* మొదట ఆప్షన్ల ఎంపిక.. ఆ తర్వాత ధ్రువపత్రాల పరిశీలన
* పీజీ డిప్లొమా, ఇంటిగ్రేటెడ్ పీజీలకు త్వరలో ప్రత్యేకంగా కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం వెబ్ ఆప్షన్ల ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. వర్సిటీ పరిధిలో తొలిసారిగా చేపట్టిన వెబ్ కౌన్సెలింగ్‌కు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి 23వ తేదీ వరకు విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలల్లో సబ్జెక్టుల కోసం ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని అధికారులు తెలిపారు.
సబ్జెక్టుల వారీగా కళాశాలల జాబితా, సీట్ల సంఖ్యను వెబ్‌సైట్ (www.ouadmissions.com)లో అందుబాటులో ఉంచారు. అయితే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కంటే ముందుగా కళాశాలల జాబితాను సరిచూసుకోవాలని విద్యార్థులకు అధికారులు సూచిస్తున్నారు. వరుస క్రమంలో కళాశాలల ప్రాధాన్యంపై స్పష్టత వచ్చాకే ఆప్షన్ల ప్రక్రియలో పాల్గొనాలని చెబుతున్నారు. వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత తాత్కాలిక సీట్ల కేటాయింపు జాబితా సిద్ధం చేస్తారు.
ఈ విద్యార్థులకు చెందిన ధ్రువపత్రాల పరిశీలన ముగియడం, ఫీజు చెల్లింపులు పూర్తయ్యాక తుది సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించిన వారు విడివిడిగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది.
వీరికి ప్రత్యేకంగా కౌన్సెలింగ్
బ్యాచిలర్ డిగ్రీలో కొన్ని కోర్సులకు సంబంధించి ఫలితాలు వెల్లడి కాలేదు. అలాగే సీట్ల సంఖ్య కంటే దరఖాస్తులు తక్కువ రావడంతో ఓయూసెట్‌లో మరికొన్ని సబ్జెక్టులకు పరీక్ష నిర్వహించలేదు. ఎంఈడీ, ఎంపీఈడీ, కన్నడ, మరాఠీ, పర్షియన్, సైకాలజీ, తమిళ్, థియేటర్ ఆర్ట్స్, ఎమ్మెస్సీ న్యూట్రిషన్ తోపాటు పీజీ డిప్లొమా, ఇంటిగ్రేటెడ్ పీజీ విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇవ్వకూడదని అధికారులు పేర్కొన్నారు. అలాగే ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, వికలాంగ, స్పోర్ట్స్ తదితర ప్రత్యేక కోటా ద్వారా కళాశాలల్లో చేరాలనుకుంటున్న విద్యార్థులకు ఇదే వర్తిస్తుంది. వీరికి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. పరీక్షలు నిర్వహించని సబ్జెక్టుల్లో మెరిట్ ఆధారంగా విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు.
నేటి నుంచి ఓయూ పీజీ వెబ్ ఆప్షన్లు
Published Fri, Jul 17 2015 12:24 AM | Last Updated on Sun, Sep 3 2017 5:37 AM
Advertisement
Advertisement