సైన్స్‌తోనే సామాజిక అభివృద్ధి
గెస్ట్ కాలమ్
దేశంలో సైన్స్ ఎడ్యుకేషన్‌పై అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ రంగంలో రీసెర్చ్ కార్యకలాపాలను బాగా విస్తృతం చేయాలి. వాస్తవానికి సైన్స్ ఎడ్యుకేషన్‌లో దేశానికి దశాబ్దాల ఘన చరిత్ర ఉన్నప్పటికీ నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థిల్లో సైన్స్ పట్ల మక్కువ తగ్గుతోంది. అయితే సైన్స్‌తోనే సమాజాభివృద్ధి సాధ్యం అవుతుందని గుర్తించాలి అంటున్నారు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ - మొహాలీ క్యాంపస్ డెరైక్టర్ ప్రొఫెసర్ నారాయణసామి సత్యమూర్తి. కెమిస్ట్రీ విభాగంలో అన్నామలై యూనివర్సిటీలో బీఎస్సీ, ఎమ్మెస్సీ పూర్తి చేసి తర్వాత ఓక్లహామా స్టేట్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ, జె.సి.పొలానీస్ లేబొరేటరీలో పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ అందుకున్న ప్రొఫెసర్ సత్యమూర్తి.. ప్రపంచంలో ప్రముఖ కెమిస్ట్రీ ప్రొఫెసర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. 1978 నుంచి 2007 వరకు ఐఐటీ కాన్పూర్‌లో అధ్యాపక వృత్తిలో విధులు నిర్వర్తించి.. 2007 నుంచి ఐఐఎస్‌ఈఆర్ డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్ సత్యమూర్తితో ఇంటర్వ్యూ..
సైన్స్ దశాబ్దాల చరిత్ర
మన దేశంలో ఎందరో శాస్త్రవేత్తలు దశాబ్దాల క్రితమే సైన్స్‌లో పలు ఆవిష్కరణలు చేశారు. ముఖ్యంగా ఫిజిక్స్ విభాగంలో సర్ సి.వి. రామన్, ఎస్.ఎన్.బోస్, ఎం.ఎన్.సాహా వంటి శాస్త్రవేత్తల ఆవిష్కరణల ఫలితాలను ఇప్పటికీ ఆస్వాదిస్తున్నాం. ఇంతటి ఘన చరిత్ర ఉన్న దేశం.. ఆధునిక యుగంలో మాత్రం సైన్స్ ఎడ్యుకేషన్, రీసెర్చ్‌లో ఇతర దేశాల కంటే వెనుకంజలో ఉంది. దీన్ని గుర్తించి పోటీ ప్రపంచంలో ఇతర దేశాలకు ధీటుగా ఆవిష్కరణలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. అందుకోసం విస్తృతంగా లభిస్తున్న వనరులను సద్వినియోగం చేసుకోవాలి.
సైన్స్‌తోనే సామాజిక అభివృద్ధి
జాతి పురోగమన దిశలో పయనించాలంటే సైన్స్ ఎడ్యుకేషన్‌ను అభివృద్ధి చేయాలని దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లోనే ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ భావించారు. ఫలితంగా ఏర్పాటైనవే సీఎస్‌ఐఆర్ లేబొరేటరీలు. అదేవిధంగా అటామిక్ ఎనర్జీ విభాగంలో హోమీ జే బాబా, స్పేస్ టెక్నాలజీలో విక్రమ్ సారాబాయ్ వంటి శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేశారు.
ప్రస్తుత పరిస్థితి
ప్రస్తుతం దేశంలో ఇటు అకడమిక్‌గా, అటు పరిశోధనల పరంగా సైన్స్ విభాగాన్ని ఎంతో వృద్ధి చేయాల్సిన అవసరముంది. ఈ ఉద్దేశంతోనే ఇంజనీరింగ్‌లో ఐఐటీల మాదిరిగా సైన్స్ విభాగంలో ఐదు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్‌స ఎడ్యుకేషన్ అండ్ రీసెర్‌చ (ఐఐఎస్‌ఈఆర్)లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సైన్స్ పరిశోధనల దిశగా అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కలిగించేలా పలు కోర్సులను ఇక్కడ నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ఇండస్ట్రీ- ఇన్‌స్టిట్యూషన్ ఇంటరాక్షన్ విధానంలో సాగే బోధన ద్వారా విద్యార్థులకు పరిశోధన పట్ల ఆసక్తి కలుగుతుంది. ఇలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇన్‌స్టిట్యూట్‌లే కాకుండా అన్ని యూనివర్సిటీల్లో సైన్స్ పట్ల ఆసక్తి, అవగాహన పెంచే చర్యలు చేపట్టాలి. అప్పుడే విస్తృత స్థాయిలో ప్రయోజనాలు చేకూరుతాయి. కొత్త ఆవిష్కరణలు వెలుగుచూస్తాయి.
ఐఐఎస్‌ఈఆర్ మొహాలీలో
మొత్తం ఐదు ఐఐఎస్‌ఈఆర్ క్యాంపస్‌లలో కరిక్యులం, బోధన విధి విధానాలు ఒకే విధంగా ఉంటాయి. మొహాలీలో ప్రతి విభాగానికీ ప్రత్యేక పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఇటీవలే.. కొత్త క్యాంపస్‌లో న్యూక్లియర్ మాగ్నటిక్ రిసోనెన్స్ ఆర్ అండ్ డీ సెంటర్‌ను ప్రారంభించాం. ఈ సెంటర్ ఉద్దేశం.. స్ట్రక్చరల్ బయాలజీ మొదలు క్వాంటమ్ కంప్యూటింగ్ వరకు అన్ని విభాగాల్లో ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్ కార్యకలాపాలు నిర్వహించడం. ఇలా ఎప్పటికప్పుడు కొత్తగా ముందు కెళుతున్నాం.
కెరీర్ అంటే ఇంజనీరింగ్ మాత్రమే కాదు
విద్యార్థిల్లో కెరీర్ అంటే ఇంజనీరింగ్, దానికి మార్గంగా ఐఐటీలను భావిస్తున్న రోజులివి. కెరీర్ అంటే ఇంజనీరింగ్ మాత్రమే కాదు. వాస్తవానికి ఇంజనీరింగ్ కోర్సుల్లోనూ సైన్స్ అంశాలు అంతర్గతంగా ఇమిడి ఉంటాయి. విద్యార్థులు ఈ అంశాన్ని గుర్తించడం లేదు. సైన్స్‌లోనూ అవకా శాలు పుష్కలం. రీసెర్చ్, పీజీ ఔత్సాహికులకు ఇప్పుడు స్కాలర్‌షిప్స్, ఫెలోషిప్స్ వంటివి లభిస్తు న్నాయి. మంచి లేబొరేటరీలు అందుబాటులో ఉన్నాయి.
తల్లిదండ్రుల దృక్పథమూ మారాలి
సైన్స్‌పై విద్యార్థుల అనాసక్తికి ప్రస్తుత విద్యా విధానం కూడా కొంత కారణమని చెప్పొచ్చు. వాస్తవానికి ఎంతో మంది విద్యార్థుల్లో పాఠశాల స్థాయిలోనే సైన్స్ అంటే ఆసక్తి, ఉత్సుకత ఉంటున్నాయి. కానీ, పరీక్షలు-మార్కులు అనే మూల్యాంకన పద్ధతి, మల్టిపుల్ ఛాయిస్‌లో ఉండే పోటీ పరీక్షలు వంటివి విద్యార్థుల్లోని సృజనాత్మకతను దెబ్బతీస్తున్నాయి. ఈ విధానాల కారణంగా తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు క్లాస్‌లో ముందుండాలనే భావిస్తున్నారు. తద్వారా వారి వాస్తవ అభిరుచులను గుర్తించడంలో విఫలమవుతున్నారు. ఈ పరిస్థితి మారాలి. తమ పిల్లల ఆసక్తి, అభిరుచులకు అనుగుణంగా లభించే అవకాశాలు-మార్గాలపై అన్వేషణ సాగించడంతోపాటు సదరు విభాగంలో మరింత అవగాహన పెరిగేలా చేయూతనివ్వాలి.
నిరంతర అన్వేషణే.. ఉన్నతికి మార్గం
విద్యార్థులు కెరీర్ పరంగా ఉన్నత స్థితికి చేరుకోవాలంటే నైపుణ్యాలు పొందే విధంగా నిరంతరం అన్వేషణ సాగించాలి. ఐఐఎస్‌ఈ ఆర్ మొహాలీ లోగో క్యాప్షన్ కూడా ఇదే (ఇన్ పర్షుయిట్ ఆఫ్ నాలెడ్జ్). అన్వేషణే.. ఆవిష్కరణలకు దోహదం చేస్తుంది. అవగాహన, అవసరమైన మౌలిక సదుపా యాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టించే విధంగా నేటి యువత అడుగులు వేస్తోంది. ఇతర దేశాల్లో ఆయా విభాగాల్లో ఉన్నత స్థానాల్లో నిలిచిన భారతీయులు ఎందరో ఉన్నారు. ఆ యువశక్తి విదేశా లకు తరలకుండా ఇక్కడే ఉండేలా.. సమాజాభివృద్ధికి తోడ్పడేలా మోటివేట్ చేయాలి.