అర్హులైన బోధకులుంటేనే కౌన్సెలింగ్ అవకాశం
విద్యార్థులకు రూ.2,500 కోట్ల మేర ఆర్థిక సాయం
{పమాణాలు లేని కాలేజీలకు ప్రజాధనం ఎలా వెచ్చిస్తాం?
సరైన తనిఖీలు లేకుండానే అఫిలియేషన్లు ఇచ్చిన ఏఐసీటీఈ
హైకోర్టుకు నివేదించిన ఏజీ రామకృష్ణారెడ్డి
నిర్ణయం వాయిదా వేసిన న్యాయమూర్తి
హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు వెబ్‌కౌన్సెలింగ్ నుంచి 174 కాలేజీల తొలగింపు, అఫిలియేషన్లరద్దు వ్యవహారంపై నిర్ణయం సోమవారానికి వాయిదా పడింది. ఈ మేరకు ఉభయపక్షాల వాదనలను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి శనివారం విన్నారు. జేఎన్‌టీయూ హైదరాబాద్ తమ కౌన్సెలింగ్ కాలేజీల జాబితా నుంచి తమను తొలగించి అఫిలియేషన్లను రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాదాపు 150కి పైగా ప్రైవేటు ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి శనివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా వాదనలు విన్నారు. జేఎన్‌టీయూ హైదరాబాద్ తరఫున అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి వాదించారు. అఫిలియేషన్ల రద్దును, కౌన్సిలింగ్ నుంచి కాలేజీల తొలగింపును ఆయన సమర్థించారు. సౌకర్యాలు లేనప్పుడు ప్రమాణాలు ఎలా మెరుగవుతాయని, విద్యాప్రమాణాలు లేని కాలేజీల్లో చదువుకున్నవారు ఎలా ప్రయోజకులవుతారని ఆయన ప్రశ్నించారు. ఈ విద్యాసంవత్సరం నుంచి నిబంధనలకు అనుగుణంగా బోధనా సిబ్బందిని నియమించుకుంటే, వాటికి వెబ్‌కౌన్సెలింగ్ జాబితాలో స్థానం కల్పిం చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
దాదాపు 141 కాలేజీలు శుక్రవారం జేఎన్‌టీయూహెచ్ వైస్ చాన్సలర్‌ను సంప్రదించి, లోపాలను సరిదిద్దుకుంటున్నామంటూ అఫిడవిట్లు ఇచ్చి, కౌన్సెలింగ్‌లో స్థానం కల్పించాలని కోరాయని వివరించారు. అర్హులైన బోధనా సిబ్బంది ఉండేలా చూడడమే తమ ఉద్దేశమన్నారు. బోధనా సిబ్బంది కోసం తాము ఒత్తిడి చేస్తుంటే, కాలేజీలు ఎందుకు ఇబ్బంది పడుతున్నాయో తమకు అర్థంకావడం లేదన్నారు. ఈ ఏడాది విద్యార్థులకు రూ.2,500 కోట్ల మేర సాయంచేయనున్నామని, ఇదంతా ప్రజాధనమని, ప్రమాణాలు లేని, సౌకర్యాలు లేని కాలేజీల కోసం ఇంత ప్రజాధనాన్ని వృథా చేయలేమన్నారు. ఏఐసీటీఈ క్షేత్రస్థాయిలో కాలేజీలను సందర్శించకుండానే అఫిలియేషన్లు ఇచ్చిందని, అలాంటివాటికి ఎటువంటి విలువలేదని ఏజీ తేల్చి చెప్పారు. విశ్వవిద్యాలయాలపై ఏఐసీటీఈ పెత్తనం చెల్లదని, అది సలహా మండలి మాత్రమేనన్నారు. కాలేజీల తరఫున సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి, మరికొందరు వాదిస్తూ, లోపాలను సరిదిద్దుకునే సమయం ఇవ్వకుండా ఒకేసారి 174 కాలేజీల తలరాతను జేఎన్‌టీయూహెచ్ మార్చివేసిందన్నారు. తాము యూనివర్సిటీ అధికారాలను ప్రశ్నించడం లేదని, అయితే చట్టం ప్రకారం నడచుకోలేదన్నదనే తమ అభ్యంతరమన్నారు. అఫిలియేషన్ రద్దుతో రెండు, మూడేళ్ల విద్యార్థుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. వాదనలు విన్న న్యాయమూర్తి తన నిర్ణయాన్ని వాయిదా వేశారు.
లోపాలు దిద్దుకుంటున్నాం..
తమ కాలేజీల్లో లోపాల సవరించుకుంటున్నట్టు వివరిస్తూ తెలంగాణలోని 170 ఇంజనీరింగ్ కాలేజీలు డెఫిషియెన్సీ కాంప్లియన్స్ రిపోర్టులను అఫిడవిట్ల రూపంలో హైదరాబాద్ జేఎన్‌టీయూకు అందజేసినట్టు తెలిసింది. లోపాలను సరిదిద్దుతున్నామని, అఫిలియేషన్లు ఇవ్వాలని, కౌన్సెలింగ్‌లో అవకాశం కల్పించాలని అవి కోరినట్టు తెలిసింది. 174 కాలేజీలకు యూనివర్సిటీ అఫిలియేషన్లను నిరాకరించిన సంగతి తెలిసిందే.