శ్రీకాకుళం :ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ప్రభుత్వ పాఠశాలల బోధనపై ప్రధాన ప్రభావం చూపింది. వేసవి సెలవుల్లో బదిలీలు చేపడతామని చెప్పిన విద్యా సంవత్సరం ప్రారంభమైన తరువాత ఆగస్టులో ప్రక్రియ చేపట్టింది. ఆన్‌లైన్ విధానం ద్వారానా, వెబ్ కౌన్సెలింగ్ విధానం ద్వారానా అనే విషయంపై తర్జన భర్జన పడింది. చివరికి సెప్టెంబర్ 30న వెబ్ కౌన్సిలింగ్ ద్వారా చేపట్టేందుకు ఉత్తర్వులు వెలువరించింది. ఇందులోనూ గందరగోళాన్ని సృష్టిస్తూ రెండు నెలలపాటు తాత్సారం చేసింది. నవంబర్ చివరి వారంలో ప్రక్రియను చేపట్టింది.
విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రకారం పోస్టులను సర్దుబాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ వ్యవహారంలో కూడా తర్జన భర్జన పడి చివరికి ప్రాథమిక పాఠశాలల్లో మాత్రమే రేషనలైజేషన్ చేపట్టింది. జనవరిలో పని సర్దుబాటు పేరిట రేషనలైజేషన్ చేపట్టి వివాదానికి తెరలేపింది. ప్రభుత్వం సెప్టెంబర్‌లో జీఓ విడుదల చేసింది. దీని ప్రకారం ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో 75 మంది పిల్లలుంటే ఆ పాఠశాలను పూర్తిస్థాయి ఇంగ్లీష్ మీడియంగా మార్చేయాలని ఆదేశించింది. అక్కడ ఉన్న తెలుగు మీడియం పిల్లలను సమీపంలోని పాఠశాలలకు తరలించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇది కూడా వివాదమై ఆందోళన చేపట్టే దిశగా పయనించింది. పాఠశాలలు పునఃప్రారంభం నాటికి పాఠ్య పుస్తకాలను సరఫరా చేయాలి. ఆగస్టు వరకు పాఠ్య పుస్తకాలు సరఫరా అవుతూనే ఉన్నాయి. ఇందులో పదవతరగతికి చెందినవి కూడా ఉన్నాయి. ఇది కూడా బోధనకు అవాంతరాలు ఏర్పడేలా చేసింది.
సెప్టెంబర్ చివరి వారం నుంచి పదవతరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. ఈ ఏడాది జనవరి రెండో వారం వరకు అటువంటి దాఖలాలే లేవు. ఇప్పుడిప్పుడే సామర్థ్య పరీక్షలు జరుగుతున్నాయి. ఇవి సత్ఫలితాలనిస్తే తప్ప ఉత్తీర్ణతా శాతం మెరుగుపడే అవకాశం ఉండదు.
-జిల్లాలో 470 ప్రభుత్వ పాఠశాలలు, 32 కేజీబీవీలతోపాటు సాంఘిక, గిరిజన సంక్షేమ, నవోదయ, రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి. 50 ప్రైవేటు పాఠశాలలున్నాయి. మొత్తంగా 37,741 మంది విద్యార్థులు పదవతరగతి పరీక్షలకు హాజరవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన సరిగా లేకపోవడంతో ఆ ప్రభావం ఉత్తీర్ణతా శాతంపై పడేలా వుంది.
ప్రత్యేక దృష్టి సారించాం
ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక దృష్టి సారించాం. ప్రణాళికాబద్ధంగా ఉపాధ్యాయులకు సూచనలు, సలహాలు ఇస్తున్నా. బదిలీలు, కౌన్సిలింగ్ సందర్భాల్లో ఉపాధ్యాయులను పాఠశాల నుంచి వేరొక దగ్గరికి రప్పించలేదు. అందువల్ల బోధనకు ఆటంకం కలగలేదు. వెబ్ విధానం వలన ఉపాధ్యాయులకే నేరుగా సమాచారం అందింది. దీని వల్ల ఒక గంట కూడా ఉపాధ్యాయులు పాఠశాలకు దూరంగా లేరు. దేవానందరెడ్డి, డీఈవో
‘టెన్’షన్
Published Thu, Jan 28 2016 11:34 PM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement