నకిలీ డిగ్రీ వివాదంలో మాజీ క్రికెటర్ భార్య
ఇస్లామాబాద్: నకిలీ డిగ్రీ వివాదంతో పాకిస్థాన్ ప్రతిపక్ష నాయకుడు, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ చిక్కుల్లో పడ్డారు. ఇమ్రాన్ ఖాన్ భార్య రెహమ్ ఖాన్ డిగ్రీ సర్టిఫికెట్ నకిలీదని బ్రిటన్ దినప్రతిక వెల్లడించడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇంగ్లండ్ లోని నార్త్ లిండ్సే కాలేజీలో బ్రాడ్ కాస్ట్ జర్నలిజంలో డిగ్రీ చదినట్టు రెహమ్ ఖాన్ చెప్పుకున్నారు.
అసలు ఆ కాలేజీలో బ్రాడ్ కాస్ట్ జర్నలిజం కోర్సు లేదని, రెహమ్ ఖాన్ పేరుతో ఎవరూ చదవలేదని 'ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్' దినపత్రిక వెల్లడించింది. తన క్వాలిఫికేషన్ పై రెహమ్ ఖాన్ అబద్దం చెప్పారని 'డైలీ మెయిల్' పేర్కొంది. పాకిస్థాన్ చానళ్లు ఈ వార్తను పదేపదే ప్రచారం చేయడంతో రెహమ్ ఖాన్ మండిపడ్డారు. ఈ వార్తలు నిరాధారమని ఆమె కొట్టిపారేశారు.