స్త్రీలోక సంచారం
ఫిమేల్ జెనిటల్ మ్యుటిలేషన్’ కు వ్యతిరేకంగా దాఖలైన ఒక పిటిషన్‌ను విచారిస్తూ, బాలికల జననాంగాల జోలికి మతాచారాలు ఎందుకు వెళ్లాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. జెనిటల్ మ్యుటిలేషన్ వల్ల బాలికల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని సునీతా తివారీ అనే న్యాయవాది వినిపించిన వాదనలను పరిగణనలోకి తీసుకున్న చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఎ.ఎం.ఖాన్విల్కర్, జస్టిస్ చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం.. ‘ ఇటువంటి మతాచారాలను ‘ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ ఆఫెన్సెస్’ (పోక్సో) యాక్ట్ పరిధిలోకి తీసుకురావలసిన అవసరం ఉంది’ అని అభిప్రాయపడింది ::: నర్మదా బచావో ఆందోళన్ ఉద్యమ కార్యకర్త మేధాపాట్కర్, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఛైర్మన్ వి.కె. సక్సేనా మధ్య 18 ఏళ్లుగా సాగుతున్న న్యాయపోరాటంలో ఢిల్లీలోని ఒక కోర్టు పాట్కర్‌ను దోషిగా నిర్ధారించి, ఆమెపై సక్సేనా వేసిన పరువు నష్టం దావాను సమర్థించింది. ఈ కేసులో మొదట మేధాపాట్కర్ తన పైన, తమ ఆందోళన పైన సక్సేనా వార్తాపత్రికలకు అనుచితమైన ప్రకటనలు ఇచ్చారని కోర్టును ఆశ్రయించగా, 2006లో ఒక టీవీ న్యూస్ చానల్‌తో తన పరువు మంటగలిసేలా పాట్కర్ మాట్లాడారని ఆరోపిస్తూ ఆమెపై సక్సేనా పరువునష్టం దావా వేశారు ::: సమాజంలో మహిళలపై జరుగుతున్న హింసను మరణశిక్షలు నిర్మూలించలేవని ఇండియాలోని ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్’ అభిప్రాయపడింది. నిర్భయ సామూహిక అత్యాచారం కేసులోని దోషులు.. కోర్టులు తమకు విధించిన మరణశిక్షను పునఃపరిశీలించాలని వేసుకున్న రివ్యూ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు వారి మరణశిక్షను నిర్ధారించడంపై ఆమ్నెస్టీ ఈ విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
ఇండియన్ ఉమెన్స్ ట్వంటీ20 క్రికెట్ కెప్టెన్, అర్జున అవార్డు విజేత హర్మన్‌ప్రీత్ కౌర్‌కు ఈ ఏడాది మార్చి 1న ఇచ్చిన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ర్యాంకును పంజాబ్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. మీరట్‌లోని ‘చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీ’ నుంచి 2011లో పట్టభద్రురాలైనట్లుగా హర్మన్‌ప్రీత్ పొందుపరిచిన డిగ్రీ సర్టిఫికెట్ నకిలీదని తేలడంతో.. ఈ ఉపసంహరణ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, ఇష్టమైతే ఆమె తన ఇంటర్మీడియట్ విద్యార్హతపై కానిస్టేబుల్‌గా కొనసాగవచ్చునని తెలిపింది ::: ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఇటీవల జెనీవాలో జరిగిన ‘వరల్డ్ హెల్త్ అసెంబ్లీ’ సమావేశంలో సభ్యదేశాలు ‘బెస్ట్‌ఫీడింగ్’కు అనుకూలంగా చేసిన తీర్మానం అమలు కాకుండా ఉండేందుకు అమెరికా అడ్డుపుల్లులు వేసే సూచనలు కనిపిస్తున్నాయి. బిడ్డకు తల్లిపాలే శ్రేష్టమైనవని తేల్చి చెప్పడం ద్వారా పాల పొడి పరిశ్రమలు బిలియన్ డాలర్ల వ్యాపారాన్ని నష్టపోవలసి వస్తుందన్న ఆందోళనలు వ్యక్తం కావడంతో అమెరికా.. ఆ వ్యాపార కుబేరుల తరఫున తీర్మానానికి వంకలు పెట్టాలని చూస్తోంది ::: ఆస్కార్ అకాడెమీలో గౌరవ సభ్యురాలిగా చేరవలసిందిగా తనకు వచ్చిన ఆహ్వానాన్ని ఫ్రాన్స్ నటి ఎమ్మాన్యుయేల్ సీగ్నర్ రెండో మాట లేకుండా తిరస్కరించారు. అత్యాచార ఆరోపణలపై రెండు నెలల క్రితం తన భర్త రోమన్ పొలాన్‌స్కీని అకాడెమీ సభ్యత్వం నుంచి తొలగించడంపై ఆమె తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో తన డ్యాన్స్ వీడియోలను పోస్ట్ చేసిన యువతిని ఇరాన్ ప్రభుత్వం నిర్బధంలోకి తీసుకుంది. ఇరానియన్, పాశ్యాత్య నృత్య సంప్రదాయాలలో డ్యాన్స్ చేస్తూ దాదాపు 300 వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన మేదే హొజాబ్రీ అని ఆ యువతి.. ‘ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకోడానికి మాత్రమే నేనిలా చేశాను తప్ప, మరో ఉద్దేశం లేదు’ అని ఇచ్చిన వివరణను ఇరాన్ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నదీ లేనిదీ వెంటనే తెలియరాలేదు ::: ప్రపంచకప్ ఫుట్‌బాల్ పోటీల వేలంవెర్రితో విసుగు చెందిన పేరు వెల్లడించని ఒక వధువు తన పెళ్లి జరుగుతున్న వేదిక దగ్గర ఫుట్‌బాల్ స్క్రీన్లు పెట్టడం లేదనీ, పెళ్లికి వచ్చినవాళ్లు తమ ఫోన్లలోనైనా మ్యాచ్‌లను చూడటం నిషిద్ధం అని ప్రకటించడం విశేషం అయింది. నిషిద్ధాన్ని మీరి, పెళ్లికి వచ్చినవాళ్లు కొందరు.. స్వీడన్, ఇంగ్లండ్‌ల మధ్య శనివారం జరుగుతున్న మ్యాచ్‌ను అక్కడి ఒక టీవీలో చానల్ మార్చుకుని చూస్తున్న విషయాన్ని గమనించిన వధువు వెంటనే పెళ్లి వేదిక మీద నుంచి దిగి వచ్చి టీవీ ఆఫ్ చేయించింది.