అమెరికా వయా అమీర్‌పేట.... | ameerpet couching centers special story | Sakshi
Sakshi News home page

అమెరికా వయా అమీర్‌పేట....

Published Sun, Dec 20 2015 3:18 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

అమెరికా వయా అమీర్‌పేట.... - Sakshi

అమెరికా వయా అమీర్‌పేట....

►  సాఫ్ట్‌వేర్ కోర్సులకు చిరునామా
►  వందలాది శిక్షణ సంస్థలు
►  స్వల్ప ఫీజులతోనే మంచి కోర్సులు
►  యువతరం చూపు...ఇటు వైపు

 
 అమెరికా... సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల కలల ప్రపంచం. అందమైన భవిష్యత్తును అందించే అద్భుత లోకం. ఆ కలలను సాకారం చేసుకోవాలనుకున్న వారు ముందుగా అమీర్‌పేటలో అడుగు పెట్టాల్సిందే. అవును... అమెరికాకు దగ్గర దారి అమీర్‌పేట అంటే అతిశయోక్తి కాదు. అప్పుడే కళాశాల నుంచి బయటకు వచ్చిన వారితో పాటు ఉద్యోగాన్వేషణలో ఉన్న వారు సైతం ఇక్కడ తమ సాంకేతిక ప్రతిభకు మెరుగులు దిద్దుకొని... విమానం ఎక్కుతున్నారు. సాఫ్ట్‌వేర్ కోర్సులకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఈ ప్రాంతం... అభ్యర్థులకు శిక్షణ అందించడమే కాదు... పరోక్షంగా వందలాది మందికి ఉపాధి కల్పిస్తోంది.  సనత్ నగర్: అమీర్‌పేట... గేట్ వే ఆఫ్ అమెరికా.
 
  అవును... ఏ మారుమూల గ్రామం నుంచైనా... ఎవరైనా ‘సాఫ్ట్’గా అమెరికా వెళ్లారంటే వయా అమీర్‌పేటే. ఇక్కడ ‘శిక్షణ’కు పునాది వేసుకుంటేనే అమెరికా ప్రయాణం ఖాయమైనట్టు. సాంకేతికత కొత్త అడుగులు వేస్తే...  సంబంధిత కోర్సులు మొదటిగా అమీర్‌పేటలోనే ప్రత్యక్షమవుతాయి. ఇక్కడ లభించే కోర్సులు సెంచరీ దాటేశాయి. ప్రస్తుతం డిమాండ్ ఉన్న కోర్సును అందిపుచ్చుకునే లోపే... మరో కోర్సు సాఫ్ట్‌వేర్ యువతకు పరిచయం అవుతోంది.
 
  జావా, సీ ప్లస్, సీ ప్లస్ ప్లస్, క్లౌడ్ ఫర్ కస్టమర్, హనా డెవలప్‌మెంట్, యూఐ5-ఫ్లోరి, వెబ్ ప్రో అబాప్, సీఆర్‌ఎం టెక్, వెబ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్, మొబిలిటీ (ఆప్స్ డెవలప్‌మెంట్), షేర్ పాయింట్ టెక్నాలజీ, ఫోన్ గ్యాప్ శాప్ (సింపుల్ ఫైనాన్స్) ... ఇలా ఎప్పటికప్పుడు సరికొత్త సాఫ్ట్‌వేర్ కోర్సులతో పాటు హార్డ్‌వేర్ అండ్ నెట్‌వర్కింగ్ కోర్సుల శిక్షణకు అమీర్‌పేట్ పెట్టింది పేరు. ఈ కోర్సులు ఇన్‌ఫ్రా, మొబైల్, సైబర్ సెక్యూరిటీ, మొబైల్ ట్రాకింగ్, జీఐఎస్ వంటి విభిన్న రంగాల వైపు యువతను అడుగులు వేయిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే యువతను సానబెడుతూ సాఫ్ట్‌వేర్ దిగ్గజాలను తయారు చేసే కేంద్రంగా అమీర్‌పేట్ భాసిల్లుతోంది.
 
 రెండున్నర దశాబ్దాల క్రితమే  ‘సాఫ్ట్’కు దారులు...
 అమీర్‌పేట్ కేంద్రంగా రెండున్నర దశాబ్దాల క్రితమే సాఫ్ట్‌వేర్‌కు దారులు తెరుచుకున్నాయి. ఆ సమయంలో ఇంజినీరింగ్ పూర్తి చేసుకుని వచ్చే విద్యార్థుల పరిజ్ఞానం సాఫ్ట్‌వేర్ కంపెనీలకు ఏమాత్రం సరిపోయేది కాదు. ఇలాంటి వారికి శిక్షణ కేంద్రాలు బాసటగా నిలిచాయి. 1999-2000 మధ్య ఇక్కడ కేవలం నాలుగైదు శిక్షణ కేంద్రాలు మాత్రమే ఉండేవి. ఆ సమయంలోనే సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్‌టీపీఐ) మైత్రీవనంలోకివచ్చింది. ఎస్‌టీపీఐ చెంతనే ఉండడంతో అనుమతులు... ఇతర కార్యకలాపాలకు అనువుగా ఉంటుందన్న భావనతో ఈ ప్రాంతం సాఫ్ట్‌వేర్ శిక్షణ సంస్థలకు నెలవైంది. ప్రస్తుతం ఇక్కడ 400కు పైగా సంస్థలు సాఫ్ట్‌వేర్ కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నాయి.
 
 
 అందరి చూపు అమీర్‌పేట వైపే...
 తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 700 ఇంజినీరింగ్‌కళాశాలల విద్యార్థులతో పాటు బెంగళూరు, చెన్నై, కోల్‌కత్తా, ముంబయి నగరాల నుంచి సైతం సాఫ్ట్‌వేర్ శిక్షణకు అమీర్‌పేట వస్తుంటారు. వీటితో పాటు ఇంజినీరింగ్ చివరి సెమిస్టర్‌లో ప్రాజెక్టు శిక్షణకూ విద్యార్థులు ఇక్కడికి వస్తుంటారు. దాదాపు లక్షకు పైగా విద్యార్థులు ఈ కేంద్రాల్లో  వివిధ కోర్సులు, ప్రాజెక్టులకు సంబంధించి శిక్షణ పొందుతున్నారు. మిగతా నగరాల్లో ఎన్నో శిక్షణ సంస్థలు ఉన్నప్పటికీ... అక్కడి ఫీజులో 10 శాతం మాత్రమే ఇక్కడ ఉండడంతో విద్యార్థులు ఇటువైపుక్యూ కడుతున్నారు.
 
  ఉదాహరణకు వెబ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ కోర్సుకు బెంగళూరులో రూ.40వేలు ఫీజు ఉంటే అమీర్‌పేట్‌లో రూ.నాలుగు వేలకే లభిస్తోంది. తక్కువ ఫీజు ఉంది కదా... క్వాలిటీ ఎలా ఉంటుందోనని భయపడనక్కర్లేదు. నాణ్యతా ప్రమాణాలలోనూ ఇక్కడి సంస్థలు పోటీ పడుతుంటాయి. ఈ క్రమంలోనే శిక్షణతో పాటు ప్లేస్‌మెంట్స్‌కూ ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో పాటు హాస్టళ్లు, భోజన వసతికి కొదువ లేకపోవడంతో ఇతర రాష్ట్రాల వారు సైతం సాఫ్ట్‌వేర్ కోర్సులు అనగానే అమీర్‌పేటకే మొగ్గు చూపుతారు.
 
  విడిభాగాలకు కేరాఫ్... ఆదిత్య ట్రేడ్ సెంటర్
 మదర్ బోర్డు, ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ (ర్యామ్), ఎస్‌ఎంపీఎస్, హార్డ్‌డిస్క్... ఇలా కంప్యూటర్‌కు సంబంధించిన సకల విడి పరికరాలకు ఆదిత్య ట్రేడ్ సెంటర్ కేంద్ర బిందువైంది. చిన్న చిన్న చిప్‌ల నుంచి సీపీయూ, మానిటర్, యూపీఎస్, ప్రింటర్, స్కానర్, డీటీఎస్ స్పీకర్స్ వరకు... ఏది కావాలన్నా ఇక్కడికి రావాల్సిందే. కొత్త వాటిని ఇంటికి ఆహ్వానించాలన్నా... పాత వాటిని వదిలించుకోవాలన్నా (అమ్మాలన్నా) ఇదే అడ్డా. ఇక ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ మొరాయించినా ఆదిత్య ట్రేడ్ సెంటర్ బాట పట్టాల్సిందే. నాణ్యమైన సేవలు యువతను ఇటువైపు నడిపిస్తుంటాయి.
 
 
 ఎందరికో ఉపాధి
 ఒక్కసారి అమీర్‌పేట మైత్రీవనం-సత్యం టాకీస్ మార్గాన్ని పరిశీలిస్తే ఆ రహదారితో పాటు అక్కడి భవనాలు దాదాపుగా హోర్డింగ్‌లు, బ్యానర్లతో నిండి ఉంటాయి. శిక్షణ సంస్థలు ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండడంతో ఎందరో ఉపాధి పొందుతున్నారు. వెయ్యి కరపత్రాలు పంచితే... రూ.100 వస్తాయి. ఒక్కొక్కరు రోజుకు 5 నుంచి 10 వేల వరకు కరపత్రాలు పంపిణీ చేస్తూ రూ.500 నుంచి రూ.1000 వరకు సంపాదించుకుంటున్నారు.
 
  దాదాపు 500 మందికి కరపత్రాలే ఉపాధినిస్తున్నాయి. ఒక్కో బ్యానర్ కడితే రూ.10 నుంచి రూ.20 చెల్లిస్తారు. దీంతో బ్యానర్ల ద్వారా కూడా చాలామందికి ఉపాధి లభిస్తోంది. ఇక్కడికి వచ్చే యువతను నమ్ముకుని టీ స్టాళ్లు, చాట్‌బండార్, టిఫిన్ సెంటర్లు, పాస్ట్‌ఫుడ్ సెంటర్ల వ్యాపారులు సునాయాసంగా బతుకు బండిని నడిపించేస్తున్నారు. ఇక వీరిని నమ్ముకున్న ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెంట్ల వ్యాపారమైతే మూడు పువ్వులు... ఆరు కాయలే.
 
 చెంతనే పాస్‌పోర్టు  సేవా కేంద్రం...  ట్రావెల్ ఏజెన్సీలు
 అమెరికా కలలలో బతికే సాఫ్ట్‌వేర్ యువత కోసమే అన్నట్లుగా పాస్‌పోర్టు సేవా కేంద్రంతో పాటు ఎయిర్ టికెట్ల కోసం ట్రావెల్ ఏజెన్సీలు అమీర్‌పేటలో వెలిశాయి. ఊరు నుంచి అమీర్‌పేట్.... ఇక్కడి నుంచి ఎంచక్కా విదేశాలకు చేరవేసేందుకు వివిధ సంస్థలు యువత కోసం తరచూ ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటిస్తుంటాయి.
 
 అందుబాటులో కొత్త కోర్సులు
 నేను 2000వ సంవత్సరంలో నగరానికి వచ్చాను. అప్పుడు కేవలం నాలుగు సాఫ్ట్‌వేర్ శిక్షణ కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు 400 దాటిపోయాయి. ఎప్పటికప్పుడు టెక్నాలజీ మారుతున్న కొద్దీ కొత్త కోర్సులు పుట్టుకురావడం సహజమే. మా సంస్థలోనే దాదాపు వందకు పైగా కోర్సులు సాఫ్ట్‌వేర్ యువతకు అందిస్తున్నాం. థియరీతో పాటు వారి కోసం ప్రాక్టికల్ చేయించేందుకు ల్యాబ్‌లు అందుబాటులో ఉంటాయి. మిగతా నగరాలతో పోలిస్తే ఇక్కడ తక్కువ ఖర్చుతోనే డిమాండ్ ఉన్న కోర్సులు లభిస్తాయి.
 -కోటి, పీర్స్ టెక్నాలజీ ఆపరేషన్ హెడ్, మైత్రీవనం
 
 జాబ్ గ్యారెంటీ
 ఇక్కడ శిక్షణ పొందితే జాబ్ గ్యారెంటీ అన్న నమ్మకం ఉంటుంది. మహబూబ్ నగర్ నుంచి వెబ్ డిజైనింగ్‌లో శిక్షణకు వచ్చాను. తక్కువ ఫీజుతోనే శిక్షణ ఇచ్చే సంస్థలు ఇక్కడ ఉండడంతో పేద కుటుంబీకులు సైతం ఉన్నత కోర్సులను ఇక్కడ చేయగలుగుతున్నారు. నాలాంటి వారికి అమీర్‌పేట్ ప్రాంతం ఒక వరం లాంటిదే.
 - శిరీష, వెబ్ డిజైనింగ్ విద్యార్థిని
 
 ఇక్కడ ఫీజులు తక్కువ
 జేఎన్టీయూలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ కోర్సులో చేరేందుకు ఇక్కడికి వచ్చాను. డిమాండ్ ఉన్న సాఫ్ట్‌వేర్ కోర్సుల్లో శిక్షణ ఇస్తారని తెలిసి అమీర్‌పేట్ వచ్చాను. నెట్‌లో అన్వేషిస్తే... బెంగళూరు, ముంబయిలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఫీజు, కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువగా అనిపించింది. అందుకే ఇక్కడ శిక్షణకు ఆసక్తి కనబరిచాను.
 -హసన్ డెరినోజ్, టర్కీ దేశస్తుడు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement