ఎస్వీయూ రీసెట్ ఇప్పట్లో లేనట్టే ! | sv currently does not reset | Sakshi
Sakshi News home page

ఎస్వీయూ రీసెట్ ఇప్పట్లో లేనట్టే !

Published Sat, Dec 13 2014 3:04 AM | Last Updated on Sat, Sep 2 2017 6:04 PM

ఎస్వీయూ  రీసెట్ ఇప్పట్లో లేనట్టే !

ఎస్వీయూ రీసెట్ ఇప్పట్లో లేనట్టే !

నోటిఫికేషన్ విడుదలలో జాప్యం
ఆసక్తి చూపని అధికారులు

 
యూనివర్సిటీ క్యాంపస్: ఎస్వీ యూనివర్సిటీ లో ఎంఫిల్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి నియామక ప్రక్రియ (రీసెట్) అటకెక్కింది. ఏడాది కాలంగా అదిగో, ఇదిగో అంటూ అధికారులు కప్పదాట్లు వేస్తున్నారు. చివరిసారిగా గత ఏడాది జూన్‌లో ప్రవేశ ప్రకటన వెలువడింది. డిసెంబర్‌లో అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించారు. అయితే ఆ నోటిఫికేషన్‌లో ఎక్కువ ఖాళీలను నింపలేదు. ఒక్కో అధ్యాపకుడి వద్ద ఒక ఫుల్‌టైం, ఒక పార్ట్‌టైం పీహెచ్‌డీ పరిశోధకులను మాత్రమే చేర్చుకున్నారు. దీంతో ప్రవేశ పరీక్షలు రాసిన వేలాది మందికి నిరాశ ఎదురైంది. ఇకపై ప్రతి ఏటా నోటిఫికేషన్ ఇస్తాం, పీజీ కోర్సులాగా అడ్మిషన్లు నిర్వహిస్తామంటూ అధికారులు చేసిన ప్రకటనలు నీటి మీద రాతల్లా మారాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఎంఫిల్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ ఇవ్వలేదు. పీజీ ప్రవేశాలు పూర్తవ్వగానే నోటిఫికేషన్ ఇస్తామంటూ అధికారులు ప్రకటించారు. ఆ ప్రక్రియ ఇంతవరకు మొదలు కాలేదు. నోటిఫికేషన్ విడుదల కోసం నాలుగైదు సార్లు సమావేశాలు నిర్వహించారు. అయి నా ఫలితం లేదు. ఈ ప్రక్రియ ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు.

 ఆది నుంచీ నిర్లక్ష్యమే

 ఎంఫిల్, పీహెచ్‌డీ ప్రవేశాల విషయంలో ఆది నుంచీ అలక్ష్యమే జరుగుతోంది. గత నోటిఫికేషన్ పూర్వపరాలు పరిశీలిస్తే.. 2005లో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏడాది తర్వాత 2006లో అడ్మిషన్లు చేశారు. అలాగే 2007 ఏప్రిల్‌లో నోటిఫికేషన్ ఇచ్చి 2008 మేలో అడ్మిషన్లు జరిపారు. 2009 జూన్‌లో నోటిఫికేషన్ విడుదల చేసి 2010 మేలో అడ్మిషన్లు జరిపారు. ఆ తర్వాత దాదాపు నాలుగేళ్లు నోటిఫికేషన్ విడుదల చేయలేదు.

 గత  ఏడాది మేలో నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్, జనవరిలో అడ్మిషన్లు ప్రక్రియ ఇచ్చారు. నిబంధనల ప్రకారం కనీసం రెండేళ్లకొకసారి నోటిఫికేషన్ ఇచ్చి సకాలంలో అడ్మిషన్లు జరపాలి. ఐఐటీలో కేంద్రియ విశ్వవిద్యాలయాలు ప్రతి ఏటా పీజీ ప్రవేశ ప్రకటనతో పాటు ఎంఫిల్, పీహెచ్‌డీ ప్రకటన విడుదల చేసి, పీజీ కోర్సులతో పాటే అడ్మిషన్లు నిర్వహిస్తారు. ఎస్వీయూలో కూడా ఇదే విధానాన్ని పాటిస్తామని అధికారులు చాలా సందర్భాల్లో ప్రకటించినా అమలులో మాత్రం చిత్తశుద్ధి చూపలేదు

ఖాళీల సేకరణ

 ఈ ఏడాది ఎంఫిల్, పీహెచ్‌డీ ప్రవేశ ప్రకటన విడుదల చేయడం కోసం ఎస్వీయూ అధికారులు అధ్యాపకుల నుంచి ఖాళీల వివరాలు సేకరించారు. ఇది జరిగి మూడు నెలలు పూర్తయింది. యూజీసీ నిబంధనల ప్రకారం ప్రొఫెసర్ కింద ఆరుగురు, అసోసియేట్ కింద నలుగురు, అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద ముగ్గురిని పీహెచ్‌డీ కోర్సులో చేర్చుకోవచ్చు. 2010 తర్వాత పూర్తిస్థాయి అడ్మిషన్లు జరగనందువల్ల చాలా ఖాళీలు ఉన్నాయి.

వచ్చే ఏడాది 33 మంది ఉద్యోగ విరమణ

ఎస్వీ యూనివర్సిటీలో వచ్చే ఏడాది 33 మంది అధ్యాపకులు ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ ఏడాది జూన్ నుంచి పాతిక మంది ఉద్యోగ విరమణ చేశారు. నోటిఫికేషన్ ఆలస్యమైతే వచ్చే ఏడాది ఉద్యోగ విరమణ చేసే అధ్యాపకులు తమ వద్ద పరిశోధక విద్యార్థులను చేర్చుకునే అవకాశం కోల్పోతారు.

ఈసారి ఎంఫిల్ ఉండదు

రానున్న రీసెట్ నోటిఫికేషన్‌లో ఎంఫిల్ కోర్సును ఎత్తివేసే ఆలోచనలో అధికారులు ఉన్నారు. డిగ్రీ అధ్యాపక పోస్టుల కోసం అభ్యర్థులకు నెట్, సెట్ లేదా పీహెచ్‌డీ అర్హతలున్నాయి. గతంలో ఎంఫిల్ డిగ్రీ ఉన్నవారికి డిగ్రీ అధ్యాపక పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. దీనిని తొలగించారు. దీంతో ఎంఫిల్ డిగ్రీ ఉన్నా అభ్యర్థులకు కలిగే ప్రయోజనం లేదు. దీంతో ఈ కోర్సును రద్దు చేసే పనిలో అధికారుల పడ్డారు.

నోటిఫికేషన్ ఇప్పుడు లేనట్టే..

ఎస్వీయూ అడ్మిషన్ల విభాగం డెరైక్టర్‌గా పి.భాస్కర్‌రెడ్డి, జాయింట్ డెరైక్టర్‌గా మునిరత్నం, డెప్యూటీ డెరైక్టర్‌గా పీసీ వెంకటేశ్వర్లు పనిచేస్తున్నారు. వీరి పదవీకాలం ఫిబ్రవరి మొదటి వారంలో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి మొదటి వారంలోపు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తిచేయడం కష్టమన్న నిర్ణయానికి అధికారులు వచ్చారు. అందువల్ల నోటిఫికేషన్ విడుదలపై మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఫిబ్రవరి తర్వాత వచ్చే అధికారులు చూసుకుంటారు..

తామెందుకు రిస్క్ తీసుకోవాలన్న ఆలోచనలో ప్రస్తుత అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. దీనివల్లే నోటిఫికేషన్ విడుదలలో ఆలస్యం జరుగుతోందన్న ప్రచారం సాగుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కొత్త అధికారులు బాధ్యతలు స్వీకరిస్తే వెంటనే పీజీ ప్రవేశ ప్రక్రియ మొదలు పెట్టాల్సి ఉంటుంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే వచ్చే జూన్ వరకు నోటిఫికేషన్ విడుదల కాకపోవచ్చు. ఇంకా ఆలస్యమైనా కావచ్చని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement