► డీఎస్సీ నిర్వహించినా వారికి అవకాశం అనుమానమే..
► డీఎస్సీ–2002 నోటిఫైడ్ పోస్టుల కంటే అత్యధికంగా భర్తీలు
► తాజాగా 83 మందికి పోస్టింగ్‌లు
► గతంలో కాదన్న రాష్ట్ర అధికారులే తాజా భర్తీలకు ఆదేశించిన వైనం
► డీఎస్సీ 2002 అన్‌ట్రైన్డ్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం
శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వం ఇకపై డీఎస్సీలు నిర్వహించినా అందులో హిందీపండిట్ పోస్టులు ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. డీఎస్సీ–2002 ద్వారా పరీక్ష రాసిన అభ్యర్థుల్లో నోటిఫైడ్ పోస్టుల కంటే దఫదఫాలుగా అత్యధికంగా భర్తీచేయడమే దీనికి కారణం. నోటిఫైడ్ పోస్టుల కంటే అధికంగా భర్తీ చేయడం సాధ్యం కాకపోయినా డీఎస్సీ –2002 హిందీపండిట్ పోస్టుల భర్తీమాత్రం ఇందుకు విరుద్ధంగా జరిగింది. కోర్టు తీర్పుపేరిట పలువురు విద్యాశాఖ అధికారులు నోటిఫైడ్ పోస్టుల కంటే అధికంగా భర్తీ చేశారు. డీఎస్సీ–2002లో 339 హిందీపండిట్ పోస్టులను నోటిఫైడ్ చేశారు.
అప్పట్లో కొన్ని రాష్ట్రేతర శిక్షణా కేంద్రాల్లో శిక్షణ పొందిన వారికి పోస్టింగ్‌లు ఇవ్వవద్దని చెప్పడంతో రాష్ట్రంలో చదివినవారికి మాత్రం పోస్టింగ్‌లు ఇచ్చారు. దీంతో ఇతర రాష్ట్రాల్లో శిక్షణ పొందిన వారు కోర్టును ఆశ్రయించగా అక్కడ వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. వీరందరికి పోస్టింగ్‌లు ఇవ్వడంతో నోటిఫైడ్‌పోస్టులన్నీ భర్తీ అయిపోయాయి. అటు తర్వాత మరికొందరు కోర్టును ఆశ్రయించగా వారికి కూడా కోర్టులో అనుకూలంగా తీర్పువెలువడింది. ఇలా అభ్యర్థులంతా కోర్టును ఆశ్రయించినప్పుడల్లా వారికి అనుకూలంగా తీర్పువచ్చింది. ఇటువంటి వారందరికి పోస్టింగ్‌లు ఇచ్చేందుకు అధికారులు అప్పట్లో పెద్ద ఎత్తున వసూళ్లు చేశారన్న ఆరోపణలు కూడా వచ్చాయి.
ఓ విధంగా చెప్పాలంటే డీఎస్సీ 2002 హిందీపండిట్ పోస్టుల భర్తీ కొందరు అధికారులకు కల్పవృక్షంగా మారిందన్న వ్యాఖ్యానాలు కూడా వినిపించాయి. ఇలా పలువురు అధికారులు డీఎస్సీ 2002లో పరీక్ష రాసిన హిందీపండిట్‌లలో 399 మందికి పోస్టింగ్‌లు ఇచ్చారు. దీంతో కొందరు అభ్యర్థులు రాష్ట్రాధికారులను ఆశ్రయించి నోటిఫైడ్ పోస్టుల కంటే అధికంగా ఎలా భర్తీ చేశారని, ఆ వివరాలను తెలపాలని సమాచార హక్కు చట్టం ద్వారా కోరారు. అప్పుడు స్పందించిన రాష్ట్ర అధికారులు ఇకపై డీఎస్సీ 2002 హిందీపండిట్ పోస్టులను భర్తీ చేయవద్దని ఆదేశిస్తూ ఇక మీదట జరిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అప్పటి నుంచి భర్తీలు జరపకపోగా తాజాగా శనివారం మరో 83 మందికి పోస్టింగ్‌లు ఇవ్వడం గమనార్హం.
గతంలో భర్తీలు జరపవద్దన్న అధికారులే తాజా భర్తీలకు అనుమతినివ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని ఓ శాసనసభ్యుని బంధువు, ‘ముఖ్య’నేతకు సమీప బంధువునని చెప్పుకుంటున్న వ్యక్తి చక్రం తిప్పి తాజా భర్తీలు చేయించినట్లు విద్యాశాఖలోని కొందరు ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. కారణం ఏదైనప్పటికీ నోటిఫైడ్ పోస్టుల కంటే 150 వరకు అధికంగా పోస్టులు భర్తీచేయడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 83 మందికి పోస్టింగ్‌లు ఇవ్వగా, అంతస్థాయిలో హిందీపండిట్ పోస్టులు ఖాళీగా లేకపోవడంతో ఎస్‌జీటీ పోస్టులలో వీరిని నియమించారు. భవిష్యత్‌లో ఖాళీ అయ్యే హిందీపండిట్ పోస్టులలో ఇటువంటి వారినందరినీ బదలాయిస్తూ రావాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు హిందీపండిట్ పోస్టులు డీఎస్సీలో నోటిఫై అయ్యే అవకాశాలు ఉండవు.
అన్‌ట్రైన్డ్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం
డీఎస్సీ 2002 అన్‌ట్రైన్డ్ హిందీ పండిట్ అభ్యర్థుకు తీవ్ర అన్యాయం జరిగిందనే చెప్పాలి. అప్పట్లో బ్యాక్‌లాగ్‌గా ఉండిపోయిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, పోస్టుల భర్తీకి అన్‌ట్రైన్డ్ డీఎస్సీని నిర్వహించారు. అప్పట్లో ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో శ్రీకాకుళం మినహా, మిగిలిన అన్నజిల్లాల్లో అన్‌ట్రైన్డ్ హిందీపండిట్ల పోస్టింగ్‌లు ఇచ్చినా శ్రీకాకుళంలో మాత్రం భర్తీలు జరగలేదు. అన్‌ట్రైన్డ్ హిందీ పండిట్‌లకు జిల్లాలో పోస్టింగ్‌లు ఇవ్వకపోయినా మిగిలిన కేటగిరీలైన తెలుగు, ఉర్దూ, సంస్కృతం పండిట్‌పోస్టులతో పాటు ఎస్‌జీటీ అన్‌ట్రైన్డ్ అభ్యర్థులకు మాత్రం పోస్టింగ్‌లు ఇచ్చారు. అప్పట్లో అన్‌ట్రైన్డ్ అభ్యర్థుల కోసం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌లో అన్‌ట్రైన్డ్ హిందీ పండిట్‌ల కోసం సుమారు 100 పోస్టులను నోటిఫై చేశారు.
అయితే వీరికి పోస్టింగ్‌లు ఇవ్వకపోవడంతో వీరు కూడా కోర్టును ఆశ్రయించారు. వీరందరికి పోస్టింగ్‌లు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ తీర్పును మాత్రం ఏ అధికారీ పట్టించుకోలేదు. ట్రైన్డ్ హిందీపండిట్‌లకు మాత్రం నోటిఫైడ్ పోస్టుల కంటే అధికంగా పోస్టింగ్‌లు ఇవ్వడం వెనుక కొందరు విద్యాశాఖాధికారుల అవినీతి, కొన్ని శిక్షణా కేంద్రాల యజమానుల వసూళ్ల పాత్ర ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవమెంత అన్నది అటుంచితే నోటిఫైడ్ పోస్టుల కంటే అధికంగా భర్తీలు చేయడం భవిష్యత్‌లో హిందీపండిట్ పోస్టులు భర్తీలు లేకుండా చేయడంపై పలువురు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హిందీ పండిట్ పోస్టుల భర్తీ లేనట్లే!
Published Sun, Aug 20 2017 4:39 AM | Last Updated on Tue, Sep 12 2017 12:30 AM
Advertisement
Advertisement