వచ్చేవారంలో ఎంసెట్ నోటిఫికేషన్ | EAMCET Notification vaccevaranlo | Sakshi
Sakshi News home page

వచ్చేవారంలో ఎంసెట్ నోటిఫికేషన్

Published Thu, Feb 5 2015 2:39 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

EAMCET Notification vaccevaranlo

  •  ‘సెట్’లకు కన్వీనర్ల నియూమకం
  • సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘ఎంసెట్’కు వచ్చే వారంలోనే నోటిఫికేషన్ జారీ చేసే అవకాశముంది. ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) తేదీల ఖరారు ఆలస్యమయిన నేపథ్యంలో.. వాటి నోటిఫికేషన్ల జారీని వేగవంతం చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సెట్)ల నిర్వహణకు కన్వీనర్లను నియమించింది. వివిధ ప్రవేశ పరీక్షలను నిర్వహించాల్సిన వర్సిటీలను ఉన్నత విద్యా మండలి ఇంతకుముందే ఖరారు చేసింది.

    వాటి నిర్వహణ బాధ్యతలను ఎవరికి అప్పగించాలనేదానిపై ప్రతి వర్సిటీ నుంచి ముగ్గురి పేర్లను సూచించాలని మండలి ఆదేశించింది. ఈ మేరకు ఆయా వర్సిటీల నుంచి అందిన జాబితాలో నుంచి ‘సెట్’లకు కన్వీనర్లను ఎంపిక చేసింది. మండలి చైర్మన్ ప్రాఫెసర్ పాపిరెడ్డి బుధవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో సమావేశమై కన్వీనర్ల నియామకంపై చర్చించారు. అనంతరం సీఎం కేసీఆర్‌తోనూ భేటీ అయ్యారు. ఆ తర్వాత కన్వీనర్ల పేర్లను ప్రకటించారు.

    ఈ మేరకు బుధవారమే వారికి ఉత్తర్వులను కూడా అందజేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా, విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు చేపడతామని ఎంసెట్ కన్వీనర్‌గా ఎంపికైన జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ ఎన్వీ రమణారావు తెలిపా రు. ఎంసెట్ కమిటీని ఏర్పాటు చేసి, పక్కా ప్రణాళికతో నోటిఫికేషన్ జారీ చేస్తామని... వీలైతే వచ్చే వారంలోనే ఎంసెట్ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని వెల్లడించారు. అయితే ‘ఎంసెట్’కు కన్వీనర్‌గా ఎన్వీ రమణారావు నియామకం కావడం ఇది ఆరోసారి. గత ఐదేళ్లలో పకడ్బందీగా ఎంసెట్‌ను నిర్వహించిన నేపథ్యంలో.. ఈ సారి కూడా ఆయనకే బాధ్యతలు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement