అభిప్రాయం
విద్యకు సాటి వచ్చే ధనం లేదనేది సుభాషితం. కాని నేటి వ్యాపార యుగంలో ధనం అన్ని రంగాలనూ శాసిస్తున్నట్టే... విద్య మీద కూడా ఆధిపత్యాన్ని చలాయిస్తూ దాన్ని అంగడి సరుకుగా దిగజారుస్తోంది. నేడు సాధారణ డిగ్రీలు మొదలుకొని విద్యారంగంలో అత్యున్నత అర్హతలకు సంబంధించిన పట్టాల వరకు కొనగలిగిన స్తోమత ఉన్నవారికి లభించడం ఈ దుఃస్థితికి నిదర్శనం.
ముఖ్యంగా విదేశాలలోనూ, ఉత్తర భారతదేశంలోనూ పుట్టగొడుగుల్లా వెలుస్తున్న నకిలీ విశ్వవిద్యాలయాలు విక్రయిస్తున్న ఈ డిగ్రీలను ప్రచార వ్యామోహం గల సంపన్నులు తమ పేర్లకు అలంకారాలుగా తగిలించుకొని, అవి తమ ప్రతిభాచిహ్నాలుగా చాటుకుంటున్నారు. ఊరేగింపులు, అభినందన సభలు, విందులు, వినోదాలు ఏర్పాటు చేసుకొని అవి తమ కీర్తి కిరీటాలుగా జనాన్ని భ్రమపెడుతున్నారు. ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి తనకో విదేశీ సంస్థ డాక్టరేట్‌ను ఇవ్వజూపితే ‘డాక్టరేట్ ఇంత తేలికా?’ అని నిజాయతీగా వ్యాఖ్యానించడమే కాదు, తెచ్చుకున్న ఆ డాక్టరేట్ బిరుదును ఎప్పుడూ తన పేరు ముందు, కనీసం ‘నవ్విపోదురు గాక’ పుస్తక రచయితగా కూడా ఉపయోగించలేదు. అలా ప్రలోభాలకు లొంగకుండా అర్హత లేని బిరుదులను తోకలుగా ఉపయోగించని వారు అరుదు. నకిలీ విద్యార్హతలతో ఆత్మవంచనకు, పరవంచనకు పాల్పడుతున్న పెద్దమనుషులే ఎక్కువ.
డాక్టరేట్ల సంతర్పణకు కాణాచులుగా మన విశ్వవిద్యాలయాలను చెప్పుకోవాలి. పీహెచ్‌డీ పట్టాల కోసం పరిశోధనలు ఉద్యోగాలకో, పదోన్నతులకో అవసరం కావడంతో నాటి ప్రమాణాలు దిగజారుతున్నాయి. ఈ జాతరలో పరిశోధక విద్యార్థులు అడ్డదారులను వెతు క్కుంటుంటే పర్యవేక్షకులు వారి కోర్కెలకు అనుగుణంగా తోడ్పడి లబ్ధి పొందుతున్నారు. ‘కాదేదీ కవిత కనర్హం’ అన్నట్లు పరిశోధన ఆవశ్యకత లేని, కేవలం ‘మెథడాలజీ’ చట్రంలో ఇమిడ్చి పీహెచ్‌డీ పట్టాను పొందే సులభమైన, ఎందుకూ పనికిరాని అంశాన్ని పరిశోధక విద్యార్థికి సూచించడం... విద్యార్థి ఆర్థికంగా ఆశపెడితే సిద్థాంత గ్రంథాన్ని తామే అన్నీ రాసి ఇవ్వడం కొందరు పర్యవేక్షక గురువులు చేస్తున్న నిర్వాకాలు. విశ్వవిద్యాలయాల వెలుపల సిద్ధాంత గ్రంథ రచనకు ధరను మాట్లాడుకొని రాసిపెట్టడం వృత్తిగా కలిగిన నిరుద్యోగ మేధావులు కూడా ఉండడంతో కొందరు పరిశోధకులు వారు అడిగిన డబ్బిచ్చి శ్రమ పడకుండా ‘డాక్టర్లు’ అనిపించుకుంటున్నారు.
తెలుగే కాదు, ఆంగ్లం, హిందీ వంటి ఇతర భాష ల్లోనూ, సాంఘిక విజ్ఞాన శాస్త్ర విభాగాల్లోనూ పరిశోధనల స్థాయి భిన్నంగా లేదు. కొందరు ప్రబుద్ధులు ఎలాగోలా ‘పీహెచ్‌డీ’ అనిపించుకుంటే చాలని పూర్వుల కృషిని కొల్ల గొట్టి రాసిన సిద్ధాంత గ్రంథాలకు కూడా అయ్యవార్ల ఆశీస్సులతో ఆమోద ముద్రను వేయించుకొని ‘మమ’అంటున్న సందర్భాలు కూడా లేక పోలేదు. అయితే పరిశోధనలన్నీ కాకి బంగారం బాపతేననీ, యోగ్యతకూ నిజాయతీకి స్థానం లేదనీ అనడం కువిమర్శే అవుతుంది.
విశ్వవిద్యాలయాలు వివిధ రంగాలలో– ప్రతిభామూర్తులను గుర్తించి వారికి గౌరవ డాక్టరేట్లను, కళాప్రపూర్ణ వంటి బిరుదులనూ ప్రకటించడం ఆనవాయి తీగా వస్తోంది. అయితే వాటిని కానీ, కొన్ని ప్రామాణిక సంస్థలు ఇస్తున్న బిరుదులను కానీ విశ్వనాథ, శ్రీశ్రీ, జాషువా, పుట్టపర్తి, సినారె, ఆరుద్ర వంటి దిగ్దంతులెవరూ ఎప్పుడూ, ఎక్కడా భుజకీర్తులుగా వినియోగించుకోలేదు. ఏనుగులపై ఊరేగించినా, గురుతుల్యుల చేత గండ పెండేరాలతో సన్మానింపబడినా వారు వాటిని స్వోత్కర్షగా వాడుకోలేదు. కానీ నేడు కీర్తి కాంక్షతో అభినవ కృష్ణదేవరాయలం అనుకునే కవి పోషకులు, ‘అంతా కవులము కామా’ అనుకునే చిల్లర కవులు ఎక్కువయ్యారు.
చదవండి: ఇది మాయ కాక మరేమిటి?
వారు ఆశ్రిత కవులకు ‘కవిరత్న’, ’కవిశేఖర’, ‘కవితిలక’ వంటి బిరుదులను ప్రదానం చేసి శాలువాలను కప్పడం... వీరు మరునాడు స్థానిక పత్రికలలో ఆ సత్కారాల గురించి ఘనంగా రాయించుకోవడం ప్రహస నమైపోయింది. ఇటీవల కొన్ని సంస్థలు ఏకంగా కొందరు స్థానిక కవులకు ‘గౌరవ డాక్టరేట్’లను కూడా ప్రదానం చేస్తున్నాయి. కొంతనయం– పద్మ పురస్కారాలను కూడా ప్రకటించడం లేదు! ఏ హక్కు, అధికారం లేకుండా ఎవరు పడితే వారు ఇలా బిరుదులనివ్వడం, ప్రతిభాశూన్యులైన కవులు కూడా వాటిని అలంకారాలుగా ప్రదర్శించడం సమాజానికి హానికరం. దీనికి నియంత్రణ అవసరం!
చదవండి: ఎవరిని ఎలా పిలవాలి?
ఇటీవల ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు రాహుల్ ద్రావిడ్‌కు బెంగుళూరు విశ్వవిద్యాలయం వారు ‘గౌరవ డాక్టరేట్’ను ప్రకటిస్తే ఆయన సున్నితంగా తిరస్కరించడమే గాక ‘అవసరమనుకుంటే ‘నేను థీసిస్‌ను సమర్పించి డాక్టరేట్ తీసుకుంటాను కాని ఉచితంగా కాదు’ అని వ్యాఖ్యానించడం అభినందనీయం. ఆదర్శవంతులు ముఖ్యంగా రాజకీయ, చిత్ర రంగాలకు చెందిన ప్రముఖులు ఎటువంటి ప్రలోభాలకూ లోను కాకుండా గౌరవ డాక్టరేట్ల ప్రత్యేకతను కాపాడుతారని ఆశిద్దాం.
- పైడిపాల
విశ్రాంత తెలుగు ఉపన్యాసకులు
Comments
Please login to add a commentAdd a comment