సర్టిఫికెట్ల పరిశీలనకు 362మంది హాజరు
Published Fri, Aug 23 2013 5:31 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : ఎంసెట్-2013 కౌన్సెలింగ్‌లో భాగంగా గురువారం నుంచి ప్రారంభం కావాల్సిన వెబ్ కౌన్సెలింగ్‌ను ఉన్నత విద్యాశాఖ వాయిదా వేసింది. దీంతో ఇప్పటికే సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన విద్యార్థులు వెబ్ కౌన్సెలింగ్ వాయిదా పడిన విషయం తెలియక గురువారం హెల్ప్‌లైన్ కేంద్రాలకు వచ్చి నిరాశగా వెనుదిరిగారు. సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జరిగిన సర్టిఫికెట్ల పరిశీలనకు 362మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఈనెల 19న ఎంసెట్ సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభమైన తరువాత అధ్యాపకుల సమ్మె కారణంగా పాలిటెక్నిక్ కళాశాలల పరిధిలో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తిగా నిలిచిపోయింది. ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపకపోవడంతో మూడు రోజుల పాటు సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ పూర్తిస్థాయిలో జరగలేదు. ఈ నేపథ్యంలో కళాశాలల ఎంపికకు గురువారం నుంచి జరగాల్సిన వెబ్ కౌన్సెలింగ్‌ను తాత్కాలికంగా వాయిదా వేసిన ఉన్నత విద్యాశాఖ తాజా షెడ్యూల్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది.
నేడు ర్యాంకుల వారీగా సర్టిఫికెట్ల పరిశీలన..
ఎంసెట్-2013 కౌన్సెలింగ్‌లో భాగంగా శుక్రవారం జరిగే సర్టిఫికెట్ల పరిశీలనకు 60,001 నుంచి 80,000 ర్యాంకు వరకు గల విద్యార్థులు హాజరుకావాల్సి ఉంది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో 60,001 ర్యాంకు నుంచి 65,000, 75,001 నుంచి 80వేల ర్యాంకు వరకు గల విద్యార్థులు హాజరుకావాలి. సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 65,001 నుంచి 75,000 ర్యాంకు వరకు గల విద్యార్థులు హాజరుకావాలి.
Advertisement
Advertisement