of course
-
28లోపు కోర్సు ఫీజు చెల్లించాలి
ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం దూరవిద్య విధానంలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో రెండో సంవత్సరం విద్యనభ్యసిస్తున్న వారు ఈ నెల 28 లోపు కోర్సు ఫీజు చెల్లించాలని ఆ విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ బి.వి.రాఘవులు తెలిపారు. సప్లిమెంటరీ విద్యార్థులు కోర్సు, పరీక్ష ఫీజును ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంకు డిమాండ్ డ్రాప్టు రూపంలో చెల్లించాలని సూచించారు. -
హిందీ పండిట్ పోస్టుల భర్తీ లేనట్లే!
► డీఎస్సీ నిర్వహించినా వారికి అవకాశం అనుమానమే.. ► డీఎస్సీ–2002 నోటిఫైడ్ పోస్టుల కంటే అత్యధికంగా భర్తీలు ► తాజాగా 83 మందికి పోస్టింగ్‌లు ► గతంలో కాదన్న రాష్ట్ర అధికారులే తాజా భర్తీలకు ఆదేశించిన వైనం ► డీఎస్సీ 2002 అన్ట్రైన్డ్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వం ఇకపై డీఎస్సీలు నిర్వహించినా అందులో హిందీపండిట్ పోస్టులు ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. డీఎస్సీ–2002 ద్వారా పరీక్ష రాసిన అభ్యర్థుల్లో నోటిఫైడ్ పోస్టుల కంటే దఫదఫాలుగా అత్యధికంగా భర్తీచేయడమే దీనికి కారణం. నోటిఫైడ్ పోస్టుల కంటే అధికంగా భర్తీ చేయడం సాధ్యం కాకపోయినా డీఎస్సీ –2002 హిందీపండిట్ పోస్టుల భర్తీమాత్రం ఇందుకు విరుద్ధంగా జరిగింది. కోర్టు తీర్పుపేరిట పలువురు విద్యాశాఖ అధికారులు నోటిఫైడ్ పోస్టుల కంటే అధికంగా భర్తీ చేశారు. డీఎస్సీ–2002లో 339 హిందీపండిట్ పోస్టులను నోటిఫైడ్ చేశారు. అప్పట్లో కొన్ని రాష్ట్రేతర శిక్షణా కేంద్రాల్లో శిక్షణ పొందిన వారికి పోస్టింగ్‌లు ఇవ్వవద్దని చెప్పడంతో రాష్ట్రంలో చదివినవారికి మాత్రం పోస్టింగ్‌లు ఇచ్చారు. దీంతో ఇతర రాష్ట్రాల్లో శిక్షణ పొందిన వారు కోర్టును ఆశ్రయించగా అక్కడ వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. వీరందరికి పోస్టింగ్‌లు ఇవ్వడంతో నోటిఫైడ్పోస్టులన్నీ భర్తీ అయిపోయాయి. అటు తర్వాత మరికొందరు కోర్టును ఆశ్రయించగా వారికి కూడా కోర్టులో అనుకూలంగా తీర్పువెలువడింది. ఇలా అభ్యర్థులంతా కోర్టును ఆశ్రయించినప్పుడల్లా వారికి అనుకూలంగా తీర్పువచ్చింది. ఇటువంటి వారందరికి పోస్టింగ్‌లు ఇచ్చేందుకు అధికారులు అప్పట్లో పెద్ద ఎత్తున వసూళ్లు చేశారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఓ విధంగా చెప్పాలంటే డీఎస్సీ 2002 హిందీపండిట్ పోస్టుల భర్తీ కొందరు అధికారులకు కల్పవృక్షంగా మారిందన్న వ్యాఖ్యానాలు కూడా వినిపించాయి. ఇలా పలువురు అధికారులు డీఎస్సీ 2002లో పరీక్ష రాసిన హిందీపండిట్లలో 399 మందికి పోస్టింగ్‌లు ఇచ్చారు. దీంతో కొందరు అభ్యర్థులు రాష్ట్రాధికారులను ఆశ్రయించి నోటిఫైడ్ పోస్టుల కంటే అధికంగా ఎలా భర్తీ చేశారని, ఆ వివరాలను తెలపాలని సమాచార హక్కు చట్టం ద్వారా కోరారు. అప్పుడు స్పందించిన రాష్ట్ర అధికారులు ఇకపై డీఎస్సీ 2002 హిందీపండిట్ పోస్టులను భర్తీ చేయవద్దని ఆదేశిస్తూ ఇక మీదట జరిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అప్పటి నుంచి భర్తీలు జరపకపోగా తాజాగా శనివారం మరో 83 మందికి పోస్టింగ్‌లు ఇవ్వడం గమనార్హం. గతంలో భర్తీలు జరపవద్దన్న అధికారులే తాజా భర్తీలకు అనుమతినివ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని ఓ శాసనసభ్యుని బంధువు, ‘ముఖ్య’నేతకు సమీప బంధువునని చెప్పుకుంటున్న వ్యక్తి చక్రం తిప్పి తాజా భర్తీలు చేయించినట్లు విద్యాశాఖలోని కొందరు ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. కారణం ఏదైనప్పటికీ నోటిఫైడ్ పోస్టుల కంటే 150 వరకు అధికంగా పోస్టులు భర్తీచేయడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 83 మందికి పోస్టింగ్‌లు ఇవ్వగా, అంతస్థాయిలో హిందీపండిట్ పోస్టులు ఖాళీగా లేకపోవడంతో ఎస్జీటీ పోస్టులలో వీరిని నియమించారు. భవిష్యత్‌లో ఖాళీ అయ్యే హిందీపండిట్ పోస్టులలో ఇటువంటి వారినందరినీ బదలాయిస్తూ రావాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు హిందీపండిట్ పోస్టులు డీఎస్సీలో నోటిఫై అయ్యే అవకాశాలు ఉండవు. అన్ట్రైన్డ్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం డీఎస్సీ 2002 అన్ట్రైన్డ్ హిందీ పండిట్ అభ్యర్థుకు తీవ్ర అన్యాయం జరిగిందనే చెప్పాలి. అప్పట్లో బ్యాక్‌లాగ్‌గా ఉండిపోయిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, పోస్టుల భర్తీకి అన్ట్రైన్డ్ డీఎస్సీని నిర్వహించారు. అప్పట్లో ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో శ్రీకాకుళం మినహా, మిగిలిన అన్నజిల్లాల్లో అన్ట్రైన్డ్ హిందీపండిట్ల పోస్టింగ్‌లు ఇచ్చినా శ్రీకాకుళంలో మాత్రం భర్తీలు జరగలేదు. అన్ట్రైన్డ్ హిందీ పండిట్లకు జిల్లాలో పోస్టింగ్‌లు ఇవ్వకపోయినా మిగిలిన కేటగిరీలైన తెలుగు, ఉర్దూ, సంస్కృతం పండిట్పోస్టులతో పాటు ఎస్జీటీ అన్ట్రైన్డ్ అభ్యర్థులకు మాత్రం పోస్టింగ్‌లు ఇచ్చారు. అప్పట్లో అన్ట్రైన్డ్ అభ్యర్థుల కోసం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్లో అన్ట్రైన్డ్ హిందీ పండిట్ల కోసం సుమారు 100 పోస్టులను నోటిఫై చేశారు. అయితే వీరికి పోస్టింగ్‌లు ఇవ్వకపోవడంతో వీరు కూడా కోర్టును ఆశ్రయించారు. వీరందరికి పోస్టింగ్‌లు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ తీర్పును మాత్రం ఏ అధికారీ పట్టించుకోలేదు. ట్రైన్డ్ హిందీపండిట్లకు మాత్రం నోటిఫైడ్ పోస్టుల కంటే అధికంగా పోస్టింగ్‌లు ఇవ్వడం వెనుక కొందరు విద్యాశాఖాధికారుల అవినీతి, కొన్ని శిక్షణా కేంద్రాల యజమానుల వసూళ్ల పాత్ర ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవమెంత అన్నది అటుంచితే నోటిఫైడ్ పోస్టుల కంటే అధికంగా భర్తీలు చేయడం భవిష్యత్‌లో హిందీపండిట్ పోస్టులు భర్తీలు లేకుండా చేయడంపై పలువురు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అమెరికా వయా అమీర్‌పేట....
► సాఫ్ట్వేర్ కోర్సులకు చిరునామా ► వందలాది శిక్షణ సంస్థలు ► స్వల్ప ఫీజులతోనే మంచి కోర్సులు ► యువతరం చూపు...ఇటు వైపు అమెరికా... సాఫ్ట్వేర్ ఉద్యోగుల కలల ప్రపంచం. అందమైన భవిష్యత్తును అందించే అద్భుత లోకం. ఆ కలలను సాకారం చేసుకోవాలనుకున్న వారు ముందుగా అమీర్‌పేటలో అడుగు పెట్టాల్సిందే. అవును... అమెరికాకు దగ్గర దారి అమీర్‌పేట అంటే అతిశయోక్తి కాదు. అప్పుడే కళాశాల నుంచి బయటకు వచ్చిన వారితో పాటు ఉద్యోగాన్వేషణలో ఉన్న వారు సైతం ఇక్కడ తమ సాంకేతిక ప్రతిభకు మెరుగులు దిద్దుకొని... విమానం ఎక్కుతున్నారు. సాఫ్ట్వేర్ కోర్సులకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఈ ప్రాంతం... అభ్యర్థులకు శిక్షణ అందించడమే కాదు... పరోక్షంగా వందలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. సనత్ నగర్: అమీర్‌పేట... గేట్ వే ఆఫ్ అమెరికా. అవును... ఏ మారుమూల గ్రామం నుంచైనా... ఎవరైనా ‘సాఫ్ట్’గా అమెరికా వెళ్లారంటే వయా అమీర్‌పేటే. ఇక్కడ ‘శిక్షణ’కు పునాది వేసుకుంటేనే అమెరికా ప్రయాణం ఖాయమైనట్టు. సాంకేతికత కొత్త అడుగులు వేస్తే... సంబంధిత కోర్సులు మొదటిగా అమీర్‌పేటలోనే ప్రత్యక్షమవుతాయి. ఇక్కడ లభించే కోర్సులు సెంచరీ దాటేశాయి. ప్రస్తుతం డిమాండ్ ఉన్న కోర్సును అందిపుచ్చుకునే లోపే... మరో కోర్సు సాఫ్ట్వేర్ యువతకు పరిచయం అవుతోంది. జావా, సీ ప్లస్, సీ ప్లస్ ప్లస్, క్లౌడ్ ఫర్ కస్టమర్, హనా డెవలప్మెంట్, యూఐ5-ఫ్లోరి, వెబ్ ప్రో అబాప్, సీఆర్ఎం టెక్, వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్, మొబిలిటీ (ఆప్స్ డెవలప్మెంట్), షేర్ పాయింట్ టెక్నాలజీ, ఫోన్ గ్యాప్ శాప్ (సింపుల్ ఫైనాన్స్) ... ఇలా ఎప్పటికప్పుడు సరికొత్త సాఫ్ట్వేర్ కోర్సులతో పాటు హార్డ్‌వేర్ అండ్ నెట్వర్కింగ్ కోర్సుల శిక్షణకు అమీర్‌పేట్ పెట్టింది పేరు. ఈ కోర్సులు ఇన్ఫ్రా, మొబైల్, సైబర్ సెక్యూరిటీ, మొబైల్ ట్రాకింగ్, జీఐఎస్ వంటి విభిన్న రంగాల వైపు యువతను అడుగులు వేయిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే యువతను సానబెడుతూ సాఫ్ట్వేర్ దిగ్గజాలను తయారు చేసే కేంద్రంగా అమీర్‌పేట్ భాసిల్లుతోంది. రెండున్నర దశాబ్దాల క్రితమే ‘సాఫ్ట్’కు దారులు... అమీర్‌పేట్ కేంద్రంగా రెండున్నర దశాబ్దాల క్రితమే సాఫ్ట్‌వేర్‌కు దారులు తెరుచుకున్నాయి. ఆ సమయంలో ఇంజినీరింగ్ పూర్తి చేసుకుని వచ్చే విద్యార్థుల పరిజ్ఞానం సాఫ్ట్వేర్ కంపెనీలకు ఏమాత్రం సరిపోయేది కాదు. ఇలాంటి వారికి శిక్షణ కేంద్రాలు బాసటగా నిలిచాయి. 1999-2000 మధ్య ఇక్కడ కేవలం నాలుగైదు శిక్షణ కేంద్రాలు మాత్రమే ఉండేవి. ఆ సమయంలోనే సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) మైత్రీవనంలోకివచ్చింది. ఎస్టీపీఐ చెంతనే ఉండడంతో అనుమతులు... ఇతర కార్యకలాపాలకు అనువుగా ఉంటుందన్న భావనతో ఈ ప్రాంతం సాఫ్ట్వేర్ శిక్షణ సంస్థలకు నెలవైంది. ప్రస్తుతం ఇక్కడ 400కు పైగా సంస్థలు సాఫ్ట్వేర్ కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నాయి. అందరి చూపు అమీర్‌పేట వైపే... తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 700 ఇంజినీరింగ్కళాశాలల విద్యార్థులతో పాటు బెంగళూరు, చెన్నై, కోల్కత్తా, ముంబయి నగరాల నుంచి సైతం సాఫ్ట్వేర్ శిక్షణకు అమీర్‌పేట వస్తుంటారు. వీటితో పాటు ఇంజినీరింగ్ చివరి సెమిస్టర్లో ప్రాజెక్టు శిక్షణకూ విద్యార్థులు ఇక్కడికి వస్తుంటారు. దాదాపు లక్షకు పైగా విద్యార్థులు ఈ కేంద్రాల్లో వివిధ కోర్సులు, ప్రాజెక్టులకు సంబంధించి శిక్షణ పొందుతున్నారు. మిగతా నగరాల్లో ఎన్నో శిక్షణ సంస్థలు ఉన్నప్పటికీ... అక్కడి ఫీజులో 10 శాతం మాత్రమే ఇక్కడ ఉండడంతో విద్యార్థులు ఇటువైపుక్యూ కడుతున్నారు. ఉదాహరణకు వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ కోర్సుకు బెంగళూరులో రూ.40వేలు ఫీజు ఉంటే అమీర్‌పేట్‌లో రూ.నాలుగు వేలకే లభిస్తోంది. తక్కువ ఫీజు ఉంది కదా... క్వాలిటీ ఎలా ఉంటుందోనని భయపడనక్కర్లేదు. నాణ్యతా ప్రమాణాలలోనూ ఇక్కడి సంస్థలు పోటీ పడుతుంటాయి. ఈ క్రమంలోనే శిక్షణతో పాటు ప్లేస్మెంట్స్కూ ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో పాటు హాస్టళ్లు, భోజన వసతికి కొదువ లేకపోవడంతో ఇతర రాష్ట్రాల వారు సైతం సాఫ్ట్వేర్ కోర్సులు అనగానే అమీర్పేటకే మొగ్గు చూపుతారు. విడిభాగాలకు కేరాఫ్... ఆదిత్య ట్రేడ్ సెంటర్ మదర్ బోర్డు, ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ (ర్యామ్), ఎస్‌ఎంపీఎస్, హార్డ్‌డిస్క్... ఇలా కంప్యూటర్‌కు సంబంధించిన సకల విడి పరికరాలకు ఆదిత్య ట్రేడ్ సెంటర్ కేంద్ర బిందువైంది. చిన్న చిన్న చిప్‌ల నుంచి సీపీయూ, మానిటర్, యూపీఎస్, ప్రింటర్, స్కానర్, డీటీఎస్ స్పీకర్స్ వరకు... ఏది కావాలన్నా ఇక్కడికి రావాల్సిందే. కొత్త వాటిని ఇంటికి ఆహ్వానించాలన్నా... పాత వాటిని వదిలించుకోవాలన్నా (అమ్మాలన్నా) ఇదే అడ్డా. ఇక ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ మొరాయించినా ఆదిత్య ట్రేడ్ సెంటర్ బాట పట్టాల్సిందే. నాణ్యమైన సేవలు యువతను ఇటువైపు నడిపిస్తుంటాయి. ఎందరికో ఉపాధి ఒక్కసారి అమీర్‌పేట మైత్రీవనం-సత్యం టాకీస్ మార్గాన్ని పరిశీలిస్తే ఆ రహదారితో పాటు అక్కడి భవనాలు దాదాపుగా హోర్డింగ్‌లు, బ్యానర్లతో నిండి ఉంటాయి. శిక్షణ సంస్థలు ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండడంతో ఎందరో ఉపాధి పొందుతున్నారు. వెయ్యి కరపత్రాలు పంచితే... రూ.100 వస్తాయి. ఒక్కొక్కరు రోజుకు 5 నుంచి 10 వేల వరకు కరపత్రాలు పంపిణీ చేస్తూ రూ.500 నుంచి రూ.1000 వరకు సంపాదించుకుంటున్నారు. దాదాపు 500 మందికి కరపత్రాలే ఉపాధినిస్తున్నాయి. ఒక్కో బ్యానర్ కడితే రూ.10 నుంచి రూ.20 చెల్లిస్తారు. దీంతో బ్యానర్ల ద్వారా కూడా చాలామందికి ఉపాధి లభిస్తోంది. ఇక్కడికి వచ్చే యువతను నమ్ముకుని టీ స్టాళ్లు, చాట్‌బండార్, టిఫిన్ సెంటర్లు, పాస్ట్‌ఫుడ్ సెంటర్ల వ్యాపారులు సునాయాసంగా బతుకు బండిని నడిపించేస్తున్నారు. ఇక వీరిని నమ్ముకున్న ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెంట్ల వ్యాపారమైతే మూడు పువ్వులు... ఆరు కాయలే. చెంతనే పాస్‌పోర్టు సేవా కేంద్రం... ట్రావెల్ ఏజెన్సీలు అమెరికా కలలలో బతికే సాఫ్ట్వేర్ యువత కోసమే అన్నట్లుగా పాస్‌పోర్టు సేవా కేంద్రంతో పాటు ఎయిర్ టికెట్ల కోసం ట్రావెల్ ఏజెన్సీలు అమీర్‌పేటలో వెలిశాయి. ఊరు నుంచి అమీర్‌పేట్.... ఇక్కడి నుంచి ఎంచక్కా విదేశాలకు చేరవేసేందుకు వివిధ సంస్థలు యువత కోసం తరచూ ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటిస్తుంటాయి. అందుబాటులో కొత్త కోర్సులు నేను 2000వ సంవత్సరంలో నగరానికి వచ్చాను. అప్పుడు కేవలం నాలుగు సాఫ్ట్వేర్ శిక్షణ కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు 400 దాటిపోయాయి. ఎప్పటికప్పుడు టెక్నాలజీ మారుతున్న కొద్దీ కొత్త కోర్సులు పుట్టుకురావడం సహజమే. మా సంస్థలోనే దాదాపు వందకు పైగా కోర్సులు సాఫ్ట్వేర్ యువతకు అందిస్తున్నాం. థియరీతో పాటు వారి కోసం ప్రాక్టికల్ చేయించేందుకు ల్యాబ్‌లు అందుబాటులో ఉంటాయి. మిగతా నగరాలతో పోలిస్తే ఇక్కడ తక్కువ ఖర్చుతోనే డిమాండ్ ఉన్న కోర్సులు లభిస్తాయి. -కోటి, పీర్స్ టెక్నాలజీ ఆపరేషన్ హెడ్, మైత్రీవనం జాబ్ గ్యారెంటీ ఇక్కడ శిక్షణ పొందితే జాబ్ గ్యారెంటీ అన్న నమ్మకం ఉంటుంది. మహబూబ్ నగర్ నుంచి వెబ్ డిజైనింగ్‌లో శిక్షణకు వచ్చాను. తక్కువ ఫీజుతోనే శిక్షణ ఇచ్చే సంస్థలు ఇక్కడ ఉండడంతో పేద కుటుంబీకులు సైతం ఉన్నత కోర్సులను ఇక్కడ చేయగలుగుతున్నారు. నాలాంటి వారికి అమీర్‌పేట్ ప్రాంతం ఒక వరం లాంటిదే. - శిరీష, వెబ్ డిజైనింగ్ విద్యార్థిని ఇక్కడ ఫీజులు తక్కువ జేఎన్టీయూలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ కోర్సులో చేరేందుకు ఇక్కడికి వచ్చాను. డిమాండ్ ఉన్న సాఫ్ట్వేర్ కోర్సుల్లో శిక్షణ ఇస్తారని తెలిసి అమీర్‌పేట్ వచ్చాను. నెట్లో అన్వేషిస్తే... బెంగళూరు, ముంబయిలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఫీజు, కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువగా అనిపించింది. అందుకే ఇక్కడ శిక్షణకు ఆసక్తి కనబరిచాను. -హసన్ డెరినోజ్, టర్కీ దేశస్తుడు -
వచ్చేవారంలో ఎంసెట్ నోటిఫికేషన్
‘సెట్’లకు కన్వీనర్ల నియూమకం సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘ఎంసెట్’కు వచ్చే వారంలోనే నోటిఫికేషన్ జారీ చేసే అవకాశముంది. ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) తేదీల ఖరారు ఆలస్యమయిన నేపథ్యంలో.. వాటి నోటిఫికేషన్ల జారీని వేగవంతం చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సెట్)ల నిర్వహణకు కన్వీనర్లను నియమించింది. వివిధ ప్రవేశ పరీక్షలను నిర్వహించాల్సిన వర్సిటీలను ఉన్నత విద్యా మండలి ఇంతకుముందే ఖరారు చేసింది. వాటి నిర్వహణ బాధ్యతలను ఎవరికి అప్పగించాలనేదానిపై ప్రతి వర్సిటీ నుంచి ముగ్గురి పేర్లను సూచించాలని మండలి ఆదేశించింది. ఈ మేరకు ఆయా వర్సిటీల నుంచి అందిన జాబితాలో నుంచి ‘సెట్’లకు కన్వీనర్లను ఎంపిక చేసింది. మండలి చైర్మన్ ప్రాఫెసర్ పాపిరెడ్డి బుధవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో సమావేశమై కన్వీనర్ల నియామకంపై చర్చించారు. అనంతరం సీఎం కేసీఆర్‌తోనూ భేటీ అయ్యారు. ఆ తర్వాత కన్వీనర్ల పేర్లను ప్రకటించారు. ఈ మేరకు బుధవారమే వారికి ఉత్తర్వులను కూడా అందజేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా, విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు చేపడతామని ఎంసెట్ కన్వీనర్‌గా ఎంపికైన జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ ఎన్వీ రమణారావు తెలిపా రు. ఎంసెట్ కమిటీని ఏర్పాటు చేసి, పక్కా ప్రణాళికతో నోటిఫికేషన్ జారీ చేస్తామని... వీలైతే వచ్చే వారంలోనే ఎంసెట్ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని వెల్లడించారు. అయితే ‘ఎంసెట్’కు కన్వీనర్‌గా ఎన్వీ రమణారావు నియామకం కావడం ఇది ఆరోసారి. గత ఐదేళ్లలో పకడ్బందీగా ఎంసెట్‌ను నిర్వహించిన నేపథ్యంలో.. ఈ సారి కూడా ఆయనకే బాధ్యతలు అప్పగించారు. -
ఎస్వీయూ రీసెట్ ఇప్పట్లో లేనట్టే !
నోటిఫికేషన్ విడుదలలో జాప్యం ఆసక్తి చూపని అధికారులు యూనివర్సిటీ క్యాంపస్: ఎస్వీ యూనివర్సిటీ లో ఎంఫిల్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశానికి నియామక ప్రక్రియ (రీసెట్) అటకెక్కింది. ఏడాది కాలంగా అదిగో, ఇదిగో అంటూ అధికారులు కప్పదాట్లు వేస్తున్నారు. చివరిసారిగా గత ఏడాది జూన్‌లో ప్రవేశ ప్రకటన వెలువడింది. డిసెంబర్లో అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించారు. అయితే ఆ నోటిఫికేషన్లో ఎక్కువ ఖాళీలను నింపలేదు. ఒక్కో అధ్యాపకుడి వద్ద ఒక ఫుల్‌టైం, ఒక పార్ట్‌టైం పీహెచ్డీ పరిశోధకులను మాత్రమే చేర్చుకున్నారు. దీంతో ప్రవేశ పరీక్షలు రాసిన వేలాది మందికి నిరాశ ఎదురైంది. ఇకపై ప్రతి ఏటా నోటిఫికేషన్ ఇస్తాం, పీజీ కోర్సులాగా అడ్మిషన్లు నిర్వహిస్తామంటూ అధికారులు చేసిన ప్రకటనలు నీటి మీద రాతల్లా మారాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఎంఫిల్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ ఇవ్వలేదు. పీజీ ప్రవేశాలు పూర్తవ్వగానే నోటిఫికేషన్ ఇస్తామంటూ అధికారులు ప్రకటించారు. ఆ ప్రక్రియ ఇంతవరకు మొదలు కాలేదు. నోటిఫికేషన్ విడుదల కోసం నాలుగైదు సార్లు సమావేశాలు నిర్వహించారు. అయి నా ఫలితం లేదు. ఈ ప్రక్రియ ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు. ఆది నుంచీ నిర్లక్ష్యమే ఎంఫిల్, పీహెచ్డీ ప్రవేశాల విషయంలో ఆది నుంచీ అలక్ష్యమే జరుగుతోంది. గత నోటిఫికేషన్ పూర్వపరాలు పరిశీలిస్తే.. 2005లో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏడాది తర్వాత 2006లో అడ్మిషన్లు చేశారు. అలాగే 2007 ఏప్రిల్‌లో నోటిఫికేషన్ ఇచ్చి 2008 మేలో అడ్మిషన్లు జరిపారు. 2009 జూన్‌లో నోటిఫికేషన్ విడుదల చేసి 2010 మేలో అడ్మిషన్లు జరిపారు. ఆ తర్వాత దాదాపు నాలుగేళ్లు నోటిఫికేషన్ విడుదల చేయలేదు. గత ఏడాది మేలో నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్, జనవరిలో అడ్మిషన్లు ప్రక్రియ ఇచ్చారు. నిబంధనల ప్రకారం కనీసం రెండేళ్లకొకసారి నోటిఫికేషన్ ఇచ్చి సకాలంలో అడ్మిషన్లు జరపాలి. ఐఐటీలో కేంద్రియ విశ్వవిద్యాలయాలు ప్రతి ఏటా పీజీ ప్రవేశ ప్రకటనతో పాటు ఎంఫిల్, పీహెచ్డీ ప్రకటన విడుదల చేసి, పీజీ కోర్సులతో పాటే అడ్మిషన్లు నిర్వహిస్తారు. ఎస్వీయూలో కూడా ఇదే విధానాన్ని పాటిస్తామని అధికారులు చాలా సందర్భాల్లో ప్రకటించినా అమలులో మాత్రం చిత్తశుద్ధి చూపలేదు ఖాళీల సేకరణ ఈ ఏడాది ఎంఫిల్, పీహెచ్డీ ప్రవేశ ప్రకటన విడుదల చేయడం కోసం ఎస్వీయూ అధికారులు అధ్యాపకుల నుంచి ఖాళీల వివరాలు సేకరించారు. ఇది జరిగి మూడు నెలలు పూర్తయింది. యూజీసీ నిబంధనల ప్రకారం ప్రొఫెసర్ కింద ఆరుగురు, అసోసియేట్ కింద నలుగురు, అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద ముగ్గురిని పీహెచ్డీ కోర్సులో చేర్చుకోవచ్చు. 2010 తర్వాత పూర్తిస్థాయి అడ్మిషన్లు జరగనందువల్ల చాలా ఖాళీలు ఉన్నాయి. వచ్చే ఏడాది 33 మంది ఉద్యోగ విరమణ ఎస్వీ యూనివర్సిటీలో వచ్చే ఏడాది 33 మంది అధ్యాపకులు ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ ఏడాది జూన్ నుంచి పాతిక మంది ఉద్యోగ విరమణ చేశారు. నోటిఫికేషన్ ఆలస్యమైతే వచ్చే ఏడాది ఉద్యోగ విరమణ చేసే అధ్యాపకులు తమ వద్ద పరిశోధక విద్యార్థులను చేర్చుకునే అవకాశం కోల్పోతారు. ఈసారి ఎంఫిల్ ఉండదు రానున్న రీసెట్ నోటిఫికేషన్లో ఎంఫిల్ కోర్సును ఎత్తివేసే ఆలోచనలో అధికారులు ఉన్నారు. డిగ్రీ అధ్యాపక పోస్టుల కోసం అభ్యర్థులకు నెట్, సెట్ లేదా పీహెచ్డీ అర్హతలున్నాయి. గతంలో ఎంఫిల్ డిగ్రీ ఉన్నవారికి డిగ్రీ అధ్యాపక పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. దీనిని తొలగించారు. దీంతో ఎంఫిల్ డిగ్రీ ఉన్నా అభ్యర్థులకు కలిగే ప్రయోజనం లేదు. దీంతో ఈ కోర్సును రద్దు చేసే పనిలో అధికారుల పడ్డారు. నోటిఫికేషన్ ఇప్పుడు లేనట్టే.. ఎస్వీయూ అడ్మిషన్ల విభాగం డెరైక్టర్‌గా పి.భాస్కర్‌రెడ్డి, జాయింట్ డెరైక్టర్‌గా మునిరత్నం, డెప్యూటీ డెరైక్టర్‌గా పీసీ వెంకటేశ్వర్లు పనిచేస్తున్నారు. వీరి పదవీకాలం ఫిబ్రవరి మొదటి వారంలో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి మొదటి వారంలోపు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తిచేయడం కష్టమన్న నిర్ణయానికి అధికారులు వచ్చారు. అందువల్ల నోటిఫికేషన్ విడుదలపై మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఫిబ్రవరి తర్వాత వచ్చే అధికారులు చూసుకుంటారు.. తామెందుకు రిస్క్ తీసుకోవాలన్న ఆలోచనలో ప్రస్తుత అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. దీనివల్లే నోటిఫికేషన్ విడుదలలో ఆలస్యం జరుగుతోందన్న ప్రచారం సాగుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కొత్త అధికారులు బాధ్యతలు స్వీకరిస్తే వెంటనే పీజీ ప్రవేశ ప్రక్రియ మొదలు పెట్టాల్సి ఉంటుంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే వచ్చే జూన్ వరకు నోటిఫికేషన్ విడుదల కాకపోవచ్చు. ఇంకా ఆలస్యమైనా కావచ్చని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. -
ఏఏఈవో పోస్టుల్లో ‘వెయిటేజీ’
వ్యవసాయ కోర్సుల్లో పాసైనప్పటి నుంచి ఏడాదికో మార్కు కేటాయింపు మొత్తం పోస్టులో డిప్లొమా వారికి 80 శాతం సాక్షి, హైదరాబాద్: సహాయ వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఏఈవో) ఉద్యోగాల్లో అభ్యర్థులకు కోర్సుల్లో ఉత్తీర్ణత పొందిన సంవత్సరం ఆధారంగా వెయిటేజీ ఇవ్వనున్నారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు నిర్దేశిత వ్యవసాయ, ఉద్యాన కోర్సులో ఉత్తీర్ణత సాధించినప్పటి నుంచి ఇప్పటివరకు ఏడాదికి ఒక మార్కు చొప్పున వెయిటేజీ ఇవ్వాలని ‘నియామకపు కమిటీ’ నిర్ణయించింది. ఉదాహరణకు అభ్యర్థి సంబంధిత కోర్సులో 2010లో ఉత్తీర్ణత సాధిస్తే.. ఇప్పటివరకు నాలుగేళ్లుగా పరిగణించి ఏడాదికి ఒక మార్కు చొప్పున నాలుగు మార్కులు వెయిటేజీగా ఇస్తారు. ఈ పోస్టులన్నింటినీ జిల్లా స్థాయిలో మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తుండడంతో.. ఆ మెరిట్‌కు ఈ వెయిటేజీని కలిపి లెక్కించి నియామకాలు చేపడతారు. ఏఏఈవో పోస్టుల భర్తీ అంశంపై ‘ఏఏఈవో నియామకపు కమిటీ’ శనివారం సమావేశమైంది. ‘వెయిటేజీ’తో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముందుగా పేర్కొన్నట్లు ఏఏఈవో ఉద్యోగాలకు వ్యవసాయ, ఉద్యాన కోర్సుల్లో డిప్లొమా చేసిన అభ్యర్థులు మాత్రమే అర్హులు. కానీ తమకూ అవకాశం కల్పించాలని ఆయా విభాగాల్లో డిగ్రీ, పీజీ కోర్సులు చేసిన అభ్యర్థులు చేసుకున్న విన్నపంతో పాటు పలువురు అభ్యర్థుల నుంచి వచ్చిన సూచనలు, సలహాలను కమిటీ పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు ప్రకటించింది. 80 శాతం ఉద్యోగాలు డిప్లొమా వారికే: నియామకపు కమిటీ తీసుకున్న నిర్ణయాల ప్రకారం... మొత్తం 4,442 ఏఏఈవో పోస్టుల్లో 80 శాతం వ్యవసాయ, ఉద్యాన కోర్సుల్లో డిప్లొమా చేసిన అభ్యర్థులకు కేటాయిస్తారు. మిగతా 20 శాతం పోస్టులను బీఎస్సీ, ఎంఎస్సీ పూర్తిచేసిన వారికి కేటాయిస్తారు. ఈ మొత్తం పోస్టుల్లో 20 శాతం (888) పోస్టులను ఉద్యాన శాఖకు కేటాయించాలని నిర్ణయించారు. -
కోర్సులేకున్నా పోస్టింగులు
జిల్లాలో కీలక నేత సిఫార్సే అర్హత ఏయూ పెద్దల నిర్వాకం ఇదీ దూరవిద్యావిభాగంలో అస్మదీయులకు అందలం సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: వడ్డించేవాడు మనవాడైతే చివరిపంక్తిలో కూర్చున్నా పర్వాలేదన్నట్లుగా ఉంది ఏయూలో పోస్టిం గుల తీరు. పెద్దలు మనవాళ్తై కోర్సులు లేకపోయినా పోస్టులు మాత్రం కట్టబెట్టేస్తున్నారు. మంత్రివర్యుల సిఫార్సు... ఏయూ పెద్దల సపోర్టు ఉంటే ఇంకేం... పోస్టుల భర్తీ అన్నది పూర్తి ఫార్సుగా తయారైపోతోంది. ఏయూ దూరవిద్యా విభాగం కేంద్రంగా అస్మదీయులకు యథేచ్ఛగా పోస్టుల పందేరం సాగుతున్న తీరు ఇదిగో ఇలా ఉంది...జిల్లాలో చక్రం తిప్పుతున్న ఓ ప్రభుత్వ పెద్ద అనుగ్రహానికి పాత్రులు కావడమే ఏయూ పెద్దల లక్ష్యంగా మారింది. గతంలోఅడ్డగోలుగా మూడు పోస్టులు భర్తీ చేసిన వైనాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ప్రభుత్వం విచారణ జరిపించింది. అయినా వ్యవహారం మాత్రం తేలలేదు. కేవలం ఏయూ పెద్దలను తన దారికి తెచ్చుకునేందుకే సదరు పెద్ద ఈ వ్యవహారాన్ని వాడుకున్నారని తేటతెల్లమైంది. తరువాత ఆయన చెప్పిందే ఏయూలో వేదంగా మారింది. ఆ నివేదికను బూచిగా చూపి అస్మదీయులతో ఏయూను నింపేస్తున్నారు. తాజాగా ఆ ప్రభుత్వ పెద్ద తనవారికి ఏయూలో పోస్టులు ఇవ్వాలని హుకుం జారీ చేశారు. కోర్సు లేకపోయినా! ప్రభుత్వ పెద్ద సిఫార్సుతో ఏయూ పెద్దలు తర్జనభర్జన పడ్డారు. ఎందుకంటే ఆయన సిఫార్సు చేసిన అభ్యర్థి సబ్జెక్ట్ జాగ్రఫీ. ప్రస్తుతం జాగ్రఫీ విభాగంలో ఖాళీలు లేవు. దాంతో ఏయూ పెద్దలు మరో ఎత్తుగడ వేశారు. దూరవిద్యావిభాగంలో ఆయన్ని కాంట్రాక్టు విధానంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమించారు. కాకపోతే అందుకోసం వెబ్సైట్లోనోటిఫికేషన్ ఇచ్చి ఇంటర్వ్యూ నిర్వహించి కాస్త పద్దతిగానే హడావుడి చేశారు. కానీ అసలు కోర్సే లేని సబ్జెక్ట్‌కు అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను ఎందుకు నియమించారన్నది అంతుచిక్కకుండా ఉంది. ఈ నియామకంతోవిద్యార్థులకు ఉపయోగం లేదు. పైగా ఏయూకు ఆర్థిక భారం. గతంలో కూడా! జాగ్రఫీలోనేకాదు కొన్ని నెలల క్రితం సోషల్‌వర్క్ విభాగంలో కూడా కాంట్రాక్టు విధానంలో ఓ మహిళను అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను నియమించారు. ఆమె సర్వీసును రెన్యువల్ కూడా చేశారు. ఇలా కోర్సులు లేకపోయినా పోస్టింగులు కట్టబెడుతున్నవారికి ఇతరత్రా పనులకు ఉపయోగించుకుని కాలం వెళ్లదీస్తున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు పీజీ కోర్సులకు ఉపయోగించుకోవాలి. ప్రస్తుతం ఆ కోర్సులు లేవు. దాంతో వారిని అండర్గ్రాడ్యుయేట్ కోర్సులకనో మరోదానికనో ఉపయోగించుకోవాలన్నది ఏయూ పెద్దల ఉద్దేశం. ముందు ఉద్యోగం ఇచ్చేసి ... తరువాత ఏదో బాధ్యత అప్పగిస్తారు. అండర్గ్రాడ్యుయేట్ కోర్సులకు వాడుకుంటాం: రిజిస్ట్రార్ ఈ వ్యవహారంపై ఏయూ రిజిస్ట్రార్ కె.రామ్మోహన్‌రావును ‘సాక్షి’ సంప్రదించగా కోర్సులు లేకపోయినప్పటికీ అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించిన విషయాన్ని ధ్రువీకరించారు. వారిని దూర విద్యావిభాగంలో అండర్గ్రాడ్యుయేట్ కోర్సులకు సంబంధించిన పనుల్లో ఉపయోగించుకుంటామని ఆయన చెప్పారు. -
సీఎస్ ఔత్సాహికులకు సరైన సమయమిదే..
గెస్ట్ కాలమ్ కంపెనీ సెక్రటరీ.. వ్యాపార, వాణిజ్య రంగాల్లో దేశం శరవేగంగా పురోగతి సాధిస్తున్న నేపథ్యంలో చక్కటి కెరీర్‌కు అవకాశం కల్పించే కోర్సు. ప్రభుత్వ తాజా నిబంధనలు కూడా కెరీర్ పరంగా కంపెనీ సెక్రటరీలకు ఎన్నో అవకాశాలు కల్పించే విధంగా ఉన్నాయి. ఔత్సాహిక విద్యార్థులు దీన్ని అందిపుచ్చుకోవాలి. కంపెనీ సెక్రటరీ కోర్సు అంటే కామర్స్, మేనేజ్మెంట్ సంబంధితమని, ఆ నేపథ్యం ఉన్న వారికే అనుకూలమనే భావన సరికాదు. నిరంతర అధ్యయన దృక్పథం, పరిశీలనాత్మక దృష్టితో వ్యవహరిస్తే.. అన్ని అకడమిక్ నేపథ్యాల విద్యార్థులు సీఎస్ కోర్సులో రాణించగలరు అంటున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) ఆల్ ఇండియా కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆర్. శ్రీధరన్‌తో ఇంటర్వ్యూ.. ప్రొఫెషనల్స్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యం ఐసీఎస్ఐ ప్రెసిడెంట్‌గా తొలి ప్రాధాన్యం ఇచ్చే అంశం.. ఉద్యోగం లేదా ప్రాక్టీస్‌లో ఉన్నవారిని మరింత నిబద్ధతగా వ్యవహరించేలా చేయడమే. ఇక సీఎస్ విద్యార్థుల విషయానికొస్తే అకడమిక్ సామర్థ్యాలను మరింత పెంచడం మా లక్ష్యం. ఈ క్రమంలో కంపెనీస్ లా- 2013లో కంపెనీ సెక్రటరీ విధుల పరంగా పేర్కొన్న అన్ని నిబంధనలను కచ్చితంగా అమలయ్యేలా చేస్తాం. కంపెనీ సెక్రటరీ.. పెరుగుతున్న ప్రాధాన్యం కంపెనీ సెక్రటరీ ప్రొఫెషన్‌కు ప్రాధాన్యం దినదిన ప్రవర్థమానం అవుతోంది. రూ. 5 కోట్ల పెయిడ్-అప్ క్యాపిటల్ ఉన్న ప్రతి సంస్థ కంపెనీ సెక్రటరీని నియమించుకోవాలనే నిబంధన కారణంగా క్వాలిఫైడ్ కంపెనీ సెక్రటరీలకు డిమాండ్ పెరుగుతోంది. ఆయా సంస్థల్లో పూర్తిస్థాయిలో కంపెనీ సెక్రటరీ ఉద్యోగంతోపాటు, ప్రాక్టీసింగ్ కంపెనీ సెక్రటరీగా స్వయం ఉపాధికి కూడా ఎంతో అవకాశం ఉంది. కానీ ఏటా సర్టిఫికెట్లు అందుకుంటున్నవారి సంఖ్యతో పోల్చితే సీఎస్‌కు డిమాండ్ - సప్లయ్ మధ్య ఎంతో వ్యత్యాసం నెలకొంది. ఔత్సాహిక విద్యార్థులు ప్రొఫెషన్లో ప్రవేశించి చక్కటి కెరీర్ అందుకోవడానికి ఇదే సరైన సమయం. సంస్థల్లోనూ కీలక పాత్ర పోషించే సీఎస్‌లు మూడు దశల సీఎస్ కోర్సు పూర్తి చేసుకున్న క్వాలిఫైడ్ కంపెనీ సెక్రటరీలకు ఆయా సంస్థల కార్యకలాపాల్లోనూ ముఖ్య హోదాలు లభిస్తున్నాయి. ఈ క్రమంలో ఎంతో కీలకపాత్ర పోషించాల్సి ఉంటుంది. సదరు సంస్థ ప్రభుత్వ నిబంధనల ప్రకారం సెక్రటేరియల్ ప్రమాణాలు పాటించేలా చూడటం, ఆ మేరకు అవసరమైతే ఉన్నతాధికారులకు తగిన సిఫార్సులు చేయడం వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. కంపెనీ లా - 2013 ప్రకారం మొత్తం తొమ్మిది కీలక విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత కంపెనీ సెక్రటరీలదే. ఇలా.. ఒక సంస్థలో సీఈఓ, ఎండీ తర్వాత ఆ స్థాయీ ప్రాధాన్యం సీఎస్‌లకు లభిస్తుంది. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ హోదాకు చేరుకోవచ్చు. అదేవిధంగా సెక్రటేరియల్ ఆడిట్, లేబర్ ఆడిట్, లీగల్ ఆడిట్ తదితర విభాగల్లోనూ సీఎస్‌లకు అవకాశాలు లభిస్తాయి. ఇదే సమయంలో రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ ఎక్కువగా ఉండే ఉద్యోగం కంపెనీ సెక్రటరీ. ఒకవైపు సంస్థలోని ఉన్నతాధికారులకు, మరోవైపు స్టేక్ హోల్టర్లు, నియంత్రణ సంస్థలకు మధ్య వారధిగా కీలక బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. సెమినార్లు, వర్క్‌షాప్‌లతో అవగాహన వృత్తి పరంగా ఎంతో కీలకమైన కంపెనీ సెక్రటరీ కోర్సుపై విద్యార్థులకు ఆశించిన రీతిలో అవగాహన లేదనే మాట వాస్తవం. కోర్సుకు నమోదు చేసుకుంటున్న విద్యార్థుల సంఖ్య ఇటీవల కాలంలో పెరుగుతున్న ప్పటికీ ఆ సంఖ్య వాస్తవ అవసరాలకు సరితూగట్లేదు. ఈ క్రమంలో విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు సెమినార్లు నిర్వహించాలని నిర్ణయించాం. ఈ ఏడాది దేశవ్యాప్తంగా దాదాపు 400 సెమినార్లు నిర్వహించాలని నిర్దేశించుకున్నాం. అదేవిధంగా ఇప్పటికే కోర్సు పూర్తి చేసి అసోసియేట్, ఫెలో మెంబర్స్‌గా దాదాపు 35 వేల మందికిపైగా క్వాలిఫైడ్ కంపెనీ సెక్రటరీలు ఉన్నారు. వీరికి కూడా తాజా పరిస్థితులపై అవగాహన కల్పించేందుకు వర్క్‌షాప్‌లు నిర్వహించ నున్నాం. సీఏ, సీఎస్, సీఎంఏ మూడు.. వేర్వేరు ప్రాధాన్యత కలిగిన కోర్సులు చాలా మంది సీఏ, సీఎస్, సీఎంఏ కోర్సుల మధ్య పోలికలు, తేడాలు బేరీజు వేయాలని చూస్తున్నారు. కానీ ఇది సరికాదు. రెండు కోర్సులు వేర్వేరు ప్రాధాన్యతలు కలిగున్నాయి. కంపెనీ సెక్రటరీ కోర్సు పూర్తిగా సెక్రటేరియల్ ప్రాక్టీసెస్, కంపెనీ లా ఆధారంగా ఉంటుంది. చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సు ఆర్థికపరమైన అంశాలు (అకౌంటింగ్, ఆడిటింగ్) ఎక్కువగా ఉండే కోర్సు. ఉద్యోగ విధుల విషయంలోనూ రెండింటికీ వేర్వేరు ప్రాధాన్యాలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రతి సంస్థకు కంపెనీ సెక్రటరీ, చార్టర్డ్ అకౌంటెంట్ ఇద్దరూ అవసరం. అదే విధంగా కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కోర్సుకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా ఉత్పత్తి రంగ సంస్థల్లో కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ ఉత్తీర్ణులకు చక్కటి అవకాశాలున్నాయి. మొత్తంమీద ఒక సంస్థను సమర్థంగా, ప్రగతి పథంలో పయనించేలా చేయడంలో సీఏ, సీఎస్, సీఎంఏ ఉత్తీర్ణులు ముగ్గురూ ముఖ్యమే. ఆ అభిప్రాయం అపోహ మాత్రమే కంపెనీ సెక్రటరీ కోర్సు.. కేవలం కామర్స్, లా, మేనేజ్మెంట్ అకడమిక్ నేపథ్యాలు ఉన్న విద్యార్థులకే అనుకూలం అనే అభిప్రాయం అపోహ మాత్రమే. తులనాత్మక పరిశీలన, విశ్లేషణ నైపుణ్యం ఉంటే అకడమిక్ నేపథ్యంతో సంబంధం లేకుండా ఎలాంటి విద్యార్థులైనా సులువుగా రాణించగల కోర్సు కంపెనీ సెక్రటరీ. కోర్సులో చేరాక నిర్దేశిత సిలబస్‌ను క్షుణ్నంగా అధ్యయనం చేయడంతోపాటు దానికి సంబంధించిన తాజా మార్పులపై అవగాహన పొందుతూ ముందుకు సాగాలి. సరైన సమయం.. మూడు దశలు (ఫౌండేషన్, ఎగ్జిక్యూటివ్, ప్రొఫెషనల్)గా ఉండే కంపెనీ సెక్రటరీ కోర్సులో చేరడానికి సరైన సమయం అనేది విద్యార్థుల వ్యక్తిగత లక్ష్యాలు, అభిరుచులపై ఆధారపడి ఉంటుంది. ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన కోర్సుతో ఫౌండేషన్ కోర్సులో; బ్యాచిలర్స్ డిగ్రీ అర్హతతో ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లో పేరు నమోదు చేసుకోవచ్చు. ఏ దశలో చేరినా పూర్తి స్థాయిలో సమయం కేటాయించేట్లు ప్రణాళిక రూపొందించుకోవాలి. సీఎస్ కోర్సు ఔత్సాహికులకు సలహా.. సీఎస్ కోర్సు ఔత్సాహికులు, క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ కెరీర్లో గుర్తుంచుకోవాల్సిన రెండు ప్రధాన అంశాలు కఠోర శ్రమ, ఓర్పు. ఈ రెండూ ఉంటే విజయాలు వాటంతటే వరిస్తాయి. అదే విధంగా నిత్య నూతన ఆలోచన దృక్పథం కూడా ఈ రంగంలో విజయానికి ఎంతో కీలక సాధనం. దీంతోపాటు పరిస్థితులకు అనుగుణంగా తమను తాము తీర్చిదిద్దుకునే లక్షణాన్ని సొంతం చేసుకోవాలి. -
అర్హులైన బోధకులుంటేనే కౌన్సెలింగ్ అవకాశం
విద్యార్థులకు రూ.2,500 కోట్ల మేర ఆర్థిక సాయం {పమాణాలు లేని కాలేజీలకు ప్రజాధనం ఎలా వెచ్చిస్తాం? సరైన తనిఖీలు లేకుండానే అఫిలియేషన్లు ఇచ్చిన ఏఐసీటీఈ హైకోర్టుకు నివేదించిన ఏజీ రామకృష్ణారెడ్డి నిర్ణయం వాయిదా వేసిన న్యాయమూర్తి హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు వెబ్‌కౌన్సెలింగ్ నుంచి 174 కాలేజీల తొలగింపు, అఫిలియేషన్లరద్దు వ్యవహారంపై నిర్ణయం సోమవారానికి వాయిదా పడింది. ఈ మేరకు ఉభయపక్షాల వాదనలను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి శనివారం విన్నారు. జేఎన్టీయూ హైదరాబాద్ తమ కౌన్సెలింగ్ కాలేజీల జాబితా నుంచి తమను తొలగించి అఫిలియేషన్లను రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాదాపు 150కి పైగా ప్రైవేటు ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి శనివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా వాదనలు విన్నారు. జేఎన్టీయూ హైదరాబాద్ తరఫున అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి వాదించారు. అఫిలియేషన్ల రద్దును, కౌన్సిలింగ్ నుంచి కాలేజీల తొలగింపును ఆయన సమర్థించారు. సౌకర్యాలు లేనప్పుడు ప్రమాణాలు ఎలా మెరుగవుతాయని, విద్యాప్రమాణాలు లేని కాలేజీల్లో చదువుకున్నవారు ఎలా ప్రయోజకులవుతారని ఆయన ప్రశ్నించారు. ఈ విద్యాసంవత్సరం నుంచి నిబంధనలకు అనుగుణంగా బోధనా సిబ్బందిని నియమించుకుంటే, వాటికి వెబ్‌కౌన్సెలింగ్ జాబితాలో స్థానం కల్పిం చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దాదాపు 141 కాలేజీలు శుక్రవారం జేఎన్టీయూహెచ్ వైస్ చాన్సలర్‌ను సంప్రదించి, లోపాలను సరిదిద్దుకుంటున్నామంటూ అఫిడవిట్లు ఇచ్చి, కౌన్సెలింగ్‌లో స్థానం కల్పించాలని కోరాయని వివరించారు. అర్హులైన బోధనా సిబ్బంది ఉండేలా చూడడమే తమ ఉద్దేశమన్నారు. బోధనా సిబ్బంది కోసం తాము ఒత్తిడి చేస్తుంటే, కాలేజీలు ఎందుకు ఇబ్బంది పడుతున్నాయో తమకు అర్థంకావడం లేదన్నారు. ఈ ఏడాది విద్యార్థులకు రూ.2,500 కోట్ల మేర సాయంచేయనున్నామని, ఇదంతా ప్రజాధనమని, ప్రమాణాలు లేని, సౌకర్యాలు లేని కాలేజీల కోసం ఇంత ప్రజాధనాన్ని వృథా చేయలేమన్నారు. ఏఐసీటీఈ క్షేత్రస్థాయిలో కాలేజీలను సందర్శించకుండానే అఫిలియేషన్లు ఇచ్చిందని, అలాంటివాటికి ఎటువంటి విలువలేదని ఏజీ తేల్చి చెప్పారు. విశ్వవిద్యాలయాలపై ఏఐసీటీఈ పెత్తనం చెల్లదని, అది సలహా మండలి మాత్రమేనన్నారు. కాలేజీల తరఫున సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి, మరికొందరు వాదిస్తూ, లోపాలను సరిదిద్దుకునే సమయం ఇవ్వకుండా ఒకేసారి 174 కాలేజీల తలరాతను జేఎన్టీయూహెచ్ మార్చివేసిందన్నారు. తాము యూనివర్సిటీ అధికారాలను ప్రశ్నించడం లేదని, అయితే చట్టం ప్రకారం నడచుకోలేదన్నదనే తమ అభ్యంతరమన్నారు. అఫిలియేషన్ రద్దుతో రెండు, మూడేళ్ల విద్యార్థుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. వాదనలు విన్న న్యాయమూర్తి తన నిర్ణయాన్ని వాయిదా వేశారు. లోపాలు దిద్దుకుంటున్నాం.. తమ కాలేజీల్లో లోపాల సవరించుకుంటున్నట్టు వివరిస్తూ తెలంగాణలోని 170 ఇంజనీరింగ్ కాలేజీలు డెఫిషియెన్సీ కాంప్లియన్స్ రిపోర్టులను అఫిడవిట్ల రూపంలో హైదరాబాద్ జేఎన్టీయూకు అందజేసినట్టు తెలిసింది. లోపాలను సరిదిద్దుతున్నామని, అఫిలియేషన్లు ఇవ్వాలని, కౌన్సెలింగ్‌లో అవకాశం కల్పించాలని అవి కోరినట్టు తెలిసింది. 174 కాలేజీలకు యూనివర్సిటీ అఫిలియేషన్లను నిరాకరించిన సంగతి తెలిసిందే. -
సైన్స్ అభివృద్ధితోనే సమాజ పురోగతి
విద్య అంటే ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సులే కాదు... ‘ఇన్స్పైర్’ శిక్షణ సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి కేయూ క్యాంపస్ : సైన్సపై ఆసక్తి పెంచుకుని నిర్దేశిత లక్ష్యంతో భవిష్యత్‌లో రాణించేలా ముందుకు సాగాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి విద్యార్థులకు సూచించారు. సైన్స అభివృద్ధితోనే సమాజ పురోగతి కూడా సాధ్యమవుతుందని పేర్కొన్నా రు. ఇన్స్పైర్ ఇంటర్న్‌షిప్ సైన్స్ క్యాంపు శిక్షణ కాకతీయ యూనివర్సిటీ జువాలజీ విభాగం ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పరిపాలన భవనం సెనేట్ హాల్లో శిక్షణను పాపిరెడ్డి ప్రారంభించి మాట్లాడా రు. విజ్ఞానాన్ని అందిస్తూనే భవిష్యత్‌లో ఉపాధి కల్పించేందుకు విద్య ఉండాల్సిన అవసరముందన్నారు. ప్రస్తుతం ఎనిమిదో తరగతి నుంచే ఐఐటీ ఫౌండేషన్ కోర్సుల్లో శిక్షణ ఇప్పిస్తుండడంతో విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఇంజినీరింగ్ కోర్సులపై ఆసక్తి చూపిస్తుండడంతో విద్యార్థులు తప్పనిసరిగా ఆ కోర్సుల్లో చేరినా నైపుణ్యాలు లేకపోవడంతో చిరు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారని పాపిరెడ్డి తెలిపారు. టాప్ ఇంజినీరింగ్ కాలేజీల్లో చదివి కొంతమేర కష్టపడిన వారికే ఉపాధి లభిస్తోందన్నారు. ఈ మేరకు చదువంటే ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సులే కాకుండా పలు సైన్స్ కోర్సులు ఉన్నాయని గుర్తించాలని సూచించారు. ఇన్స్పైర్ శిక్షణకు వచ్చిన వారిలో ఎక్కువ మంది గ్రామీణ విద్యార్థు లు ఉన్నారని, ఐదు రోజుల శిక్షణలో వారికి సైన్స్‌పై అవగాహన పెరుగుతుందని పాపిరెడ్డి అభిప్రాయపడ్డారు. విషయ పరిజ్ఞానం ఉండడం లేదు.. విద్యార్థులకు ఇంటర్లో మార్కులు ఎక్కువగానే వస్తున్నా సబ్జెక్టుల పరంగా విషయ పరిజ్ఞానం ఉండడం లేదని భట్నాగర్ అవార్డు గ్రహీత, హైదరాబాద్‌లోని ఐఐసీటీ డిప్యూటీ డెరైక్టర్ డాక్టర్ జి.నరహరశాస్త్రి అన్నారు. ఈ మేర కు ఆసక్తి ఉన్న కోర్సుల్లోనే చేరి అందులో రాణించాలని సూచించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 68 ఏళ్లు గడిచినా పరిశోధన రంగంలో అనుకున్న మేర పురోగతి లేదని.. దీన్ని అధిగమించేందుకు దేశంలోని ప్రసిద్ధ సైంటిస్టుల జీవిత చరిత్రలు చదివి విద్యార్థులు ఉత్తేజం పొందాలని కోరారు. కేయూ ఇన్చార్జ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎంఏ. సింగరాచార్య, క్యాంపస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.రామస్వామి మాట్లాడుతూ విలువలతో కూడిన విద్య నేటి సమాజానికి అవసరమన్నారు. ఇన్స్పైర్ కోఆర్డినేటర్ ఎం.కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇంటర్ విద్యార్థుల కోసం కేయూలో ఇన్స్పైర్ నిర్వహించడం ఇది మూడోసారని తెలిపారు. ప్రస్తుతం 150మంది విద్యార్థులు పాల్గొంటుం డగా, వివిధ పరిశోధనా సంస్థల శాస్త్రవేత్తలు పాల్గొని అవగాహన కల్పిస్తారని తెలిపారు. కార్యక్రమంలో జువాలజీ విభాగాధిపతి ఎం.స్వామి, సైన్స్ డీన్ ఎ.సదానందం, డాక్టర్ వెంకయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాపిరెడ్డి, నరహరిశాస్త్రిని నిర్వాహకులు సన్మానించారు. -
విదేశీ విద్యకు దారులెన్నో..
విదేశీ విద్య.. భారత్‌లోని లక్షల మంది విద్యార్థుల స్వప్నం. ప్రధానంగా ఇంజనీరింగ్, సెన్సైస్, బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు ఔత్సాహికుల్లో ఈ ఆలోచన ఎక్కువే. అందుకే దేశవ్యాప్తంగా ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళుతున్న వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఆయా దేశాల్లోని విద్యా సంస్థలు.. మన దేశంలోని కన్సల్టెన్సీలతో ఒప్పందం ద్వారా ప్రవేశ ప్రక్రియను సులభం చేస్తూ విద్యార్థులకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. పలు దేశాల్లో సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యే ఫాల్ సెమిస్టర్‌కు దరఖాస్తు గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో.. స్టడీ అబ్రాడ్ దిశగా మన దేశ విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్న దేశాలపై ఫోకస్.. అమెరికా... హాట్ స్పాట్ విదేశీ విద్య విషయంలో మన దేశ విద్యార్థులకు హాట్ స్పాట్‌గా నిలుస్తున్న దేశం అమెరికా. గత మూడేళ్లుగా అమెరికాకు వెళుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య కాస్త తగ్గింది. అయినా ఇతర దేశాలతో పోల్చితే అత్యధికుల గమ్యస్థానం నేటికీ అమెరికానే. అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లో చైనా తర్వాత భారతీయ విద్యార్థులే అధికం. 2012-13 విద్యా సంవత్సరంలో అమెరికాలో మొత్తం 8 లక్షల మంది విదేశీ విద్యార్థులుంటే.. వారిలో లక్ష మంది వరకు మన దేశ విద్యార్థులే ఉండటం విశేషం. ప్రధానంగా బిజినెస్ మేనేజ్మెంట్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్ కోర్సులకు సంబంధించి భారతీయ విద్యార్థులను ఆకట్టుకోవడంలో అమెరికా ముందంజలో ఉంది. ఆ దేశ బోధన విధానం.. ఆర్థిక ప్రోత్సాహకాలు.. అమెరికా పట్ల మన విద్యార్థులు ఆకర్షితులవ్వడానికి ప్రధాన కారణం. దాంతోపాటు అమెరికాలో విద్యతో భవిష్యత్ బంగారం అవుతుందనే అనే ఆలోచన కూడా ఇందుకు దోహదం చేస్తోంది. అమెరికాలో ప్రముఖ యూనివర్సిటీలు హార్వర్డ్ యూనివర్సిటీ మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రిన్స్టన్ యూనివర్సిటీ పెన్సిల్వేనియా యూనివర్సిటీ యేల్ యూనివర్సిటీ మిచిగాన్ యూనివర్సిటీ కొలంబియా యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ చికాగో కార్నెగీ మిలన్ యూనివర్సిటీ ప్రవేశం: ఔత్సాహిక విద్యార్థులు ఆయా ఇన్స్టిట్యూట్లకు నేరుగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతోపాటు నిర్దేశిత పత్రాలు(విద్యార్హతల సర్టిఫికెట్లు; ఫీజు, నివాస వ్యయానికి సరిపడే విధంగా ఆర్థిక వనరుల రుజువు పత్రాలు, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, రికమండేషన్ లెటర్స్, ప్రవేశపరీక్షల స్కోర్లు తదితర) అందించాలి. వీటి ఆధారంగా.. ఆయా ఇన్స్టిట్యూట్లు ఆఫర్ లెటర్ అందిస్తాయి. దీన్నే ఐ-20 ఫామ్‌గా పిలుస్తారు. దీని ఆధారంగా స్టూడెంట్ వీసాకు దరఖాస్తు చేయాలి. అమెరికా వీసా ప్రక్రియ కాస్త క్లిష్టంగా ఉంటుంది. కాబట్టి విద్యార్థులు తాము చేరదలచుకున్న కోర్సు, ఇన్స్టిట్యూట్ విషయంలో అడ్మిషన్ సెషన్ ప్రారంభానికి కనీసం ఏడాది లేదా ఏడాదిన్నర ముందు నుంచే కసరత్తు మొదలుపెట్టాలి. అకడమిక్ సెషన్ ప్రారంభం: ప్రతి ఏటా రెండుసార్లు (జనవరి, సెప్టెంబర్) పూర్తి వివరాలకు: www.educationusa.state.gov ఆస్ట్రేలియా... మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్‌సకు పెట్టింది పేరు మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ కోర్సుల బోధనలో పేరుగాంచిన దేశంగా ఆస్ట్రేలియా నిలుస్తోంది. స్టూడెంట్ వీసా నిబంధనలను సరళీకృతం చేయడం.. కొత్తగా పోస్ట్ స్టడీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ పేరిట కోర్సు పూర్తయ్యాక ఆస్ట్రేలియాలోనే రెండేళ్లు ఉద్యోగం చేసే అవకాశం కల్పిస్తోంది. అదేవిధంగా అభ్యర్థులు చూపించాల్సిన ఆర్థిక వనరుల మొత్తాన్ని కూడా కొంత తగ్గిస్తూ తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించడం.. భారతీయ విద్యార్థులు ఆస్ట్రేలియావైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం. ప్రపంచ ర్యాంకింగ్స్ జాబితాలో టాప్-100లో నిలిచిన పలు ప్రముఖ యూనివర్సిటీలు ఆస్ట్రేలియాలో ఉన్నాయి. అకడమిక్ సెషన్ ప్రారంభం: ఫిబ్రవరి, జూలై పేరున్న యూనివర్సిటీలు ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్ యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ అడిలైడ్ యూనివర్సిటీ మొనాష్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్లాండ్ యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్‌వేల్స్ యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా పూర్తి వివరాలకు: www.immi.gov.au సింగపూర్... అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు కేవలం మూడు ప్రభుత్వ ఇన్స్టిట్యూట్లే ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన దేశం సింగపూర్. ముఖ్యంగా ఈ దేశం మేనేజ్మెంట్ కోర్సుల విషయంలో ఖ్యాతి పొందింది. సింగపూర్ ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటైన సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్.. అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చైనాలోని ఝెజియాంగ్ యూనివర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఇక్కడ చేరిన విద్యార్థులకు యు.ఎస్., చైనా సర్టిఫికెట్లు పొందే సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చింది. కోర్సు పూర్తయ్యాక ఒక ఏడాది పని చేసే అవకాశం కల్పించడం, కోర్సు సమయంలో వారానికి 16 గంటలు పార్ట్‌టైం జాబ్ చేసుకునే సదుపాయం వంటివి మన విద్యార్థులను సింగపూర్‌వైపు దృష్టి సారించేలా చేస్తున్నాయి. అకడమిక్ సెషన్ ప్రారంభం: మార్చి, జూలై బెస్ట్ ఇన్స్టిట్యూట్స్: నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్; నాన్యాంగ్ టెక్నలా జికల్ యూనివర్సిటీ. పూర్తి వివరాలకు: ww.singaporeedu.gov.sg జర్మనీ... నామమాత్రపు ఫీజులే! సైన్స్, ఇంజనీరింగ్, రీసెర్చ్ కోర్సులకు కేరాఫ్‌గా నిలుస్తున్న దేశం జర్మనీ. అయితే ఇంగ్లిష్ మాధ్యమంలో బోధించని ఇన్స్టిట్యూట్లలో చేరాలంటే.. దరఖాస్తు సమయంలోనే జర్మన్ భాషలో నైపుణ్యం ఉన్నట్లు తెలియజేయాలి. ఇందుకోసం అన్ని దేశాల్లోని జర్మనీ ఎంబసీ కార్యాలయాల్లో ప్రత్యేక విభాగాలు ఉన్నాయి. జర్మనీలో విద్యాభ్యాసం దిశగా మరో ఆకర్షణీయ అంశం.. స్వల్ప ఫీజులు. జర్మనీ ప్రభుత్వ విధానాల ప్రకారం- చాలా యూనివర్సిటీలు ఫీజులు లేకుండానే లేదా సెమిస్టర్‌కు 500 యూరోల నామమాత్రపు ఫీజుతో ప్రవేశం కల్పిస్తున్నాయి. ఎలాంటి ఫీజు వసూలు చేయని ఇన్స్టిట్యూట్లలో చేరిన విద్యార్థులు సెమిస్టర్ కంట్రిబ్యూషన్ పేరుతో ప్రతి సెమిస్టర్‌కు 50 యూరోల నుంచి 250 యూరోల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇవేకాకుండా ఎలాంటి కాలపరిమితి లేకుండా వర్క్ వీసా సదుపాయం అందుబాటులో ఉండటం.. కోర్సు పూర్తయ్యాక కూడా 18 నెలలపాటు జర్మనీలో ఉండి ఉద్యోగాన్వేషణ సాగించేందుకు అవకాశం కల్పించడం జర్మనీలో విదేశీ విద్య ప్రత్యేకతలు. అకడమిక్ సెషన్ ప్రారంభం: ఏప్రిల్, అక్టోబర్ పేరున్న ఇన్స్టిట్యూట్స్ హంబోల్ట్ యూనివర్సిటీ ఫ్రీ యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్ టెక్నికల్ యూనివర్సిటీ మ్యూనిచ్ జార్జ్ అగస్ట్ యూనివర్సిటీ ఎబర్‌హార్డ్ కార్ల్స్ యూనివర్సిటీ టెక్నికల్ యూనివర్సిటీ బెర్లిన్ లీప్జిగ్ యూనివర్సిటీ జెనా యూనివర్సిటీ బ్రెమెన్ యూనివర్సిటీ రెగెన్స్‌బర్గ్ యూనివర్సిటీ పూర్తి వివరాలకు: www.studyin.de/en యూకే ప్రతిష్టాత్మక వర్సిటీలకు నెలవు ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ వంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీలకు నెలవు యునెటైడ్ కింగ్డమ్. అమెరికా తర్వాత భారతీయ విద్యార్థులను విదేశీ విద్య కోసం విశేషంగా ఆకర్షిస్తున్న దేశం ఇది. విద్యార్థుల నమోదు సంఖ్య, క్రేజీ కోర్సుల పరంగానూ అమెరికా తర్వాత స్థానం యూకే యూనివర్సిటీలదే. బిజినెస్ మేనేజ్మెంట్, ఇంజనీరింగ్, హ్యుమానిటీస్ కోర్సులకు కేరాఫ్‌గా నిలుస్తోంది యూకే. సాధారణంగా మాస్టర్స్ డిగ్రీ వ్యవధి రెండేళ్లు ఉండగా.. అధిక శాతం యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూట్లు ఫాస్ట్‌ట్రాక్ కోర్సుల పేరుతో ఏడాదిలోనే పీజీ కోర్సులను అందిస్తుండటం కూడా ఈ దేశానికి మన విద్యార్థుల సంఖ్య పెరగడానికి కారణం. రెండేళ్ల క్రితం వీసా నిబంధనలను కఠినం చేస్తూ.. పోస్ట్ స్టడీ వర్క్ వీసా సదుపాయాన్ని తొలగించడంతో యూకేకు అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య కొంతమేర తగ్గింది. అయితే చదువుకుంటున్న సమయంలోనే.. 20 వేల పౌండ్ల వార్షిక వేతనంతో ఉద్యోగం పొందేట్లు స్పాన్సర్ లెటర్ అందించి.. చదువు పూర్తయ్యాక కూడా అక్కడే ఉండేలా నిబంధనను కొంత సడలించింది. అకడమిక్ సెషన్ ప్రారంభం: జనవరి, సెప్టెంబర్ యూకేలో బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ యూనివర్సిటీ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్ వార్విక్ యూనివర్సిటీ కింగ్స్ కాలేజ్ ఎడిన్బర్గ్ యూనివర్సిటీ లాంకెస్టర్ యూనివర్సిటీ గ్లాస్గో యూనివర్సిటీ పూర్తి వివరాలకు వెబ్సైట్: www.ukvisas.gov.uk జపాన్.. సైన్స అండ్ టెక్నాలజీ కోర్సులు ప్రతి ఏటా దాదాపు 50 వేల మందికిపైగా విదేశీ విద్యార్థులు అడుగుపెడుతున్న దేశం జపాన్. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సుల విషయంలో ప్రపంచ ప్రఖ్యాతి గడించిన ఎన్నో ఇన్స్టిట్యూట్లు జపాన్‌లోనే ఉన్నాయి. ఈ దే శంలో ఇన్స్టిట్యూట్లోనే అనుబంధంగా ఆర్ అండ్ డీ సంస్థలు ఉంటాయి. దాంతో విద్యార్థులు ప్రాక్టికల్ నైపుణ్యాలు సొంతం చేసుకునేందుకు వీలవుతుంది. రీసెర్చ్ విభాగాల్లో పాల్పంచుకునే విద్యార్థులకు రీసెర్చ్ అసిస్టెన్స్‌షిప్ లభిస్తుంది. అకడమిక్ సెషన్ ప్రారంభం: ఏప్రిల్, అక్టోబర్ బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ యూనివర్సిటీ ఆఫ్ టోక్యో క్యోటో యూనివర్సిటీ ఒసాకా యూనివర్సిటీ టోక్యో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నగోయా యూనివర్సిటీ క్యుషు యూనివర్సిటీ వసెడా యూనివర్సిటీ కోబ్ యూనివర్సిటీ టోక్యో మెట్రోపాలిటన్ యూనివర్సిటీ టోక్యో యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ పూర్తి వివరాలకు: www.jasso.go.jp కెనడా... సైన్స, పీహెచ్‌డీలకు చిరునామా సైన్స్ కోర్సులకు, పీహెచ్‌డీలకు చిరునామా కెనడా. ఇంజనీరింగ్, ఏవియేషన్, బయోటెక్నాలజీ వంటి కోర్సుల ఔత్సాహికులకు బెస్ట్ ఇన్స్టిట్యూట్లలో చదివే అవకాశం ఇక్కడ లభిస్తుంది. పీహెచ్డీ స్థాయిలో కెనడాలోని అన్ని ఇన్స్టిట్యూట్లు, యూనివర్సిటీలు ఇండస్ట్రీ కొలాబరేషన్‌తో రియల్‌టైం ఎక్స్‌పీరియన్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాయి. దాంతో పీహెచ్‌డీకి సరైన వేదికగా ఈ దేశాన్ని పేర్కొనొచ్చు. అదే విధంగా ఇమ్మిగ్రేషన్ నిబంధనలను సడలించి.. పని అనుభవం కలిగిన ఉన్నత విద్యావంతులు కెనడాలోనే శాశ్వత నివాసానికి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు సైతం కల్పించారు. ఈ కారణంగా గత ఐదేళ్లుగా కెనడాకు వెళుతున్న వారి సంఖ్య క్రమేణా పెరుగుతోంది. అకడమిక్ సెషన్ ప్రారంభం: జనవరి, సెప్టెంబర్ బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ మెక్‌గిల్ యూనివర్సిటీ క్వీన్స్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ టోరంటో వాటర్లూ యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీ ఆఫ్ అల్బెర్టా యూనివర్సిటీ డి మాంట్రియల్ మెక్‌మాస్టర్ యూనివర్సిటీ వెస్ట్రన్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ కల్గెరీ పూర్తి వివరాలకు: www.educationau-incanada.ca/ రష్యా... మెడికల్, ఫార్మసీ కోర్సులకు కేరాఫ్ మెడికల్, హెల్త్, ఫార్మసీ, నర్సింగ్, ఏవియేషన్ కోర్సులకు కేరాఫ్‌గా రష్యా పేరు గడిస్తోంది. ముఖ్యంగా మన దేశంలో వైద్య విద్య ఔత్సాహికులకు రష్యానే ప్రధాన గమ్యం. ఎంబీబీఎస్ కోర్సు కోసమే ప్రతి సంవత్సరం దాదాపు ఐదు వేల మంది రష్యాకు వెళుతున్నారు. అయితే ఈ దేశానికి వెళ్లే విద్యార్థులు ప్రధానంగా గమనించాల్సిన అంశం.. అక్కడ తాము చేరాలనుకుంటున్న కళాశాలలో బోధన మాధ్యమం. అధిక శాతం ఇన్స్టిట్యూట్లు స్థానిక భాషలోనే బోధిస్తున్నాయి. ఈ మేరకు సదరు ఇన్స్టిట్యూట్లో ప్రవేశం కోరుకునే విద్యార్థులు తప్పనిసరిగా ఆ భాషపై పరిజ్ఞానం పొందాల్సి ఉంటుంది. నెలకు 80 డాలర్ల నుంచి వంద డాలర్ల లోపు నివాస వ్యయం ఇక్కడ ప్రధానంగా కలిసొచ్చే అంశం. ప్రముఖ యూనివర్సిటీలు సెయింట్ పీటర్స్బర్గ్ స్టేట్ యూనివర్సిటీ మాస్కో మెడికల్ అకాడమీ మాస్కో స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్ అండ్ డెంటిస్ట్రీ సెయింట్ పీటర్స్బర్గ్ స్టేట్ ఎల్.పి.పావ్లోవ్ మెడికల్ యూనివర్సిటీ రష్యన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ మాస్కో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ టెక్నాలజీ కజాన్ ఫెడరల్ యూనివర్సిటీ సదరన్ ఫెడరల్ యూనివర్సిటీ వొరోనెజ్ స్టేట్ యూనివర్సిటీ బౌమన్ మాస్కో స్టేట్ టెక్నికల్ యూనివర్సిటీ అకడమిక్ సెషన్ ప్రారంభం: ప్రతి ఏటా సెప్టెంబర్ పూర్తి వివరాలకు వెబ్సైట్: en.russia.edu.ru న్యూజిలాండ్... మేనేజ్మెంట్, అగ్రికల్చర్ తక్కువ వ్యయంతో కోర్సులు పూర్తి చేసుకునే అవకాశమున్న దేశం న్యూజిలాండ్. ముఖ్యంగా మేనేజ్మెంట్, అగ్రికల్చర్ కోర్సుల విషయంలో ఈ దేశ యూనివర్సిటీలకు మంచి పేరుంది. ఎంబీఏ, ఇతర పీజీ మేనేజ్మెంట్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు బ్యాచిలర్‌స డిగ్రీ తర్వాత రెండేళ్ల పని అనుభవం పొందడం తప్పనిసరి! ఆయా కోర్సులు పూర్తి చేసుకున్న తర్వాత ఏడాది కాలపరిమితి గల జాబ్ సెర్చ్ వీసా పొంది.. అక్కడే ఉద్యోగాన్వేషణ సాగించే సదుపాయం ఉంది. కొన్ని కోర్సులకు మన దేశంలో బోధించే మూడేళ్ల బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో ప్రవేశం లభిస్తోంది. ఎంఎస్, ఎంటెక్ వంటి స్పెషలైజ్డ్ కోర్సుల్లో చేరాలంటే.. 16 ఏళ్ల విద్యాభ్యాసం తప్పనిసరి. బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ యూనివర్సిటీ ఆఫ్ ఆక్లాండ్ యూనివర్సిటీ ఆఫ్ ఒటాగో యూనివర్సిటీ ఆఫ్ కాంటెర్బరీ విక్టోరియా యూనివర్సిటీ ఆఫ్ వెల్లింగ్టన్ మాసే యూనివర్సిటీ వ్యకాటో యూనివర్సిటీ లింకన్ యూనివర్సిటీ ఆక్లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అకడమిక్ సెషన్ ప్రారంభం: ప్రతి ఏటా మార్చి నెలలో పూర్తి వివరాలకు: www.immigration.govt.nz అమెరికా ఔత్సాహికులు అప్రమత్తంగా అమెరికాకు వెళ్లాలనుకునే విద్యార్థులు దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఏటా రెండుసార్లు మొదలయ్యే అకడమిక్ సెషన్ కోసం 12 నుంచి 14 నెలల ముందుగానే ప్రక్రియ ప్రారంభించడం మేలు. ఇన్స్టిట్యూట్లు, యూనివర్సిటీల ఎంపిక విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటీవల కాలంలో అమెరికాలో కొన్ని ఫేక్ యూనివర్సిటీల్లో చేరడం వల్ల ఎందరో విదేశీ విద్యార్థులు నష్టపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా ఔత్సాహిక విద్యార్థుల కోసం యునెటైడ్ స్టేట్స్- ఇండియా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ (యుఎస్‌ఐఈఎఫ్) తరఫున హెల్ప్‌లైన్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాం. అభ్యర్థులు దీన్ని వినియోగించుకుంటే కచ్చితమైన సమాచారం లభిస్తుంది. రేణుక రాజారావు, కంట్రీ కో-ఆర్డినేటర్, యుఎస్‌ఐఈఎఫ్ కూలంకషంగా పరిశీలించి.. స్టడీ అబ్రాడ్ ఔత్సాహిక విద్యార్థులు.. తాము ఎంచుకున్న కోర్సు, గమ్యాలకు సంబంధించి కూలంకషంగా పరిశీలన చేయాలి. అక్కడి సామాజిక, ఆర్థిక పరిస్థితులపై అవగాహన ఏర్పరచుకోవాలి. సాధారణంగా విదేశాల్లోని యూనివర్సిటీలు.. ప్రవేశాల విషయంలో ప్రత్యేక ప్రకటనలు చేయవు. కాబట్టి విద్యార్థులు సదరు యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూట్ల వెబ్సైట్లను చూస్తూ నిర్ణీత గడువు తేదీలను, ఇతర ప్రవేశ నిబంధనలను తెలుసుకోవాలి. వాటికి సరితూగుతామనే ఆత్మవిశ్వాసం లభించాకే దరఖాస్తు ప్రక్రియకు ఉపక్రమించాలి. దరఖాస్తు సమయంలో జత చేయాల్సిన స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ను పకడ్బందీగా రూపొందించుకోవాలి. నిర్దేశిత టెస్ట్ (జీమ్యాట్, జీఆర్ఈ, టోఫెల్, ఐఈఎల్టీఎస్, శాట్ తదితర)ల్లో స్కోర్ బాగా ఉన్నప్పటికీ.. కొన్ని సందర్భాల్లో స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ సరిగా లేక దరఖాస్తులు తిరస్కరణకు గురవుతాయి. అందుకే ఈ విషయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. అకడమిక్ సెషన్ ప్రారంభానికి సంవత్సరం ముందు నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించాలి. అలా చేస్తేనే సదరు ఇన్స్టిట్యూట్ నిబంధనల మేరకు అడ్మిషన్ ప్రక్రియ సరైన సమయంలో పూర్తి చేసుకోవడం సులువవుతుంది. సోను హిమాని, సీనియర్ మేనేజర్, ఎడ్యుకేషన్ యూకే, (సౌత్ ఇండియా బ్రిటిష్ కౌన్సిల్) విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు ప్రధానంగా దృష్టి సారించి.. సిద్ధం చేసుకోవాల్సినవి... జీఆర్ఈ/టోఫెల్, జీమ్యాట్/ఐఈఎల్టీఎస్/ ఎస్ఏటీ పరీక్షల్లో స్కోరు. దరఖాస్తుతోపాటు కవరింగ్ లెటర్ అప్లికేషన్ ఫీజు స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ లెటర్ ఆఫ్ రికమండేషన్ విద్యార్హతల సర్టిఫికెట్లు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పాస్‌పోర్ట్ స్పాన్సర్ లెటర్స్, స్పాన్సరర్స్ ఆదాయ పన్ను స్టేట్మెంట్ -
నేడే ఎంసెట్
హాజరుకానున్న విద్యార్థులు 25,355 మంది నిమిషం ఆలస్యమైనా అనుమతించరు బాల్‌పాయింట్ పెన్‌తోనే సమాధానాలు పరిశీలనకు ప్రత్యేక బృందాలు ఏయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : ఇంజినీరింగ్, మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశానికి గురువారం నిర్వహించనున్న ఎంసెట్-2014కు నగరంలో 25,355 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. నగరంలో ఇంజినీరింగ్‌కు 36 కేంద్రాల్లో 18,976 మంది, మెడిసిన్‌కు 13 కేంద్రాల్లో 6,379 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ప్రాంతీయ సమన్వయకర్త ఆచా ర్య కె.వెంకట సుబ్బయ్య తెలిపా రు. ఉదయం 10 నుంచి 1 గంట వరకు ఇంజినీరింగ్‌కు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు మెడిసిన్‌కు పరీక్ష జరగనుంది. నిరంతర పరిశీలన పరీక్షలకు నిరంతర పర్యవేక్షణ జరపనున్నారు. మెడిసిన్ పరీక్ష కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి కేంద్రానికి ఒక పర్యవేక్షకుడు, నగరానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను ఏర్పాటు చేస్తున్నారు. మెడిసిన్ పరీక్ష కేంద్రాలకు అదనంగా ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఉంటారు. ప్రతి 500 విద్యార్థులకు ఒక పరిశీలకుడిని, ప్రతి 24 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్‌ను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను గంట ముందుగా అనుమతిస్తారు. దరఖాస్తులో ఎటువంటి పొరపాట్లు దొర్లినా పరీక్ష కేంద్రంలో ఉండే నామినల్ రోల్స్‌లో సరిచేసుకునే అవకాశం ఉంది. విద్యార్థులు తమ వెంట హాల్ టికెట్, గెజిటెడ్ అధికారి సంతకం చేసిన ఆన్లైన్ దరఖాస్తు పత్రం కాపీని తీసుకురావాలి. పరీక్ష కేంద్రాలివే... నగరంలో ఇంజినీరింగ్‌కు సంబంధించి ఏయూ ఇంజినీరింగ్ కళాశాల న్యూ క్లాస్రూమ్ కాంప్లెక్స్, ఏయూ ఇంజినీరింగ్ కళాశాల, ఏయూ మహిళా ఇంజినీరింగ్ కళాశాల, ఏయూ సైన్స్ కళాశాల, ఏయూ కామర్స్ మేనేజ్మెంట్ విభాగం, ఏయూ సోషల్ సెన్సైస్ భవనం, ఏయూ ఆర్ట్స్ కళాశాల, ఏయూ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ న్యాయ కళాశాల, ఏయూ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల బ్లాక్-4( ఆర్ట్స్ అండ్ కామర్స్) డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల బ్లాక్-5 ( పీజీ కోర్సులు), డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల బ్లాక్-6( పీజీ కోర్సులు), డాక్టర్ లంకపల్లి బుల్లయ్య మహిళా ఇంజినీరింగ్ కళాశాల, డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల బ్లాక్-2, ఎస్ఎఫ్ఎస్ పాఠశాల, ప్రిజమ్ డిగ్రీ, పీజీ కళాశాల, బీవీకే డిగ్రీ కళాశాల, ప్రభుత్వ మహిళా కళాశాల, పైడా కళాశాల, రెడ్నం గార్డెన్స్, శ్రీగౌరి డిగ్రీ, పీజీ కళాశాల, సెయింట్ మేరీస్ సెంటినరి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, సెయింట్ జోసఫ్స్ అటానమస్ కాలేజ్ ఫర్ ఉమెన్, బుద్ద రమేష్ బాబు డిగ్రీ, పీజీ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజినీరింగ్, వి.వి.ఆర్. కె.ఎం.ఎల్ డిగ్రీ కళాశాల, తాటిచెట్టపాలెం, డాక్టర్ వి.ఎస్ కృష్ణా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సమతా కళాశాల, జీవీపీ డిగ్రీ కళాశాల, ఎస్.వి.వి.పి.వి.ఎం.సి.కళాశాల, విశాఖ వేలీ పాఠశాల, ఎస్వీపీ ఇంజినీరింగ్ కళాశాల, సాంకేతిక ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, సాంకేతిక పాలిటెక్నిక్ కళాశాల, బాబా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లను పరీక్ష కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. మెడిసిన్‌కు... మెడిసిన్‌కు పైన పేర్కొన్న ఏయూలోని పది కేంద్రాలతో పాటు లంకపల్లి బుల్లయ్య కళాశాలలో రెండు కేంద్రాలు, వి.ఎస్.కృష్ణా ప్రభుత్వ కళాశాలలో ఒక కేంద్రంలో పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులూ ఇవి పాటించండి : పరీక్ష సమాధానాలు గుర్తించడంలో పెన్సిల్‌కు బదులు నీలం, నలుపు బాల్‌పాయింట్ పెన్నును మాత్రమే వినియోగించాలి. విద్యార్థులు ఓఎంఆర్ పత్రంపై సమాధానాలు గుర్తించే సమయంలో ఎటువంటి పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్త వహించాలి. తమ వెంట ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ఫోన్ల్ తీసుకు రాకూడదు. ఆత్మ విశ్వాసంతో పరీక్ష రాయండి రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్యకు సరిపడినన్ని ఇంజినీరింగ్ కళాశాలలు, సీట్లు ఉన్నాయి. పూర్తి నమ్మకంతో, ఆత్మ విశ్వాసంతో పరీక్ష రాయండి. తల్లిదండ్రులు సైతం విద్యార్థులకు మానసిక బలాన్ని అందించే విధంగా ఉండాలి. పూర్తి నమ్మకంతో పరీక్ష రాస్తే మంచి ఫలితాలు వస్తాయి. -ఆచార్య జి.ఎస్.ఎన్ రాజు, ఉపకులపతి -
ఈ మూడు తప్పులు చేయొద్దు..
శివకు ఏమీ పట్టదు. డబ్బుల విషయంలో ప్లానింగ్ జీరో. దీనికి తోడు ఎవరి మాటా వినడు కూడా. తోచింది చేసుకుపోతుంటాడు. ఇదే ధోరణిలో... ఆర్థికంగా జీవితంలో ఏ మనిషీ చేయకూడని మూడు తప్పులు చేసేశాడు. ఫలితం!! ప్రతిరోజూ డబ్బుకు కటకటే. పిల్లలకు నచ్చిన చదువు చెప్పించలేకపోయాడు. రిటైరయ్యాక కూడా సరైన ఆదాయం లేక ఏదో ఒక పని చేస్తూనే వచ్చాడు. అసలు శివ చేసిన తప్పులేంటి? ఎవరూ చెయ్యకూడని ఆ మూడు తప్పుల వివరమేంటి? తాహతుకు మించిన చదువు.. పిల్లలకు ఉన్నత విద్య చెప్పించి, ఉత్తమంగా తీర్చిదిద్దాలని కోరుకోనిదెవరు? అయితే, ఇందుకు చేసే ఖర్చుపై కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించకపోతే పిల్లల చదువు సంగతి అటుంచి కుటుంబం ఆర్థిక కష్టాల్లో ఇరుక్కోక తప్పదు. విదేశీ చదువుల విషయంలో ఎదురుదెబ్బలు తగిలితే మరీ కష్టం. ఇలాంటివి ఎదురవకుండా ఉండాలంటే.. కోర్సు మొదలు కాలేజీ దాకా అన్నింటి గురించి ముందే తెలుసుకోవాలి. ఆయా కోర్సులకు ఎక్కడెక్కడ ఫీజులు ఎంతెంత ఉన్నాయో తెలుసుకోవాలి. అలాగే, స్కాలర్షిప్లు, ఆర్థిక సహాయం వంటివి ముందే చూసుకోవాలి. విదేశీ చదువుల విషయానికొస్తే.. అక్కడ నివసించేందుకయ్యే ఖర్చులనూ బేరీజు వేసుకోవాలి. ప్రముఖ కాలేజీలుండేది పెద్దపెద్ద నగరాల్లోనే కనుక అక్కడ జీవన వ్యయాలూ భారీగానే ఉంటాయి. విద్యా రుణం తీసుకునేటప్పుడు ఇవన్నీ చూసుకోవాలి. ఎంతదాకా భరించగలమన్నది చూసుకునే ముందడుగు వేయాలి. ముందుచూపు లేని జీవితం.. పిల్లల చదువులు, వాహనాలు, ఇల్లు కొనుక్కోవడాలు ఇతరత్రా సమస్యల్లో పడి కీలకమైన రిటైర్మెంట్ తరుణానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వదిలేయడం మరో తప్పిదం. ఎందుకంటే.. రిటైరయ్యాక ఆదాయం బాగా తగ్గిపోతుంది. ఖర్చులు మాత్రం పెరిగిపోతాయి. ఆర్థికంగా బలంగా లేకపోతే తీవ్రమైన కష్టాలొస్తాయి. అందుకని చాలా ముందునుంచే రిటైర్మెంట్ ప్రణాళిక వేసుకోవాలి. ఆదాయంలో కనీసం 10-12 శాతం దాకా క్రమం తప్పకుండా పొదుపు చేయాలి. ఆదాయం పెరిగినప్పుడల్లా ఇన్వెస్ట్మెంట్ల కేటాయింపులూ పెంచాలి. పెట్టుబడి పెడుతూ పోవడం కాకుండా.. దాని పనితీరునూ తరచూ సమీక్షించుకోవాలి. అవసరమైన మార్పులు, చేర్పులూ చేస్తూ మంచి రాబడులొచ్చేలా జాగ్రత్తపడాలి. అవసరాన్ని మించిన అప్పు... వంటింట్లో స్టవ్ నుంచి ఆ వంటిల్లుండే సొంతిల్లు దాకా అన్నీ ఇపుడు ఈఎంఐ మీదే దొరికేస్తున్నాయి. అంటే నెలసరి వాయిదాల పద్ధతిలోనన్న మాట. అయితే వాయిదా పద్ధతిలో వస్తున్నాయి కదా అని చూసిందల్లా కొనొద్దు. మనకు ఏది, ఎంతవరకూ అవసరమో చూడాలి. సహజంగానే పెద్ద కారు.. పెద్ద ఇల్లు.. ఇలాంటి కలలు చాలా మందికి ఉంటాయి. అవన్నీ సాకారం కావాలంటే.. అందుకు తగ్గ స్థాయిలో ఆర్థిక ప్రణాళికలూ వేయాలి. మన ఆదాయం... ఖర్చులు పోను దాచగలిగేది ఎంత... ఇవన్నీ చూడాలి. ఇల్లు కొనేంత కూడబెట్టలేకపోతే.. రుణం తీసుకోవాలి. తీసుకుంటే వడ్డీ రేట్లు పెరిగినప్పుడల్లా బాదుడు. పైగా మనకు ఆదాయం ఉన్నా లేకున్నా సంవత్సరాల తరబడి ఈఎంఐలు కట్టాలి. కాబట్టి ఇలాంటి రుణాలు తీసుకునేటపుడు పక్కా లెక్కలు వేసుకోవాలి. లేకుంటే జీవితం ఈఎంఐలు కట్టడానికే సరిపోతుంది.