- విద్య అంటే ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సులే కాదు...
- ‘ఇన్‌స్పైర్’ శిక్షణ సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి
కేయూ క్యాంపస్ : సైన్‌సపై ఆసక్తి పెంచుకుని నిర్దేశిత లక్ష్యంతో భవిష్యత్‌లో రాణించేలా ముందుకు సాగాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి విద్యార్థులకు సూచించారు. సైన్‌స అభివృద్ధితోనే సమాజ పురోగతి కూడా సాధ్యమవుతుందని పేర్కొన్నా రు. ఇన్‌స్పైర్ ఇంటర్న్‌షిప్ సైన్స్ క్యాంపు శిక్షణ కాకతీయ యూనివర్సిటీ జువాలజీ విభాగం ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభమైంది.
ఈ సందర్భంగా పరిపాలన భవనం సెనేట్ హాల్‌లో శిక్షణను పాపిరెడ్డి ప్రారంభించి మాట్లాడా రు. విజ్ఞానాన్ని అందిస్తూనే భవిష్యత్‌లో ఉపాధి కల్పించేందుకు విద్య ఉండాల్సిన అవసరముందన్నారు. ప్రస్తుతం ఎనిమిదో తరగతి నుంచే ఐఐటీ ఫౌండేషన్ కోర్సుల్లో శిక్షణ ఇప్పిస్తుండడంతో విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఇంజినీరింగ్ కోర్సులపై ఆసక్తి చూపిస్తుండడంతో విద్యార్థులు తప్పనిసరిగా ఆ కోర్సుల్లో చేరినా నైపుణ్యాలు లేకపోవడంతో చిరు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారని పాపిరెడ్డి తెలిపారు.
టాప్ ఇంజినీరింగ్ కాలేజీల్లో చదివి కొంతమేర కష్టపడిన వారికే ఉపాధి లభిస్తోందన్నారు. ఈ మేరకు చదువంటే ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సులే కాకుండా పలు సైన్స్ కోర్సులు ఉన్నాయని గుర్తించాలని సూచించారు. ఇన్‌స్పైర్ శిక్షణకు వచ్చిన వారిలో ఎక్కువ మంది గ్రామీణ విద్యార్థు లు ఉన్నారని, ఐదు రోజుల శిక్షణలో వారికి సైన్స్‌పై అవగాహన పెరుగుతుందని పాపిరెడ్డి అభిప్రాయపడ్డారు.
విషయ పరిజ్ఞానం ఉండడం లేదు..
విద్యార్థులకు ఇంటర్‌లో మార్కులు ఎక్కువగానే వస్తున్నా సబ్జెక్టుల పరంగా విషయ పరిజ్ఞానం ఉండడం లేదని భట్నాగర్ అవార్డు గ్రహీత, హైదరాబాద్‌లోని ఐఐసీటీ డిప్యూటీ డెరైక్టర్ డాక్టర్ జి.నరహరశాస్త్రి అన్నారు.
ఈ మేర కు ఆసక్తి ఉన్న కోర్సుల్లోనే చేరి అందులో రాణించాలని సూచించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 68 ఏళ్లు గడిచినా పరిశోధన రంగంలో అనుకున్న మేర పురోగతి లేదని.. దీన్ని అధిగమించేందుకు దేశంలోని ప్రసిద్ధ సైంటిస్టుల జీవిత చరిత్రలు చదివి విద్యార్థులు ఉత్తేజం పొందాలని కోరారు. కేయూ ఇన్‌చార్‌జ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎంఏ. సింగరాచార్య, క్యాంపస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.రామస్వామి మాట్లాడుతూ విలువలతో కూడిన విద్య నేటి సమాజానికి అవసరమన్నారు.
ఇన్‌స్పైర్ కోఆర్డినేటర్ ఎం.కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇంటర్ విద్యార్థుల కోసం కేయూలో ఇన్‌స్పైర్ నిర్వహించడం ఇది మూడోసారని తెలిపారు. ప్రస్తుతం 150మంది విద్యార్థులు పాల్గొంటుం డగా, వివిధ పరిశోధనా సంస్థల శాస్త్రవేత్తలు పాల్గొని అవగాహన కల్పిస్తారని తెలిపారు. కార్యక్రమంలో జువాలజీ విభాగాధిపతి ఎం.స్వామి, సైన్స్ డీన్ ఎ.సదానందం, డాక్టర్ వెంకయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాపిరెడ్డి, నరహరిశాస్త్రిని నిర్వాహకులు సన్మానించారు.