నేడు, రేపు మెడికల్ వెబ్ కౌన్సెలింగ్ | Today, tomorrow Medical web counseling | Sakshi
Sakshi News home page

నేడు, రేపు మెడికల్ వెబ్ కౌన్సెలింగ్

Published Mon, Sep 19 2016 11:42 PM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

నేడు, రేపు మెడికల్ వెబ్ కౌన్సెలింగ్ - Sakshi

నేడు, రేపు మెడికల్ వెబ్ కౌన్సెలింగ్

- ఉదయం 6 గంటల నుంచే ఆప్షన్ల ఎంపిక ప్రారంభం
- 22న సీట్లు ప్రకటించనున్న ఆరోగ్య విశ్వవిద్యాలయం
నేటితో ముగియనున్న సర్టిఫికెట్ల వెరిఫికేషన్
 
 సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని సీట్లతోపాటు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 50 శాతం కన్వీనర్ కోటా సీట్లకు మంగళ, బుధవారాల్లో వెబ్ కౌన్సెలింగ్ జరగనుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ మంగళవారం ముగియనున్న నేపథ్యంలో కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ అధికారులు తదుపరి కార్యాచరణ చేపట్టారు. వెరిఫికేషన్ పూర్తయిన విద్యార్థుల సెల్‌ఫోన్లకు ఎప్పటికప్పుడు పాస్‌వర్డ్‌లు పంపే ప్రక్రియను ప్రారంభించారు. పాస్‌వర్డ్ పొందిన విద్యార్థులంతా మంగళవారం ఉదయం 6  నుంచి బుధవారం సాయంత్రం 5 గంటల వరకు తమ వెబ్‌సైట్లో కాలేజీలవారీగా ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. 21 మెడికల్, 12 డెంటల్ కాలేజీలన్నింటికీ ఆప్షన్లను ప్రాధాన్యాలవారీగా ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఇంటర్నెట్ ద్వారా ఎక్కడి నుంచైనా ఆప్షన్లను ఎంపిక చేసుకోవచ్చన్నారు. ఎవరికైనా గందరగోళం ఉంటే తాము ఏర్పాటు చేసిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కేంద్రాల్లోని హెల్ప్‌లైన్ సెంట్లరకు రావచ్చన్నారు.

 22న సీట్ల ప్రకటన
 విద్యార్థుల ఆప్షన్లను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్లోనే పరిశీలించి వారి ఆప్షన్ ప్రకారం ఎక్కడ సీటు వచ్చిందో 22న ప్రకటిస్తామని కరుణాకర్‌రెడ్డి తెలిపారు. ఆ ప్రకారం వారు నిర్ణీత తేదీలోగా కాలేజీల్లో చేరాల్సి ఉంటుందన్నారు. కాగా, 22 నాటికి ప్రభుత్వ, కన్వీనర్ కోటాలో సీట్లు రాని విద్యార్థులు ప్రైవేటు మెడికల్ కాలేజీలు 23, 24 తేదీల్లో నిర్వహించే కౌన్సెలింగ్‌కు (‘నీట్’ ర్యాంకులు పొందిన వారే యాజమాన్య సీట్లల్లో అడ్మిషన్లు పొందొచ్చు) హాజరుకావచ్చు. మరోవైపు అడ్మిషన్ల గడువును ఈ నెలాఖరు నుంచి మరో నెలపాటు పొడిగించాలంటూ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు రావడానికి నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉందని కరుణాకర్‌రెడ్డి తెలిపారు.
 
 స్పోర్ట్స్ కోటా సీట్ల భర్తీపై గందరగోళం...
 స్పోర్ట్స్ కోటాలో మెడికల్ సీట్లను ఎంపిక చేయడం కష్టమైన వ్యవహారమని అధికారులు చెబుతున్నారు. స్పోర్ట్స్ కోటాలో 11 సీట్లు, మిలటరీ కోటాలో 21 మెడికల్ సీట్లున్నాయి. ప్రధానంగా స్పోర్ట్స్ కోటాలో సీటు కేటాయించాలంటే సంబంధిత విద్యార్థి సమర్పించే స్పోర్ట్స్ సర్టిఫికెట్లను పరిశీలించి నిర్ధారించుకోవాల్సి ఉండటం కష్టమైన వ్యవహారమని డాక్టర్ కరుణాకర్‌రెడ్డి చెబుతున్నారు. సర్టిఫికెట్లు జారీ చేసిన సంస్థలు సహకరించకపోతే ఈ ప్రక్రియకు మరింత సమయం పడుతుందన్నారు. మరోవైపు మిలటరీ కోటా సీట్లపైనా సోమవారం గందరగోళం నెలకొంది.

ఈ కోటా కింద సీటు పొందేందుకు తమకూ అవకాశం కల్పించాలని... తమ సర్టిఫికెట్లనూ పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు కోరారని కరుణాకర్‌రెడ్డి తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన మిలటరీ కుటుంబాల విద్యార్థులకు ఆ అవకాశం లేదని చెప్పినా వారు వినడం లేదని...దీనిపై కొందరు ఆందోళన వ్యక్తం చేశారన్నారు. సోమవారం నాటికి 4,501 ర్యాంకు నుంచి 9 వేల ర్యాంకు వరకు పొందిన విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. మూడ్రోజుల నుంచి ఇప్పటివరకు 7,002 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement