సాక్షి, హైదరాబాద్: బదిలీల్లో కీలకమైన వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఉపాధ్యాయులకు చుక్కలు చూపిస్తోంది. ఆప్షన్ల ఎంపిక సమయంలో పొరపాట్లు తలెత్తితే వాటిని సవరించే వీలు లేకుండా విద్యాశాఖ నిబంధనలు విధించింది. దీంతో ఒకసారి ఆప్షన్లు ఇస్తే అదే చివరి అవకాశం కానుంది. వెబ్ కౌన్సెలింగ్‌లో కఠిన నిబంధనలు పెట్టడం మంచిదైనప్పటికీ.. విద్యాశాఖ మాటిమాటికీ మార్పులు చేయడంతో ఉపాధ్యాయ వర్గాలు గందరగోళానికి గురవుతున్నాయి. స్పౌజ్ పాయింట్లున్న టీచర్లకు తొలుత పూర్తిస్థాయిలో ఆప్షన్లు కనిపించకపోగా.. తాజాగా జియోట్యాగింగ్ మార్పులతో ఆప్షన్లు ఎక్కువ కనిపించేలా విద్యాశాఖ సాంకేతికంగా మార్పులు చేసింది. దీంతో తొలిరోజు ఆప్షన్లు పెట్టుకున్న తమకు తీవ్ర నష్టం కలిగిందని పలువురు వాపోతున్నారు. ఈ అంశంపై విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పాఠశాల విద్యా శాఖ సంచాలకునికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సీనియార్టీ జాబితాలో మార్పులు, ఇతర అంశాల్లో సవరణ చేసేలా జిల్లా విద్యాశాఖ అధికారికి అధికారాలు ఇచ్చినట్లు విద్యాశాఖ ప్రకటించినా.. ఆ మేరకు డీఈవోలకు వెబ్‌సైట్‌లో వెసులుబాటు లేదు. దీంతో డీఈవోలను సంప్రదించినా రిక్తహస్తమే ఎదురవుతోంది.
వరుస తప్పితే అంతే సంగతి..
ప్రస్తుతం ఎస్జీటీ(సెకండరీ గ్రేడ్ టీచర్)ల వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రానికే గెజిటెడ్ హెచ్‌ఎంలు, స్కూల్ అసిస్టెంట్ల ఆప్షన్ల నమోదు ముగిసింది. బదిలీల కోసం రాష్ట్రవ్యాప్తంగా 33,061 మంది దరఖాస్తు చేసుకోగా.. 11,210 మంది తప్పనిసరి బదిలీ కానున్నారు. మరో 21,851 మంది ఒకేచోట రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకోవడంతో సాధారణ బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు.వెబ్ కౌన్సెలింగ్‌లో తప్పనిసరి బదిలీ కానున్న టీచర్లు జాబితాలో ఉన్న ఖాళీలన్నీ ఎంపిక చేసుకోవాలి. దీంతో వందల సంఖ్యలో ఆప్షన్లను ప్రాధాన్యతాక్రమంలో ఇవ్వాలి. ఈ క్రమంలో తేడా వస్తే బదిలీ ప్రక్రియ తల్లకిందులు కానుంది. దీంతో జాగ్రత్తగా ఆప్షన్లు ఇవ్వాలి. సాధారణ బదిలీలకు దరఖాస్తు చేసుకున్న వారు సైతం ఎక్కువ సంఖ్యలో స్కూళ్లను ఎంపిక చేసుకోవాల్సి వస్తోంది.
ఖాళీల ప్రదర్శనలో గోప్యత..
మరోవైపు ఎస్జీటీ ఖాళీల ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుత బదిలీ ప్రక్రియలో జిల్లాలో ఉన్న పూర్తి ఖాళీలను విద్యాశాఖ ప్రకటించాలి. కానీ చాలాచోట్ల పట్టణ ప్రాంతాల్లోని ఖాళీలను జాబితాలో ప్రకటించకపోవడంపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇంగ్లిష్ మీడియం ప్రారంభించిన తెలుగు మీడియం స్కూళ్లను తాజా జాబితాలో చూపడం లేదని పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సరోత్తంరెడ్డి, జి.చెన్నకేశవరెడ్డి మండిపడుతున్నారు. కేటగిరీల వారీగా ఉన్న ఖాళీలన్నీ వేకెన్సీ జాబితాలో చూపాలని కోరుతూ ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బి.భుజంగరావు, జి.సదానంద్‌గౌడ్ బుధవారం విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని కలసి వినతిపత్రం అందజేశారు. ఆప్షన్ల ఎంపిక తర్వాత మార్పులు చేసుకునే వీలుంటే ఇబ్బందులుండవని టీఆర్‌టీఎఫ్ గౌరవాధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి సూచించారు. ఎడిట్ అధికారాన్ని డీఈవోలకైనా ఇవ్వాలని టీటీయూ అధ్యక్ష, కార్యదర్శులు మణిపాల్‌రెడ్డి, నరసింహస్వామి ప్రభుత్వాన్ని కోరారు.
ఎడిట్‌కు.. నోచాన్స్!
Published Thu, Jun 28 2018 1:37 AM | Last Updated on Thu, Jun 28 2018 1:37 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment