సీఎస్ ఔత్సాహికులకు సరైన సమయమిదే.. | CS enthusiasts samayamide right .. | Sakshi
Sakshi News home page

సీఎస్ ఔత్సాహికులకు సరైన సమయమిదే..

Published Mon, Sep 8 2014 12:22 AM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

సీఎస్ ఔత్సాహికులకు సరైన సమయమిదే.. - Sakshi

సీఎస్ ఔత్సాహికులకు సరైన సమయమిదే..

 గెస్ట్ కాలమ్
 
కంపెనీ సెక్రటరీ.. వ్యాపార, వాణిజ్య రంగాల్లో దేశం శరవేగంగా పురోగతి సాధిస్తున్న నేపథ్యంలో చక్కటి కెరీర్‌కు అవకాశం కల్పించే కోర్సు. ప్రభుత్వ తాజా నిబంధనలు కూడా కెరీర్ పరంగా కంపెనీ సెక్రటరీలకు ఎన్నో అవకాశాలు కల్పించే విధంగా ఉన్నాయి. ఔత్సాహిక విద్యార్థులు దీన్ని అందిపుచ్చుకోవాలి. కంపెనీ సెక్రటరీ కోర్సు అంటే కామర్స్, మేనేజ్‌మెంట్ సంబంధితమని, ఆ నేపథ్యం ఉన్న వారికే అనుకూలమనే భావన సరికాదు. నిరంతర అధ్యయన దృక్పథం, పరిశీలనాత్మక దృష్టితో వ్యవహరిస్తే.. అన్ని అకడమిక్ నేపథ్యాల విద్యార్థులు సీఎస్ కోర్సులో రాణించగలరు అంటున్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ) ఆల్ ఇండియా కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆర్. శ్రీధరన్‌తో ఇంటర్వ్యూ..
 
ప్రొఫెషనల్స్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యం

ఐసీఎస్‌ఐ ప్రెసిడెంట్‌గా తొలి ప్రాధాన్యం ఇచ్చే అంశం.. ఉద్యోగం లేదా ప్రాక్టీస్‌లో ఉన్నవారిని మరింత నిబద్ధతగా వ్యవహరించేలా చేయడమే. ఇక సీఎస్ విద్యార్థుల విషయానికొస్తే అకడమిక్ సామర్థ్యాలను మరింత పెంచడం మా లక్ష్యం. ఈ క్రమంలో కంపెనీస్ లా- 2013లో కంపెనీ సెక్రటరీ విధుల పరంగా పేర్కొన్న అన్ని నిబంధనలను కచ్చితంగా అమలయ్యేలా చేస్తాం.
 
కంపెనీ సెక్రటరీ.. పెరుగుతున్న ప్రాధాన్యం

కంపెనీ సెక్రటరీ ప్రొఫెషన్‌కు ప్రాధాన్యం దినదిన ప్రవర్థమానం అవుతోంది. రూ. 5 కోట్ల పెయిడ్-అప్ క్యాపిటల్ ఉన్న ప్రతి సంస్థ కంపెనీ సెక్రటరీని నియమించుకోవాలనే నిబంధన కారణంగా క్వాలిఫైడ్ కంపెనీ సెక్రటరీలకు డిమాండ్ పెరుగుతోంది. ఆయా సంస్థల్లో పూర్తిస్థాయిలో కంపెనీ సెక్రటరీ ఉద్యోగంతోపాటు, ప్రాక్టీసింగ్ కంపెనీ సెక్రటరీగా స్వయం ఉపాధికి కూడా ఎంతో అవకాశం ఉంది. కానీ ఏటా సర్టిఫికెట్లు అందుకుంటున్నవారి సంఖ్యతో పోల్చితే సీఎస్‌కు డిమాండ్ - సప్లయ్ మధ్య ఎంతో వ్యత్యాసం నెలకొంది. ఔత్సాహిక విద్యార్థులు ప్రొఫెషన్‌లో ప్రవేశించి చక్కటి కెరీర్ అందుకోవడానికి ఇదే సరైన సమయం.
 
సంస్థల్లోనూ కీలక పాత్ర పోషించే సీఎస్‌లు


మూడు దశల సీఎస్ కోర్సు పూర్తి చేసుకున్న క్వాలిఫైడ్ కంపెనీ సెక్రటరీలకు ఆయా సంస్థల కార్యకలాపాల్లోనూ ముఖ్య హోదాలు లభిస్తున్నాయి. ఈ క్రమంలో ఎంతో కీలకపాత్ర పోషించాల్సి ఉంటుంది. సదరు సంస్థ ప్రభుత్వ నిబంధనల ప్రకారం సెక్రటేరియల్ ప్రమాణాలు పాటించేలా చూడటం, ఆ మేరకు అవసరమైతే ఉన్నతాధికారులకు తగిన సిఫార్సులు చేయడం వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. కంపెనీ లా - 2013 ప్రకారం మొత్తం తొమ్మిది కీలక విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత కంపెనీ సెక్రటరీలదే. ఇలా.. ఒక సంస్థలో సీఈఓ, ఎండీ తర్వాత ఆ స్థాయీ ప్రాధాన్యం సీఎస్‌లకు లభిస్తుంది. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ హోదాకు చేరుకోవచ్చు. అదేవిధంగా సెక్రటేరియల్ ఆడిట్, లేబర్ ఆడిట్, లీగల్ ఆడిట్ తదితర విభాగల్లోనూ సీఎస్‌లకు అవకాశాలు లభిస్తాయి. ఇదే సమయంలో రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ ఎక్కువగా ఉండే ఉద్యోగం కంపెనీ సెక్రటరీ. ఒకవైపు సంస్థలోని ఉన్నతాధికారులకు, మరోవైపు స్టేక్ హోల్టర్లు, నియంత్రణ సంస్థలకు మధ్య వారధిగా కీలక బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది.
 
సెమినార్లు, వర్క్‌షాప్‌లతో అవగాహన


వృత్తి పరంగా ఎంతో కీలకమైన కంపెనీ సెక్రటరీ కోర్సుపై విద్యార్థులకు ఆశించిన రీతిలో అవగాహన లేదనే మాట వాస్తవం. కోర్సుకు నమోదు చేసుకుంటున్న విద్యార్థుల సంఖ్య ఇటీవల కాలంలో పెరుగుతున్న ప్పటికీ ఆ సంఖ్య వాస్తవ అవసరాలకు సరితూగట్లేదు. ఈ క్రమంలో విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు సెమినార్లు నిర్వహించాలని నిర్ణయించాం. ఈ ఏడాది దేశవ్యాప్తంగా దాదాపు 400 సెమినార్లు నిర్వహించాలని నిర్దేశించుకున్నాం. అదేవిధంగా ఇప్పటికే కోర్సు పూర్తి చేసి అసోసియేట్, ఫెలో మెంబర్స్‌గా దాదాపు 35 వేల మందికిపైగా క్వాలిఫైడ్ కంపెనీ సెక్రటరీలు ఉన్నారు. వీరికి కూడా తాజా పరిస్థితులపై అవగాహన కల్పించేందుకు వర్క్‌షాప్‌లు నిర్వహించ నున్నాం.
 
సీఏ, సీఎస్, సీఎంఏ మూడు.. వేర్వేరు ప్రాధాన్యత కలిగిన కోర్సులు

చాలా మంది సీఏ, సీఎస్, సీఎంఏ కోర్సుల మధ్య పోలికలు, తేడాలు బేరీజు వేయాలని చూస్తున్నారు. కానీ ఇది సరికాదు. రెండు కోర్సులు వేర్వేరు ప్రాధాన్యతలు కలిగున్నాయి. కంపెనీ సెక్రటరీ కోర్సు పూర్తిగా సెక్రటేరియల్ ప్రాక్టీసెస్, కంపెనీ లా ఆధారంగా ఉంటుంది. చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సు ఆర్థికపరమైన అంశాలు (అకౌంటింగ్, ఆడిటింగ్) ఎక్కువగా ఉండే కోర్సు. ఉద్యోగ విధుల విషయంలోనూ రెండింటికీ వేర్వేరు ప్రాధాన్యాలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రతి సంస్థకు కంపెనీ సెక్రటరీ, చార్టర్డ్ అకౌంటెంట్ ఇద్దరూ అవసరం. అదే విధంగా కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ కోర్సుకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా ఉత్పత్తి రంగ సంస్థల్లో కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ ఉత్తీర్ణులకు చక్కటి అవకాశాలున్నాయి. మొత్తంమీద ఒక సంస్థను సమర్థంగా, ప్రగతి పథంలో పయనించేలా చేయడంలో సీఏ, సీఎస్, సీఎంఏ ఉత్తీర్ణులు ముగ్గురూ ముఖ్యమే.
 
ఆ అభిప్రాయం అపోహ మాత్రమే

కంపెనీ సెక్రటరీ కోర్సు.. కేవలం కామర్స్, లా, మేనేజ్‌మెంట్ అకడమిక్ నేపథ్యాలు ఉన్న విద్యార్థులకే అనుకూలం అనే అభిప్రాయం అపోహ మాత్రమే. తులనాత్మక పరిశీలన, విశ్లేషణ నైపుణ్యం ఉంటే అకడమిక్ నేపథ్యంతో సంబంధం లేకుండా ఎలాంటి విద్యార్థులైనా సులువుగా రాణించగల కోర్సు కంపెనీ సెక్రటరీ. కోర్సులో చేరాక నిర్దేశిత సిలబస్‌ను క్షుణ్నంగా అధ్యయనం చేయడంతోపాటు దానికి సంబంధించిన తాజా మార్పులపై అవగాహన పొందుతూ ముందుకు సాగాలి.
 
సరైన సమయం..

మూడు దశలు (ఫౌండేషన్, ఎగ్జిక్యూటివ్, ప్రొఫెషనల్)గా ఉండే కంపెనీ సెక్రటరీ కోర్సులో చేరడానికి సరైన సమయం అనేది విద్యార్థుల వ్యక్తిగత లక్ష్యాలు, అభిరుచులపై ఆధారపడి ఉంటుంది. ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన కోర్సుతో ఫౌండేషన్ కోర్సులో; బ్యాచిలర్స్ డిగ్రీ అర్హతతో ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లో పేరు నమోదు చేసుకోవచ్చు. ఏ దశలో చేరినా పూర్తి స్థాయిలో సమయం కేటాయించేట్లు ప్రణాళిక రూపొందించుకోవాలి.
 
సీఎస్ కోర్సు ఔత్సాహికులకు సలహా..

సీఎస్ కోర్సు ఔత్సాహికులు, క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ కెరీర్‌లో గుర్తుంచుకోవాల్సిన రెండు ప్రధాన అంశాలు కఠోర శ్రమ, ఓర్పు. ఈ రెండూ ఉంటే విజయాలు వాటంతటే వరిస్తాయి. అదే విధంగా నిత్య నూతన ఆలోచన దృక్పథం కూడా ఈ రంగంలో విజయానికి ఎంతో కీలక సాధనం. దీంతోపాటు పరిస్థితులకు అనుగుణంగా తమను తాము తీర్చిదిద్దుకునే లక్షణాన్ని సొంతం చేసుకోవాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement