సూపర్-30 ఆనంద్ కుమార్
గెస్ట్ కాలమ్
ఆనంద్ కుమార్.. దేశంలో ఈ పేరుగల వ్యక్తులు ఎందరో. కానీ సూపర్-30 ఆనంద్ కుమార్ అంటే.. మాత్రం మ్యాథమెటీషియన్‌గా దేశవ్యాప్తంగా సుపరిచితం. ఒకప్పుడు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకునే అవకాశం వచ్చినా.. ఆర్థిక ఇబ్బందులతో అందుకోలేకపోయిన ఆనంద్ కుమార్‌కు ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీ, ఎంఐటీ తదితర ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలు గెస్ట్ లెక్చర్స్ ఇవ్వాలంటూ ఆహ్వానం పంపాయి. మరెన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు, పేరు ప్రఖ్యాతులు ఆయన సొంతమయ్యాయి. కారణం.. ఆనంద్ కుమార్ నెలకొల్పిన సూపర్-30. దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్షకు ప్రతి ఏటా 30 మంది నిరుపేద విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో బీహార్‌లోని పాట్నాలో సూపర్-30ను ప్రారంభించారు. తద్వారా ఎంతో మంది నిరుపేద విద్యార్థుల ఐఐటీ కలల్ని నిజం చేశారు ఆనంద్ కుమార్. 2002లో ప్రారంభించిన ఈ సూపర్ 30 ప్రోగ్రామ్ ద్వారా ఇప్పటి వరకు 308 మంది ఐఐటీల్లో అడుగుపెట్టారు. ఇదే.. ఆనంద్ కుమార్‌కు అంతర్జాతీయ ఖ్యాతిని అందించింది. గ్రాడ్యుయేషన్ దశలోనే నంబర్ థియరీపై పేపర్ ప్రచురించిన ఆనంద్ కుమార్‌తో నేటి విద్యా వ్యవస్థ.. ఐఐటీల్లో ప్రవేశాలపై ఇంటర్వ్యూ..
అమలులోనే అసలు సమస్య
మన దేశంలో ప్రస్తుత విద్యా వ్యవస్థలో చిన్నపాటి లోపాలున్నప్పటికీ.. నేటితరం ప్రపంచస్థాయిలో పోటీపడే రీతిలోనే ఉంది. కానీ అసలు సమస్య అంతా రూపొందిస్తున్న విధానాలను అమలు చేస్తున్న తీరులోనే ఉంటోంది. ఎలాంటి తారతమ్యాలు లేనటువంటి విద్యా వ్యవస్థను సంఘటితం చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ముఖ్యంగా ప్రైమరీ, సెకండరీ విద్యపై ప్రత్యేక దృష్టి సారించాలి. విద్యార్థుల జీవితా నికి పునాదులు పడే దశలు ఇవే. దీన్ని గుర్తించాలి.
అన్ని స్థాయిల్లో ఉపాధ్యాయుల కొరత
మనం ఎదుర్కొంటున్న మరో ముఖ్యమైన సమస్య ఉపా ధ్యాయుల కొరత. విద్యార్థుల భవిష్యత్తుకు ప్రాథమిక, మాధ్యమిక విద్య దశలు పునాదులైతే.. మొత్తం విద్యా వ్యవస్థ అభివృద్ధికి నిర్దేశకులు ఉపాధ్యాయులు. నేడు ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు, నిపుణులు, డాక్టర్లు, ఇంజనీర్లు ఎవరైనా సరే.. వారు ఆ స్థాయికి చేరుకోవడానికి కారణం వారికి విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులే. కానీ దురదృష్టవశాత్తూ మనం అన్ని స్థాయిల్లో ఉపాధ్యాయుల కొరతను ఎదుర్కొంటున్నాం. కారణం.. ప్రతిభావంతులు ఉపాధ్యాయ వృత్తి పట్ల ఆసక్తి చూపకపోవడం. ఇందుకు మరో రెండు కారణాలు ఉన్నాయి.. అవి.. ఆకర్షణీయమైన కెరీర్ కాదు అనే ఆలోచన, ఉపాధ్యాయు లకు గతంలో మాదిరిగా గౌరవం లభించట్లేదనే భావన. కాబట్టి ముందుగా యువత మైండ్‌సెట్‌ను మార్చాలి. ఉపాధ్యాయ వృత్తి గౌరవప్రదమైందనే భావన కల్పించాలి. ప్రభుత్వాలు ఈ విషయంలో దృష్టి సారించాలి. ఉపాధ్యాయ వృత్తిలో నైపుణ్యా లు ప్రదర్శించిన వారికి తగిన గుర్తింపు ఇవ్వాలి. తద్వారా ప్రతి భావంతులు ఈ వృత్తిలో అడుగు పెట్టేందుకు ఆస్కారం ఉంటుంది.
ఐఐటీల్లో ప్రస్తుత ప్రవేశ విధానం సరైందే
గత పన్నెండేళ్లుగా ఐఐటీ ఎంట్రెన్స్ కోచింగ్ ఇస్తున్నా. నా అభిప్రాయం మేరకు ప్రస్తుతం ఐఐటీల్లో ప్రవేశానికి అనుసరిస్తు న్న విధానం సరైందనే నేను భావిస్తున్నాను. సబ్జెక్ట్ నాలెడ్జ్‌ను మాత్రమే పరీక్షించే విధంగా ఎంట్రెన్స్ ఉంటుందనే పలువురు విద్యావేత్తల అభిప్రాయాలను తోసిపుచ్చలేం. కానీ ఇంజనీరింగ్ అనేది ఒక ప్రత్యేకమైన రంగం. విద్యార్థులు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటేనే రాణించగలరు. అయితే ఇక్కడ మనం గుర్తించా ల్సింది.. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తున్న ఐఐటీలు ఆ తర్వాత కోర్సు క్రమంలో.. విద్యార్థుల ఆల్‌రౌండ్ డెవలప్‌మెంట్‌కు అవసరమైన అన్ని చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. కోర్ సబ్జెక్ట్‌లతోపాటు పర్సనాలిటీ డెవలప్‌మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి వాటిలో శిక్షణ నిస్తున్నాయి. అంతేకాకుండా తొలి ఏడాది అంతా అన్ని బ్రాంచ్ లకు ఒకే విధమైన సిలబస్‌ను అమలు చేస్తున్నాయి.
రెండు పరీక్షల వల్ల కొంత ఇబ్బందే
మూడేళ్లుగా ఐఐటీ, ఇతర కేంద్ర ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశానికి జేఈఈ-మెయిన్స్, అడ్వాన్స్‌డ్ పేరిట రెండు పరీక్ష లు నిర్వహిస్తున్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా యి. దీనివల్ల కొంత ఇబ్బందే. కొందరు అభ్యర్థులు తమ వాస్త వ టాలెంట్ గురించి ఆలోచించకుండా ఐఐటీని ఏకైక లక్ష్యంగా మార్చుకుని నిరాశ చెందుతున్నారు. కొందరు ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ మెయిన్ స్థాయిలోనే అవకాశం కోల్పోతున్నారు.
రీసెర్చ్ కార్యకలాపాలు పెరగాలి
ఐఐటీలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందనడంలో సందేహం లేదు. కానీ అదే సమయంలో అంతర్జాతీయ స్థాయి ఇన్‌స్టిట్యూ ట్‌లతో దీటుగా పోటీపడాలంటే రీసెర్చ్ కార్యకలాపాలు పెరగా లి. నేటి పోటీ ప్రపంచంలో చాలా విచిత్రమైన పరిస్థితి నెలకొం ది. మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పొందిన అభ్యర్థి సాఫ్ట్‌వేర్ ఉద్యోగంతో కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెడుతున్నాడు. దీన్ని ఐఐటీలు సీరియస్‌గా పరిగణించాలి. ఎన్నో లక్షల పోటీ నుంచి వేలమంది ని మాత్రమే ఎంపిక చేసే ఐఐటీలు.. ఆయా అభ్యర్థులు తమ బ్రాంచ్‌లకు సరితూగే ఉన్నత విద్యను లేదా కెరీర్‌ను ఎంచుకునే లా తోడ్పాటును అందించాలి. అందుకోసం సంబంధిత రీసెర్చ్ కార్యకలాపాలు నిర్వహిస్తూ వారికి భాగస్వామ్యం కల్పించాలి. ప్రస్తుత కార్పొరేట్ యుగంలో క్యాంపస్ ప్యాకేజ్‌లు అనే సిండ్రోమ్ నుంచి బయటపడి.. ఆర్ అండ్ డీ దిశగా విద్యార్థులను నడిపించాలి. ఆ బాధ్యత ఐఐటీలదే!
ఇంజనీరింగ్‌తోపాటు ఎన్నో రంగాల్లో అవసరం
నేడు విద్యార్థుల్లో అధిక శాతం ఇంజనీరింగ్‌వైపు దృష్టి సారిస్తున్నారు. ఇదే లక్ష్యంగా అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇంజనీరింగ్‌లో చేరుతున్నారు. కానీ అసలైన ఇంజనీర్లుగా రాణించలేకపోతున్నారు. సివిల్ ఇంజనీరింగ్ చేసిన విద్యార్థి సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయానికి కృషి చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితి మారాలి. తాము కోర్సులో చేరిన ఉద్దేశం నెరవేరేలా భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ఇప్పుడు ఇంజనీరింగ్‌తోపాటు ఎన్నో రంగాలు కొత్త, కొత్త అవకాశాలతో ముందుకొస్తున్నాయి.
మ్యాథ్స్, ప్యూర్‌సైన్స్‌లను ప్రోత్సహించాలి
ప్రస్తుత పరిస్థితుల్లో నెలకొన్న ఇంజనీరింగ్ క్రేజ్ కారణంగా.. ప్యూర్‌సైన్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్‌లపై ఆసక్తి తగ్గుతోంది.ఇదే ధోరణి కొనసాగితే భవిష్యత్తులో మనకు టీచర్లు దొరకరు. వాస్తవానికి ఎన్నో మోడ్రన్ బ్రాంచ్‌లన్నీ ప్యూర్ సైన్స్ ఆధారితంగా ఆవిష్కృతమైనవే. విద్యార్థులు దీన్ని గుర్తించాలి. ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు చేపట్టాలి. ఇటీవల కాలంలో రీసెర్చ్ స్కాలర్స్‌కు ప్రభుత్వం పెంచిన ఆర్థిక ప్రోత్సాహకాలు కొంత మేర సత్ఫలితాలు అందించే అవకాశం ఉంది.
ఆలోచించి.. అభిరుచి మేరకు
యువతకు కెరీర్ పరంగా ఇచ్చే సలహా.. స్వీయ ఆలోచన, ఆప్టిట్యూడ్ ఆధారంగా కెరీర్ లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ఈ క్రమంలో ప్రతి విద్యార్థి తన బలాలు, బలహీనతలను బేరీజు వేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఒక కోర్సును ఎంపిక చేసుకునేముందు.. భవిష్యత్తులో ఆ రంగం ద్వారా సమాజాని కి, జాతికి ఎలాంటి సేవ చేసే అవకాశం లభిస్తుంది? అనే సామాజిక దృక్పథం ఉండాలి. ఆప్టిట్యూడ్‌తోపాటు ‘గివింగ్’ ఆటిట్యూడ్ ఉంటేనే సార్థకత!!