- వ్యవసాయ కోర్సుల్లో పాసైనప్పటి నుంచి ఏడాదికో మార్కు కేటాయింపు
- మొత్తం పోస్టులో డిప్లొమా వారికి 80 శాతం
సాక్షి, హైదరాబాద్: సహాయ వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఏఈవో) ఉద్యోగాల్లో అభ్యర్థులకు కోర్సుల్లో ఉత్తీర్ణత పొందిన సంవత్సరం ఆధారంగా వెయిటేజీ ఇవ్వనున్నారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు నిర్దేశిత వ్యవసాయ, ఉద్యాన కోర్సులో ఉత్తీర్ణత సాధించినప్పటి నుంచి ఇప్పటివరకు ఏడాదికి ఒక మార్కు చొప్పున వెయిటేజీ ఇవ్వాలని ‘నియామకపు కమిటీ’ నిర్ణయించింది. ఉదాహరణకు అభ్యర్థి సంబంధిత కోర్సులో 2010లో ఉత్తీర్ణత సాధిస్తే.. ఇప్పటివరకు నాలుగేళ్లుగా పరిగణించి ఏడాదికి ఒక మార్కు చొప్పున నాలుగు మార్కులు వెయిటేజీగా ఇస్తారు.
ఈ పోస్టులన్నింటినీ జిల్లా స్థాయిలో మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తుండడంతో.. ఆ మెరిట్‌కు ఈ వెయిటేజీని కలిపి లెక్కించి నియామకాలు చేపడతారు. ఏఏఈవో పోస్టుల భర్తీ అంశంపై ‘ఏఏఈవో నియామకపు కమిటీ’ శనివారం సమావేశమైంది. ‘వెయిటేజీ’తో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
ముందుగా పేర్కొన్నట్లు ఏఏఈవో ఉద్యోగాలకు వ్యవసాయ, ఉద్యాన కోర్సుల్లో డిప్లొమా చేసిన అభ్యర్థులు మాత్రమే అర్హులు. కానీ తమకూ అవకాశం కల్పించాలని ఆయా విభాగాల్లో డిగ్రీ, పీజీ కోర్సులు చేసిన అభ్యర్థులు చేసుకున్న విన్నపంతో పాటు పలువురు అభ్యర్థుల నుంచి వచ్చిన సూచనలు, సలహాలను కమిటీ పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు ప్రకటించింది.
80 శాతం ఉద్యోగాలు డిప్లొమా వారికే: నియామకపు కమిటీ తీసుకున్న నిర్ణయాల ప్రకారం... మొత్తం 4,442 ఏఏఈవో పోస్టుల్లో 80 శాతం వ్యవసాయ, ఉద్యాన కోర్సుల్లో డిప్లొమా చేసిన అభ్యర్థులకు కేటాయిస్తారు. మిగతా 20 శాతం పోస్టులను బీఎస్సీ, ఎంఎస్సీ పూర్తిచేసిన వారికి కేటాయిస్తారు. ఈ మొత్తం పోస్టుల్లో 20 శాతం (888) పోస్టులను ఉద్యాన శాఖకు కేటాయించాలని నిర్ణయించారు.