ఈ మూడు తప్పులు చేయొద్దు..
శివకు ఏమీ పట్టదు. డబ్బుల విషయంలో ప్లానింగ్ జీరో. దీనికి తోడు ఎవరి మాటా వినడు కూడా. తోచింది చేసుకుపోతుంటాడు. ఇదే ధోరణిలో... ఆర్థికంగా జీవితంలో ఏ మనిషీ చేయకూడని మూడు తప్పులు చేసేశాడు. ఫలితం!! ప్రతిరోజూ డబ్బుకు కటకటే. పిల్లలకు నచ్చిన చదువు చెప్పించలేకపోయాడు. రిటైరయ్యాక కూడా సరైన ఆదాయం లేక ఏదో ఒక పని చేస్తూనే వచ్చాడు. అసలు శివ చేసిన తప్పులేంటి? ఎవరూ చెయ్యకూడని ఆ మూడు తప్పుల వివరమేంటి?
తాహతుకు మించిన చదువు..
పిల్లలకు ఉన్నత విద్య చెప్పించి, ఉత్తమంగా తీర్చిదిద్దాలని కోరుకోనిదెవరు? అయితే, ఇందుకు చేసే ఖర్చుపై కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించకపోతే పిల్లల చదువు సంగతి అటుంచి కుటుంబం ఆర్థిక కష్టాల్లో ఇరుక్కోక తప్పదు. విదేశీ చదువుల విషయంలో ఎదురుదెబ్బలు తగిలితే మరీ కష్టం. ఇలాంటివి ఎదురవకుండా ఉండాలంటే.. కోర్సు మొదలు కాలేజీ దాకా అన్నింటి గురించి ముందే తెలుసుకోవాలి. ఆయా కోర్సులకు ఎక్కడెక్కడ ఫీజులు ఎంతెంత ఉన్నాయో తెలుసుకోవాలి. అలాగే, స్కాలర్‌షిప్‌లు, ఆర్థిక సహాయం వంటివి ముందే చూసుకోవాలి. విదేశీ చదువుల విషయానికొస్తే.. అక్కడ నివసించేందుకయ్యే ఖర్చులనూ బేరీజు వేసుకోవాలి. ప్రముఖ కాలేజీలుండేది పెద్దపెద్ద నగరాల్లోనే కనుక అక్కడ జీవన వ్యయాలూ భారీగానే ఉంటాయి. విద్యా రుణం తీసుకునేటప్పుడు ఇవన్నీ చూసుకోవాలి. ఎంతదాకా భరించగలమన్నది చూసుకునే ముందడుగు వేయాలి.
ముందుచూపు లేని జీవితం..
పిల్లల చదువులు, వాహనాలు, ఇల్లు కొనుక్కోవడాలు ఇతరత్రా సమస్యల్లో పడి కీలకమైన రిటైర్మెంట్ తరుణానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వదిలేయడం మరో తప్పిదం. ఎందుకంటే.. రిటైరయ్యాక ఆదాయం బాగా తగ్గిపోతుంది. ఖర్చులు మాత్రం పెరిగిపోతాయి. ఆర్థికంగా బలంగా లేకపోతే తీవ్రమైన కష్టాలొస్తాయి. అందుకని చాలా ముందునుంచే రిటైర్మెంట్ ప్రణాళిక వేసుకోవాలి. ఆదాయంలో కనీసం 10-12 శాతం దాకా క్రమం తప్పకుండా పొదుపు చేయాలి. ఆదాయం పెరిగినప్పుడల్లా ఇన్వెస్ట్‌మెంట్ల కేటాయింపులూ పెంచాలి. పెట్టుబడి పెడుతూ పోవడం కాకుండా.. దాని పనితీరునూ తరచూ సమీక్షించుకోవాలి. అవసరమైన మార్పులు, చేర్పులూ చేస్తూ మంచి రాబడులొచ్చేలా జాగ్రత్తపడాలి.
అవసరాన్ని మించిన అప్పు...
వంటింట్లో స్టవ్ నుంచి ఆ వంటిల్లుండే సొంతిల్లు దాకా అన్నీ ఇపుడు ఈఎంఐ మీదే దొరికేస్తున్నాయి. అంటే నెలసరి వాయిదాల పద్ధతిలోనన్న మాట. అయితే వాయిదా పద్ధతిలో వస్తున్నాయి కదా అని చూసిందల్లా కొనొద్దు. మనకు ఏది, ఎంతవరకూ అవసరమో చూడాలి. సహజంగానే పెద్ద కారు.. పెద్ద ఇల్లు.. ఇలాంటి కలలు చాలా మందికి ఉంటాయి. అవన్నీ సాకారం కావాలంటే.. అందుకు తగ్గ స్థాయిలో ఆర్థిక ప్రణాళికలూ వేయాలి. మన ఆదాయం... ఖర్చులు పోను దాచగలిగేది ఎంత... ఇవన్నీ చూడాలి. ఇల్లు కొనేంత కూడబెట్టలేకపోతే.. రుణం తీసుకోవాలి. తీసుకుంటే వడ్డీ రేట్లు పెరిగినప్పుడల్లా బాదుడు. పైగా మనకు ఆదాయం ఉన్నా లేకున్నా సంవత్సరాల తరబడి ఈఎంఐలు కట్టాలి. కాబట్టి ఇలాంటి రుణాలు తీసుకునేటపుడు పక్కా లెక్కలు వేసుకోవాలి. లేకుంటే జీవితం ఈఎంఐలు కట్టడానికే సరిపోతుంది.