బదిలీల సందడి | Transfer of the noise | Sakshi
Sakshi News home page

బదిలీల సందడి

Published Fri, Aug 14 2015 1:25 AM | Last Updated on Sun, Sep 3 2017 7:23 AM

Transfer of the noise

ఎన్నాళ్ల నుంచో వేచిన సమయం రానే వచ్చింది. ఎప్పుడెప్పుడు కోరుకున్న స్థానానికి బదిలీపై వెళ్దామా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్న ఉద్యోగుల అభిలాష నెరవేరే సమయం ఆసన్నమైంది. ఈ మేరకు జిల్లాలోని ఉద్యోగుల్లో బదిలీ ఉత్సాహం ఉరకలెత్తుతోంది.
 
 టీచర్ల హేతుబద్ధీకరణ
 విజయనగరం అర్బన్: రెండేళ్లుగా బదిలీలుగాని, మూడేళ్లగా హేతుబద్ధీకరణగాని  చేపట్టకపోవడం వల్ల బదిలీ కోసం ఎదురు చూసే టీచర్లు వేలసంఖ్యలో ఉన్నారు.  అయితే వారి నిరీక్షణకు ఇక తెరపడనుంది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో కలిపి 25 వేల మందికి పైగా ఉద్యోగులున్నారు. వారిలో విద్యాశాఖ పరిధిలోనే 12,600 మందికి పైగా ఉపాధ్యాయులు ఉండడం విశేషం. వీరిలో ప్రస్తుతం సుమా రు 6,700 మంది వరకు బదిలీలు, హేతుబద్ధీకరణ ప్రక్రియల్లో భాగస్వాములవుతారని విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ సంఘాల అంచనా.
 
 దీంతో విద్యాశాఖ పరిధిలోని ఉపాధ్యాయుల్లో ప్రస్తుతం బదిలీల సందడి నెలకొంది.  తొలుత బడులు, టీచర్ల హేతుబద్ధీకరణ చేపట్టడానికి రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా కిలోమీటర్ పరిధిలో ఒక ఆదర్శ ప్రాథమిక పాఠశాల విధానాన్ని అమలులోకి తెస్తున్నారు. ఈ ప్రక్రియ వల్ల జిల్లా వ్యాప్తంగా 194 పాఠశాలను విలీనం అవుతాయి. దీంతో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులను ఆదర్శపాఠశాలకు పంపుతారు. కనీసం 100 మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులు ఉండేవిధంగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేయనున్నారు. దీని వల్ల 600 మంది ఉపాధ్యాయులకు సర్దుబాటు తప్పదు.
 
 వెబ్‌కౌన్సెలింగ్‌పైనే మొగ్గు
 ప్రభుత్వ నూతనంగా ప్రవేశపెడుతున్న వెబ్‌కౌన్సెలింగ్‌పైనే ఉపాధ్యాయులు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఖాళీ పోస్టుల వివరాలు, టీచర్ల సీనియార్టీ జాబితా తదితర అంశాలను పారదర్శకంగా వెబ్‌సైట్‌లో పెట్టి పక్కాగా నిర్వహిస్తే అక్రమ బదిలీలను అడ్డుకోవచ్చని ఉపాధ్యాయ సంఘాలు మొగ్గు చూపుతున్నాయి. అయితే అలాంటి ప్రక్రియ జరిగితే అక్రమబదిలీల సిఫార్సులను చేయలేమని వెబ్‌కౌన్సెలింగ్ ఈ ఏడాదికి విరమించుకోవాలని ప్రభుత్వం యోచిస్తోందనే ఆరోపణలు కూడా వచ్చా యి. ఈ మేరకు రాష్ట్రస్థాయిలో ఉపాధ్యాయ సంఘాల  నుంచి ఫిర్యాదులు రావడంతో ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవడంతో తాజాగా వెబ్‌కౌన్సెలింగ్  విధానాన్నే ఖరారు చేశారు.
 
 ఆరు స్థాయిల్లో బదిలీ ప్రక్రియ
 మొత్తం బదిలీల ప్రక్రియను ఆరు స్థాయిల్లో నిర్వహించనున్నారు. ముందుగా ఇప్పటికే ఉన్న ఖాళీలు, ఎనిమిదేళ్లు ఒకే చోట సర్వీసు కలిగిన ఖాళీలు, హేతుబద్ధీకరణ ద్వారా వచ్చిన ఖాళీలను ప్రదర్శిస్తారు. అనంతరం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు మూడురోజులు సమయం ఇస్తారు. ఉపాధ్యాయుడు దరఖాస్తు చేసిన ప్రింట్‌ను తీసుకుని సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో మండల విద్యాశాఖాధికారి, ప్రధానోపాధ్యాయులకు సమర్పించి నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. వారు వాటిని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి పంపుతారు. అనంతరం తాత్కాలిక సీనియారిటీ జాబితాను ఎన్‌టైటిల్‌మెంట్ పాయింట్లతో వెబ్‌సైట్‌లో ఉంచుతారు. దీనిపై దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయుల సెల్‌ఫోన్‌లకు పాస్‌వర్డ్ వస్తుంది.
 
 అనంతరం  తాము పనిచేయదలుచుకున్న, కోరుకుంటున్న పాఠశాలల వివరాలను ఆన్‌లైన్‌లోనే నమోదుచేయాల్సి ఉంటుంది. అవసరమైతే రెండుసార్లు వాటిని మార్చుకునే అవకాశం కూడా కల్పిస్తారు. వెబ్‌కౌన్సెలింగ్ ద్వారా సీనియారిటీలో తమకిందనున్న వారు ఖాళీ చేసిన స్థానాలను సైతం ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించడం ఈసారి అరుదైన అవకాశంగా ఉపాధ్యాయులు భావిస్తున్నారు. వెబ్‌కౌన్సెలింగ్ ముగిసిన ఐదురోజుల్లో బదిలీ ఉత్తర్వులు పంపుతారు. ఉపాధ్యాయుల సెల్‌నంబర్లకు కూడా సంక్షిప్త సమా చారం పంపే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. వెబ్ కౌన్సెలింగ్‌లో జిల్లా వ్యాప్తంగా సుమారు 6,700 మంది వరకు బదిలీ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని అంచనా వేస్తున్నారు.
 
 జెడ్పీలో నేడు బదిలీలు
 
 సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జిల్లా పరిషత్  ఉద్యోగుల బదిలీలు నేడు జరగనున్నాయి. ఇప్పటికే సిఫార్సులు, పైరవీలు పెద్ద ఎత్తున జరిగాయి. కౌన్సెలింగ్‌లో అవి ఎంతమేర ప్రభావం చూపుతాయో శుక్రవా రం స్పష్టం కానుంది. ఒకేచోట ఐదేళ్లు పనిచేసిన ఉద్యోగులంతా బదిలీకి అర్హులు. కానీ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్‌లో కాల వ్యవధితో పనిలేకుండా ఎవరినైనా బదిలీ చేసే వెసులుబాటు జిల్లా పరిషత్‌కు ఉంది. దా న్నే వజ్రాయుధంగా చేసుకోవాలని పాలకులు చూస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2గంటలకు జెడ్పీ సమావేశ భవనంలో బదిలీ ప్రక్రియ ప్రారంభం కానుంది. కౌన్సెలింగ్ ద్వారా బదిలీ చేయనున్నారు. ఐదేళ్ల కాల పరిమితి, అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్‌లో బదిలీలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతానికైతే ఐదేళ్లు ఒకేచోట పనిచేసిన ఎంపీడీఓలు ఇద్దరే ఉన్నారు.
 
 వారిలో ఒకరు శ్రీధర్‌రాజా, మరొకరు పూసపాటిరేగ ఎంపీడీఓ లక్ష్మి. ఇందులో శ్రీధర్‌రాజా గంట్యాడ ఎంపీడీఓ హోదాలో ప్రస్తుతం జెడ్పీ డిప్యూటీ సీఈఓగా పనిచేస్తున్నారు. దీంతో శ్రీధర్ రాజా స్థానంలో గంట్యాడలో మరొకర్ని నియమించనున్నారు. అలాగే, పూసపాటిరేగ ఎంపీడీఓ తన సీటు ఖాళీ చేయాల్సి ఉంటోంది. ఇక, అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్‌లో మరికొందర్ని బదిలీ చేయనున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు తమకు నచ్చని ఎంపీడీఓను బదిలీ చేయాలని, తమకు కావల్సిన వారిని నియమించాలని కోరుతూ ఇప్పటికే సిఫార్సులు లేఖలు ఇచ్చారు. ఇదే క్రమంలో కొందరు పైరవీలు కూడా చేస్తున్నట్టు తెలిసింది. కావాల్సిన పోస్టింగ్ ఇప్పించేందుకు లోపాయికారీ సంప్రదింపులు చేసుకు న్నారన్న వాదనలు ఉన్నాయి. ఇదిలా ఉండగా, పంచాయతీరాజ్‌లో ఈఓపీఆర్‌డీ, సూపరింటెండెంట్‌లుగా పనిచేసి ఎంపీడీఓలగా పదోన్నతి పొందిన వారు పది మంది ఉన్నారు. వీరందరికీ పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది. ఈ లెక్కన పాత వారిలో కొందర్ని కదిపే అవకాశం ఉంది.
 
 ఇక, ఐదేళ్లు ఒకేచోట పనిచేసిన సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టుల్ని కూడా కౌన్సెలింగ్ ద్వారా బదిలీ చేయనున్నారు. అయితే, వీరి బదిలీపై కూడా సిఫార్సులు ఉన్నాయి. వివిధ హోదాల్లో ఉన్న పలువురు టీడీపీ నేతలు తమకు కావల్సిన వ్యక్తుల్ని వేసుకునేందుకు ఇప్పటికే సంప్రదింపులు చేసినట్టు తెలుస్తోంది. మరి బదిలీల విషయంలో  విమర్శలకు తావిచ్చేలా వ్యవహరిస్తారో,పారదర్శకంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారో చూడాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement