Web counseling
-
యూజీ ఆయుష్ వైద్యవిద్య సీట్ల భర్తీకి వెబ్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: యూజీ ఆయుష్ వైద్య విద్య సీట్ల భర్తీకి రెండో విడత వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వ విద్యాలయం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. వర్సిటీ పరిధిలోని ఆయుష్ కళాశాలల్లో హోమియోపతి (బీహెచ్ ఎంఎస్), ఆయుర్వేద (బీఏఎంఎస్), యునాని (బీయూఎంఎస్), నేచురోపతి– యోగా (బీఎన్‌వైసీ) కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. ఈ నెల 16 ఉదయం 8 గంటల నుంచి 17వ తేదీ సాయంత్రం 6గంటల వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసు కోవాలని, తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది. అయితే అఖిల భారత కోటాలో, కాళోజీ, ఎన్టీఆర్ వర్సిటీలలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో సీటు పొందిన అభ్యర్థులు ఈ వెబ్ కౌన్సెలింగ్‌కు అనర్హులని పేర్కొంది. మరింత వివరాలకు www.knruhs.telangana.gov.in¯ను చూడాలని వెల్లడించింది. -
AP: గుడ్‌న్యూస్.. టీచర్ల బదిలీలకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బదిలీల ప్రక్రియకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్ శనివారం ఈ మేరకు జీఓ–187ను విడుదల చేశారు. ఈనెల 12 నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. వివిధ దశల అనంతరం 2023 జనవరి 12న టీచర్లకు బదిలీ ఉత్తర్వులు విడుదలవుతాయి. 2021–2022 విద్యా సంవత్సరం నాటికి ఒకే పాఠశాలలో ఐదేళ్ల సర్వీసును పూర్తిచేసిన ప్రధానోపాధ్యాయులు (గ్రేడ్–2) ఎనిమిది విద్యా సంవత్సరాల సర్వీసు పూర్తిచేసిన ఉపాధ్యాయులకు తప్పనిసరిగా బదిలీ ఉంటుంది. అలాగే విధివిధానాల్లోని ముఖ్యాంశాలు ఏమిటంటే.. – 2024 ఆగస్టు 31 లేదా అంతకు రెండేళ్లలోపు పదవీ విరమణ చేయబోయే వారిని వారు కోరుకుంటే తప్ప బదిలీ చేయరు. – బదిలీ దరఖాస్తుకు ఎలాంటి సర్వీసు నిబంధన లేదు. – 2022 ఆగస్టు 31 నాటికి 50 ఏళ్లలోపు వయసున్న బాలికల హైస్కూల్లోని పురుష హెచ్ఎం టీచర్లకు బదిలీ తప్పనిసరి. – బాలికల ఉన్నత పాఠశాలల్లో పనిచేయడానికి మహిళా ప్రధానోపాధ్యాయులు (గ్రేడ్–2), ఉపాధ్యాయులు అందుబాటులో లేకుంటే 50 ఏళ్లు దాటిన పురుష హెచ్ఎంలు, టీచర్లను పరిగణనలోకి తీసుకుంటారు. – విద్యాశాఖ మార్గదర్శకాల ప్రకారం పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీల కోసం దరఖాస్తు చేసుకోవాలి. – దృష్టిలోపం ఉన్న ఉపాధ్యాయులకు బదిలీల నుంచి మినహాయింపు ఉంది. 80 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న ఆర్థోపెడికల్ ఛాలెంజ్డ్ టీచర్లకు కూడా బదిలీల నుండి మినహాయింపు ఉంది. అయితే, అటువంటి ఉపాధ్యాయులు బదిలీని కోరుకుంటే దరఖాస్తు చేసుకోవచ్చు. – పేరెంట్ మేనేజ్మెంట్కి వెళ్లాలని కోరుకునే వారు ఆ మేనేజ్మెంట్లో అందుబాటులో ఉన్న ఖాళీలకు మాత్రమే బదిలీని ఎంచుకోవాలి. – ఏజెన్సీ మైదాన ప్రాంతాల వారికి బదిలీ అవకాశం ఉంటుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు భర్తీకాకపోతే ఇతర ప్రాంతంలోని జూనియర్ మోస్ట్ మిగులు టీచర్లను బదిలీ కౌన్సెలింగ్ తర్వాత తాత్కాలికంగా నియమిస్తారు. ఆన్లైన్లో బదిలీల కౌన్సెలింగ్ బదిలీలు ఆన్లైన్ ప్రక్రియ ద్వారా మాత్రమే జరుగుతాయి. గతంలో ఉన్న పాత జిల్లాలను జిల్లాగా పరిగణించాలి. ప్రతి జిల్లా, జోన్లో ఏర్పాటుచేసిన కమిటీల ఆమోదంతో విద్యాశాఖ బదిలీ ఉత్తర్వులు జారీచేస్తుంది. హెచ్ఎం, టీచర్ల వెబ్అప్షన్ల ఆధారంగా బదిలీ పోస్టింగ్ ఆర్డర్లను జారీచేస్తారు. బదిలీల కోసం పాయింట్లను గణించేందుకు కమిటీ నివాసాల జాబితాను కొత్తగా ప్రకటిస్తుంది. మెరిట్, సర్వీసు, ప్రత్యేక పాయింట్ల కేటాయింపు, మినహాయింపు వంటి అంశాలను జీఓలో వివరంగా పొందుపరిచారు. అంతేకాక.. 2022 నవంబర్ 30 నాటికి అన్ని ఖాళీలను కౌన్సెలింగ్‌లోకి తీసుకుంటారు. నిర్బంధ బదిలీల కారణంగా ఏర్పడే అన్ని ఖాళీలు, కౌన్సెలింగ్ సమయంలో అయ్యే ఖాళీల్లోకి బదిలీలు ఉంటాయి. అడహక్ ప్రాతిపదికన పదోన్నతిపై కేటాయించిన హెచ్ఎంలు, టీచర్ల స్థానాలు ఖాళీగా చూపిస్తారు. ఏడాదికి పైగా అధికారికంగా లేదా అనధికారికంగా రాని వారి స్థానాలు ఖాళీలుగా పరిగణిస్తారు. ప్రసూతి సెలవులు, వైద్య సెలవులు లేదా సస్పెన్షన్‌లో ఉన్న వారి ఖాళీలను కౌన్సెలింగ్‌లో చూపించరు. నాలుగు వారాలకు మించి ఖాళీగా ఉంటే పని సర్దుబాటు ద్వారా వాటిని భర్తీచేయాలి. పూర్వపు జిల్లాల్లో మంజూరు పోస్టుల్లో భర్తీ అయినవి కాకుండా మిగిలిన పోస్టులను బ్లాక్ చేయాలని ఆదేశించారు. ఖాళీలు, సీనియారిటీ జాబితాలను కౌన్సెలింగ్ వెబ్సైట్లో సంబంధిత జిల్లాల వెబ్సైట్లో కూడా పొందుపరుస్తారు. వెబ్ కౌన్సెలింగ్‌కు ఆన్లైన్లోనే దరఖాస్తులు.. – ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు నిర్దేశిత వెబ్సైట్ ద్వారా బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇలా అందిన దరఖాస్తులను మాత్రమే బదిలీకి పరిగణిస్తారు. – ఆన్లైన్ సమర్పించాక దరఖాస్తుదారులు నిర్దిష్ట వెబ్సైట్ నుండి అప్లికేషన్ ప్రింట్‌ను తీసుకోవాలి. – వాటిపై సంతకంచేసి మండల విద్యాధికారి, హైస్కూల్ హెడ్మాస్టర్, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లకు అందజేయాలి. – దరఖాస్తుల స్వీకరణ తర్వాత, సంబంధిత అధికారులు తాత్కాలిక సీనియారిటీ జాబితాలను ప్రదర్శించాలి. – అభ్యంతరాలుంటే వాటిని స్వీకరించాలి. అవి పరిష్కరించిన తర్వాత, అధికార వెబ్సైట్లో తుది సీనియారిటీని ఎన్టైటిల్మెంట్ పాయింట్లతో చూపించాలి. – తప్పనిసరిగా బదిలీ అయ్యేవారు అన్ని అప్షన్లను ఎంచుకోవాలి. ఇలాంటి హెచ్ఎం, టీచర్లు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోకపోతే 3, 4 కేటగిరీల్లోని పాఠశాలల్లో ఉన్న ఖాళీలకు బదిలీచేస్తారు. – దరఖాస్తు చేసి ఆపై వారికి సమర్పించకపోతే, క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు. ఆన్లైన్లో రూపొందించిన తుది జాబితాల ఆధారంగా సంబంధిత కమిటీల ఆమోదంతో బదిలీ ఉత్తర్వులు జారీ అవుతాయి. తప్పుడు సమాచారమిస్తే చర్యలు ఇక కమిటీ ఆమోదంతో బదిలీ ఉత్తర్వులు జారీచేసిన తర్వాత, కమిటీ కాంపిటెంట్ అథారిటీ ఆర్డర్లను సమీక్షించడం, సవరించడానికి వీల్లేదు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల ఫలితాలకు లోబడి ఉత్తర్వుల్లో షరతును చేర్చాలి. బదిలీ ఆర్డర్లు అందిన తర్వాత ప్రస్తుతం పనిచేస్తున్న ప్రదేశం నుండి తక్షణమే రిలీవ్ అవుతారు. తదుపరి తేదీన వారు కొత్త పాఠశాల్లో చేరాలి. పాఠశాలలో ఒకే ఉపాధ్యాయుడు (సబ్జెక్ట్ టీచర్లతో సహా) పనిచేస్తూ బదిలీని పొందినట్లయితే, ప్రత్యామ్నాయం లేకుండా రిలీవ్ చేయరాదు. అలాగే, ఇతర స్థానాల విషయంలో కూడా ప్రత్యామ్నాయం తర్వాతే రిలీవ్ చేస్తారు. తప్పుడు సమాచారమిచ్చి, మార్గదర్శకాలు ఉల్లంఘిస్తే ప్రాసిక్యూషన్‌తో పాటు క్రమశిక్షణా చర్యలు తప్పవు. తప్పుడు సమాచారంపై సంతకం చేసిన హెచ్ఎం ఇతర అధికారులపైనా ఇవే చర్యలు ఉంటాయి. బదిలీ ఉత్తర్వులు అందిన అనంతరం ఎటువంటి ఆలస్యం లేకుండా పోస్టింగ్ స్థానంలో చేరాలి. అనధికారికంగా గైర్హాజరైతే మార్గదర్శకాల ప్రకారం క్రమశిక్షణా చర్యతో పాటు ‘నో వర్క్ నో పే’ నిబంధన వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బదిలీల షెడ్యూల్ ఇలా.. – ఖాళీల వివరాలు వెబ్సైట్లో ప్రదర్శన : డిసెంబర్ 12, 13 – బదిలీలకు దరఖాస్తు : డిసెంబర్ 14 నుండి 17 వరకు – దరఖాస్తుల వెరిఫికేషన్ : డిసెంబర్ 18, 19 – సీనియారిటీ జాబితాల ప్రదర్శన, అభ్యంతరాల అప్లోడ్ : డిసెంబర్ 20 నుండి 22 వరకు – అభ్యంతరాల పరిశీలన, ఫైనల్ చేయడం : డిసెంబర్ 23, 24 – ఫైనల్ సీనియారిటీ జాబితాల ప్రదర్శన : డిసెంబర్ 26 – వెబ్ఆప్షన్లు : డిసెంబర్ 27 నుండి జనవరి 1 వరకు – బదిలీ కోరుకున్న వారికి పాఠశాలల కేటాయింపు : జనవరి 2 నుండి 10 వరకు – కేటాయింపులో తేడాలుంటే అభ్యంతరాలు : జనవరి 11 – బదిలీ ఉత్తర్వులు డౌన్లోడ్ చేసుకోవడం : జనవరి 12 -
పీజీ వైద్య విద్య సీట్లకు వెబ్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: పీజీ వైద్య విద్య యాజమాన్య కోటా సీట్లకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు కాళోజి హెల్త్ యూనివర్సిటీ తెలిపింది. ఈ మేరకు ఆదివారం రెండో విడత ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో ఉన్న యాజమాన్య కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. సీట్ల ఖాళీ ల వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్ లో పొందుపరిచారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి అదే రోజు రాత్రి 8 గంటల వరకు ప్రాధాన్య క్రమంలో కళాశాలల వారిగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్సైట్ www.knruhs.telangana.gov.inలో చూడా లని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో సూచించాయి. -
‘ప్రవేశ పరీక్ష రాయకున్నా పీజీ ప్రవేశాలు’
ఉస్మానియా యూనివర్సిటీ: టీఎస్‌సీపీజీఈటీ–2021 మూడు విడతల వెబ్ కౌన్సెలింగ్ అనంతరం మిగిలిన సీట్లను ఆయా విశ్వవిద్యాలయాల పరిధిలోని కళాశాలలు భర్తీ చేసుకోవాలని కన్వీనియర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి శనివారం పేర్కొన్నారు. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు వివిధ పీజీ కోర్సుల సీట్లను భర్తీ చేసి 14న ఓయూలోని పీజీ అడ్మిషన్స్ కార్యాలయంలో సమర్పించాలని కోరారు. ప్రవేశ పరీక్షను రాయని అభ్యర్థులు, సీపీజీఈటీ–2021లో అర్హత సాధించని విద్యార్థులకు సైతం పీజీ కోర్సుల్లో ప్రవేశం కల్పించవచ్చని తెలిపారు. -
550, 111 జీవోలకు సవరణ
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యాసంస్థల్లోని సీట్ల భర్తీకి సంబంధించి గతంలో ఇచ్చిన జీవోలు 550, 111లను సవరిస్తూ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. గతంలో జారీచేసిన జీవోల్లోని నిబంధనలపై స్పష్టత ఇస్తూ, ఎలాంటి సందేహాలకు తావులేకుండా వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ఆయా సీట్లను మెరిట్ ప్రకారం భర్తీ చేసేలా తాజాగా సవరణలు ఉత్తర్వులు జారీచేశారు. వీటి ప్రకారం... ► మెరిటోరియస్ రిజర్వుడ్ అభ్యర్థి స్లైడింగ్‌తో వేరే కాలేజీలో సీటు పొందితే ఖాళీ అయ్యే ఓపెన్ కేటగిరీ సీటును మెరిట్ ప్రకారం అదే రిజర్వుడ్ వర్గానికి చెందిన అభ్యర్థితో భర్తీ చేస్తారు. ► మెరిటోరియస్ రిజర్వుడ్ అభ్యర్థి స్లైడింగ్ ద్వారా కేటాయింపు అయిన కాలేజీలోని సీటులో చేరని పక్షంలో ఖాళీ అయిన ఓపెన్ కేటగిరీ సీటును తిరిగి ఓపెన్ కేటగిరీగానే పరిగణిస్తారు. ► మెరిటోరియస్ రిజర్వుడ్ అభ్యర్థి ఖాళీచేసే సీటును పొందిన అదే కేటగిరీకి చెందిన మరో అభ్యర్థి కూడా ఆ సీటులో జాయిన్ కాని పక్షంలో..అదే రిజర్వుడ్ వర్గానికి చెందిన అభ్యర్థితో భర్తీ అయ్యేవరకు కౌన్సెలింగ్ ప్రక్రియను కొనసాగిస్తారు. ఉన్నతస్థాయి కమిటీ సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక వేర్వేరుగా ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సెలింగ్ ఇలావుండగా కమిటీ చేసిన సిఫారసులతో మరికొన్ని ప్రతిపాదనలు కూడా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అమల్లోకి తెస్తోంది. ► ఈసారి ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సెలింగ్‌లు వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. దీనికిముందు అన్నీ కలిపి చేయడం వల్ల ఒకింత గందరగోళానికి దారితీసేది. ► అభ్యర్థులు ప్రాధాన్యత ప్రకారం ఒకేసారి తమకు నచ్చినన్ని ఆప్షన్లు ఇచ్చుకొనేలా చేస్తున్నారు. తర్వాత మార్చుకోవడానికి అవకాశం ఇవ్వరు. గతంలో ఆప్షన్లను పలుమార్లు మార్చుకునేందుకు అవకాశం ఉండేది. ► ఈసారి ఒక కౌన్సెలింగ్‌లో సీటు వచ్చిన అభ్యర్థి దానిలో జాయినయినట్లు ఆన్లైన్ ద్వారా రిపోర్టు చేస్తేనే తదుపరి కౌన్సెలింగ్‌కు, స్లైడింగ్‌కు అనుమతిస్తారు. ► గతంలో ఒక కౌన్సెలింగ్‌లో కాలేజీలో సీటు వచ్చిన అభ్యర్థి అందులో జాయినయినట్లు ఆప్షన్ ఇవ్వకున్నా తదుపరి కౌన్సెలింగ్‌కు, స్లైడింగ్‌కు అవకాశముండేది అలా స్లైడింగ్లతో ఆప్షన్లు ఇస్తూ ఆ అభ్యర్థి చివరకు ఎక్కడా జాయిన్ కాకుంటే ఆ సీట్లు ఖాళీగా మేనేజ్మెంటుకు మిగిలేవి. చివరకు ఇదో పెద్ద అక్రమాల తంతుగా మారింది. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ దీనికి కొంతవరకు అడ్డుకట్టవేసేలా జాయినింగ్ రిపోర్టును తప్పనిసరి చేస్తోంది. -
ఇంజనీరింగ్‌లో 45 రకాల కోర్సులు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా వెబ్ ఆప్షనకు ఆదివారం అర్ధరాత్రి నుంచే అవకాశం కలి్పంచేలా ఏర్పాట్లు చేసినా, సాంకేతిక కారణాలతో సోమవారం మధ్యాహ్నం 3 గంటల తరువాత మొదలైంది. ఈనెల 20తో సరి్టఫికెట్ల వెరిఫికేషన్, 22తో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ పూర్తి చేసేలా, 24న సీట్ల కేటాయింపును ప్రకటించేలా అధికారులు ఇదివరకే షెడ్యూలు జారీ చేశారు. ఇక సోమవారం సాయంత్రం వరకు 57,530 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, అందులో 51,880 మంది సరి్టఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. వారిలో 10,032 మంది వెబ్ ఆప్షన్లను ఇచ్చుకున్నారు. కోర్సుల వివరాల్లో పలు మార్పులు, చేర్పుల తరువాత కనీ్వనర్ కోటాలో 72,998 సీట్లు అందుబాటులో ఉన్నాయని.. ఇంజనీరింగ్‌లో 69,116, ఫార్మసీలో 3,882 సీట్లున్నట్లు ప్రవేశాలు కమిటీ వెల్లడించింది. ఇంజనీరింగ్‌లో 45 రకాల కోర్సులను అనుమతించగా, ఫార్మసీలో రెండు కోర్సులను అనుమతించింది. కొత్త కోర్సులు, ప్రధాన బ్రాంచీల్లోని సీట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 126 సీట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డాటా సైన్స్ 168, సీఎస్ఈ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెరి్నంగ్) 5,310, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ అండ్ బ్లాక్ చెయిన్ టెక్నాలజీ 126, కంప్యూటర్ ఇంజనీరింగ్ 42, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ 252, సీఎస్ఈ(సైబర్ సెక్యూరిటీ) 1,806, సీఎస్ఈ (డాటా సైన్స్) – 3,213, సీఎస్‌ఐటీ 336, సీఎస్ఈ (నెట్ వర్క్స్) 126, సీఎస్ఈ (ఐవోటీ) 1,281, కంప్యూటర్ ఇంజనీరింగ్ 210, సీఎస్ఈ 16,681, ఈసీఈ 13,397, సివిల్ 6,378, ఈఈఈ 6,907, ఐటీ 4,650, మెకానికల్ 5,980, మైనింగ్ 328 సీట్లు. -
టీచర్ల బదిలీలకు ఓకే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు మార్గదర్శకాలను ఖరారుచేస్తూ పాఠశాల విద్యాశాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. గ్రేడ్–2 హెడ్మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు, తత్సమాన కేటగిరీల టీచర్లు ఈ బదిలీల పరిధిలోకి వస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ జీవో–54 విడుదల చేశారు. దీంతోపాటు ఆయా పాఠశాలల్లో టీచర్ల సర్దుబాటు ప్రక్రియకు సంబంధించి కూడా ప్రభుత్వం జీవో–53ని జారీచేసింది. బదిలీలు ఆన్లైన్లో వెబ్ కౌన్సెలింగ్ ద్వారా చేయనున్నారు. ఈ ఉత్తర్వులు రావడంతో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ బదిలీల షెడ్యూల్ విడుదల చేయనున్నారు. ఇతర యాజమాన్యాల స్కూళ్ల టీచర్ల బదిలీలకు ఆయా విభాగాలు షెడ్యూల్ ఇవ్వనున్నాయి. మార్గదర్శకాలు ఇలా.. – 2019–20 విద్యా సంవత్సరం పూర్తయ్యే నాటికి ఎనిమిదేళ్లు సర్వీసు పూర్తయిన టీచర్లకు, 5 ఏళ్ల సర్వీసు పూర్తిచేసిన గ్రేడ్–2 హెడ్మాస్టర్లకు బదిలీ తప్పనిసరి. ఏడాదిలో సగం రోజులు పూర్తి చేసినా పూర్తి ఏడాదిగానే పరిగణిస్తారు. – అక్టోబర్ ఒకటి నుంచి రెండేళ్లలో పదవీ విరమణ చేయబోయే వారికి వారు కోరుకుంటే తప్ప బదిలీ ఉండదు. – బాలికోన్నత పాఠశాలల్లో పనిచేస్తూ అక్టోబర్ 1 నాటికి 50 ఏళ్లలోపు వయసున్న పురుష టీచర్లకు బదిలీ తప్పనిసరి. – అంధులైన టీచర్లను బదిలీల నుంచి మినహాయించారు. వారు కోరుకుంటే బదిలీ చేయవచ్చు. – టీచర్ల బదిలీలకు 85 ఎన్టైటిల్మెంట్ పాయింట్లను ఖరారు చేశారు. కామన్ పాయింట్ల కింద 55, స్పెషల్ పాయింట్ల కింద 25, రీ అపోర్షన్ పాయింట్ల కింద 5గా నిర్ణయించారు. – ప్రిఫరెన్షియల్ కేటగిరీల కింద దివ్యాంగులు, భర్త నుంచి విడిపోయిన వారు, భర్త చనిపోయిన వారికి ఎన్టైటిల్మెంటు పాయింట్లతో సంబంధం లేకుండా సీనియార్టీలో ప్రాధాన్యతనిస్తారు. – తప్పుడు ధ్రువపత్రాలిచ్చే వారిపై.. వాటిని పరిశీలించకుండా కౌంటర్ సంతకం చేసే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. – ఉత్తర్వులు అందుకున్నాక ఎవరైనా అనధికారికంగా గైర్హాజరైతే వారికి నో వర్క్ నో పే అమలుచేస్తారు. టీచర్ల సర్దుబాటు ప్రక్రియ ఇలా.. టీచర్ల సర్దుబాటుకు సంబంధించి కేటగిరీల వారీగా పిల్లల సంఖ్యను అనుసరించి టీచర్ల సంఖ్యను నిర్ధారించారు. – ప్రాథమిక పాఠశాలల్లో 151–200 విద్యార్థులుంటే ఒక హెచ్ఎం, 5గురు ఎస్జీటీలు.. – 121–150 వరకు ఐదుగురు ఎస్జీటీలు.. – 91–120 వరకు నలుగురు ఎస్జీటీలు.. – 61–90 వరకు ముగ్గురు ఎస్జీటీలు.. – 60 వరకు అయితే ఇద్దరు ఎస్జీటీలు.. – 200పైన ప్రతి 40 మంది విద్యార్థులకు అదనంగా ఒక ఎస్జీటీని నియమిస్తారు. -
స్పెషలిస్టు వైద్యులకు ఇష్టమైన చోట పోస్టింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో అసంతృప్తితో ఉన్న స్పెషలిస్టు వైద్యులకు ప్రత్యేకంగా వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగులు ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కౌన్సెలింగ్ శుక్రవారమే మొదలైందని వైద్య విధాన పరిషత్ వర్గాలు తెలిపాయి. 3 నెలల కిందట 919 మంది స్పెషలిస్టు వైద్యులను వైద్య విధాన పరిషత్ నియమించింది. అయితే అందులో 500 మందికి మించి విధులకు రావ డం లేదన్న విమర్శలు వచ్చాయి. మిగిలిన వారిలో కొందరు విధులకు డుమ్మా కొడుతుండగా, 128 మంది దూరాభారం అంటూ ఉద్యోగాలనే వదిలేసుకున్న పరిస్థితి నెలకొంది. విధులకు వెళ్లకుండా అసంతృప్తితో ఉన్న వారిని మళ్లీ దారి లో పెట్టాలని సర్కారు వెబ్ కౌన్సెలింగ్‌కు ఏర్పాట్లు చేసింది. నచ్చిన చోట ఇవ్వలేదని: వైద్య విధాన పరిషత్‌లో 911 మంది స్పెషలిస్ట్ వైద్యులను 31 జిల్లా ఆస్పత్రులు, 22 ఏరియా ఆస్పత్రులు, 58 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, హైదరాబాద్‌లోని 14 ఫస్ట్ రిఫరల్ యూనిట్లలో భర్తీ చేశారు. ఆన్లైన్ ద్వారా ఆర్థోపెడిక్, రేడియాలజీ, డెర్మటాలజీ, ఫోరెన్సిక్, జనరల్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, పల్మనరీ, ఆప్తమాలజీ, సైకియాట్రిక్, ఎనస్తీషియా, ఈఎన్టీ, పాథాలజీ, జనరల్ సర్జన్స్, ఓబీజీ, పీడియాట్రిక్స్ పోస్టులను భర్తీ చేశారు. కొందరికి సుదూర ప్రాంతాలకు పోస్టింగ్‌లు ఇవ్వడంతో అసలు సమస్య మొదలైంది. సుదూర ప్రాంతాలకు భార్యాభర్తలను వేరు చేసేలా వేశారని కొందరు గగ్గోలు పెట్టారు. గతంలో ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ సంచాలకుల పరిధిలోని వైద్యుల భర్తీలోనూ ఇలాంటి సమస్యే ఏర్పడితే వాటిని మార్చేందుకు ప్రత్యేకంగా దరఖాస్తులను ఆహ్వానించారు. ఏకంగా 250 మంది వరకు తమకు ఇచ్చిన పోస్టింగ్‌లను మార్చాలని కోరారు. దీంతో వారికి వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్‌లను ఖరారు చేశారు. అలాగే వైద్య విధాన పరిషత్‌లోనూ నిర్వహిస్తున్నారు. దాదాపు 500 మంది వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. -
వైద్యుల నియామకం.. ఫలితం శూన్యం
సాక్షి, హైదరాబాద్: వైద్య విధాన పరిషత్‌లో స్పెషలిస్టు వైద్యుల భర్తీ మిశ్రమ ఫలితాన్నే ఇచ్చింది. మూడు నెలల కిందట 919 మందిని నియమిస్తే 500 మంది వరకు ఇప్పుడు విధులకు హాజరు కావడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. మిగిలిన వారిలో 128 మంది దూరా భారం అంటూ ఉద్యోగాలనే వదిలేసుకున్నారు. మరికొందరేమో విధులకు డుమ్మా కొడుతున్నారు. దీంతో ఎంతో ఆశించి చేసిన స్పెషలిస్టుల భర్తీ ఆశాభంగం కలిగించింది. దరఖాస్తు చేసుకున్న మిగిలిన వారితో పోస్టులు భర్తీ చేయాలనుకున్నా ఉన్నతస్థాయి నుంచి అనుమతి రాకపోవడంతో ఇప్పుడు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మళ్లీ నోటిఫికేషన్ జారీచేసిన తర్వాతే భర్తీ ప్రక్రియ జరుగుతుందని వైద్య విధాన పరిషత్ వర్గాలు చెబుతున్నాయి. ఇష్టమైన పోస్టింగ్ దక్కక.. తెలంగాణ ఏర్పడ్డాక మొదటిసారిగా వైద్య విధాన పరిషత్‌లో 919 మంది స్పెషలిస్ట్ వైద్యులను నియమించిన సంగతి తెలిసిందే. 31 జిల్లా ఆసుపత్రులు, 22 ఏరియా ఆసుపత్రులు, 58 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, హైదరాబాద్ నగరంలోని 14 ఫస్ట్ రిఫరల్ యూనిట్లలో వైద్యులను భర్తీ చేశారు. ఆన్లైన్ ద్వారా ఆర్థోపెడిక్–47, రేడియాలజీ–50, డెర్మటాలజీ–20, ఫోరెన్సిక్–28, జనరల్ మెడిసిన్–68, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్–09, పల్మనరీ–39, ఆప్తమాలజీ–34, సైకియాట్రిక్–22, ఎనస్తీషియా–156, ఈఎన్టీ–17, పాథాలజీ–55, జనరల్ సర్జన్స్–78, ఓబీజీ–146, పీడియాట్రిక్స్–150 పోస్టులను భర్తీ చేశారు. వైద్యులకు వారి సొంత జిల్లాలు, సొంతూళ్లకు సమీప ఆసుపత్రుల్లోనే పోస్టింగ్‌లు ఇచ్చే ప్రయత్నాలు జరిగాయి. అయితే కొందరికి సుదూర జిల్లాలు, ప్రాంతాలకు పోస్టింగ్‌లు ఇవ్వడంతో సమస్య మొదలైంది. అలాగే సుదూర ప్రాంతాలకు భార్యాభర్తలను వేరు చేసేలా వేశారని మరికొందరు గగ్గోలు పెట్టారు. ఇలా పోస్టింగులు ఇస్తే తమకు ప్రభుత్వ ఉద్యోగమే అవసరం లేదని దాదాపు 128 మంది కొలువులను వదులుకోవడం ఉన్నతస్థాయిలో చర్చనీయాంశమైంది. వెబ్‌కౌన్సెలింగ్ కోసం విన్నపాలు.. కోర్టులో సమస్య ఉండటంతో ఆగమేఘాల మీద భర్తీ ప్రక్రియ జరిగింది. కాబట్టి అనేకమందికి అనుకున్నచోట ఉద్యోగం దక్కలేదు. ఇదే పరిస్థితి ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ సంచాలకుల పరిధిలోని వైద్యుల భర్తీలోనూ జరిగితే వాటిని మార్చేందుకు ప్రత్యేకంగా దరఖాస్తులను ఆహ్వానించారు. ఏకంగా 250 మంది వరకు తమకు ఇచ్చిన పోస్టింగ్‌లను మార్చాలని కోరారు. వారికి వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్‌లను ఖరారు చేశారు. ఎన్నికల కోడ్ ఉన్నందున వైద్యులకు ఉత్తర్వులు ఇవ్వలేదు. అలాగే వైద్య విధాన పరిషత్‌లోనూ వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించి వారిచ్చిన ఆప్షన్ల ప్రకారం స్పెషలిస్టు వైద్యుల పోస్టుల్లో మార్పులు చేయాలని పలువురు కోరుతున్నారు. దీనివల్ల పోస్టింగ్‌లలో వెసులుబాటు దొరికి విధులకు హాజరుకావడానికి వీలుంటుందని పలువురు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. -
‘ఝలక్’ ఇచ్చిన ఉద్యోగులకు షాక్..!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీల్లో అవకతవకలకు పాల్పడిన ఉద్యోగులపై వేటు వేసేందుకు పాఠశాల విద్యా శాఖ చర్యలు చేప ట్టింది. టీచర్ల వెబ్ కౌన్సెలింగ్‌లో జరిగిన పొరపాట్ల సర్దుబాటులో పలువురు టీచర్ల నుంచి విద్యా శాఖ అప్పీళ్లు స్వీకరించింది. ఈ అప్పీళ్లను పరిశీలించి కొన్నింటికి ఆమోదం తెలుపుతూ విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచా ర్య ఉత్తర్వులు జారీ చేశారు. దీని ఆధారంగా పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్‌కుమార్ బదిలీ ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వుల్లో కొందరు ఆర్జేడీ కార్యాలయ ఉద్యోగులు ప్రభుత్వం ఆమోదించిన అప్పీళ్లతోపాటు తిరస్కరించిన అప్పీళ్లనూ చొప్పి ంచారు. ఇలా దాదాపు 17 మంది టీచర్లకు అక్రమంగా బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ‘ఉపాధ్యాయ బదిలీల్లో ఉన్నతాధికారులకు ఝలక్’అనే శీర్షికతో ఈ నెల 8న ‘సాక్షి’లో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీంతో బాధ్యులపై చర్యలకు సిఫార్సు చేశారు. ముగ్గురికి నోటీసులు..: బదిలీల్లో అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులకు ఆర్జేడీ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇందులో ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌తోపాటు సెక్షన్ సూపరింటెండెంట్, క్లరికల్ ఉద్యోగి ఉన్నారు. వీరంతా వివరణ ఇవ్వాల్సిందిగా ఆమె ఆదేశించారు. ఈ క్రమ ంలో వారి నుంచి వివరణ తీసుకున్న అధికారులు ఆ ఫైలును పాఠశాల విద్యా శాఖ సంచాలకుల కార్యాలయానికి పంపినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ ఫైలు డైరెక్టర్ వద్ద పెండింగ్‌లో ఉంది. ఆయా ఉద్యోగులు ఇచ్చిన వివరణ ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తిరస్కరించిన అప్పీళ్లకు ప్రాంతీయ కార్యాలయంలో ఎలా ఆమోదించారనే అంశాన్నీ విద్యా శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. మొత్తంగా దసరా తర్వాత వీరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆ శాఖ అధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. -
నచ్చలేదని నొచ్చుకున్నారు..
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వానికి వైద్యులు చుక్కలు చూపిస్తున్నారు. తమకు ఇష్టమైన చోట పోస్టింగ్ ఇవ్వకపోవడంతో వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాన్నే వదులుకోవడం వైద్య విధాన పరిషత్‌లో సంచలనం కలిగించింది. ఇష్టారాజ్యంగా పోస్టింగులు ఇవ్వడంతో తమకు ప్రభుత్వ ఉద్యోగమే అవసరం లేదని దాదాపు 200 మంది కొలువులను వదులుకోవడం చర్చనీయాంశంమైంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి వైద్యులకు ఇష్టమైన చోట పోస్టింగ్ ఇవ్వా లని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం డిమాండ్ చేస్తోంది. మరోవైపు ఇష్టం వచ్చినట్లు ఎవరికి పోస్టింగులు ఇవ్వలేదని, గడువులోగా విధుల్లో చేరని వారం తా ఉద్యోగం కోల్పోయినట్లేనని వైద్య విధాన పరిషత్ స్పష్టం చేసింది. ఇటీవల తయారు చేసిన జాబితాలోని మిగిలిన వారితో ఆయా పోస్టులను భర్తీ చేసేందుకు యోచిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కీలకమైన కంటి వెలుగు కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో తాజా పరిణామాలు అధికారులకు ఇబ్బందికరంగా మారాయి. 700 మందే చేరిన వైనం.. రాష్ట్రం ఏర్పడ్డాక మొదటిసారిగా వైద్య ఆరోగ్య శాఖలో 911 మంది స్పెషలిస్ట్ వైద్యులను ఇటీవల నియమించారు. జూలై 6న ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించి తర్వాత పోస్టింగ్‌లు ఇచ్చారు. పోస్టులు దక్కించుకున్న వారిలో 146 మంది మహిళా వైద్యులున్నారు. కొందరి వైద్యులకు వారి సొంత జిల్లాలు, సొంతూళ్లకు సమీప ఆస్పత్రుల్లోనే పోస్టింగ్‌లు ఇచ్చారు. మరికొందరికి సుదూర జిల్లాలు, ప్రాంతాలకు పోస్టింగ్‌లు ఇవ్వడంతో సమస్య మొదలైంది. పైరవీలు చేయించుకున్న వారికి మంచి పోస్టింగులు దక్కాయని, మిగిలిన వారికి అన్యాయం జరిగిందని కొందరు విమర్శిస్తున్నారు. దీంతో తాము కావాలను కున్న చోటు దక్కలేదని 200 మంది స్పెషలిస్టు వైద్యు లు విధుల్లో చేరేందుకు నిరాకరించారు. జూలై 29నే ఉద్యోగంలో చేరే గడువు ముగిసింది. మరోవైపు చేరిన 700 మందిలో దాదాపు సగం మంది తమకు కేటాయించిన ఆస్పత్రుల్లో విధులకు హాజరుకావడం లేదని సమాచారం. వైద్యులకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి, ఆప్షన్లు ఇచ్చి పోస్టింగ్ కేటాయించి ఉంటే బాగుండేదన్న చర్చ ప్రస్తుతం జరుగుతోంది. వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించాలి.. ఇష్టారాజ్యంగా పోస్టింగ్‌లు ఇవ్వడంతో దాదాపు 200 మంది స్పెషలిస్టు వైద్యులు ఉద్యోగంలో చేరలేదు. వైద్యులకు నచ్చిన చోట పోస్టింగ్‌లు ఇచ్చి ఉంటే బాగుండేది. ఇప్పటికైనా వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి వైద్యులకు ఇష్టమైన చోట పోస్టింగులు ఇవ్వాలి. – డాక్టర్ ప్రవీణ్, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు జాబితాలోని ఇతరులకు ఇస్తాం.. చాలామంది స్పెషలిస్టు వైద్యులు విధుల్లో చేరలేదు. విధుల్లో చేరని వారంతా ఉద్యోగం కోల్పోయినట్లే. ప్రస్తుతం ఏం చేయాలన్న దాని పై ప్రభుత్వంతో చర్చిస్తాం. అవసరమైతే ఇటీవల తయారు చేసిన జాబితాలో మిగిలిన వారికి పోస్టింగ్ ఇస్తాం. – డాక్టర్ శివప్రసాద్, వైద్య విధాన పరిషత్ కమిషనర్ -
ఎడిట్‌కు.. నోచాన్స్!
సాక్షి, హైదరాబాద్: బదిలీల్లో కీలకమైన వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఉపాధ్యాయులకు చుక్కలు చూపిస్తోంది. ఆప్షన్ల ఎంపిక సమయంలో పొరపాట్లు తలెత్తితే వాటిని సవరించే వీలు లేకుండా విద్యాశాఖ నిబంధనలు విధించింది. దీంతో ఒకసారి ఆప్షన్లు ఇస్తే అదే చివరి అవకాశం కానుంది. వెబ్ కౌన్సెలింగ్‌లో కఠిన నిబంధనలు పెట్టడం మంచిదైనప్పటికీ.. విద్యాశాఖ మాటిమాటికీ మార్పులు చేయడంతో ఉపాధ్యాయ వర్గాలు గందరగోళానికి గురవుతున్నాయి. స్పౌజ్ పాయింట్లున్న టీచర్లకు తొలుత పూర్తిస్థాయిలో ఆప్షన్లు కనిపించకపోగా.. తాజాగా జియోట్యాగింగ్ మార్పులతో ఆప్షన్లు ఎక్కువ కనిపించేలా విద్యాశాఖ సాంకేతికంగా మార్పులు చేసింది. దీంతో తొలిరోజు ఆప్షన్లు పెట్టుకున్న తమకు తీవ్ర నష్టం కలిగిందని పలువురు వాపోతున్నారు. ఈ అంశంపై విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పాఠశాల విద్యా శాఖ సంచాలకునికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సీనియార్టీ జాబితాలో మార్పులు, ఇతర అంశాల్లో సవరణ చేసేలా జిల్లా విద్యాశాఖ అధికారికి అధికారాలు ఇచ్చినట్లు విద్యాశాఖ ప్రకటించినా.. ఆ మేరకు డీఈవోలకు వెబ్సైట్లో వెసులుబాటు లేదు. దీంతో డీఈవోలను సంప్రదించినా రిక్తహస్తమే ఎదురవుతోంది. వరుస తప్పితే అంతే సంగతి.. ప్రస్తుతం ఎస్జీటీ(సెకండరీ గ్రేడ్ టీచర్)ల వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రానికే గెజిటెడ్ హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్ల ఆప్షన్ల నమోదు ముగిసింది. బదిలీల కోసం రాష్ట్రవ్యాప్తంగా 33,061 మంది దరఖాస్తు చేసుకోగా.. 11,210 మంది తప్పనిసరి బదిలీ కానున్నారు. మరో 21,851 మంది ఒకేచోట రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకోవడంతో సాధారణ బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు.వెబ్ కౌన్సెలింగ్‌లో తప్పనిసరి బదిలీ కానున్న టీచర్లు జాబితాలో ఉన్న ఖాళీలన్నీ ఎంపిక చేసుకోవాలి. దీంతో వందల సంఖ్యలో ఆప్షన్లను ప్రాధాన్యతాక్రమంలో ఇవ్వాలి. ఈ క్రమంలో తేడా వస్తే బదిలీ ప్రక్రియ తల్లకిందులు కానుంది. దీంతో జాగ్రత్తగా ఆప్షన్లు ఇవ్వాలి. సాధారణ బదిలీలకు దరఖాస్తు చేసుకున్న వారు సైతం ఎక్కువ సంఖ్యలో స్కూళ్లను ఎంపిక చేసుకోవాల్సి వస్తోంది. ఖాళీల ప్రదర్శనలో గోప్యత.. మరోవైపు ఎస్జీటీ ఖాళీల ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుత బదిలీ ప్రక్రియలో జిల్లాలో ఉన్న పూర్తి ఖాళీలను విద్యాశాఖ ప్రకటించాలి. కానీ చాలాచోట్ల పట్టణ ప్రాంతాల్లోని ఖాళీలను జాబితాలో ప్రకటించకపోవడంపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇంగ్లిష్ మీడియం ప్రారంభించిన తెలుగు మీడియం స్కూళ్లను తాజా జాబితాలో చూపడం లేదని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సరోత్తంరెడ్డి, జి.చెన్నకేశవరెడ్డి మండిపడుతున్నారు. కేటగిరీల వారీగా ఉన్న ఖాళీలన్నీ వేకెన్సీ జాబితాలో చూపాలని కోరుతూ ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బి.భుజంగరావు, జి.సదానంద్‌గౌడ్ బుధవారం విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని కలసి వినతిపత్రం అందజేశారు. ఆప్షన్ల ఎంపిక తర్వాత మార్పులు చేసుకునే వీలుంటే ఇబ్బందులుండవని టీఆర్టీఎఫ్ గౌరవాధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి సూచించారు. ఎడిట్ అధికారాన్ని డీఈవోలకైనా ఇవ్వాలని టీటీయూ అధ్యక్ష, కార్యదర్శులు మణిపాల్‌రెడ్డి, నరసింహస్వామి ప్రభుత్వాన్ని కోరారు. -
సంఘాల అంగీకారం తర్వాతే వెబ్‌కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: బదిలీల విషయంలో ఉపాధ్యాయ సంఘాల సమ్మతి తీసుకున్న తర్వాతే చర్యలు చేపట్టామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో ఆయన టీచర్ల బదిలీల అంశంపై మీడియాతో మాట్లాడారు. ప్రతి ఉపాధ్యాయుడికీ అర్హతల మేరకు న్యాయం జరిగేందుకు, బదిలీల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం వెబ్ కౌన్సెలింగ్ చేపట్టిందన్నా రు. ఉపాధ్యాయ జేఏసీలు వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలకు అంగీకరించిన తర్వాతే ఈ విధానాన్ని అమలు చేశామన్నారు. వెబ్ కౌన్సెలింగ్‌లో లోపాలున్నాయని, ఈ విధానం వద్దని కొద్దిరోజులుగా ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న ప్రచారాన్ని మంత్రి తప్పుబట్టారు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనల అంశం కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున పదో న్నతులు ఇవ్వడం లేదని చెప్పారు. మేనేజ్‌మెంట్లవారీగా బదిలీలను వెబ్ కౌన్సెలింగ్ ద్వారా చేద్దామని చెబితే ఉపాధ్యాయ జేఏసీలు అంగీకరించిన తర్వాతే జూన్ 6న జీవో 16ను తీసుకొచ్చామన్నారు. సీనియార్టీ విషయంలో కొంతమంది తప్పుడు పత్రాలు పెట్టా రని తెలిసిన వెంటనే వాటిని సరిదిద్ది తుది జాబితా వెల్లడించామన్నారు. ఉపాధ్యాయ జేఏసీలు చెప్పినట్లుగానే వేర్వేరుగా ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలకు బదిలీలు నిర్వహిస్తున్నామని, ఈ ప్రక్రియ ఇంత దూరం వచ్చాక ఇప్పుడు వెబ్ కౌన్సెలింగ్ వద్దని కొన్ని సంఘాలు అంటుండటం సరికాదన్నారు. కొందరు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించవద్దని కోర్టుకు వెళ్తున్నారని, ఇతర కారణాలతోనూ కోర్టుకు వెళ్లారన్నారు. కోర్టులో ప్రభుత్వ వాదనలు, పిటిషనర్ల వాదనలు విన్న తర్వాత తీర్పును ఈ నెల 26కి రిజర్వ్ చేశారని, ఈలోపు బదిలీల ప్రక్రియ పూర్తి చేసే పనిలో ప్రభుత్వం ఉందని చెప్పారు. దీనిలో భాగంగా ప్రధానోపాధ్యాయుల బదిలీలు చేశామని, వెబ్ కౌన్సెలింగ్‌లో బదిలీల నిర్వహణను ప్రధానోపాధ్యాయుల సంఘం హర్షించిందన్నారు. వెబ్ కౌన్సె లింగ్ వద్దంటూ తన వ్యక్తిగత ఫోన్‌కు వేల మెస్సేజ్ లు, వందల కాల్స్ చేయిస్తున్నారని, ఈ ఎస్సెమ్మెస్ లు ఎక్కడి నుంచి పెట్టిస్తున్నారో విచారణ చేయించి, తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు. వెబ్ కౌన్సెలింగ్ౖపై కొంతమంది యూనియన్ నాయకులు చేసే అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. పొరపాట్లు సరిదిద్దారు.. టీచర్ల బదిలీ షెడ్యూల్లో మార్పులు చేసిన విద్యాశాఖ స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీల ఆప్షన్ తేదీల గడువు పెంపు సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ బదిలీల్లో పొరపాట్లను సరిదిద్దే చర్యలను విద్యాశాఖ వేగిరం చేసింది. ఇందులో భాగంగా కీలక దశలో ఉన్న వెబ్‌కౌన్సెలింగ్ గడువును పొడిగించి ఉపాధ్యాయులకు కొంత ఉపశమనం ఇచ్చింది. ఇటీవల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల(జీహెచ్ఎం) వెబ్‌కౌన్సెలింగ్ ముగిసింది. ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్ల వెబ్‌కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను విద్యాశాఖ పరిష్కరిస్తోంది. ఈ నేపథ్యంలో వెబ్‌కౌన్సెలింగ్ గడువును ఒకరోజు పెంచింది. ఈ నెల 26 వరకు స్కూల్ అసిస్టెంట్లు వెబ్ఆప్షన్లు ఇచ్చేలా వెసులుబాటు కల్పించింది. ఈ నెల 27 నుంచి 29 వరకు సెకండరీ గ్రేడ్ టీచర్లు(ఎస్జీటీలు) వెబ్ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. వెబ్సైట్ మొరాయిస్తుండటంపై విద్యాశాఖకు ఫిర్యా దులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వెబ్సైట్లో సాంకేతిక సమస్యలను అధిగమించే క్రమంలో ప్రత్యేక సర్వర్లు ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు వెబ్‌కౌన్సెలింగ్ ప్రక్రియలో వెబ్సైట్ మొరాయించడమే కీలక సమస్యగా మారింది. దీంతో ఓటీపీ రావడం, ఆప్షన్ల నమోదు ప్రక్రియ గంటల తరబడి జరుగుతోందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక సర్వర్ల ఏర్పాటుతో టీచర్లకు ఊరట లభించినట్లైంది. -
వెబ్ కౌన్సెలింగ్ రద్దు చేయాలి
ఆదిలాబాద్‌టౌన్ : వెబ్ కౌన్సెలింగ్ రద్దు చేసి పాత పద్ధతిలో (మాన్యువల్‌గా) బదిలీల కౌన్సెలింగ్ చే పట్టాలని పీఆర్టీయూ నాయకులు డిమాండ్ చేశా రు. జిల్లాకేంద్రంలోని డీఈవో కార్యాలయం ఎదు ట పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఆదివారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొమ్ము కృష్ణకుమార్, నల్ల రత్నాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రధానోపాధ్యాయులు వెబ్ అప్షన్లు పెట్టుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. అలాగే ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లు అప్షన్లు ఇచ్చుకునేందుకు అవస్థలు పడాల్సి ఉంటుందన్నారు.ప్రభుత్వం వెంటనే స్పం దించి మాన్యువల్‌గా కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీఈవోకు వినతపత్రం అందజేశారు. కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఇన్నారెడ్డి, మనోహర్, నిర్మల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రమణారావు, ఎ. నరేంద్రబాబు, ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్, ప్రకాశ్, నాయకులు రామకృష్ణ, సత్యనారాయణగౌడ్, అర్చన, అరుణ, మధుసూధన్, రాజన్న, జయరాం పాల్గొన్నారు. -
వెబ్ కౌన్సెలింగ్ అయోమయం!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియలో భాగంగా ప్రారంభమైన వెబ్ కౌన్సెలింగ్ తొలి రోజే గందరగోళానికి దారితీసింది. వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు, దానికి తోడు స్పౌజ్ పాయింట్లు ఉన్న టీచర్లకు అతి తక్కువ ఆప్షన్లు, ఒకే పోస్టును రెండుసార్లు చూపడం మొదలైనవి టీచర్లను తీవ్ర అయోమయానికి గురిచేశాయి. బదిలీ ప్రక్రియలో భాగంగా శనివారం గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల(జీహెచ్ఎం)కు విద్యా శాఖ వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంలు శనివారం ఉదయం నుంచే కంప్యూటర్ల ముందుకు చేరారు. రాష్ట్రవ్యాప్తంగా జీహెచ్ఎం కేటగిరీలో 2,209 మంది బదిలీల కోసం దరఖాస్తులు సమర్పించారు. వీరిలో 541 మందికి తప్పనిసరి బదిలీ కానుండగా.. 1,668 మంది ఒకేచోట రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని ఉండటంతో బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు. సతాయించిన సాంకేతిక సమస్యలు జీహెచ్‌ఎంల వెబ్ కౌన్సెలింగ్‌లో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. తక్కువ మంది టీచర్లే ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యతో టీచర్లు ఇబ్బంది పడ్డారు. ట్రెజరీ సంఖ్య, మొబైల్ నంబర్‌ను వెబ్సైట్లో నమోదు చేస్తే ఉద్యోగి మొబైల్‌కు ఓటీపీ(వన్ టైమ్ పాస్వర్డ్) వస్తుంది. దాన్ని నమోదు చేస్తే ఉద్యోగికి సంబంధించిన వెబ్ పేజీ తెరుచుకుంటుంది. కానీ వివరాలు నమోదు చేసిన వెంటనే ఓటీపీ రావడం లేదు. దీంతో పలుమార్లు వివరాలు నమోదు చేయాల్సి వచ్చింది. ఓటీపీ నమోదు తర్వాత ఉద్యోగి ఖాళీలను ఆప్ట్ చేసుకుంటూ ప్రాధాన్యతా క్రమంలో ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. సర్వర్ తెరుచుకోవడం.. ఆప్షన్లు ఇస్తున్న సమయంలో పేజీ రీడింగ్‌లో తీవ్ర జాప్యంతో ఆప్షన్లు ఇవ్వడానికి రెండు గంటలపాటు వేచి చూడాల్సి వస్తోందని జీహెచ్ఎంలు ఆందోళన వ్యక్తం చేశారు. లాగ్ అవుట్ కాకపోవడం, వెబ్ఆప్షన్లు సేవ్ కాకపోవడం లాంటి సమస్యలతో జీహెచ్ఎంలు ఇబ్బంది పడ్డారు. తప్పనిసరి అయితే అన్నీ ఎంచుకోవాలి.. ఒకేచోట ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం పనిచేసిన టీచర్లకు తప్పనిసరి బదిలీ కానుంది. తప్పనిసరి బదిలీ కేటగిరీలో ఉన్న టీచర్లు వెబ్ కౌన్సెలింగ్‌లో చూపిన ఖాళీలన్నింటికి ఆప్షన్ ఇవ్వాలి. అలా అయితేనే వెబ్ కౌన్సెలింగ్ పేజీ పూర్తవుతుంది. కొన్నింటికే ఆప్షన్లు ఇస్తే.. సీనియార్టీ ఆధారంగా సదరు జీహెచ్‌ఎంకు అందులో పేర్కొన్న స్థానం దక్కకుంటే.. మిగతా ఖాళీ స్థానాన్ని సాఫ్ట్వేర్ ఆటోమేటిక్‌గా కేటాయిస్తుంది. దీంతో ప్రాధాన్యతా క్రమంలో ఉన్న ఖాళీలన్నీ చూపాలని విద్యాశాఖ ఇలా వెబ్‌సైట్‌ను అప్డేట్ చేసింది. ఈ ప్రక్రియతో టీచర్లు ఇబ్బంది పడ్డారు. ఇక స్పౌజ్ పాయింట్లున్న టీచర్ల పరిస్థితి విచిత్రంగా మారింది. స్పౌజ్ పని చేసే చోటు నుంచి జీహెచ్ఎం పనిచేస్తున్న చోటు మధ్య ఉన్న దూరాన్నే సాఫ్ట్వేర్ ప్రామాణికంగా తీసుకోవడంతో.. ఆ కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఖాళీలే వెబ్సైట్లో కనిపిస్తున్నాయి. దీంతో వాటిని మాత్రమే ఎంపిక చేసుకోవాల్సి వస్తోంది. దూరం తక్కువగా ఉంటే తక్కువ ఖాళీలు చూపడంతో కొందరు టీచర్లకు నాలుగైదు స్థానాలకు మించి ఎంపిక చేసుకునే అవకాశం లేకుండా పోయింది. అలాగే వెబ్సైట్లో ఖాళీ స్థానాలు కొన్ని రెండేసిసార్లు చూపించడంతో టీచర్లు తికమకపడ్డారు. -
నేటి నుంచి రెండో దశ వెబ్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని వైద్యవిద్య కాలేజీల్లోని ఏ కేటగిరీ ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ కోసం రెండో దశ వెబ్ కౌన్సెలింగ్‌కు కాళోజీ ఆరోగ్య వర్సిటీ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. తొలిదశ కౌన్సెలింగ్ తర్వాత ఎంబీ బీఎస్‌లో 216, బీడీఎస్‌లో 219 సీట్లు ఖాళీగా ఉన్నట్లు తెలిపింది. ఆగస్టు 12 నుంచి ఆగస్టు 14 వరకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనుంది. ఇక వైద్య సీట్ల భర్తీ విషయంలో హైకోర్టు ఇటీవలి తీర్పు ప్రకారం.. తొలిదశ కౌన్సెలింగ్‌లో మైనారిటీ కాలేజీల్లోని బీ కేటగిరీ సీటు పొంది, అడ్మిషన్ తీసుకోకుండా ఖాళీగా ఉంటే.. ఆ సీట్లను తాజా కౌన్సెలింగ్‌లో ఏ కేటగిరీలోకి మార్చుతున్నట్లు తెలిపింది. -
5 నుంచి ఏపీ ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల ప్రవేశానికి గాను ఏపీ ఎంసెట్–2017 తుది విడత కౌన్సెలింగ్‌ను ఈ నెల 5 నుంచి నిర్వహించనున్నట్లు అడ్మిషన్ల కమిటీ కన్వీనర్ జీఎస్ పండాదాస్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 5, 6 తేదీల్లో వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవచ్చని, 8న సీట్లు కేటాస్తా మన్నారు. ఇదివరకు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకాలేని వారు కూడా ఈ రెండురోజుల వెబ్‌కౌన్సెలింగ్‌కు వచ్చి ధ్రువపత్రాల పరిశీలన అనంతరం వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చన్నారు. వర్సిటీ కాలేజీల్లో 483, ప్రైవేటు కాలేజీల్లో 31,362 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. వివరాలను ఎంసెట్ కౌన్సెలింగ్ వెబ్సైట్లో (హెచ్‌టీటీపీఎస్: //ఏపీ ఈఏఎంసీఈటీ.ఎన్ఐసీ.ఐఎన్) ఉంచినట్లు తెలిపారు. -
ఏపీ ఈసెట్ ప్రవేశాలకు నోటిఫికేషన్
- జూన్ 29 నుంచి ధ్రువపత్రాల పరిశీలన - 30 నుంచి ఆప్షన్ల నమోదు... జూలై 5న సీట్ల కేటాయింపు సాక్షి, అమరావతి: ఏపీ ఈసెట్‌లో అర్హత సాధించిన (డిప్లొమా, బీఎస్సీ మేథ్స్) అభ్యర్థులకు ఇంజనీరింగ్,, ఫార్మా కాలేజీల్లో ప్రవేశాల కోసం రాష్ట్ర ఉన్నత విద్యామండలి బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. వీరు వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు వీలుగా 18 హెల్ప్‌లైన్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. వీరు ఒరిజినల్ ధ్రువపత్రాలను ఆయా కేంద్రాల్లో జూన్ 29 నుంచి పరిశీలింపచేసుకోవాలి. ధ్రువపత్రాల జిరాక్స్ పత్రాలను మాత్రమే కాలేజీల్లో అందించాలని కన్వీనర్ పండాదాస్ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులు రూ. 600, ఇతరులు రూ.1200 ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాలన్నారు. ఒకటవ ర్యాంకు నుంచి ఆరు వేల వరకు జూన్ 29న, 6,001 నుంచి 14 వేల వరకు జూన్ 30న, 14,001 నుంచి 22వేల వరకు జూలై ఒకటిన, 22,001 నుంచి చివరి ర్యాంకు వరకు జూలై 2న పరిశీలన చేస్తారు. దివ్యాంగులు ఇతర ప్రత్యేక కేటగిరీల వారు విజయవాడలోని బెంజ్సర్కిల్లో ఉన్న పాలిటెక్నిక్‌లోని కేంద్రంలో పరిశీనలకు రావాలి. అభ్యర్ధులు జూన్ 30 నుంచి జూలై 3న సాయంత్రం 6 గంటల వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ‘హెచ్‌టీటీపీఎస్://ఏపీఈసీఈటీ.ఎన్ఐసీ.ఐఎన్’ వెబ్సైట్లో ఆప్షన్లు ఇవ్వాలి. జూలై 5న సీట్ల కేటాయింపు వివరాలు వెబ్సైట్లో పొందుపర్చనున్నారు. -
‘వైద్య’ అడ్మిషన్లపై గందరగోళం
హైకోర్టు తీర్పు ఇచ్చినా భర్తీపై అస్పష్టత ► స్టే ఎత్తివేతకు పిటిషన్ వేయాలని ప్రైవేటు మెడికల్ కాలేజీల నిర్ణయం ► ప్రభుత్వంతో ఒప్పందం జరగనందున భర్తీకి ఒప్పుకోబోమని స్పష్టీకరణ ► రెండో విడత వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభం.. ఆప్షన్లు ఇస్తున్న విద్యార్థులు సాక్షి, హైదరాబాద్: పీజీ వైద్య సీట్ల అడ్మిషన్లపై గందరగోళం కొనసాగుతోంది. ఫీజులు పెంచుతూ తెలంగాణ సర్కారు విడుదల చేసిన జీవోలను హైకోర్టు నిలుపుదల చేయడం, ప్రవేశాలను యథాతథంగా కొనసాగించాలని స్పష్టం చేయడం తెలిసిందే. దీంతో స్టే ఎత్తివేతకు ప్రైవేటు మెడికల్ కాలేజీలు పిటిషన్ దాఖలు చేయాలని తాజాగా నిర్ణయించాయి. అలాగే అడ్మిషన్ల ప్రక్రియను నిలిపివేయాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి లేఖ రాశాయి. కన్వీనర్ కోటా సీట్లకు శుక్రవారం మొదలైన వెబ్ కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలని కోరాయి. దీంతో ఆరోగ్య విశ్వవిద్యాలయం గందరగోళంలో పడింది. అడ్మిషన్ల ప్రక్రియపై ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించింది. ఎంసీఐ నిబంధనల ప్రకారం పీజీ వైద్య సీట్ల భర్తీ ప్రక్రియ ఈ నెలాఖరుకు పూర్తి కావాలి. ఇంకా 18 రోజులే గడువు ఉంది. దీంతో అడ్మిషన్లు పూర్తవుతాయా లేదా అనే సందేహాలతో వైద్య విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వెనక్కు తగ్గని మెడికల్ కాలేజీలు మొదటి నుంచి ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలు మొండిగానే వ్యవహరిస్తున్నాయి. ఫీజులు పెంచకుంటే పీజీ వైద్య సీట్లను తమ కాలేజీల నుంచి ఉపసంహరించుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. దీంతో వెనక్కు తగ్గిన ప్రభుత్వం.. అడిగినట్లుగా అన్ని రకాల ఫీజులను గణనీయంగా పెంచింది. క్లినికల్ ఎన్ఆర్ఐ కోటా సీటుకైతే మూడేళ్లకు ఏకంగా రూ.2.17 కోట్లు పెంచేసింది. దీంతో ఆందోళన చెందిన వైద్య విద్యార్థులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో స్టే విధిస్తూ తీర్పు వెలువడిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పు వెలువడినా ప్రైవేటు కాలేజీలు వెనక్కు తగ్గడంలేదు. అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్లి పిటిషన్ దాఖలు చేస్తామని స్పష్టంచేస్తున్నాయి. ఫీజులకు సంబంధించి మూడు నెలల కిందటే ఏఎఫ్ఆర్సీకి లేఖ రాశామని చెబుతున్నాయి. ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం జరగకుండానే వెబ్ కౌన్సెలింగ్‌కు ఎలా వెళ్లారంటూ ఆరోగ్య వర్సిటీని ప్రశ్నిస్తున్నాయి. ‘హైకోర్టు స్టే విధించాక మాకు ఎలాంటి నోటీసు రాలేదు. కాబట్టి వెబ్ కౌన్సెలింగ్ జరగకుండా చూడాలని వర్సిటీకి లేఖ ఇచ్చాం. అయినా ఎంవోయూ జరగకుండా ఎలా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు’అని ప్రైవేటు మెడికల్ కాలేజీల సంఘం అధ్యక్షుడు లక్ష్మీనర్సింహరావు ప్రశ్నిస్తున్నారు. ‘ఫీజులు పెంచకుంటే మాకు గిట్టుబాటు కాదు. తక్కువ ఫీజులతో పీజీ కోర్సులను నడిపించడం సాధ్యంకాదు. అవసరమైతే కాలేజీలను బంద్ పెడతాం’అని ఆయన ‘సాక్షి’తో అన్నారు. హైకోర్టుకు వెళ్లాలా, సుప్రీంకోర్టుకు వెళ్లాలా అనే దానిపై సోమవారం నాటికి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. వెబ్ కౌన్సెలింగ్‌పై ముందుకే ప్రైవేటు మెడికల్ కాలేజీలు కౌన్సెలింగ్ నిలిపివేయాలని కోరినా అది సాధ్యం కాదని ఆరోగ్య వర్సిటీ స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రభుత్వ కాలేజీల్లోని సీట్లకు మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తయింది. కొన్ని సీట్లల్లో విద్యార్థులు చేరిపోయారు. ఫీజులను పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో మొదటి కౌన్సెలింగ్ తర్వాత ప్రభుత్వ కాలేజీల్లో మిగిలిపోయిన సీట్లకు, అలాగే ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లకు శుక్రవారం రెండో విడత వెబ్ కౌన్సెలింగ్ మొదలైంది. శనివారం సాయంత్రం 4 గంటలకు కౌన్సెలింగ్ ముగుస్తుంది. ప్రైవేటు కాలేజీలు కౌన్సెలింగ్ రద్దు చేయమని కోరినా ఇప్పటికే ప్రారంభమైనందున వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియను రద్దు చేయడం కుదరదని, కాబట్టి కొనసాగిస్తామని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ప్రైవేటు కాలేజీల్లోని 267 కన్వీనర్ కోటా సీట్లకు, మైనారిటీలోని 46 కన్వీనర్ కోటా సీట్లకు, కొత్తగా కేటాయించిన 100 సీట్లకు, అలాగే మొదటి కౌన్సెలింగ్‌లో మిగిలినపోయిన నిమ్స్‌లోని 51 సీట్లకు, ఓయూ, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీల్లో మిగిలిపోయిన 236 సీట్లకు రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. మొదటిరోజు విద్యార్థులు ఆప్షన్లు ఎంపిక చేసుకున్నారు. కౌన్సెలింగ్ పూర్తి చేస్తామని, అయితే ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థులకు సీట్ల కేటాయింపుపై ప్రభుత్వం ఎలా చెబితే అలా నడుచుకుంటామని కరుణాకర్‌రెడ్డి వివరించారు. దీనిపై ప్రభుత్వానికి లేఖ రాస్తామన్నారు. నెలాఖరుకు పూర్తి కావాల్సిన ప్రక్రియ సీట్ల అడ్మిషన్ల ప్రక్రియ ఈ నెలాఖరుకు పూర్తి కావాల్సి ఉంది. హైకోర్టు స్టే ఇవ్వడం, ప్రైవేటు కాలేజీలు కౌన్సెలింగ్‌ను నిలుపుదల చేయాలని కోరుతుండటంతో అడ్మిషన్లపై గందరగోళం నెలకొనడంతో అడ్మిషన్ల ప్రక్రియ పూర్త య్యే పరిస్థితి కనిపించడం లేదు. పొడిగింపు కోరే అవకాశముంది. -
12, 13న ‘పీజీ మెడికల్’ కౌన్సెలింగ్
నోటిఫికేషన్ జారీచేసిన కాళోజీ హెల్త్ వర్సిటీ సాక్షి, హైదరాబాద్: పీజీ మెడికల్, డిప్లొమా సీట్ల అడ్మిషన్ల కోసం ఈ నెల 12, 13 తేదీల్లో రెండో విడత వెబ్ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వ విద్యాలయం వీసీ కరుణాకర్‌రెడ్డి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 12వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 13 సాయంత్రం 4 గంటల వరకు విద్యార్థులు ఆప్షన్లు ఇవ్వాలని సూచించారు. మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్ ఇటీవల పూర్తయిన సంగతి తెలిసిందే. ఆ కౌన్సెలింగ్ నిమ్స్ సహా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని పీజీ మెడికల్ సీట్లకు మాత్రమే నిర్వహించారు. ప్రైవేటు, మైనారిటీ మెడికల్ కాలేజీల సీట్ల ఫీజుల వ్యవహారం తేలక పోవడంతో మొదటి విడత కౌన్సెలింగ్ ప్రభుత్వ సీట్లకే పరిమితమైంది. మంగళవారం పీజీ సీట్ల ఫీజుల పెంపుపై జీవో జారీచేయడంతో రెండో విడత వెబ్ కౌన్సెలింగ్‌లో ప్రభుత్వ సీట్లతో పాటు ప్రైవేటు మెడికల్ కాలేజీలు, మైనారిటీ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లకు కూడా వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. మైనారిటీ కోటా సీట్లకు మాత్రం మొదటి విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. కాగా, మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్ దాదాపు 600 సీట్లకు నిర్వహించగా, విద్యార్థులు చేరకపోవడంతో 238 సీట్లు మిగిలిపోయాయి. ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీల్లో కూడా సీట్లు మిగిలిపోయాయి. తదుపరి కౌన్సెలింగ్‌లో నిమ్స్ తదితర ప్రముఖ కాలేజీల్లో సీటు వస్తుందన్న ఆశతోనే చాలా మంది చేరలేదని భావిస్తున్నారు. -
పీజీ వైద్య విద్య అడ్మిషన్లకు నోటిఫికేషన్
నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పీజీ వైద్య సీట్ల అడ్మిషన్లకు సోమ వారం నోటిఫికేషన్ విడుదలైంది. నీట్ పీజీ–2017, నీట్ ఎండీ ఎస్–2017 ప్రవేశ పరీక్షలో కటాఫ్ మార్కులు సాధించిన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారి నుంచి మెరిట్ జాబితా తయారు చేసి మెడికల్ పీజీ, డిప్లమో, ఎండీఎస్ కోర్సుల్లో సీట్లు భర్తీ చేస్తామని కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ రిజిస్ట్రార్ టి.వెంకటేశ్వర్రావు వెల్లడించారు. నిమ్స్ సహా రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని పీజీ వైద్య సీట్లు భర్తీ చేస్తారు. దరఖాస్తులను మంగళవారం ఉదయం 11 నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు. మరిన్ని వివరాలను www.knruhs.in, http://tsp gmed.tsche.in, http://tsmds.tsche.inల్లో చూడవచ్చు. ఉమ్మడి కౌన్సెలింగ్.. ప్రభుత్వ సీట్లు, నాన్ మైనారిటీ, మైనారిటీల్లోని కన్వీనర్ కోటా పీజీ వైద్య సీట్లను నీట్ ర్యాంకుల ఆధారంగా ఉమ్మడి కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తామని తెలుపుతూ వైద్య ఆరోగ్యశాఖ సోమవారం నోటిఫి కేషన్ జారీచేసింది. కాగా, ఏయే కాలేజీల్లో ఎన్ని పీజీ సీట్లు ఉన్నాయో ప్రకటించాల్సి ఉంది. ► ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6%, బీసీలకు 29% రిజర్వేషన్ అమలుచేస్తారు. ► 30% క్లినికల్ పీజీ సీట్లను, 50% ప్రీ, పారా క్లినికల్ సీట్లను ఇన్ సర్వీస్ కోటాలో ఇస్తారు. అందులోనూ రిజర్వేషన్లు ఉంటాయి. ► రెండేళ్లు ఆపై గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన వైద్యులు, మూడేళ్లు ఆపైన గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసినవారు, ఆరేళ్లు, ఆపైన పట్టణాల్లో పనిచేసిన అభ్యర్థులు ఇన్‌సర్వీస్ కోటా రిజర్వేషన్లకు అర్హులు. దరఖాస్తులో ఆ వివరాలన్నీ నమోదు చేయాలి. పనిచేస్తున్నట్లు డీఎంఈ నుంచి ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి. ►కాంట్రాక్లు, ఔట్ సోర్సింగ్ వైద్యులు ఇన్‌సర్వీస్ కోటాకు అనర్హులు. ►85% సీట్లు స్థానికులకు, 15% సీట్లు స్థానికేతరులకు ఇస్తారు. వెబ్‌కౌన్సెలింగ్ ద్వారా సీట్లను భర్తీ చేస్తారు. వెబ్‌కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన వారి వివరాలను వెబ్సైట్లో ప్రకటిస్తారు. ఎంపికైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను విశ్వవిద్యాలయా నికి ఇవ్వాల్సి ఉంటుంది. ∙ పీజీ కోర్సులో చేరిన వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసు చేయడానికి, కన్సల్టేషన్గా ఉండటానికి వీల్లేదు. -
పారా మెడికల్ డిగ్రీ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్
25 నుంచి 28 వరకు సర్టిఫికెట్ల పరిశీలన విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): ఏపీలో పారామెడికల్ (నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ) కోర్సుల్లో అడ్మిషన్లకు జరిగే వెబ్ కౌన్సెలింగ్‌లో భాగంగా ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.అప్పలనాయుడు తెలిపారు. ఈ మేరకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ, తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు నోటిఫికేషన్లో తెలిపిన విధంగా ర్యాంకుల ప్రకారం ఏ హెల్ప్‌లైన్ కేంద్రాల్లోనైనా సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావచ్చు. అన్ రిజర్వుడు 15 శాతం సీట్ల కోసం హాజరయ్యే తెలంగాణ అభ్యర్థులు మాత్రం విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో హాజరుకావాలి. బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ కోర్సులకు దరఖాస్తు చేసుకున్న పీహెచ్ అభ్యర్థులు, పోస్టు బేసిక్ నర్సింగ్ (రెండేళ్ల) కోర్సుకు దరఖాస్తు చేసుకున్న వారు ఈనెల 28న విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో హాజరు కావాలి. మెరిట్ లిస్టు, ర్యాంకు కార్డులు, నోటిఫికేషన్ వివరాలు యూనివర్సిటీ ( హెచ్‌టీటీపీ://డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.యూజీఎన్టీఆర్యూహెచ్ఎస్.ఇన్, హెచ్‌టీటీపీ://ఎన్టీఆర్యూహెచ్ఎస్.ఏపీ.ఎన్ఐసీ.ఇన్) వెబ్సైట్లలో పొందవచ్చు. అభ్యర్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైనప్పుడు వాడకంలో ఉన్న సొంత ఫోన్ నంబర్‌ను నమోదు చేయించుకోవాలి. -
నేటి నుంచి ‘మెడికల్’ తరగతులు
* మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు దక్కిన విద్యార్థులు హాజరు * నేడు రెండో విడత వెబ్ కౌన్సెలింగ్ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 2016-17 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్ తొలి ఏడాది తరగతులు సోమవారం ప్రారంభం కానున్నాయి. తొలివిడత కౌన్సెలింగ్‌లో ఎంపికైన వారికి కాలేజీల వారీగా సీట్లు కేటాయించిన అధికారులు తరగతుల ప్రారంభానికి ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది కొత్తగా ప్రారంభం కానున్న మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలోనూ తరగతులు ప్రారంభం కానున్నాయని అధికారులు చెబుతున్నారు. 21 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రైవేటులోని కన్వీనర్ కోటాలో ఉన్న 2,075 ఎంబీబీఎస్ సీట్లకు, అలాగే 12 డెంటల్ కాలేజీల్లోని 606 సీట్లను (స్పోర్ట్స్, ఎన్సీసీ, మిలటరీ కోటా మినహాయించి) విద్యార్థులకు కేటాయించారు. వీటిల్లో 70 ఎంబీబీఎస్, 200 బీడీఎస్ సీట్లల్లో విద్యార్థులు చేరనందున మిగిలాయని కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. వాటికి రెండో విడత వెబ్‌కౌన్సెలింగ్ సోమవారం నిర్వహించి, 27న సీట్ల కేటాయింపు చేస్తామన్నారు. కాగా, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని బీ కేటగిరీ సీట్లకు కౌన్సెలింగ్ పూర్తయిన సంగతి తెలిసిందే. వాటిల్లో అన్ని ఎంబీబీఎస్ సీట్లు భర్తీ కాగా.. 92 బీడీఎస్ సీట్లు మిగిలినట్లు కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. ఈ నెలాఖరులోగా వైద్య అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
మిగిలిన పీజీ వైద్యసీట్లకు 3న కౌన్సెలింగ్
- ఏపీలో 86, తెలంగాణలో 32 పీజీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ - వెబ్ కౌన్సెలింగ్ తర్వాత ఎస్ఎంఎస్ ద్వారా నిర్ణయం - ఎస్ఎంఎస్కు స్పందించకపోతే తర్వాతి ర్యాంకర్‌కు సీటు సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మిగిలిన పోస్ట్ గ్రాడ్యుయేట్(పీజీ), పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా సీట్లకు అక్టోబర్ 3 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించాలని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ, కాళోజీ నారాయణ హెల్త్ వర్సిటీ నిర్ణయించాయి. మొదటి, రెండో విడత కౌన్సెలింగ్ తర్వాత ఏపీలో 86 సీట్లు, తెలంగాణలో 32 సీట్లు మొత్తం 118 పీజీ వైద్య సీట్లు మిగిలిపోయాయి. ఈ సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించాలని కొంతమంది విద్యార్థులు హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నెల 8న సుప్రీంకోర్టు 2 వారాల్లోగా ఈ సీట్లను భర్తీ చేయాలని ఎన్టీఆర్ హెల్త్, కాళోజీ హెల్త్ వర్సిటీలను ఆదేశించినా కోర్టు కాపీ ఆలస్యంగా వచ్చిందని స్పందించలేదు. దీంతో ఈ నెల 20న ‘పీజీ సీట్లు ఎప్పుడు భర్తీ చేస్తారు’ అన్న శీర్షికతో ‘సాక్షి’లో వార్త ప్రచురితమైంది. దీనిపై ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ స్పందించి అక్టోబర్ 3న ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ ఉంటుందని నోటిఫికేషన్ జారీచేసింది. ఈ మేరకు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ, కాళోజీ హెల్త్ వర్సిటీ పరిధిలోని మొత్తం 118 సీట్లను భర్తీ చేస్తారు. పీజీ సీట్లకు జరిగిన మొదటి, రెండో విడత కౌన్సెలింగ్‌లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయి, సీట్లు రాని వారు మాత్రమే ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాలని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ సూచించారు. విద్యార్థులు వెబ్ కౌన్సెలింగ్‌లో ఇచ్చిన ఆప్షన్ల మేరకు మెరిట్ ఆధారంగా ఎస్ఎంఎస్లు వస్తాయని, ఈ ఎస్ఎంఎస్లకు స్పందించిన వారికి సీట్లు కేటాయిస్తామన్నారు. ఒకవేళ ఎవరైనా విద్యార్థి ఎస్ఎంఎస్కు స్పందించకపోతే ఆ సీటును తర్వాతి మెరిట్ విద్యార్థికి ఇస్తామని తెలిపారు. -
ఆ కాలేజీలను కౌన్సెలింగ్ జాబితాలో చేర్చండి
జేఎన్టీయూ అధికారులకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్ : తనిఖీల్లో బయటపడ్డ లోపాలను సరిదిద్దుకున్న కాలేజీలను వెబ్ కౌన్సెలింగ్ జాబితాలో చేర్చాలని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) హైదరాబాద్ రిజిస్ట్రార్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. వెబ్ కౌన్సెలింగ్ జాబితాలో చేర్చకపోవడం, కొన్ని కోర్సులకు అఫిలియేషన్ ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ పలు ఇంజనీరింగ్ కాలేజీలు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం విచారించారు. తనిఖీలు నిర్వహించిన వర్సిటీ వర్గాలు పలు లోపాలను ఎత్తిచూపాయని, దీనిపై అప్పీల్ దాఖలు చేశామని, లోపాలను సవరించుకున్న ఆధారాలను సమర్పించినా తమ కాలేజీలను వెబ్ కౌన్సెలింగ్‌లో చేర్చలేదని పిటిషనర్లు కోర్టుకు నివేదించారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. సదరు కాలేజీల్లో మరోసారి తనిఖీలు నిర్వహించి లోపాలను సవరించుకున్న కాలేజీలను వెబ్ కౌన్సెలింగ్‌లో చేర్చాలని ఉత్తర్వులు జారీ చేశారు. వర్సిటీతో పాటు తెలంగాణ ఉన్నత విద్యామండలి, ఏఐసీటీఈ తదితరులకు నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు.