సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ–2023 ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఏడాది రాష్ట్రంలో 68,578 మంది విద్యార్థులు నీట్ రాయగా 42,836 మంది అర్హత సాధించారు. జాతీయ స్థాయిలో వచ్చిన ర్యాంక్ ఆధారంగా రాష్ట్ర స్థాయిలో ఏ ర్యాంక్ వస్తుంది? గత ఏడాది ఏ ర్యాంకుకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో పోల్చుకొని, ఈసారి ఏ కాలేజిలో సీటు వచ్చే అవకాశాలున్నాయో అంచనా వేసుకొంటున్నారు. కాలేజీల ప్రాధాన్యతక్రమం ఏ విధంగా ఉండాలో కసరత్తు చేసుకుంటున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 11 ప్రభుత్వ, 16 ప్రైవేటు, రెండు మైనారిటీ, శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ఉన్నాయి. వీటిలో 5,360 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఇందులో 2,185 సీట్లు 11 ప్రభుత్వ వైద్య కళాశాలలకు సంబంధించినవి. ఈ విద్యా సంవత్సరం నుంచి విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలల్లో కొత్తగా నిర్మించిన 5 ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభంకానున్నాయి.
వీటిలో ఒక్కో కాలేజిలో 150 చొప్పున 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. ఇది విద్యార్థులకు వరమే. వీటితో కలుపుకొంటే ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు 2,935కు పెరుగుతాయి. వీటిలో 15 శాతం సీట్లు ఆల్ ఇండియా కోటా కింద భర్తీ చేస్తారు. మిగిలినవి రాష్ట్ర కోటాలో భర్తీ చేస్తారు. మరోవైపు గత ఏడాది నుంచి బీ కేటగిరిలో 85 శాతం సీట్లలో మన విద్యార్థులకే ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది.
ఆంధ్ర వైద్య కళాశాలలో ఇలా
సాధారణంగా రాష్ట్రంలో వైద్య విద్య అభ్యసించే విద్యార్థుల మొదటి చాయిస్ ఆంధ్ర వైద్య కళాశాలే. ఈ కాలేజిలో సీటు రావడమే అదృష్టంగా భావిస్తారు. ఈ కాలేజిలో గత ఏడాది (2022–23) ఎస్టీ విభాగంలో 456 స్కోర్‌తో 120176 ర్యాంక్ సాధించిన విద్యార్థికి చివరి సీటు వచ్చింది. ఎస్సీ విభాగంలో 76695 ర్యాంక్, బీసీ–ఏలో 25137, బీసీ–బిలో 31874, బీసీ–సిలో 26291, బీసీ–డిలో 17632, బీసీ–ఈలో 68801, ఓసీ కేటగిరీలో 15652, ఈడబ్ల్యూఎస్‌లో 19907 ర్యాంక్ వారికి చివరి సీట్‌లు వచ్చాయి. దాని తర్వాతి స్థానాల్లో గుంటూరు, కర్నూలు, కాకినాడ తదితర ప్రభుత్వ కళాశాలలు ఉంటాయి.
గుంటూరు వైద్య కళాశాలలో ఓసీ విభాగంలో 22531, ఈడబ్ల్యూఎస్‌లో 26162, బీసీ–ఎలో 46529, బీసీ–బిలో 36192, బీసీ–సిలో 42535, బీసీ–డిలో 32830, బీసీ–ఈలో 65595, ఎస్సీలో 94801, ఎస్టీ విభాగంలో 132580 ర్యాంక్ వరకూ సీట్లు వచ్చాయి. కర్నూలు వైద్య కళాశాలలో ఓసీ కేటగిరీలో 20419, బీసీ–ఎలో 46268, బీసీ–బిలో 34676, బీసీ–సిలో 32239, బీసీ–డిలో 45304, బీసీ–ఈలో 36371, ఈడబ్ల్యూఎస్‌లో 26954, ఎస్సీలో 91270, ఎస్టీ విభాగంలో 115105 ర్యాంక్ వరకు విద్యార్థులు సీట్లు సాధించారు. కాకినాడ రంగరాయలో ఓసీ విభాగంలో 25622, బీసీ–ఎలో 48837, బీసీ–బిలో 47893, బీసీ–సిలో 44104, బీసీ–డిలో 31589, బీసీ–ఈలో 89637, ఈడబ్ల్యూఎస్‌లో 31333, ఎస్సీలో 97913, ఎస్టీ కేటగిరీలో 143288 ర్యాంక్‌ల వరకూ సీట్లు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment