- ఏపీలో 86, తెలంగాణలో 32 పీజీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్
- వెబ్ కౌన్సెలింగ్ తర్వాత ఎస్‌ఎంఎస్ ద్వారా నిర్ణయం
- ఎస్‌ఎంఎస్‌కు స్పందించకపోతే తర్వాతి ర్యాంకర్‌కు సీటు
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మిగిలిన పోస్ట్ గ్రాడ్యుయేట్(పీజీ), పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా సీట్లకు అక్టోబర్ 3 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించాలని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ, కాళోజీ నారాయణ హెల్త్ వర్సిటీ నిర్ణయించాయి. మొదటి, రెండో విడత కౌన్సెలింగ్ తర్వాత ఏపీలో 86 సీట్లు, తెలంగాణలో 32 సీట్లు మొత్తం 118 పీజీ వైద్య సీట్లు మిగిలిపోయాయి. ఈ సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించాలని కొంతమంది విద్యార్థులు హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నెల 8న సుప్రీంకోర్టు 2 వారాల్లోగా ఈ సీట్లను భర్తీ చేయాలని ఎన్టీఆర్ హెల్త్, కాళోజీ హెల్త్ వర్సిటీలను ఆదేశించినా కోర్టు కాపీ ఆలస్యంగా వచ్చిందని స్పందించలేదు. దీంతో ఈ నెల 20న ‘పీజీ సీట్లు ఎప్పుడు భర్తీ చేస్తారు’ అన్న శీర్షికతో ‘సాక్షి’లో వార్త ప్రచురితమైంది.
దీనిపై ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ స్పందించి అక్టోబర్ 3న ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ ఉంటుందని నోటిఫికేషన్ జారీచేసింది. ఈ మేరకు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ, కాళోజీ హెల్త్ వర్సిటీ పరిధిలోని మొత్తం 118 సీట్లను భర్తీ చేస్తారు. పీజీ సీట్లకు జరిగిన మొదటి, రెండో విడత కౌన్సెలింగ్‌లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయి, సీట్లు రాని వారు మాత్రమే ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాలని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ సూచించారు. విద్యార్థులు వెబ్ కౌన్సెలింగ్‌లో ఇచ్చిన ఆప్షన్ల మేరకు మెరిట్ ఆధారంగా ఎస్‌ఎంఎస్‌లు వస్తాయని, ఈ ఎస్‌ఎంఎస్‌లకు స్పందించిన వారికి సీట్లు కేటాయిస్తామన్నారు. ఒకవేళ ఎవరైనా విద్యార్థి ఎస్‌ఎంఎస్‌కు స్పందించకపోతే ఆ సీటును తర్వాతి మెరిట్ విద్యార్థికి ఇస్తామని తెలిపారు.
మిగిలిన పీజీ వైద్యసీట్లకు 3న కౌన్సెలింగ్
Published Fri, Sep 23 2016 1:05 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement