదేవీల చార్జీలు అదనం), ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.5000 (బ్యాంకు లావాదేవీల చార్జీలు అదనం). రుసుమును డెబిట్ కార్డ్ / క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్లైన్లో చెల్లించాలి. ♦ అభ్యర్థులు పాస్‌పోర్ట్ సైజు ఫొటో, అడ్మిట్ కార్డ్, నీట్ పీజీ ర్యాంక్ కార్డ్, ఒరిజినల్ లేదా ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్, ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం నుంచి చివరి సంవత్సరం వరకు స్టడీ సర్టిఫికెట్లు, ఇంటర్న్‌షిప్ కంప్లీషన్ సర్టిఫికెట్, పర్మినెంట్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తదితరాలు సమర్పించాలి. ♦ ఆన్లైన్ దరఖాస్తును సమర్పించడానికి అభ్యర్థులకు ఇబ్బందులు ఎదురైతే సాయం కోసం 9392685856, 7842542216 నంబర్లను సంప్రదించవచ్చు. -
ప్రీతి ఆత్మహత్య వ్యవహారంపై గవర్నర్ తమిళి సై సీరియస్
సాక్షి, హైదరాబాద్: ప్రీతి ఆత్మహత్య వ్యవహారంపై గవర్నర్ తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రీతి ఆరోగ్యం సరిగా లేదని మొదట తప్పుడు సమాచారం ఇచ్చి నిందితుడిని కాపాడటానికి ప్రయత్నించిన కాళోజీ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ అధికారులపై గవర్నర్ మండిపడ్డారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు అందజేయాలని వీసీకి లేఖ రాశారు. ప్రీతి మరణం భయంకరమైనదని, సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. మెడికల్ కాలేజీల్లో యాంటి ర్యాగింగ్ చర్యలు పకడ్బందీగా తీసుకోవాలన్నారు. మహిళా మెడికోలకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలన్నారు. ఇలాంటి సంఘటనలలో ఎలాంటి ఉదాసీనత లేకుండా, తక్షణం స్పందించి కాలేజీల్లో కఠిన చర్యలు చేపట్టాలన్నారు. మెడికల్ కాలేజీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్న గవర్నర్.. పీజీ మెడికోల డ్యూటీ సమయాలు, విశ్రాంతి లాంటి అంశాలపై శ్రద్ధ పెట్టాలని తెలిపారు. మహిళా మెడికోలకు కౌన్సెలింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయాలని గవర్నర్ పేర్కొన్నారు. -
యూజీ ఆయుష్ వైద్యవిద్య సీట్ల భర్తీకి వెబ్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: యూజీ ఆయుష్ వైద్య విద్య సీట్ల భర్తీకి రెండో విడత వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వ విద్యాలయం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. వర్సిటీ పరిధిలోని ఆయుష్ కళాశాలల్లో హోమియోపతి (బీహెచ్ ఎంఎస్), ఆయుర్వేద (బీఏఎంఎస్), యునాని (బీయూఎంఎస్), నేచురోపతి– యోగా (బీఎన్‌వైసీ) కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. ఈ నెల 16 ఉదయం 8 గంటల నుంచి 17వ తేదీ సాయంత్రం 6గంటల వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసు కోవాలని, తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది. అయితే అఖిల భారత కోటాలో, కాళోజీ, ఎన్టీఆర్ వర్సిటీలలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో సీటు పొందిన అభ్యర్థులు ఈ వెబ్ కౌన్సెలింగ్‌కు అనర్హులని పేర్కొంది. మరింత వివరాలకు www.knruhs.telangana.gov.in¯ను చూడాలని వెల్లడించింది. -
బీఎస్సీ హెల్త్ సైన్సెస్ ఫీజు రూ.15వేలు!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కొత్తగా ప్రవేశపెట్టబోయే బీఎస్సీ హెల్త్ సైన్సెస్ కోర్సులను మెరిట్ ఆధారంగా భర్తీ చేయనున్నారు. అందుకు సంబంధించి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇప్పటికే నోటిఫికేషన్ జారీచేసింది. నాలుగేళ్ల ఈ హెల్త్‌సైన్సెస్ కోర్సులను గాంధీ, ఉస్మానియా సహా 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఈ ఏడాది ప్రవేశపెడుతున్నారు. కొత్త కోర్సులు కావడంతో వీటికి మరింత డిమాండ్ ఏర్పడుతుందని భావిస్తున్నారు. ఈ కాలేజీలు యూనివర్సిటీకి చెల్లించాల్సిన ఫీజు రూ. 6వేలు కాగా, విద్యార్థుల నుంచి ఏడాదికి రూ.15 వేల వరకు ఫీజు వసూలు చేయాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. అంటే మూడేళ్లకు రూ.45 వేల ఫీజు ఉండొచ్చు. మరో ఏడాది ఇంటర్న్‌షిప్ ఉంటుంది. చివరి ఏడాదిలో విద్యార్థులకే స్కాలర్షిప్ ఇస్తారు. ఫీజు వివరాలను త్వరలో వెల్లడిస్తామని వర్సిటీ ప్రకటించింది. ఈనెల 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం పదో తరగతి ఆధారంగా పారామెడికల్ కోర్సులు ఉండగా, బీఎస్సీ డిగ్రీతో మొదటిసారిగా వీటిని ప్రవేశపెడుతున్నారు. దీనివల్ల మరింత నైపుణ్యం కలిగిన ఆరోగ్య సాంకేతిక నిపుణులు తయారుకానున్నారు. దీనివల్ల వైద్య సేవలు మరింత పటిష్టం కానున్నాయి. వీటిల్లో చేరే విద్యార్థులకు ప్రైవేట్ రంగంలోనూ మంచి ఆఫర్లు ఉంటాయి. అలాగే విదేశాల్లోనూ డిమాండ్ ఉంటుందని కాళోజీ వర్గాలు చెప్పాయి. ఈ నేపథ్యంలో మున్ముందు ఇతర ప్రభుత్వ మెడికల్ కాలేజీలు సహా ప్రైవేట్ కాలేజీల్లోనూ ఈ కోర్సులను ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. కోటా అభ్యర్థులు లేకుంటే ఓపెన్‌లోకి.. ►మొత్తం సీట్లలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వు చేశారు. ఈ కేటగిరీ అభ్యర్థులు లేకుంటే రిజర్వ్డ్ సీట్లు ఓపెన్ కేటగిరీకి వెళ్తాయి. వాటిని మెరిట్ ఆధారంగా కేటాయిస్తారు. ►29 శాతం సీట్లు బీసీలకు కేటాయిస్తారు. అర్హతగల అభ్యర్థులు లేకుంటే, మిగిలిన సీట్లను తదు పరి సబ్–గ్రూప్ అభ్యర్థులకు కేటాయించవచ్చు. వారు కూడా అందుబాటులో లేకుంటే, ఓపెన్ కేటగిరీకి మారుస్తారు. ►ఈడబ్ల్యూఎస్ కోటాలో 10% సీట్లు ఉన్నాయి. ►ప్రతి కేటగిరీలో మహిళా అభ్యర్థులకు 33.3 శాతం కేటాయిస్తారు. 5 శాతం దివ్యాంగులకు కేటాయిస్తారు. ►స్థానిక రిజర్వేషన్ 85 శాతం ఉంటుంది. ►మెరిట్ జాబితాను బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో పొందిన మార్కుల ఆధారంగా తయారుచేస్తారు. అర్హత సాధించిన అభ్యర్థులు ఒకే ప్రయత్నంలో ఉత్తీర్ణులైనవారా కాదా అనేది కూడా చూస్తారు. పాత అభ్యర్థులకు అధిక మెరిట్ ఉంటుంది. ►కోర్సు వ్యవధిలో ఒక కళాశాల నుంచి మరొక కళాశాలకు విద్యార్థుల బదిలీలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. ►ఈ సంవత్సరం 860 సీట్లను భర్తీ చేస్తారు. ప్రస్తుతం నేరుగా దరఖాస్తు చేయొచ్చు. ఇంటర్మీడియెట్ మెరిట్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. రాబోయే రోజుల్లో ఎంసెట్కుగానీ లేదా ఇతరత్రా ఏదైనా ప్రవేశ పరీక్షకు అనుసంధానిస్తారు. బీఎస్సీ హెల్త్‌సైన్సెస్ కోర్సులివీ.. ►అనెస్థీషియా టెక్నాలజీ ►ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ ►కార్డియాక్ కార్డియో వాస్క్యూలర్ టెక్నాలజీ ►రెనాల్ డయాలసిస్ టెక్నాలజీ ►ఆప్టోమెట్రీ, రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ ►న్యూరో సైన్స్ టెక్నాలజీ ►క్రిటికల్ కేర్ టెక్నాలజీ ►రేడియాలజీ ఇమేజింగ్ టెక్నాలజీ ►ఆడియోలజీ స్పీచ్ థెరపీ టెక్నాలజీ ►మెడికల్ రికార్డ్స్ సైన్సెస్ ►న్యూక్లియర్ మెడిసిన్ ►రేడియో థెరపీ టెక్నాలజీ -
ఎంబీబీఎస్‌లోనే మూడుసార్లు ‘నెక్ట్స్’
సాక్షి, హైదరాబాద్: నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (నెక్ట్స్)కు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం సన్నాహాలు చేస్తోంది. 2019 బ్యాచ్ ఎంబీబీఎస్ విద్యార్థులకు వచ్చే ఏడాది మొదటి విడత (స్టెప్–1) పరీక్ష నిర్వహించే అవకాశముందని, ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై తమకు స్పష్టమైన మార్గదర్శకాలు రావాల్సి ఉందంటున్నాయి. 2019 ఎంబీబీఎస్ బ్యాచ్‌ల నుంచి అమలు చేయనుండటంతో ఆయా విద్యార్థులు ఆ మేరకు సిద్ధంగా ఉండాలంటున్నాయి. ఎంబీబీఎస్ చదివేటప్పుడే నెక్ట్స్ పరీక్ష మూడుసార్లు జాతీయ స్థాయిలో జరగనుంది. వాటిల్లో విద్యార్థులు పాస్ కావాలి. ఒకటి బేసిక్ సైన్స్... రెండోది థియరీ... ఇంకోటి ప్రాక్టికల్స్ పరీక్ష ఉంటుంది. విదేశాల్లో ఉన్న పద్ధతిని అనుకరించాలన్నది జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఉద్దేశం. ఈ మూడు పరీక్షలు పాస్ కావాలి. అయితే థియరీ పరీక్షనే ప్రధానంగా తీసుకుంటామని, మిగిలిన రెండు పరీక్షలు కేవలం అర్హత సాధిస్తే చాలని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఎంబీబీఎస్ పాస్‌కు, తర్వాత రిజిస్ట్రేషన్, ప్రాక్టీస్‌కు కూడా ఈ పరీక్ష పాస్ కావడం తప్పనిసరి. అలాగే పీజీ మెడికల్ సీటులో ప్రవేశం కూడా నెక్ట్స్ అర్హతతోనే ఉంటుంది. అంటే నీట్ పీజీ పరీక్ష రద్దవుతుంది. అలాగే విదేశీ వైద్యవిద్యకు గుర్తింపు కూడా ఈ పరీక్ష ద్వారానే ఉంటుంది. అంటే మూడింటికీ ఇదే కీలకమైన పరీక్షగా ఉంటుంది. 2019 బ్యాచ్ వైద్య విద్యార్థులకు 2023 ఆగస్టు నాటికి నాలుగేళ్లు పూర్తవుతాయి. 2024 ఫిబ్రవరి–మార్చి నాటికి నాలుగున్నరేళ్లు అవుతుంది. కానీ మొదటి పరీక్ష బేసిక్ సైన్స్ ముందుగా నిర్వహించాలి. అంటే 2019 బ్యాచ్‌కు 2023లో ఉంటుందని అంటున్నారు. బేసిక్ సైన్స్ మొదటి పరీక్షను రెండో ఏడాది తర్వాత ఎప్పుడైనా నిర్వహించుకోవచ్చు. మొదటి పరీక్షలో అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీలతో ఉంటుంది. తర్వాత స్టెప్–2లో థియరీ, స్టెప్–3లో ప్రాక్టికల్స్ ఉంటాయి. థియరీ పరీక్షనే ప్రధానంగా తీసుకుంటామని, ప్రాక్టికల్స్ కేవలం క్వాలిఫై అయితే చాలని ఎన్ఎంసీ పేర్కొంది. హౌస్‌సర్జన్ తర్వాత ప్రాక్టికల్స్ నిర్వహించాలా లేక ముందే నిర్వహించాలా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉందని కాళోజీ వర్గాలు చెబుతున్నాయి. వైద్యవిద్యలో నాణ్యతను పెంచడమే లక్ష్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో మాదిరిగా వైద్యవిద్యలో నాణ్యతను పెంచడమే లక్ష్యంగా ఎన్ఎంసీ నెక్ట్స్ పరీక్షకు శ్రీకారం చుడుతోంది. జాతీయ స్థాయిలో ఏకీకృతమైన పరీక్షను పెట్టడం ద్వారా దేశవ్యాప్తంగా నాణ్యమైన వైద్యవిద్యను అందించాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భారతీయులు విదేశాల్లో ఎంబీబీఎస్ వైద్యవిద్య పూర్తి చేసిన వారికి ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. అందులో పాసైతేనే ఇండియాలో డాక్టర్‌గా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, ప్రాక్టీస్ చేయడానికి, ప్రభుత్వ వైద్య ఉద్యోగాల్లో చేరడానికి అనుమతి ఉంది. అయితే ఎఫ్ఎంజీఈ పరీక్ష ఎంతో కఠినంగా ఉండటంతో పరీక్ష రాసేవారిలో 20 శాతానికి మించి అర్హత సాధించలేకపోతున్నారు. ఇప్పుడు నెక్ట్స్ పరీక్షను మూడు రకాల అర్హతలకు నిర్వహిస్తున్నందున దీన్ని కీలకంగా భావిస్తున్నారు. ఇది పాస్ కాకుంటే ఎంబీబీఎస్ పట్టా ఇవ్వరు. ఎంతో కఠినంగా ఈ పరీక్ష ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే 2023లో నిర్వహించే స్టెప్–1 పరీక్ష ఎంబీబీఎస్‌లో బేసిక్ పరీక్ష మాత్రమే. 2024లో నిర్వహించేదే ఎంబీబీఎస్ అర్హతకు, మెడికల్ పీజీ సీట్లలో ప్రవేశానికి ఉంటుందని వివరిస్తున్నారు. ఎందుకంటే వచ్చే ఏడాది నీట్–పీజీ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. నెక్ట్స్ పరీక్ష సిలబస్, సరళిని ఇంకా నిర్ణయించాల్సి ఉంది. -
పీజీ వైద్య విద్య సీట్లకు వెబ్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: పీజీ వైద్య విద్య యాజమాన్య కోటా సీట్లకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు కాళోజి హెల్త్ యూనివర్సిటీ తెలిపింది. ఈ మేరకు ఆదివారం రెండో విడత ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో ఉన్న యాజమాన్య కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. సీట్ల ఖాళీ ల వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్ లో పొందుపరిచారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి అదే రోజు రాత్రి 8 గంటల వరకు ప్రాధాన్య క్రమంలో కళాశాలల వారిగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్సైట్ www.knruhs.telangana.gov.inలో చూడా లని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో సూచించాయి. -
కౌన్సెలింగ్‌కు అనుమతించండి.. తెలంగాణ సర్కార్‌కు షోకాజ్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్/బీడీఎస్ కౌన్సెలింగ్‌కు తమను అనుమతించాలని కోరుతూ నలుగురు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారిని కౌన్సెలింగ్‌కు అనుమతించాలని ఆదేశించింది. అయితే తుది ఉత్తర్వుల మేరకే సీట్ల కేటాయింపు ఉంటుందని వెల్లడించింది. విచారణను నవంబర్ 15కు వాయిదా వేసింది. తమను ఎంబీబీఎస్/బీడీఎస్ కౌన్సెలింగ్‌కు అనుమతించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ భారత మూలలున్న (పీవోఐ: పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్) టేకుమాల విదిత సహా మరో ముగ్గురు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. తాము నాలుగేళ్లుగా తెలంగాణలోనే చదువు తున్నారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, కేంద్ర ఆరోగ్య శాఖ, ఎన్ఎంసీ, రాష్ట్ర వైద్యారోగ్య ముఖ్య కార్యదర్శి, కాళోజీ నారాయణ రావు వర్సిటీని ప్రతివాదులుగా పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలీ, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి, కేంద్ర తరఫున అడ్వొకేట్ బి.కవిత యాదవ్, ఎన్ఎంసీ తరఫున శ్రీరంగ పూజిత, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎ.సంజీవ్‌కుమార్, కాళోజీ వర్సిటీ తరఫున ఎ.ప్రభాకర్‌రావు వాదనలు వినిపించారు. భారత మూలాలున్న వారు, విదేశాల్లో ఉండే భారతీయులు ఇక్కడ ఎంబీబీఎస్/బీడీఎస్ చదివేందుకు అర్హులేనన్నారు. -
TS: పీజీ నీట్ కటాఫ్ మార్కులు తగ్గింపు
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పీజీ నీట్–2022 కటాఫ్ స్కోర్‌ను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తగ్గించింది. దీనితో మరింత మంది విద్యార్థులు ప్రవేశాలకు అర్హత సాధించిన నేపథ్యంలో.. అడ్మిషన్ల కోసం కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. పీజీ మెడికల్ అడ్మిషన్లకు సంబంధించి కన్వీనర్ కోటాతోపాటు యాజమాన్య కోటా సీట్ల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు వర్సిటీ పేర్కొంది. వివిధ కేటగిరీల్లో పర్సంటైల్ మారుస్తూ.. పీజీ నీట్–2022 కటాఫ్ స్కోరును 25 పర్సంటైల్ తగ్గిస్తూ కేంద్రం నిర్ణయించడంతో అన్ని కేటగిరీల్లో పర్సంటైల్ మారినట్టు కాళోజీ వర్సిటీ తెలిపింది. జనరల్ కేటగిరీలో 25 పర్సంటైల్‌తో 201 మార్కులు.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు 15 పర్సంటైల్‌తో 169 మార్కులు.. దివ్యాంగుల కేటగిరీలో 20 పర్సంటైల్‌తో 186 మార్కులు సాధించినవారు ప్రవేశాలకు అర్హత పొందుతారని వెల్లడించింది. కటాఫ్ మార్కులు తగ్గిన మేరకు అర్హత పొందిన అభ్యర్థులు కన్వీనర్ కోటా సీట్లకు ఈ నెల 23వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అదే యాజమాన్య కోటా సీట్లకు ఈ నెల 24వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని వెల్లడించింది. మరింత సమాచారం కోసం యూని వర్సిటీ వెబ్సైట్ www. knruhs. telangana. gov. in ను సందర్శించాలని సూచించింది. -
తుది కేటాయింపులు చేయొద్దు
సాక్షి, హైదరాబాద్: నీట్–పీజీ కన్వీనర్ కోటా సీట్లకు సంబంధించి తుది కేటాయింపును ఖరారు చేయవద్దని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని హైకోర్టు ఆదేశించింది. వచ్చే సోమవారం వరకు ఎంపిక ప్రక్రియను నిలుపుదల చేయాలని స్పష్టం చేసింది. ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాళోజీ వర్సిటీని ఆదేశించింది. రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాలు, గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యులకు వైద్యవిధాన పరిషత్ సర్వీస్ సర్టిఫికెట్లు ఇచ్చింది. వారికి ఆ ప్రకారం పీజీ సీట్ల కేటాయింపులో కోటా వర్తిస్తుంది. నల్లగొండ జిల్లా చౌటుప్ప ల్లోని పంతంగికి చెందిన డాక్టర్ దిండు మల్లికార్జున్ సహా మరో ముగ్గురు ఈ సర్వీస్ సర్టిఫికెట్‌ను నీట్–పీజీ కౌన్సెలింగ్ సందర్భంగా ఇచ్చినా.. వర్సిటీ వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించి లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. గురువారం ఉదయంతో వెబ్ ఆప్షన్లు ముగియనుండటంతో కోర్టు ఉత్తర్వుల తర్వాత తమకు ఆప్షన్ల అవకాశం కూడా ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ సీహెచ్.సుమలతలతో కూడిన వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సామ సందీప్‌రెడ్డి వాదనలు వినిపించారు. గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యులకు పీజీ కౌన్సెలింగ్‌లో సర్వీస్ కోటా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సరిగ్గా అమలు చేయట్లేదన్నారు. తెలంగాణ వైద్యవిధాన పరిషత్ సర్వీస్ తొలుత సర్టిఫికెట్లు జారీ చేసి ఆ తర్వాత అవి చెల్లవంటూ వర్సిటీ అధికారులకు చెప్పడంతో పిటిషనర్ల భవిష్యత్తు గందరగోళంగా మారిందన్నారు. చాలా మందికి సర్వీస్ సర్టిఫికెట్లు ఇచ్చారని.. అందరివీ పరిగణనలోకి తీసుకున్నప్పుడు, కేవలం పిటిషనర్ల సర్టిఫికెట్లు చెల్లవని చెప్పడం చట్టవిరుద్ధమని నివేదించారు. వాదనలు విన్న ధర్మాసనం... వైద్య విధాన పరిషత్ తీరును తప్పుబట్టింది. సీట్ల కేటాయింపును ఖరారు చేయవద్దని ఆదేశిస్తూ.. విచారణను వాయిదా వేసింది. -
TS: రాష్ట్రంలో నీట్ అర్హులు 36,795 మంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రస్థాయి నీట్ ర్యాంకులు శుక్రవారం విడుదలయ్యాయి. రాష్ట్రం నుంచి 36,795 మంది నీట్ పరీక్షలో అర్హత సాధించినట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వెల్లడించింది. నీట్ జాతీయ స్థాయిలో ఐదో ర్యాంకు సాధించిన ఎర్రబెల్లి సిద్ధార్థరావు.. తెలంగాణ రాష్ట్రంలో టాప్ ర్యాంకర్‌గా నిలిచారు. జాతీయ స్థాయిలో 37వ ర్యాంకు సాధించిన చప్పిడి లక్ష్మీచరిత రాష్ట్రంలో రెండో ర్యాంకు సాధించారు. జాతీయ స్థాయి 41వ ర్యాంకర్ జీవన్‌కుమార్‌రెడ్డి రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచారు. తొలి 50 స్థానాల్లో.. 28 మంది బాలురు, 22 బాలికలు ఉన్నారు. అర్హత కటాఫ్ మార్కులను ఓపెన్ కేటగిరీలో 117, బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీలకు 93 మార్కులు, పీడబ్ల్యూడీ జనరల్‌కు 105 మార్కులుగా నిర్ణయించారు. ఈ రాష్ట్ర స్థాయి ర్యాంకుల్లో ఎవరైనా విద్యార్థుల పేర్లులేకుంటే కంగారు పడాల్సిన అవసరం లేదని, తర్వాత కౌన్సెలింగ్ సందర్భంగా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. పొరపాటున కొందరు ర్యాంకర్ల పేర్లు ఇతర రాష్ట్రాల పరిధిలోకి వెళ్లి ఉండవచ్చని పేర్కొన్నారు. కాగా రాష్ట్రంలో టాప్ వెయ్యి ర్యాంకర్లు ఆలిండియా సీట్లలో చేరే అవకాశం ఉందని.. మిగతావారు రాష్ట్ర స్థాయి కాలేజీల్లో చేరుతారని కాళోజీ వర్సిటీ వర్గాలు అంటున్నాయి. ఎంబీబీఎస్‌లో ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లు 215 రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 2022–23 వైద్య విద్యా సంవత్సరానికి ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు 215 సీట్లు కేటాయించినట్లు కాళోజీ వర్గాలు వెల్లడించాయి. ఇందులో గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీల్లో 50 సీట్ల చొప్పున, ఆదిలాబాద్ రిమ్స్, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 20 సీట్ల చొప్పున, మహబూబ్‌నగర్, సిద్దిపేట మెడికల్ కాలేజీల్లో 25 సీట్ల చొప్పున, మిగతావి ఈఎస్ఐ మెడికల్ కాలేజీలో ఉన్నాయని పేర్కొన్నాయి. అయితే ఇందులో సగం సీట్లను మాత్రమే ఈడబ్ల్యూఎస్ కోటా అర్హులైన వారితో భర్తీ చేస్తామని.. మిగతా సీట్లను ఎస్సీ, బీసీ, ఎస్టీ విద్యార్థులకు కేటాయిస్తామని విశ్వవిద్యాలయం తెలిపింది. నిబంధనల ప్రకారం ఈడబ్ల్యూఎస్ కోటాలో ఎన్ని సీట్లను భర్తీ చేస్తారో, అన్ని సీట్లను మిగిలిన రిజర్వేషన్లకు కేటాయించాల్సి ఉంటుందని పేర్కొంది. రాష్ట్రంలో 5,965 సీట్లు ప్రస్తుత లెక్కల ప్రకారం తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కలిపి 2022–23 వైద్య విద్యా సంవత్సరానికి 5,965 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వంలోని అన్ని సీట్లను, ప్రైవేటు కాలేజీల్లోని 50శాతం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 15శాతం సీట్లను ఆలిండియా కోటా కింద జాతీయస్థాయిలో భర్తీ చేస్తారు. వాటిలో రెండు విడతల కౌన్సెలింగ్ తర్వాత సీట్లు ఏవైనా మిగిలితే.. వాటిని రాష్ట్రానికి అప్పగిస్తారు. వచ్చేనెల రెండో వారంలో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు ప్రకటన జారీచేసే అవకాశం ఉందని కాళోజీ వర్సిటీ వర్గాలు తెలిపాయి. -
మాకు సీట్లు ఇప్పించండి..
ఎంజీఎం: రాష్ట్రంలో జాతీయ వైద్య కమిషన్ (ఎన్ ఎంసీ) ఇటీవల రద్దు చేసిన మెడికల్ సీట్ల విషయంలో వివాదం ఇంకా కొనసాగుతోంది. ఎన్ఎంఆర్, టీఆర్ఆర్, మహావీర్ మెడికల్ కళాశాలల్లో సీట్లను ఎన్ఎంసీ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ కాలేజీల్లో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఇతర మెడికల్ కళాశాలల్లో సీట్లు కేటాయించాలని ఎన్ఎంసీ ఆదేశించినా వరంగల్ కాళోజీ ఆరోగ్య వర్సిటీ పట్టించుకోకపోవడంతో మూడు కళాశాలల విద్యా ర్థులు, వారి తల్లిదండ్రులు శుక్రవారం ఆరోగ్య వర్సిటీ ఎదుట వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. తమకు వెంటనే సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కాగా, విద్యార్థులు, వారి తల్లిదండ్రులను లోపలికి అనుమ తించకుండా పోలీసులు యూనివర్సిటీ గేటు ఎదు టనే అడ్డుకున్నారు. దీంతో వారు అక్కడే ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా వైద్యవిద్యార్థులు మాట్లాడుతూ ఆరోగ్య వర్సిటీ అ«ధికారులు, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని, లేకుంటే ఆమరణ దీక్ష చేపడతామని హెచ్చరించారు. దీనిపై వర్సిటీ అధికారులు మాట్లాడు తూ ఎన్ఎంసీ ఆదేశాలు ఇవ్వడం సబబుగానే ఉందని, అయితే ఇక్కడ 450 మంది ఎంబీబీఎస్ విద్యా ర్థులు, 111 మంది పీజీ విద్యార్థులు ఉన్నారని, ఇంత పెద్ద మొత్తంలో విద్యార్థులను సర్దుబాటు చేయ డం కష్టమన్నారు. భవిష్యత్‌లో సాంకేతికంగా, చట్టపరంగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు. ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక పరిస్థితుల్లో ఈ సీట్లను సర్దుబాటు చేస్తున్నామని ప్రత్యేక జీఓ తెస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదన్నారు. -
విద్యార్థులకు తెలియకుండానే.. దరఖాస్తులు అప్లోడ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎక్కడా సీట్ల బ్లాకింగ్ జరగలేదని కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ వైస్ చాన్సలర్ కరుణాకర్‌రెడ్డి చెప్పారు. ఏడు సీట్లకు సంబంధించి ఇతర రాష్ట్రాల అభ్యర్థుల టెన్త్, ఇంటర్ సర్టిఫికెట్లు, ఆధార్, నీట్ అర్హతకార్డు వంటివన్నీ ఇతరులెవరో అప్లోడ్ చేసి దరఖాస్తు చేసినట్టుగా భావిస్తున్నా మని తెలిపారు. అయితే తమను తప్పుదారి పట్టించేందుకు అభ్యర్థులే ఈ నాటకం ఆడుతున్నారా? లేక ప్రైవేట్ ఏజెన్సీలేమైనా అక్రమాలకు పాల్పడ్డాయా అన్నదానిపై విచారణ జరుగుతోందన్నారు. పీజీ మెడికల్ సీట్ల బ్లాకింగ్ స్కాంపై శుక్రవారం వైద్యవిద్య సంచాలకుడు (డీఎంఈ) రమేశ్‌రెడ్డి, ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావుతో కలిసి కరుణాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. సొంత రాష్ట్రంలోని మంచి కాలేజీలో చేరి, ఇక్కడా చేరినట్టు అనుమానం రావడంతో.. మార్చి 16న కొందరు అభ్యర్థులకు లేఖలు రాశామని.. సీట్లు బ్లాక్ చేస్తే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించామని తెలిపారు. వివిధ విడతల కౌన్సెలింగ్ అనంతరం 37 సీట్లలో ఉన్నతర్యాంకు వారు దరఖాస్తు చేశారని.. వారిలో ముగ్గురికి సొంత రాష్ట్రాల్లో మంచి సీట్లు వచ్చే అవకాశం ఉండటంతో తిరస్కరించామని వివరించారు. మిగతా 34 సీట్లకుగాను 14 మంది ఇక్కడ చేరారన్నారు. మరో ఏడుగురికి సంబంధించి అభ్యర్థులు కాకుండా ఇతరులు దరఖాస్తు చేసినట్టు గుర్తించామని తెలిపారు. వారు బీహార్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌కు చెందినవారని వెల్లడించారు. సాధారణంగా మాప్ అప్ విడత తర్వాత మిగిలిన సీట్లను మేనేజ్మెంట్లకు ఇవ్వాలని, కానీ మరో విడత కౌన్సెలింగ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఆ తర్వాతా సీట్లు మిగిలితేనే ఎన్నారై కోటా కింద మార్చుకునేందుకు ప్రైవేట్ కాలేజీలకు అనుమతి ఉంటుందన్నారు. గవర్నర్‌కు నివేదిస్తాం..: సీట్ల బ్లాకింగ్‌కు సంబంధించిన ప్రచారం నేపథ్యంలో గవర్నర్‌కు సమగ్ర నివేదిక ఇస్తామని వీసీ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. విద్యార్థులు సీటు వదులుకుంటే ఇప్పటివరకు రూ.5 లక్షలు జరిమానా విధించే వారమని, దాన్ని రూ.20 లక్షలకు పెంచామని చెప్పారు. 2017 నుంచి నీట్ ద్వారా అడ్మిషన్లు జరుగుతున్నందున మేనేజ్మెంట్ సీట్లకు సంబంధించి సమస్యలు వస్తున్నాయని పేర్కొన్నారు. 2019లో ఇలాగే ముగ్గురు విద్యార్థులపై నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ)కు లేఖ రాశామని.. బ్లాకింగ్ జరగలేదని ఎన్ఎంసీ తేల్చిందని చెప్పారు. అన్నిరాష్ట్రాల పీజీ సీట్లలో ఎవరెవరు చేరారో వెబ్సైట్లలో పెట్టడం లేదా కామన్ కౌన్సిలింగ్ నిర్వహించడం ద్వారా అక్రమాలకు చెక్ పెట్టవచ్చని తెలిపారు. -
వరంగల్‌లో మెడికల్ సీట్ల మాఫియా
-
బీడీఎస్ కన్వీనర్ సీట్లకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల వెబ్ కౌన్సెలింగ్‌కు కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం మాప్ అప్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దంత కళాశాలల్లో బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్లకు ఇప్పటికే రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తయిందని, కన్వీనర్ కోటలో ఇంకా మిగిలిపోయిన ఖాళీలను ఈ మాప్ అప్ రౌండ్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపింది. అర్హులైన అభ్యర్థులు 5వ తేదీ మధ్యా హ్నం 3 నుంచి వెబ్ ఆప్షన్లు నమోదు చేసు కోవాల ని సూచించింది. గత విడత కౌన్సెలింగ్‌లో సీటు అలాట్ అయి జాయిన్ కాకపోయినా, చేరి డిస్ కం టిన్యూ చేసినా, ఆల్ ఇండియా కోటాలో ఇప్పటికే సీటు పొందిన అభ్యర్థులు ఈ కౌన్సెలింగ్‌కు అనర్హులని పేర్కొంది. వివరాలకు www.knruhs. telangana.gov.in వెబ్‌సైట్‌ను చూడవచ్చు. -
ఎంబీబీఎస్ సీట్లకు వెబ్ కౌన్సిలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేట్ వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా ఎంబీబీఎస్ సీట్లకు నేటి నుంచి 2వరకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది. రెండో విడత కౌన్సిలింగ్ తరవాత ఖాళీ అయిన సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారని గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. సీట్ల ఖాళీల వివరాలను వెబ్సైట్లో పొందుపర్చారని, ఇప్పటికే యూనివర్సిటీ విడుదల చేసిన తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు ఈ విడత వెబ్ కౌన్సెలింగ్‌కు అర్హులని వివరించింది. గత కౌన్సెలింగ్‌లో సీట్ అలాట్ అయి జాయిన్ కాకపోయినా, చేరి డిస్కంటిన్యూ చేసినా అదే విధంగా అల్ ఇండియా కోటాలో ఇప్పటికే సీటు పొందిన అభ్యర్థులు ఈ కౌన్సెలింగ్‌కు అనర్హులని సూచించింది. మరిన్ని వివరాలకు www.knruhs. telangana.gov.in చూడాలని తెలిపింది. -
ఆన్లైన్ దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్య విద్య కోర్సుల్లో యాజమాన్య కోటాలో ప్రవేశాలకుగాను ఆన్లైన్ దరఖాస్తుల నమోదుకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్లో అర్హత సాధించిన అభ్యర్థులు ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లకు నమోదు చేసుకోవాలన్నారు. యాజమాన్య కోటాలో సీట్ల భర్తీకి అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను ఈ నెల 6వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నారు. నిర్దేశిత దరఖాస్తు పూర్తి చేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు, సర్టిఫికెట్లను యూనివర్సిటీ పరిశీలించిన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తుంది. ప్రవేశాలకు సంబంధించి అర్హత ఇతర సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్ సైట్ www.knruhs.telangana.gov.in లో సంప్రదించాలని విశ్వవిద్యాలయ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. -
ఈడబ్ల్యూఎస్ కోటా..203 ఎంబీబీఎస్ సీట్లు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 2021–22 వైద్య విద్య సంవత్సరానికి గాను ఆర్థికపరంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు 203 ఎంబీబీఎస్ సీట్లు కేటాయించారు. ఇందులో గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీల్లో 50 సీట్ల చొప్పున, ఆదిలాబాద్ రిమ్స్, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 20 సీట్ల చొప్పున, మహబూబ్‌నగర్, సిద్దిపేట మెడికల్ కాలేజీల్లో 25 సీట్ల చొప్పున, ఈఎస్ఐ మెడికల్ కాలేజీల్లో 13 సీట్లు మంజూరైనట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది. అయితే వీటిలో 102 సీట్లను మాత్రమే ఈడబ్ల్యూఎస్ కోటా కింద అర్హులైన వారితో భర్తీ చేస్తామని, మిగిలిన 101 సీట్లలో 30 ఎస్సీ విద్యార్థులకు, 59 బీసీ, 12 ఎస్టీ విద్యార్థులకు కేటాయిస్తామని విశ్వవిద్యాలయం తెలిపింది. నిబంధనల ప్రకారం ఈడబ్ల్యూఎస్ కోటాలో ఎన్ని సీట్లను భర్తీ చేస్తారో, అన్ని సీట్లను మిగిలిన రిజర్వేషన్లకు కేటాయించాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే రాష్ట్రానికి ఈడబ్ల్యూఎస్ సీట్లను మంజూరు చేశారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అఖిల భారత కోటాలోకి 230 సీట్లు.. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,285 కన్వీనర్ కోటా సీట్లుండగా, వీటిలో 15 శాతం సీట్లను అంటే సుమారు 230 సీట్లను అఖిల భారత కోటాలోకి ఇవ్వనున్నారు. ఇందులో గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీల్లో 30 చొప్పున, ఉస్మానియాలో 37, రిమ్స్ ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఈఎస్ఐ కాలేజీలో 15 చొప్పున, మహబూబ్‌నగర్, సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 22 సీట్ల చొప్పున కేటాయించారు. అఖిల భారత కౌన్సెలింగ్ సందర్భంగా ఈ ఎంబీబీఎస్ సీట్లను నింపుతారు. వీటికి దేశవ్యాప్త విద్యార్థులు పోటీ పడతారు. రెండు కౌన్సెలింగ్‌లలో ఈ సీట్లను భర్తీ చేస్తారు. అయినా సీట్లు మిగిలిపోతే, వాటిని తిరిగి రాష్ట్రంలో జరిగే కౌన్సెలింగ్‌లో భర్తీ చేసుకునే అవకాశం ఇస్తారు. కాగా, రెండ్రోజుల కింద నీట్ ఫలితాలు వచ్చాయి. అయితే రాష్ట్రాల వారీగా ఇంకా ర్యాంకులు ప్రకటించలేదు. త్వరలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నుంచి రాష్ట్రానికి చెందిన అర్హులైన విద్యార్థుల జాబితా వస్తుందని, అనంతరం రాష్ట్ర స్థాయి ర్యాంకులు ప్రకటిస్తామని అధికారులు చెబుతున్నారు. -
మమ్మల్నీ పాస్ చేయండి..!
సాక్షి, హైదరాబాద్: ఇతర అన్ని తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే ప్రమోట్ చేసినట్లు తమనూ పాస్ చేయాలని లేదా మార్కుల శాతాన్నైనా తగ్గించాలని ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి వైద్య విద్యార్థులు కోరుతున్నారు. కరోనాతో ఆన్లైన్ క్లాసుల వల్ల చాలావరకు నష్టపోయామని, పరీక్షల్లో ఫెయిలయ్యామని మొదటి ఏడాది పరీక్షలు రాసినవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన క్లాసులవారి పరిస్థితీ అంతే. ఈ విషయాన్ని కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఫస్టియర్ పరీక్షల్లో 71 శాతం మంది పాసవగా, మిగిలినవారు ఏదో ఒక సబ్జెక్టులో ఫెయిలయ్యారని వర్సిటీ వర్గాలు చెప్పాయి. కరోనాకు ముందు మొదటి ఏడాది పరీక్షల్లో 88 శాతంపైగా ఉత్తీర్ణు లయ్యారు. ఒకవేళ ప్రమోట్ చేయడం నిబంధనల ప్రకారం సాధ్యం కాదనుకుంటే, పాస్ మార్కులను 50 శాతం నుంచి 35 శాతానికి తగ్గించాలని కోరుతున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల భవిష్యత్తు పట్ల తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఆన్‌లైనా? ఆఫ్‌లైనా? కరోనా కేసులు నమోదవుతుండటం, థర్డ్‌వేవ్ హెచ్చరికల నేపథ్యంలో యూజీ టూ పీజీ వరకు తరగతులన్నింటినీ ఆన్లైన్లోనే నిర్వహించాలని నిర్ణయించినా, మెడికల్ క్లాసులపై సర్కారు స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం ఎంబీబీఎస్, డెంటల్, ఆయుష్, నర్సింగ్ తదితర వైద్య కోర్సుల తరగతులు ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. మరి వాటిని అలాగే ఆన్లైన్లోనే కొనసాగించాలా? లేదా నేరుగా తరగతులు నిర్వహించాలా? అన్నదానిపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు చెప్పాయి. మెడికల్ పీజీ విద్యార్థులు సహజంగా బోధనాసుపత్రుల్లో వైద్య సేవల్లో నిమగ్నం కావాల్సిందే కాబట్టి వారికి మినహా యింపు ఉండదు. ఎంబీబీఎస్, డెంటల్, ఆయుష్ కోర్సులకు కూడా జాగ్రత్తలతో నేరుగా క్లాసులు నిర్వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వైద్య వర్గాల్లోనూ, కొందరు విద్యార్థుల్లోనూ ఉంది. విద్యార్థులను రెండు బ్యాచ్‌లుగా విభజించి, నెలలో 15 రోజులు ఒక బ్యాచ్, మరో 15 రోజులు రెండో బ్యాచ్ వచ్చేలా ఏర్పాట్లు చేయాలని కొందరంటున్నారు. అయితే నేరుగా క్లాసులు తీసుకోవడం రిస్క్ అవుతుందన్న అభిప్రాయంలో కాళోజీ వర్సిటీ వర్గాలున్నాయి. దీంతో ఆన్లైన్లోనే తరగతులు కొనసాగింపు విషయంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపే అవకాశం ఉంది. 55 వేల మందికి ఆన్లైన్లోనే.. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, నర్సింగ్, ఫిజియోథెరపీ సహా ఇతర అన్ని రకాల కాలేజీల్లో మొత్తం విద్యార్థులు దాదాపు 55 వేల మంది ఉంటారు. 33 ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మొదటి ఏడాది నుంచి చివరి ఏడాది వరకు విద్యార్థులు 20 వేల మంది వరకు ఉంటారు. 20 వేల మంది నర్సింగ్, 6 వేల మంది డెంటల్, 5 వేల మంది ఫిజియోథెరపీ విద్యార్థులు, మిగిలినవారు ఆయుష్ సహా ఇతరత్రా కోర్సులకు చెందినవారు ఉంటారని అధికారులు తెలిపారు. అన్ని కాలేజీల్లో కరోనా మొదటి వేవ్ సందర్భంగా కూడా ఆన్లైన్లోనే క్లాసులు నిర్వహించారు. కరోనా తగ్గినప్పుడు మధ్యలో రెండు నెలలపాటు ప్రాక్టికల్స్ వరకు నేరుగా నిర్వహించారు. వాస్తవంగా మెడికల్ క్లాసులను ఆన్లైన్లో నిర్వహించడం సమంజసం కాకపోయినా, తప్పనిసరి పరిస్థితుల్లో నిర్వహించాల్సి వచ్చింది. -
హైకోర్టు ఆదేశాలను పక్కనపెట్టిన సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: ఒక ప్రవాస విద్యార్థినికి వైద్య విద్యలో ప్రవేశానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ మేరకు వైద్య విద్యలో ప్రవేశం కల్పించాలంటూ కాళోజీ వైద్య విశ్వవిద్యాలయానికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టింది. విద్యార్హతలకు సంబంధించి విశ్వవిద్యాలయానికి అందజేసిన ధ్రువప త్రాల్లో స్పష్టత లేదని సుప్రీంకోర్టు తేల్చింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు సవాల్ చేస్తూ కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం దాఖలు చేసిన పిటిషన్‌పై సమగ్ర విచారణ జరిపిన జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్.రవీంద్రభట్‌ల ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. అమెరికాలో 12వ తరగతి చదివిన శ్రీకీర్తిరెడ్డి అనే ప్రవాస విద్యార్థిని నీట్‌కు అర్హత సాధించి 2020–21 విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్‌లో ప్రవేశానికి దర ఖాస్తు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం అమెరికాలో 12వ తరగతి స్థాయిలో బయోలజీ చదివినట్లుగా ఆధారాలు లేవని కాళోజీ వర్సిటీ ప్రవేశానికి నిరాకరించింది. వర్సిటీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆమె తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అమెరికాలో 12వ తరగతి రాష్ట్రంలో ఇంటర్‌తో సమానమంటూ ఇంటర్ బోర్డు, న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్ ఇచ్చిన ధ్రువపత్రాలను ఆమె కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వీటిని పరిశీలించిన తెలంగాణ హైకోర్టు కీర్తిరెడ్డికి ఎంబీబీఎస్‌లో ప్రవేశం కల్పించాలంటూ ఆదేశాలిచ్చింది. ధ్రువ పత్రాలు, విషయ నిబంధనలను నిశితంగా పరిశీలించలేదని పేర్కొంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలను పక్కన పెడుతూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. చదవండి: లక్షల కోట్లకన్నా గోప్యతే ముఖ్యం -
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాలకు నోటిఫికేషన్
సాక్షి, వరంగల్ : రాష్ర్టంలో దంత వైద్య ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాలకు గాను ఆన్లైన్ దరఖాస్తుల నమోదుకు కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నేడు నోటిఫికేషన్ విడుదల చేసింది. జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్ 2020లో అర్హత సాధించిన అభ్యర్థులు నమోదు చేసుకోవాలని తెలిపారు. కరోనా వైరస్ దృష్ట్యా ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలిన పీజీ తరహాలోనే యుజి ప్రవేశాలకు చేపట్టనున్నారు. 01-11-20 నుంచి 08-11-20 వరకు ఉదయం 8 గంటల నుంచి సాయింత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. నిర్ధేశిత ధరఖాస్తు పూర్తి చేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ లో సమర్పించిన దరఖాస్తులు , సర్టిఫికెట్లను యూనివర్సిటీ పరిశీలించిన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. ప్రవేశాలకు సంబంధించి అర్హత ఇతర సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్ సైట్ www.knruhs.telangana.gov.in లో సందర్శించాలని యూనివర్సిటీ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపారు. -
రాష్ట్రంలో పెరిగిన ఎంబీబీఎస్ సీట్లు..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి. తాజాగా ఓ ప్రైవేట్ కాలేజీకి అనుమతి రావడంతో అదనంగా 150 ఎంబీబీఎస్ సీట్లు పెరిగినట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది. రాష్ట్రంలో 2020–21 సంవత్సరానికి మెదక్ జిల్లా పటాన్చెరులో టీఆర్ఆర్ మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) తాజాగా అనుమతించింది. మరో 150 సీట్లు ఈ ఏడాది నుంచి అదనంగా అం దుబాటులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్, మైనారిటీ కాలేజీల్లో మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 5,040కు చేరుకున్నాయి. ఈఎస్‌ఐసీసహా మొత్తం ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,740 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. 18 ప్రైవేట్ కాలేజీల్లో 2,750, 4 మైనారిటీ మెడికల్ కాలేజీల్లో 550 సీట్లు ఉన్నట్లు కాళోజీ వర్సిటీ తెలిపింది. చదవండి: అఖిల భారత కోటా 6,410 చివరి వారంలో నోటిఫికేషన్ అఖిల భారత కోటా అడ్మిషన్ల నోటిఫికేషన్ ఈ నెల చివరి వారంలో వచ్చే అవకాశాలున్నట్లు కాళోజీ వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 16న నీట్ ఫలితాలు వచి్చనా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) రాష్ట్రానికి ర్యాంకుల సమాచారం పంపలేదు. రాష్ట్రస్థాయి ర్యాంకుల జాబితా, దరఖాస్తుల స్వీకరణ నోటిíÙకేషన్ ఒకేసారి విడుదల చేస్తామని వర్సిటీ వర్గాలు తెలి పాయి. ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లు మినహాయించి రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని 15 శాతం (230) సీట్లను ఆలిండియా కోటాకు ఇస్తున్నారు. -
15, 16 తేదీల్లో వెబ్ ఆప్షన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేట్ పీజీ వైద్య, దంత కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి ఈ నెల 15, 16 తేదీల్లో వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. 15వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 16న సాయంత్రం 7 గంటల వరకు ప్రాధాన్యతా క్రమంలో కాలేజీల వారీగా వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని సూచించింది. తుది మెరిట్ జాబితాను ఇప్పటికే యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచినట్లు తెలిపింది. అట్టి మెరిట్ జాబితాలోని అభ్యర్థులు వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనాలని పేర్కొంది. ఆర్మీ డెంటల్ కాలేజీ సీట్లను తదుపరి విడత కౌన్సెలింగ్‌లో భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. ఇతర వివరాలకు knruhs.telangana.gov.in వెబ్సైట్లో సంప్రదించాలని సూచించింది. -
పీజీ మెడికల్ డెంటల్ మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య, దంత కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. మేనేజ్మెంట్ కోటా సీట్లకు నీట్–2020లో అర్హత సాధించిన అభ్యర్థులు శనివారం ఉదయం 11 నుంచి 15వ తేదీ సాయంత్రం 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. నిర్దేశిత దరఖాస్తు పూర్తి చేయడంతో పాటు సంబంధిత ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాలని పేర్కొంది. ఆన్లైన్ దరఖాస్తులు https://pvttspgmed.tsche.in వెబ్సైట్లో ఉంటాయని, ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తులు, సర్టిఫికెట్లను పరిశీలించిన అనంతరం ప్రొవిజనల్ మెరిట్ జాబితాను యూనివర్సిటీ విడుదల చేస్తుందని తెలిపింది. దరఖాస్తుకు సంబంధించి ఎదురయ్యే సాంకేతిక సమస్యలకు 9704093953, 8466924522లను సంప్రదించాలని సూచించింది. పూర్తి సమాచారానికి యూనివర్సిటీ వెబ్సైట్ www.knruhs. telangana.gov.in ను సందర్శించవచ్చని పేర్కొంది.