సాక్షి, హైదరాబాద్: నీట్–పీజీ కన్వీనర్ కోటా సీట్లకు సంబంధించి తుది కేటాయింపును ఖరారు చేయవద్దని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని హైకోర్టు ఆదేశించింది. వచ్చే సోమవారం వరకు ఎంపిక ప్రక్రియను నిలుపుదల చేయాలని స్పష్టం చేసింది. ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాళోజీ వర్సిటీని ఆదేశించింది. రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాలు, గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యులకు వైద్యవిధాన పరిషత్ సర్వీస్ సర్టిఫికెట్లు ఇచ్చింది.
వారికి ఆ ప్రకారం పీజీ సీట్ల కేటాయింపులో కోటా వర్తిస్తుంది. నల్లగొండ జిల్లా చౌటుప్ప ల్‌లోని పంతంగికి చెందిన డాక్టర్ దిండు మల్లికార్జున్ సహా మరో ముగ్గురు ఈ సర్వీస్ సర్టిఫికెట్‌ను నీట్–పీజీ కౌన్సెలింగ్ సందర్భంగా ఇచ్చినా.. వర్సిటీ వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించి లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. గురువారం ఉదయంతో వెబ్ ఆప్షన్లు ముగియనుండటంతో కోర్టు ఉత్తర్వుల తర్వాత తమకు ఆప్షన్ల అవకాశం కూడా ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ సీహెచ్.సుమలతలతో కూడిన వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సామ సందీప్‌రెడ్డి వాదనలు వినిపించారు. గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యులకు పీజీ కౌన్సెలింగ్‌లో సర్వీస్ కోటా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సరిగ్గా అమలు చేయట్లేదన్నారు. తెలంగాణ వైద్యవిధాన పరిషత్ సర్వీస్ తొలుత సర్టిఫికెట్లు జారీ చేసి ఆ తర్వాత అవి చెల్లవంటూ వర్సిటీ అధికారులకు చెప్పడంతో పిటిషనర్ల భవిష్యత్తు గందరగోళంగా మారిందన్నారు.
చాలా మందికి సర్వీస్ సర్టిఫికెట్లు ఇచ్చారని.. అందరివీ పరిగణనలోకి తీసుకున్నప్పుడు, కేవలం పిటిషనర్ల సర్టిఫికెట్లు చెల్లవని చెప్పడం చట్టవిరుద్ధమని నివేదించారు. వాదనలు విన్న ధర్మాసనం... వైద్య విధాన పరిషత్ తీరును తప్పుబట్టింది. సీట్ల కేటాయింపును ఖరారు చేయవద్దని ఆదేశిస్తూ.. విచారణను వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment