అందరికీ స్కిల్ డెవలప్‌మెంట్..
గెస్ట్ కాలమ్
నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్.. విద్యార్థులు, ఉద్యోగార్థులకు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలపై శిక్షణ అందించేందుకు ఏర్పాటైన సంస్థ. 2022 నాటికి 150 మిలియన్ల మందికి స్కిల్ డెవలప్‌మెంట్ లక్ష్యంగా నిర్దేశించుకున్న ఎన్‌ఎస్‌డీసీ.. ఆ దిశగా శరవేగంగా కదులుతోందంటున్నారు.. సంస్థ మేనేజింగ్ డెరైక్టర్, సీఈఓ దిలీప్ చెనాయ్. కేవలం శిక్షణకే పరిమితం కాకుండా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందించేందుకు కూడా కృషి చేస్తున్నామని చెబుతున్న దిలీప్ చెనాయ్‌తో ఇంటర్వ్యూ..
అన్ని రంగాలు, విభాగాల్లో స్కిల్ గ్యాప్
వాస్తవానికి మనం స్కిల్ గ్యాప్ అంటే ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్ కోర్సుల పట్టభద్రుల కోణంలోనే ఎక్కువగా ఆలోచిస్తున్నాం. కానీ కింది స్థాయిలో ఐటీఐ, డిప్లొమా కోర్సులు అర్హతగా విధులు నిర్వర్తించేవారు కూడా స్కిల్ గ్యాప్ సమస్యతో బాధపడుతున్నారు. ఎంప్లాయబిలిటీ స్కిల్స్ పొందుతున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు 24 శాతం ఉంటే.. సాధారణ బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణుల్లో ఎంప్లాయబిలిటీ స్కిల్స్ పొందుతున్న విద్యార్థుల శాతం 8. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే అన్ని స్థాయిల్లో, అన్ని కోర్సులకు సంబంధించి స్కిల్ డెవలప్‌మెంట్ అనేది ప్రధానాంశంగా గుర్తించాలి.
పరిశ్రమ వర్గాలతో కలిసి
స్కిల్ డెవలప్‌మెంట్ కోసం పరిశ్రమ వర్గాలతో కలిసి పని చేస్తున్నాం. ఆయా రంగాలకు సంబంధించి వేర్వేరు శిక్షణ సదుపాయాలు అందించే విధంగా సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్‌ను ఏర్పాటు చేశాం. మొత్తం 139 సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్‌కు ఆమోదం లభించగా ఇప్పటివరకు31 సర్వీస్ సెక్టార్ స్కిల్స్ కార్యరూపం దాల్చాయి.
శిక్షణ.. సర్టిఫికేషన్
సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్‌లో ఆయా రంగాలకు చెందిన సంస్థలు, పరిశ్రమలను భాగస్వాములను చేశాం. ఉదాహరణకు ఐటీ రంగానికి సంబంధించి నాస్‌కామ్, అదే విధంగా రిటైల్ రంగానికి సంబంధించి రిటైల్ అసోసియేషన్‌లతో ఒప్పందాలు చేసుకున్నాం. దీని ద్వారా వారికి అవసరమైన స్కిల్స్‌ను గుర్తించి వాటిని పొందే విధంగా విద్యార్థులకు నిర్ణీత కాల వ్యవధిలో శిక్షణ ఇస్తున్నాం. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు కూడా అందిస్తున్నాం. దీంతో విద్యార్థులు ఉద్యోగ సాధనలో ఇతరులకంటే ముందుంటున్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో పది లక్షల మంది ఎన్‌ఎస్‌డీసీ ద్వారా శిక్షణ పొందితే వారిలో 63 శాతం మందికి ఉద్యోగాలు లభించాయి. ఆర్థిక ఒడిదుడుకులు, ఇతర కారణాల వల్ల అందరికీ ఉపాధి లభించకపోయినా.. వారంతా జాబ్ రెడీ స్కిల్స్ సొంతం చేసుకున్నారు. 2014-15 సంవత్సరంలో 33 లక్షల మందిని లక్ష్యంగా పెట్టుకున్నాం. 70 శాతం లక్ష్యాన్ని చేరుకుంటామని భావిస్తున్నాం.
అవకాశాలకు కొదవ లేదు
దేశంలో ఉద్యోగ అవకాశాలకు కొదవ లేదు. ఎంఎస్‌ఎంఈ (మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రెజైస్) రంగాన్నే పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుతం దేశంలో 44 మిలియన్ల చిన్న, మధ్య తరహా సంస్థలున్నాయి. ఒక్కో సంస్థ 12 మంది చొప్పున నియమించుకున్నా.. 2022 నాటికి లక్ష్యంగా నిర్దేశించుకున్న 150 మిలియన్ల మంది కంటే ఎన్నో ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. ఎంఎస్‌ఎంఈలను ప్రత్యేకించి ప్రస్తావించడానికి కారణం.. వీటన్నింటికీ నిపుణులైన మానవ వనరులు లభించకపోవడమే.
ఆసక్తి ఉంటే.. వేదిక స్టార్ పథకం
స్కిల్ డెవలప్‌మెంట్ దిశగా ఔత్సాహిక విద్యార్థులు, ఉద్యోగులు నేరుగా ఎన్‌ఎస్‌డీసీ శిక్షణ పొందొచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా స్టార్ అనే పథకానికి రూపకల్పన చేశాం. ఔత్సాహికులు స్టార్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి తమకు ఆసక్తి, అభిరుచి, అర్హతల ఆధారంగా తమకు సరితూగే రంగాన్ని ఎంపిక చేసుకుంటే సంబంధిత సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్‌లో శిక్షణనందిస్తాం. శిక్షణ పొందినవారికి ఆర్థిక ప్రోత్సాహకాలూ ఉంటాయి.
అకడమిక్ స్థాయి నుంచే మార్పుతో
దేశ జనాభాలో అధిక శాతం యువతే. వీరంతా వేర్వేరు కోర్సులు అభ్యసిస్తున్నారు. కానీ సమస్య అంతా వృత్తి నైపుణ్యాలు సొంతం చేసుకోవడంలోనే ఉంది. ఆర్ట్స్ నుంచి ఆటోమొబైల్స్ వరకు అన్ని కోర్సులకు క్షేత్ర స్థాయిలో వృత్తి నైపుణ్యాలు ఎంతో అవసరమవుతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని హైస్కూల్, ఇంటర్మీడియెట్ స్థాయిలోనే అకడమిక్స్‌తోపాటు ఒకేషనల్ ట్రైనింగ్ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ మేరకు సిలబస్‌లో మార్పులు చేయాలి.
కోర్సులు, కాలేజీలు ఉన్నప్పటికీ
క్షేత్ర స్థాయి నైపుణ్యాలు అందించే క్రమంలో ప్రభుత్వ పరిధిలో పలు వృత్తి విద్యా కళాశాలలు ఏర్పాటయ్యాయి. కానీ వాటిలో అధ్యాపకుల కొరత ప్రధాన సమస్యగా మారింది. దీంతో ఇంటర్మీడియెట్ స్థాయిలోని ఒకేషనల్ కోర్సులు, ఐటీఐలలో లభించే కోర్సుల పట్ల ఆదరణ తగ్గుతోంది. చివరకు పాలిటెక్నిక్స్‌లోనూ ఇదే సమస్య. వీటికి పరిష్కారంగా నేషనల్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రేంవర్క్ వంటి కొన్ని పథకాలకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. వీటిని సమర్థంగా ఆచరణలో పెడితే సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
కోర్సు ఏదైనా.. ఇవి తప్పనిసరి
నేటి పోటీ ప్రపంచంలో భవిష్యత్తుకు మార్గం వేసేవి క్షేత్ర నైపుణ్యాలే. ఏ కోర్సు ఎంచుకున్నా.. ఏ కెరీర్‌ను లక్ష్యంగా పెట్టుకున్నా.. ప్రాక్టికల్ స్కిల్స్‌ను అకడమిక్ స్థాయి నుంచే అలవర్చుకోవాలి. ఉదాహరణకు బీకాం విద్యార్థులు అకౌంటింగ్‌కు సంబంధించి అందుబాటులోకి వచ్చిన ఈఆర్‌పీ సొల్యూషన్స్ గురించి, ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్‌లో కెరీర్ కోరుకునే విద్యార్థులు కంప్యూటర్ ఆపరేటింగ్, ఆఫీస్ టూల్స్ వంటి టెక్నికల్ అంశాల్లో రాణించే దిశగా కృషి చేయాలి. అప్పుడు ఏ కోర్సయినా కెరీర్ విషయంలో ఆందోళన చెందక్కర్లేదు.