పరిశోధనలతోనే ప్రగతి
గెస్ట్ కాలమ్
దేశ ప్రగతికి పరిశోధనలు తప్పనిసరి. ప్రధానంగా సమాజ అవసరాలు, ప్రయోజనాల దిశగాఆవిష్కరణలు చేసే సైన్స్ రంగంలో రీసెర్చ్ కార్యకలాపాలు మరింత పెరగాలి. అరచేతిలో ఇమిడిపోతున్న మొబైల్ ఫోన్ నుంచి అంతరిక్షంలో అడుగుపెట్టే రాకెట్ ప్రయోగాల దాకా.. అన్నీ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ద్వారా ఆవిష్కృతమైనవే’ అంటున్నారు.. శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డ్-2014 గ్రహీత, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (హైదరాబాద్) ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్. వెంకట మోహన్. పరిశోధనల్లో రెండు దశాబ్దాలకుపైగా అనుభవం ఉన్న ఆయన... వ్యర్థాల నుంచి జీవ ఇంధన వనరుల ఆవిష్కరణల కోసం కృషి చేశారు. దీనికి గుర్తింపుగా దేశంలో ఇంజనీరింగ్ సెన్సైస్‌లో అత్యున్నత పురస్కారంగా, సైన్స్‌లో భారతదేశ నోబెల్ బహుమతిగా భావించే ‘శాంతి స్వరూప్ భట్నాగర్’ అవార్డ్‌కు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో డాక్టర్ ఎస్.వెంకట మోహన్‌తో ఇంటర్వ్యూ..
కృషికి తగ్గ గుర్తింపు
నా పరిశోధనలకు గుర్తింపుగా నేషనల్ బయోసైన్స్ అవార్డ్ (2012), యునెటైడ్ నేషన్స్ యూనివర్సిటీ అండ్ ఎల్సెవియర్ అందించే యంగ్ రీసెర్చర్ అవార్డ్ తదితర జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ఎన్నో లభించాయి. శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డ్‌కు ఎంపికవడం మాత్రం ఎంతో ఆనందాన్నిచ్చింది.
ఇంటర్ డిసిప్లినరీతో.. ఇంటిగ్రేటెడ్ నైపుణ్యాలు
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ ఉంటే మరిన్ని నైపుణ్యాలు, అవకాశాలు సొంతమవుతాయి. ఉదాహరణకు సివిల్ ఇంజనీరింగ్ అభ్యర్థి ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్‌లోనూ నైపుణ్యం పొందితే బహుళ ప్రయోజనాలు లభిస్తాయి. అదేవిధంగా ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్‌లో బయో ఇంజనీరింగ్ చదివితే పర్యావరణ కాలుష్య సమస్యల పరిష్కారానికి అవసరమైన అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. కాబట్టి కోర్సుల స్వరూపంలోనే ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ ఇమిడి ఉండేలా కరిక్యులం రూపొందించాలి.
సైన్స్.. ఆసక్తి ఉంటే అద్భుతాల సృష్టికి మార్గం
సైన్స్ కోర్సుల్లో చేరితే కెరీర్‌లో స్థిరపడేందుకు సుదీర్ఘ కాలం వేచి చూడాలనే ఆలోచనలో నేటి యువత ఉన్నారు. కోర్సులు పూర్తవగానే కెరీర్ సెటిల్‌మెంట్‌నే లక్ష్యంగా ఎంచుకుంటున్నారు. ఇందులో తప్పు లేదు. కానీ సైన్స్ రంగంలో అనేక అవకాశాలున్నాయని గుర్తించాలి. ఇటీవల కాలంలో ప్రభుత్వం కూడా సైన్స్ కోర్సులవైపు యువత ఆకర్షితులయ్యేలా, పరిశోధనల దిశగా అడుగులు వేసేందుకు ఇన్‌స్పైర్ స్కాలర్‌షిప్స్ తదితర అనేక ప్రోత్సాహకాలు అందిస్తోంది. అంతేకాకుండా పీహెచ్‌డీ స్థాయిలో అందించే ఫెలోషిప్, స్కాలర్‌షిప్ మొత్తాలను కూడా పెంచింది. కాబట్టి విద్యార్థులకు సైన్స్ పట్ల, సైన్‌స కోర్సులతో అందివచ్చే అవకాశాల గురించి అవగాహన కల్పించడంపై దృష్టిపెట్టాలి. కొంతమంది విద్యార్థులకు సైన్‌స అంటే ఆసక్తి ఉన్నప్పటికీ అవకాశాలు గురించి తెలియక వేరే కోర్సుల్లో చేరుతున్నారు. వాస్తవానికి ఇతర విభాగాలతో పోల్చితే సామాజిక అవసరాలకు, దైనందిన జీవితంలో వినియోగించే అనేక వస్తువులు ఆవిష్కృతమైంది సైన్స్ పరిశోధనల ద్వారానే! దీన్ని గమనించి ఆసక్తితో అడుగులు వేస్తే అద్భుతాలు సృష్టించేందుకు సైన్స్‌లో అవకాశాలెన్నో!!
బోధనలో ప్రాక్టికాలిటీ
విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి కలిగించే విషయంలో పాఠశాల స్థాయి నుంచే మార్పు రావాలి. ఈ దిశగా ఉపాధ్యాయులు కూడా కీలక పాత్ర పోషించాలి. విద్యార్థుల ఆసక్తిని గమనించి, భవిష్యత్తు అవకాశాల గురించి తెలియజేస్తూ ప్రోత్సహించాలి. ఇందుకు చక్కటి మార్గం.. బోధనలో ప్రాక్టికల్ అప్రోచ్‌కు ప్రాధాన్యమివ్వడం. దీని ద్వారా ప్రతి విద్యార్థిలోని సహజ ఆసక్తులు, అభిరుచులు వెలుగులోకి వస్తాయి. ఫలితంగా సదరు విద్యార్థి భవిష్యత్తులో రాణించగల రంగం ఏంటో తెలుస్తుంది. ఆ మేరకు వారికి మార్గనిర్దేశనం చేసే వీలు లభిస్తుంది.
యూనివర్సిటీల స్థాయిలో
దేశంలో ఇప్పుడు అనేక ఇన్‌స్టిట్యూట్‌లు ఆర్ అండ్ డీ కార్యకలాపాల పెంపుదల దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. అయితే, వాస్తవ అవసరాలతో పోల్చితే ఇంకా ఎంతో చేయాల్సి ఉంది. కాబట్టి అన్ని స్థాయిల్లో, అన్ని యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లలో ఆర్ అండ్ డీకి ప్రోత్సాహం దిశగా చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్‌లు, రీసెర్చ్ ఓరియెంటెడ్ సంస్థల్లో నిధులు, మౌలిక సదుపాయాల పరంగా ఆకర్షణీయ ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి. స్టేట్ యూనివర్సిటీల్లోనూ ఈ సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లు, యూనివర్సిటీలు పరిశ్రమ వర్గాలతో ఒప్పందాల ద్వారా స్పాన్సర్డ్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ నిర్వహించే దిశగా కృషి చేయాలి. అంతేకాకుండా రీసెర్చ్ ఓరియెంటెడ్ ఇన్‌స్టిట్యూట్‌ల సంఖ్య కూడా పెరగాల్సిన అవసరం ఉంది.
నిత్యాన్వేషణే.. నైపుణ్యాలకు మార్గం
సైన్స్ కోర్సుల్లో అద్భుత నైపుణ్యాల సాధనకు నిత్యం అన్వేషించే దృక్పథంతో ముందుకు సాగాలి. అనునిత్యం మన చుట్టూ జరుగుతున్న పరిణామాలను గమనిస్తుండాలి. పుస్తకంలో చదువుకున్న అంశం.. వాస్తవ పరిస్థితుల్లో, నిజ జీవితంలో ఉపయోగపడుతున్న తీరుపై అవగాహన పొందాలి. సైన్స్‌లో ఇలాంటి తులనాత్మక అధ్యయనం ఎంతో అవసరం. మనం వినియోగించే ప్రతి వస్తువు ఆవిష్కరణ వెనుక సైన్స్ భావనలు ఇమిడి ఉంటాయి. గృహోపకరణాల ఆవిష్కరణలకైనా.. గ్రహాంతర ప్రయోగాలకైనా మూలం సైన్స్‌లోనే ఉంది.
అభిరుచికి అనుగుణంగా అడుగులు
నేటి విద్యార్థులు తమ అభిరుచి, ఆసక్తికి అనుగుణంగా ఉన్నత విద్య, కెరీర్ పరంగా అడుగులు వేయాలి. ఇంటర్మీడియెట్ స్థాయిలోనే దీనికి పునాదులు వేసుకోవాలి. ఈ క్రమంలో తల్లిదండ్రుల సహకారం, తోడ్పాటు కూడా ఎంతో అవసరం. సైన్స్ రంగాన్ని కెరీర్‌గా ఎంపిక చేసుకునే విద్యార్థులు నిత్య నూతనంగా వ్యవహరించాలి. ఏ దశలోనూ నిరుత్సాహానికి గురి కాకూడదు. చేపట్టిన ప్రతి పరిశోధన లేదా ప్రాజెక్ట్ విజయం సాధించాలనుకోకూడదు. ఇప్పుడు మనం ఆస్వాదిస్తున్న ఎన్నో సదుపాయాలు, సౌకర్యాల వెనుక ఎందరో శాస్త్రవేత్తల ఏళ్ల తరబడి శ్రమ ఉంది. వారంతా ఎన్నో వైఫల్యాలు ఎదుర్కొన్నాకే విజయం సాధించారు. కాబట్టి.. నిరుత్సాహం, నిస్పృహ అనే మాటలకు చోటు లేకుండా వ్యవహరిస్తే కచ్చితంగా భవిష్యత్తులో వ్యక్తిగత, వృత్తిపరమైన సంతృప్తి లభించడం ఖాయం. అంతేకాకుండా తమ పరిశోధనలు సమాజానికి మేలు చేస్తాయి అనే సానుకూల దృక్పథంతో వ్యవహరించాలి. ఉన్నత విద్య అంటే పీజీ మాత్రమే అనే ఆలోచన వదిలి పీహెచ్‌డీ, పోస్ట్ డాక్టోరల్ డిగ్రీలు కూడా ఉన్నాయని గుర్తిస్తే అద్భుత అవకాశాలు అందుకోవచ్చు!!