సాక్షి, హైదరాబాద్: నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (నెక్ట్స్)కు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం సన్నాహాలు చేస్తోంది. 2019 బ్యాచ్ ఎంబీబీఎస్ విద్యార్థులకు వచ్చే ఏడాది మొదటి విడత (స్టెప్–1) పరీక్ష నిర్వహించే అవకాశముందని, ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై తమకు స్పష్టమైన మార్గదర్శకాలు రావాల్సి ఉందంటున్నాయి. 2019 ఎంబీబీఎస్ బ్యాచ్‌ల నుంచి అమలు చేయనుండటంతో ఆయా విద్యార్థులు ఆ మేరకు సిద్ధంగా ఉండాలంటున్నాయి.
ఎంబీబీఎస్ చదివేటప్పుడే నెక్ట్స్ పరీక్ష మూడుసార్లు జాతీయ స్థాయిలో జరగనుంది. వాటిల్లో విద్యార్థులు పాస్ కావాలి. ఒకటి బేసిక్ సైన్స్... రెండోది థియరీ... ఇంకోటి ప్రాక్టికల్స్ పరీక్ష ఉంటుంది. విదేశాల్లో ఉన్న పద్ధతిని అనుకరించాలన్నది జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) ఉద్దేశం. ఈ మూడు పరీక్షలు పాస్ కావాలి. అయితే థియరీ పరీక్షనే ప్రధానంగా తీసుకుంటామని, మిగిలిన రెండు పరీక్షలు కేవలం అర్హత సాధిస్తే చాలని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ వర్గాలు వెల్లడించాయి.
ఎంబీబీఎస్ పాస్‌కు, తర్వాత రిజిస్ట్రేషన్, ప్రాక్టీస్‌కు కూడా ఈ పరీక్ష పాస్ కావడం తప్పనిసరి. అలాగే పీజీ మెడికల్ సీటులో ప్రవేశం కూడా నెక్ట్స్ అర్హతతోనే ఉంటుంది. అంటే నీట్ పీజీ పరీక్ష రద్దవుతుంది. అలాగే విదేశీ వైద్యవిద్యకు గుర్తింపు కూడా ఈ పరీక్ష ద్వారానే ఉంటుంది. అంటే మూడింటికీ ఇదే కీలకమైన పరీక్షగా ఉంటుంది. 2019 బ్యాచ్ వైద్య విద్యార్థులకు 2023 ఆగస్టు నాటికి నాలుగేళ్లు పూర్తవుతాయి. 2024 ఫిబ్రవరి–మార్చి నాటికి నాలుగున్నరేళ్లు అవుతుంది.
కానీ మొదటి పరీక్ష బేసిక్ సైన్స్ ముందుగా నిర్వహించాలి. అంటే 2019 బ్యాచ్‌కు 2023లో ఉంటుందని అంటున్నారు. బేసిక్ సైన్స్ మొదటి పరీక్షను రెండో ఏడాది తర్వాత ఎప్పుడైనా నిర్వహించుకోవచ్చు. మొదటి పరీక్షలో అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీలతో ఉంటుంది. తర్వాత స్టెప్–2లో థియరీ, స్టెప్–3లో ప్రాక్టికల్స్ ఉంటాయి. థియరీ పరీక్షనే ప్రధానంగా తీసుకుంటామని, ప్రాక్టికల్స్ కేవలం క్వాలిఫై అయితే చాలని ఎన్‌ఎంసీ పేర్కొంది. హౌస్‌సర్జన్ తర్వాత ప్రాక్టికల్స్ నిర్వహించాలా లేక ముందే నిర్వహించాలా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉందని కాళోజీ వర్గాలు చెబుతున్నాయి.
వైద్యవిద్యలో నాణ్యతను పెంచడమే లక్ష్యంగా
అభివృద్ధి చెందిన దేశాల్లో మాదిరిగా వైద్యవిద్యలో నాణ్యతను పెంచడమే లక్ష్యంగా ఎన్‌ఎంసీ నెక్ట్స్ పరీక్షకు శ్రీకారం చుడుతోంది. జాతీయ స్థాయిలో ఏకీకృతమైన పరీక్షను పెట్టడం ద్వారా దేశవ్యాప్తంగా నాణ్యమైన వైద్యవిద్యను అందించాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భారతీయులు విదేశాల్లో ఎంబీబీఎస్ వైద్యవిద్య పూర్తి చేసిన వారికి ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు.
అందులో పాసైతేనే ఇండియాలో డాక్టర్‌గా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, ప్రాక్టీస్ చేయడానికి, ప్రభుత్వ వైద్య ఉద్యోగాల్లో చేరడానికి అనుమతి ఉంది. అయితే ఎఫ్‌ఎంజీఈ పరీక్ష ఎంతో కఠినంగా ఉండటంతో పరీక్ష రాసేవారిలో 20 శాతానికి మించి అర్హత సాధించలేకపోతున్నారు. ఇప్పుడు నెక్ట్స్ పరీక్షను మూడు రకాల అర్హతలకు నిర్వహిస్తున్నందున దీన్ని కీలకంగా భావిస్తున్నారు.
ఇది పాస్ కాకుంటే ఎంబీబీఎస్ పట్టా ఇవ్వరు. ఎంతో కఠినంగా ఈ పరీక్ష ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే 2023లో నిర్వహించే స్టెప్–1 పరీక్ష ఎంబీబీఎస్‌లో బేసిక్ పరీక్ష మాత్రమే. 2024లో నిర్వహించేదే ఎంబీబీఎస్ అర్హతకు, మెడికల్ పీజీ సీట్లలో ప్రవేశానికి ఉంటుందని వివరిస్తున్నారు. ఎందుకంటే వచ్చే ఏడాది నీట్–పీజీ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. నెక్ట్స్ పరీక్ష సిలబస్, సరళిని ఇంకా నిర్ణయించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment