504 మంది గుర్తింపు మిగులు ఉపాధ్యాయులు
804 మంది ఇది తాత్కాలికమే
మచిలీపట్నం : ప్రభుత్వ పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకంగా మారనుంది. విద్యార్థుల సంఖ్య నానాటికీ తగ్గిపోతుండడంతో ఉపాధ్యాయుల మిగులు అధికమవుతోంది. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ఇటీవలే బదిలీలు నిర్వహించిన విద్యాశాఖ తాజాగా మిగులు ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను తెరపైకి తెచ్చింది. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి టీచర్లు అధికంగా ఉన్న పోస్టులను గుర్తించి అవసరం ఉన్నచోట వారిని సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ ఈ నెల 15 నాటికి పూర్తిచేయాలని విద్యాశాఖ కమిషన్ జనవరి ఒకటో తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక పాఠశాలల్లో 30 మంది, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 35 మంది, ఉన్నత పాఠశాలల్లో 40 మంది విద్యార్థులకు ఒక టీచరు చొప్పున నియమించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుత సర్దుబాటు తాత్కాలికమేనన్నారు.
సర్దుబాటు ఉపాధ్యాయులు 804 మంది...
టీచర్లు, విద్యార్థుల నిష్పత్తి మేరకు జిల్లాలో 804 మంది టీచర్లు మిగులు ఉన్నట్లు విద్యాశాఖాదికారులు గుర్తించారు. వారిలో 296 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు, 508 మంది స్కూల్ అసిస్టెంట్లు ఉన్నట్లు లెక్క తేల్చారు. మిగులుగా ఉన్న 296 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లలో 141 మందిని ప్రాథమికోన్నత పాఠశాలల్లో సర్దుబాటు చేసేం దుకు అవకాశం ఉన్నట్లు నిర్ధారించారు. స్కూల్ అసిస్టెంట్లు 508 మందిలో 33 మందిని యూపీ పాఠశాలల్లో, మరో 333 మందిని ఉన్నత పాఠశాలల్లో సర్దుబాటు చేయాలని నిర్ణయించారు.
కమిటీ నేతృత్వంలోనే...
ఉపాధ్యాయుల సర్దుబాటుకు సంబంధించిన వ్యవహారాలు ఆయా డివిజన్లవారీగా కమిటీలు ఏర్పాటుచేసి వాటి పర్యవేక్షణలోనే చేయాలని నిర్ణయించారు. వీటిల్లో డీఈవో, డీవైఈవో, ఎంఈవో సభ్యులుగా ఉంటారు. మండల స్థాయిలోనే ఉపాధ్యాయుల సర్దుబాటు ఉండాలని, మరీ అవసరమైతే పక్క మండలాల నుంచి కూడా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని నిర్ణయించారు.
గుర్రుగా ఉన్న ఉపాధ్యాయ సంఘాలు...
ఈ సర్దుబాటు వ్యవహారంపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు గుర్రుగా ఉన్నారు. నిర్బంధ విద్యాహక్కు చట్టం ప్రకారం 20 మంది విద్యార్థులకు ఒక టీచరు ఉండాలనే నిబంధన ఉన్నా సర్దుబాటు కోసం ఇచ్చిన జీవోలో ఈ నిష్పత్తిని పెంచారని వారంటున్నారు. జనవరిలో ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తే వారు ఎంతమేర పాఠ్యాంశాలు బోధిస్తారని నేతలు ప్రశ్నిస్తున్నారు. రోజుకో ఉత్తర్వులు జారీ చేసి ఉపాధ్యాయులను ఇబ్బందులపాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
జాబితాలు సిద్ధం
ఉపాధ్యాయుల సర్దుబాటును ఈ నెల 15లోగా పూర్తిచేస్తాం. ఉపాధ్యాయుల అవసరం ఎక్కడ ఉంది.. ఎక్కడెక్కడ ఉపాధ్యాయుల మిగులు ఉందనే అంశంపై జాబితాలు సిద్ధం చేశాం. మరోసారి వాటిని పరిశీలించి ఉత్తర్వులు జారీ చేస్తాం. -ఎ.సుబ్బారెడ్డి, డీఈవో
15లోగా టీచర్ల సర్దుబాటు
Published Sat, Jan 9 2016 1:33 AM | Last Updated on Sun, Sep 3 2017 3:19 PM
Advertisement
Advertisement