సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పేరుతో టోకరా
రాంగోపాల్‌పేట్: సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఓ వ్యక్తి నిరుద్యోగి నుంచి రూ.2లక్షలు కాజేశాడు. ఉద్యోగం రాకపోవడంతో డబ్బు తిరిగి ఇవ్వాలని కోరితే రేపుమాపు అంటు తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో బాధితుడి తండ్రి మార్కెట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. మెదక్ జిల్లా గజ్వేల్‌కు చెందిన కుమారస్వామి ప్రభుత్వ ఉద్యోగి. ఇతని కుమారుడు రాకేష్ బీటెక్ పూర్తి చేసి అమీర్‌పేట్‌లో హాస్టల్‌లో ఉంటూ ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. గత కొద్ది నెలల క్రితం అమీర్‌పేట్‌కు చెందిన చక్రధర్ అనే వ్యక్తి రాకేష్‌కు పరిచయం అయ్యాడు. తాను ఓ ఎంఎన్‌సీ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని లక్ష రూపాయలు ఇవ్వాలని రాకేష్‌ను నమ్మించాడు. దీంతో రాకేష్ జూలై 15వ తేదీన చక్రధర్‌కు లక్ష రూపాయలు ఇచ్చాడు. కానీ, ఉద్యోగం మాత్రం రాలేదు. దీంతో రాకేష్ ఒత్తిడి చేయడంతో ఓ ఎంఎన్‌సీ కంపెనీకి చెందిన అపాయింట్‌మెంట్ లెటర్‌ను తెచ్చి ఇచ్చాడు.
అటు తర్వాత రెండు రోజులకే ఆ కంపెనీ దివాళా తీసిందని మరో లక్ష రూపాయలు ఇస్తే ఇంకా మంచి కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు. తన స్నేహితుడు ప్రదీప్ అకౌంట్‌కు ఆ డబ్బును బదిలీ చేయాలని చక్రధర్ కోరడంతో రాకేష్ అలాగే చేశాడు. కానీ, మళ్లీ ఉద్యోగం ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. గత నెల 10వ తేదీన రాకేష్ ఆయన తండ్రి కుమారస్వామిలు చక్రధర్‌ను గట్టిగా నిలదీయడంతో చెక్కును అందించాడు. కానీ, అందులో డబ్బు లేవు. అప్పటి నుంచి చక్రధర్ తప్పించుకుని తిరుగుతూ డబ్బు ఇవ్వకుండా ఉద్యోగం చూపించకపోవడంతో మోసపోయామని గ్రహించిన కుమార స్వామి శనివారం మార్కెట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డబ్బు లావాదేవీలు అన్నీ సికింద్రాబాద్ హరిహర కళాభవన్ వద్ద జరగడంతో మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.