ముంబై: ఐటీ రంగంలో సగం మంది నిపుణులు (53 శాతం మంది) వచ్చే ఏడాది కాలంలో నూతన ఉద్యోగంలో చేరిపోవచ్చని ‘స్కిల్‌సాఫ్ట్ 2022 ఐటీ స్కిల్స్ అండ్ శాలరీ’ నివేదిక తెలిపింది. మెరుగైన పారితోషికంతోపాటు, ప్రస్తుత ఉద్యోగంలో శిక్షణ, పురోగతి లేకపోవడం, పని–వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత లోపించడం కారణాలుగా పేర్కొంది. ఐటీల్లో టీమ్ లీడర్లు, ఆపై స్థాయి ఉన్న వారు తమ బృందంలో నైపుణ్యాల లోటును ఎదుర్కొంటున్నట్టు స్కిల్‌సాఫ్ట్ నిర్వహించిన సర్వేలో తెలిసింది.
నిపుణుల వలస, తిరిగి నిపుణులను ఆకర్షించడం అనే రెండు పెద్ద సవాళ్లను ఐటీ రంగం ఎదుర్కొంటున్నట్టు నివేదిక ప్రస్తావించింది. సర్వేలో పాల్గొన్న వారిలో 53 శాతం మంది వచ్చే 12 నెలల్లో తాము కొత్త ఉద్యోగం వెతుక్కోవచ్చని చెప్పారు. సుమారు 8,000 మంది స్కిల్‌సాఫ్ట్ సర్వేలో తమ అభిప్రాయాలు వెల్లడించారు. డిజిటల్ టెక్నాలజీకి మారే విషయంలో ఉన్న వేగం, తగినన్ని సాంకేతిక వనరులు లేకపోవడం ఐటీ నిపుణులను కఠిన నిర్ణయం తీసుకునేలా చేస్తున్నట్టు ఈ సర్వే పేర్కొంది.
‘‘అధ్యయనం అన్నది ఉద్యోగులు, సంస్థల పరస్పర అభివృద్ధికి ప్రేరణనిస్తుంది. ముఖ్యంగా నిపుణులను కాపాడుకోవడంలో ఉన్న ఇబ్బందులు, ఆవిష్కరణల వేగం దృష్ట్యా సంస్థలకు శిక్షణ ఎంతో సాయపడుతుంది’’అని స్కిల్‌సాఫ్ట్ జనరల్ మేనేజర్ జాచ్ సిమ్స్ పేర్కొన్నారు.
నేర్చుకునే సంస్కృతి ఏర్పాటు చేయడం, నైపుణ్యాల అభివృద్ధి అన్నవి విజయానికి కీలకమన్నారు. నైపుణ్యాలు కలిగిన ఆశావహల నియామకం, వారిని కాపాడుకునే విషయంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు.
చదవండి: జియో 4జీ సిమ్ వినియోగిస్తున్నారా? అయితే జియో 5జీ నెట్‌వర్క్ పొందండిలా!
Comments
Please login to add a commentAdd a comment