సాక్షి, హైదరాబాద్: వైద్య, దంత కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) రాష్ట్ర స్థాయి ర్యాంకులను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం విడుదల చేసింది. కేటగిరీల వారీగా కటాఫ్ మార్కుల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 33,936 మంది రాష్ట్రం నుంచి నీట్–2019లో అర్హత సాధించారు. ఎంబీబీఎస్, దంత వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది మే 5న జాతీయ స్థాయిలో నీట్ అర్హత పరీక్షను నిర్వహించగా, జూన్ 5న జాతీయ స్థాయిలో ఫలితాలు ప్రకటించారు. జాతీయ స్థాయిలో ఏడో ర్యాంకు, మహిళ విభాగంలో ఒకటో ర్యాంకు సాధించిన జి.మాధురిరెడ్డి.. 720 మార్కులకు గాను 695 మార్కులతో తెలంగాణ టాపర్‌గా నిలిచింది.
తాజాగా ప్రకటించిన రాష్ట్రస్థాయి ర్యాంకుల్లో మొదటి వేయి ర్యాంకుల్లో 43 మంది తెలంగాణకు చెందిన విద్యార్థులు ఉన్నారు. కాగా శనివారం విడుదల చేసిన రాష్ట్ర స్థాయి ర్యాంకుల వివరాలను అభ్యర్థుల వారీగా కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో పెట్టినట్లు వర్సిటీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలోని మెడికల్, డెంటల్ కాలేజీల్లో ప్రవేశాలకు వీలుగా అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసేందుకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించింది. అన్‌రిజర్వుడు కోటా కింది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అర్హులని.. ప్రస్తుత ర్యాంకుల జాబితాలో వారు కూడా చేరితే.. ర్యాంకుల్లో మార్పు ఉంటుందని తెలిపింది. అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం మెరిట్ జాబితాపై పూర్తి స్పష్టత వస్తుందని ప్రకటించింది.
ర్యాంకులిలా..
శనివారం విడుదల చేసిన రాష్ట్ర స్థాయి ర్యాంకుల్లో.. మొదటి వేయి ర్యాంకుల లోపు తెలంగాణకు చెందిన 43 మంది విద్యార్థులు ఉన్నారు. 2 వేల ర్యాంకుల్లోపు 69, 5 వేల ర్యాంకుల్లోపు 149, 10 వేల ర్యాంకుల్లోపు 289, 20 వేల ర్యాంకుల్లోపు 600, 25 వేల ర్యాంకుల్లోపు 793, 30 వేల ర్యాంకుల్లోపు 967, 35 వేల ర్యాంకుల్లోపు 4,148 మంది అభ్యర్థులు తెలంగాణకు చెందిన వారు ఉన్నారు. ఇదిలా ఉంటే 720 మార్కులకు గాను 107 మార్కులను ఈ ఏడాది నీట్ కటాఫ్‌గా నిర్ణయించిన విషయం తెలిసిందే. జనరల్ కేటగిరీలో 134 మార్కులు, దివ్యాంగులకు 120, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు 107 మార్కులు కటాఫ్‌గా నిర్ణయించి ర్యాంకులు ప్రకటించారు.
‘నీట్’ రాష్ట్ర స్థాయి ర్యాంకులు విడుదల
Published Sun, Jun 16 2019 2:59 AM | Last Updated on Sun, Jun 16 2019 2:59 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment