Transfer teachers
-
‘టెన్’షన్
శ్రీకాకుళం :ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ప్రభుత్వ పాఠశాలల బోధనపై ప్రధాన ప్రభావం చూపింది. వేసవి సెలవుల్లో బదిలీలు చేపడతామని చెప్పిన విద్యా సంవత్సరం ప్రారంభమైన తరువాత ఆగస్టులో ప్రక్రియ చేపట్టింది. ఆన్లైన్ విధానం ద్వారానా, వెబ్ కౌన్సెలింగ్ విధానం ద్వారానా అనే విషయంపై తర్జన భర్జన పడింది. చివరికి సెప్టెంబర్ 30న వెబ్ కౌన్సిలింగ్ ద్వారా చేపట్టేందుకు ఉత్తర్వులు వెలువరించింది. ఇందులోనూ గందరగోళాన్ని సృష్టిస్తూ రెండు నెలలపాటు తాత్సారం చేసింది. నవంబర్ చివరి వారంలో ప్రక్రియను చేపట్టింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రకారం పోస్టులను సర్దుబాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ వ్యవహారంలో కూడా తర్జన భర్జన పడి చివరికి ప్రాథమిక పాఠశాలల్లో మాత్రమే రేషనలైజేషన్ చేపట్టింది. జనవరిలో పని సర్దుబాటు పేరిట రేషనలైజేషన్ చేపట్టి వివాదానికి తెరలేపింది. ప్రభుత్వం సెప్టెంబర్‌లో జీఓ విడుదల చేసింది. దీని ప్రకారం ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో 75 మంది పిల్లలుంటే ఆ పాఠశాలను పూర్తిస్థాయి ఇంగ్లీష్ మీడియంగా మార్చేయాలని ఆదేశించింది. అక్కడ ఉన్న తెలుగు మీడియం పిల్లలను సమీపంలోని పాఠశాలలకు తరలించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇది కూడా వివాదమై ఆందోళన చేపట్టే దిశగా పయనించింది. పాఠశాలలు పునఃప్రారంభం నాటికి పాఠ్య పుస్తకాలను సరఫరా చేయాలి. ఆగస్టు వరకు పాఠ్య పుస్తకాలు సరఫరా అవుతూనే ఉన్నాయి. ఇందులో పదవతరగతికి చెందినవి కూడా ఉన్నాయి. ఇది కూడా బోధనకు అవాంతరాలు ఏర్పడేలా చేసింది. సెప్టెంబర్ చివరి వారం నుంచి పదవతరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. ఈ ఏడాది జనవరి రెండో వారం వరకు అటువంటి దాఖలాలే లేవు. ఇప్పుడిప్పుడే సామర్థ్య పరీక్షలు జరుగుతున్నాయి. ఇవి సత్ఫలితాలనిస్తే తప్ప ఉత్తీర్ణతా శాతం మెరుగుపడే అవకాశం ఉండదు. -జిల్లాలో 470 ప్రభుత్వ పాఠశాలలు, 32 కేజీబీవీలతోపాటు సాంఘిక, గిరిజన సంక్షేమ, నవోదయ, రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి. 50 ప్రైవేటు పాఠశాలలున్నాయి. మొత్తంగా 37,741 మంది విద్యార్థులు పదవతరగతి పరీక్షలకు హాజరవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన సరిగా లేకపోవడంతో ఆ ప్రభావం ఉత్తీర్ణతా శాతంపై పడేలా వుంది. ప్రత్యేక దృష్టి సారించాం ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక దృష్టి సారించాం. ప్రణాళికాబద్ధంగా ఉపాధ్యాయులకు సూచనలు, సలహాలు ఇస్తున్నా. బదిలీలు, కౌన్సిలింగ్ సందర్భాల్లో ఉపాధ్యాయులను పాఠశాల నుంచి వేరొక దగ్గరికి రప్పించలేదు. అందువల్ల బోధనకు ఆటంకం కలగలేదు. వెబ్ విధానం వలన ఉపాధ్యాయులకే నేరుగా సమాచారం అందింది. దీని వల్ల ఒక గంట కూడా ఉపాధ్యాయులు పాఠశాలకు దూరంగా లేరు. దేవానందరెడ్డి, డీఈవో -
బదిలీ టీచర్లపై కొరడా..!
విజయనగరం అర్బన్: విద్యాశాఖను తప్పుదారి పట్టించి బదిలీ పాయింట్లు వేసుకున్న ఉపాధ్యాయులపై విద్యాశాఖ కొరడా ఝుళిపించనుంది. అభ్యంతరాల సవరణ సమయంలో దొరికిన పలువురు ఉపాధ్యాయుల గుర్తించింది. వీరికి శ్రీముఖాలను ఇవ్వడానికి విద్యాశాఖ సిద్ధమైంది. జిల్లాలో 3,040 మంది ఉపాధ్యాయులు బదిలీలకు దరఖాస్తు చేసుకోగా వారిలో 806 మంది వివిధ అంశాలపై అభ్యంతరాలు, ఫిర్యాదులు పెట్టుకున్నారు. అయితే ఫిర్యాదుల్లో సుమారు 25 మంది వరకు స్వీయ తప్పిదాలను సవరించాలని కోరినవే ఉన్నాయి. వీటిని విద్యాశాఖ సవరిస్తూనే చార్జ్ మెమో ఇవ్వడానికి సిద్ధమయింది. ఈ మేరకు చార్జ్ మోమోలను బదిలీ ఆదేశాలు అందుకోకముందే సంబంధిత ఉపాధ్యాయుల చేతిలో పెట్టాలని చూస్తోంది. ఈ విషయాన్ని డీఈఓ జి.కృష్ణారావు ఖరారు చేశారు. బదిలీ జాబితా పరిశీలన ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. టీచర్లు తాము బదిలీ కోరుకుంటున్న స్థానాలను వెబ్ఆప్షన్ల రూపంలో ప్రాధాన్య తా క్రమంలో ఇప్పటికే ఆన్లైన్లో నమోదు చేశారు. వెబ్ఆప్షన్లు ఇచ్చిన స్థానాల కేటాయింపు ప్రక్రియ కోసం టీచర్లు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే తయారుచేసి ఆన్లైన్లో పొందుపరిచిన ఉపాధ్యాయుల వ్యక్తిగత పనితీరు, సర్వీస్ పాయింట్ల తుది సీనియార్టీ జాబితా, పోస్టుల ఖాళీలు, పాఠశాలల విలీనాల జాబితాలను మరోసారి పరిశీలించాలని రాష్ట్రస్థాయి అధికారుల నుంచి జిల్లా విద్యాశాఖలకు తాజాగా ఆదేశాలొచ్చాయి. రేషనలైజేషన్ అమలు చేయడం వల్ల మిగిలిన పోస్టుల సంఖ్య, విలీనమైన పాఠశాలల సంఖ్యను చివరిసారిగా సరిచూసుకుని సంబంధిత ఆన్లైన్ తుదిజాబితాతో హైదరాబాద్ రావాలని ఆదేశించారు. దీంతో విద్యాశాఖ అలెర్ట్ అయింది. బుధవారం మరోసారి పరిశీలించుకుంది. ప్రధానంగా అభ్యంతరాలు, వినతులను సవరించిన అంశాల్లో ఒకటికి రెండుసార్లు చూసింది. ఈ మేరకు ఆన్లైన్ జాబితాను తీసుకుని బుధవారం సాయంత్రం విద్యాశాఖ సిబ్బంది పయనమయ్యారు. రెండేళ్ల లోపు సర్వీసు పోస్టులపై ఖాళీలపై సందిగ్ధం రెండేళ్ల లోపు ఉద్యోగ విరమణ చేసే ఉపాధ్యాయులు బదిలీ కోసం దరఖాస్తు చేసినా ప్రస్తుతం వారు పనిచేస్తున్న స్థానాలు అరైజింగ్ వేకెన్సీలలో కనిపించలేదు. దీంతో వారు బదిలీ ఆప్షన్లలో తాము పనిచేస్తున్న స్థానాలను కూడా ఆప్షన్లు ఇచ్చేందుకు అవకాశం లేకుండా పోయింది. తాము కోరుకున్న స్థానాల్లో తమకు పోస్టింగ్ రాకపోతే తాము ఎక్కడకు వెళ్లాల్సివస్త్తుందోనని మల్లగుల్లాలు పడుతున్నారు. ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల విషయంలో కూడా ఈ సమస్య ఎదురైంది. రెండేళ్లలోపు రిటైర్డ్ అయ్యే ప్రధానోపాధ్యాయుల స్థానాలు ఖాళీల జాబితాలో కనిపించకపోవడంతో ఈ స్థానాలను ఆప్షన్లు ఇచ్చేందుకు ఇతర ప్రధానోపాధ్యాయులకు అవకాశం లేకుండా పోయింది. మొత్తం మీద ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన వెబ్సైట్లో పూర్తిస్థాయి సమాచారం పొందుపరచక పోవండంతో తాము నష్టపోతున్నామని ఉపాధ్యాయులు, హెచ్ఎంలు వాపోతున్నారు. -
గురువుల్లో గుబులు
ఏలూరు సిటీ :సర్కారు బడుల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బదిలీ గుబులు పట్టుకుంది. ఒకవైపు పాయింట్ల కేటాయింపులో లోపాలు అయోమయానికి గురి చేస్తున్నాయి. మరోవైపు విద్యా సంవత్సరం మధ్యలో బది లీలు చేపడితే ఇబ్బందులు తప్పవనే ఆందోళన వ్యక్తమవుతోంది. వేసవి సెలవుల్లో బదిలీలు, క్రమబద్ధీకరణ చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు కోరినా పట్టించుకోని ప్రభుత్వం ఆకస్మికంగా షెడ్యూల్ ప్రకటించటం విమర్శల పాలైంది. ఆన్లైన్ విధానంతో గందరగోళానికి గురవుతున్నామని కొందరు ఉపాధ్యాయులు వాపోతున్నారు. అభ్యంతరాల స్వీకరణ గడువు నేటితో పూర్తి జిల్లాలోని జెడ్పీ, ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో పనిచేస్తున్న 5,144 మంది ఉపాధ్యాయులు బదిలీ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. డీఈవో డి.మధుసూదనరావు వాటిని పరిశీ లించి 4,753 దరఖాస్తులను పరిష్కరించారు. సీనియార్టీ జాబితా, తదితర వివరాలను వెబ్సైట్లో పొందుపరిచామని, ఏవైనా అభ్యంతరాలుంటే శనివారం సాయంత్రం 5గంటల్లోగా ఆన్లైన్లోనే సమర్పించాలని డీఈవో సూచించారు. ఆమోదించిన దరఖాస్తుల సంఖ్య ఇలా బదిలీలకు సంబంధించి ఆమోదించిన దరఖాస్తుల వివరాలిలా ఉన్నాయి. జెడ్పీ యాజమాన్యంలో పనిచేస్తున్న 4,689 మందితోపాటు ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేస్తున్న 64 మంది ఉపాధ్యాయులకు సంబంధించి మొత్తం 4,753 ఆన్లైన్ దరఖాస్తులను డీఈవో ఆమోదించారు. ఇందులో గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులు 180 మంది, స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలో గణితం ఉపాధ్యాయులు 414 మంది, ఫిజికల్ సైన్సు టీచర్లు 294 మంది, బయోలాజికల్ సైన్సు టీచర్లు 291 మంది, సోషల్ స్టడీస్ ఉపాధ్యాయులు 273 మంది ఉన్నారు. ఫిజికల్ డెరైక్టర్లు 13 మంది, తెలుగు ఉపాధ్యాయులు 129 మంది, హిందీ ఉపాధ్యాయులు 122 మంది, ఇంగ్లిష్ టీచర్లు 312 మంది, సంస్కృతం ఏడుగురు, ఉర్ధూ ఉపాధ్యాయుడు ఒకరు ఉన్నారు. వీరితోపాటు ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులు 160 మంది, పీఈటీలు 144 మంది, డ్రాయింగ్ టీచర్లు 105 మంది, సెకండరీ గ్రేడ్ ఉర్ధూ ఉపాధ్యాయులు 16 మంది, సెకండరీ గ్రేడ్ తెలుగు ఉపాధ్యాయులు 1,945 మంది, భాషాపండిట్ తెలుగు ఉపాధ్యాయులు 147 మంది, భాషా పండిట్ హిందీ ఉపాధ్యాయులు 125 మంది, భాషాపండిట్ సంస్కృతం ఉపాధ్యాయులు ముగ్గురు, క్రాఫ్ట్ టీచర్లు ఏడుగురు7, ఒకేషనల్ టీచర్ ఒకరు ఉన్నారు. ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశాలల్లో పీఈటీలు 10మంది, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ టీచర్లు 8 మంది, హిందీ ఉపాధ్యాయులు ఆరుగురు, తెలుగు ఉపాధ్యాయుడు ఒకరు, పీడీ ఒకరు, సోషల్ స్టడీస్ ఉపాధ్యాయులు ఆరుగురు, బయోలాజికల్ సైన్సు టీచర్లు 8 మంది, ఫిజికల్ సైన్స్ టీచర్లు 13, గణితం ఉపాధ్యాయులు 11మంది ఉన్నారు. పాయింట్ల కిరికిరి ఉపాధ్యాయుల సర్వీస్, వారు పనిచేసే ప్రాంతం, ప్రత్యేక కేటగిరీ, ఆరోగ్య పరిస్థితులు ఇలా 11అంశాలకు సంబంధించి పాయింట్లు కేటాయిస్తున్నారు. వీటిని ఎంఈవోలు, డీవైఈవోలు ధ్రువీకరించాల్సి ఉండటంతో ఉపాధ్యాయులకు చిక్కులు వచ్చిపడ్డాయి. తాము ధ్రువీకరణ పత్రాలు తీసుకెళ్లినా విద్యాశాఖ అధికారులు పాయింట్లు కేటాయించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాయింట్లు కేటాయింపులో లోపాలు చోటుచేసుకుంటే బదిలీల్లో ప్రాధాన్యత కోల్పోతామని వాపోతున్నారు. అభ్యంతరాలకు సైతం మరోమారు ఆన్లైన్లోనే దరఖాస్తు చేయాల్సి రావటం ఇబ్బందిగా మారిందంటున్నారు. అభ్యంతరాలు స్వీకరించి లోపాలను సవరించేందుకు సరైన నిబంధనలు లేవంటున్నారు. విద్యాసంవత్సరం మధ్యలో బదిలీ చేస్తే వేరేచోటుకు వెళ్లటం కష్టమని, పిల్లల చదువులు, ఇతర సమస్యలు ఉత్పన్నం అవుతాయని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
7 నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తొలిసారిగా వెబ్‌కౌన్సెలింగ్ ద్వారా నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల బదిలీల్లో మైనస్ పాయింట్లూ పరిగణనలోకి తీసుకోనున్నారు. బదిలీలకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి ఆర్పీ సిసోడియా ‘ఏపీ టీచర్స్ (రెగ్యులేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్) రూల్స్’ పేరుతో జీవో నెంబర్ 63 విడుదల చేశారు. పనితీరు కింద ప్లస్ పాయింట్లతో పాటు లోపాలుంటే మైనస్‌పాయింట్లను పరిగణిస్తామని పేర్కొన్నారు. బదిలీల కోసం విభాగాల వారీగా జిల్లా, జోన్ల కమిటీలు ఏర్పాటుచేస్తున్నారు. బదిలీ షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ రూపొందిస్తారు. అసెంబ్లీ సమావేశాలు, టీచర్స్‌డే కారణంగా సెప్టెంబర్ 7 నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభ మవుతుందని అధికారవర్గాలు వివరించాయి. 2015 ఆగస్టు 1 నాటికి ఒకే స్కూల్లో 8 ఏళ్లు సర్వీసు పూర్తయిన టీచర్లు, అయిదేళ్లు సర్వీసు చేసిన హెడ్మాస్టర్లు (రెండేళ్లలో రిటైర్‌కానున్న వారికి దీన్నుంచి మినహాయింపు). బాలికల హైస్కూళ్లలోని 50 ఏళ్ల లోపు పురుష హెచ్ఎంలు, టీచర్లు రెండేళ్లు సర్వీసు పూర్తిచేసిన వారు బదిలీ దరఖాస్తుకు అర్హులు. రేషనలైజేషన్‌లో వేరే స్కూలుకు మారే టీచర్లు సర్వీసుతో సంబంధం లేకుండా బదిలీ దరఖాస్తు చేయొచ్చు. స్కూళ్లున్న ప్రాంతాలను బట్టి కేటగిరీ 1కి 1, కేటగిరీ 2కు 2, కేటగిరీ 3కి 3, కేటగిరీ 4కి 5 పాయింట్లు. హెచ్ఆర్ఏ, రోడ్డు కనెక్టివిటీలను అనుసరించి ఆయా జిల్లాల కలెక్టర్లు ఈ కేటగిరీలను నిర్ణయిస్తారు. -
బదిలీ టీచర్లలో వెబ్..డబ్..
- 7 వేల మందికి తప్పని స్థానచలనం - పనితీరు ప్రతిభ ఆధారంగా బదిలీ పాయింట్లు - వెబ్ కౌన్సెలింగ్‌లో ఆరు స్టేజ్‌లు - కౌన్సెలింగ్ నిర్వహణకు సిద్ధం డీఈఓ విజయనగరం అర్బన్: గంటకో ప్రకటన, రోజుకొక జీవో రావడంతో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ గందరగోళంగా తయారయింది. విద్యాసంత్సరం ప్రారంభం నాటికి టీచర్ల బదిలీ పూర్తిచేస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పటికీ బదిలీల స్పష్టత ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. ప్రాథమిక పాఠశాలల్లో రెండేళ్లుగా బదిలీలు చేపట్టలేదు. మూడేళ్లుగా హేతుబద్ధీకరణ లేదు. రెండింటినీ కలిపి ప్రస్తుతం నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపధ్యంలో బదిలీల కోసం ఎదురుచూస్తున్న వారు కొందరైతే.. నిబంధనలకు లోబడి తప్పనిసరిగా మారాల్సిన వారు మరికొందరు ఉన్నారు. విద్యాసంవత్సరం మధ్యలో జరపడం వల్ల ఎక్కడికి వెళ్లాల్సిన ఉంటుందోనని దాదాపుగా అందరూ ఆందోళన చెందుతున్నారు. ఏడువేల మందికి స్థాన చలనం ! జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పరిధిలో 13 వేలమంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో ప్రస్తుతం సుమారు ఏడు వేల మందికి బదిలీలు, హేతుబద్ధీకరణ ప్రక్రియలో స్థానచలనం ఖాయమని విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు అంచనా వేస్తున్నారు. ఉపాధ్యాయుల బదిలీలను ఈ నెల రెండవ వారంలోనే నిర్వహించాలని భావించి, షెడ్యూల్ కూడా విడుదల చేశారు. ఆ తరువాత వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలంటూ మంత్రి గంటా ప్రకటించారు. వెనువెంటనే మరో ప్రకటనలో ఉపాధ్యాయుల వృత్తిప్రతిభ ప్రాధిపతికన పాటించాలంటూ సీఎం పేర్కొన్నారు. దీంతో త్వరలోనే బదిలీలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే అకాశం ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. తక్కువ మంది విద్యార్థులున్న కిలోమీటరు పరిధిలోని ప్రాథమిక పాఠశాలలను ఆదర్శపాఠశాల పేరుతో విలీనం చేసేందుకు ప్రభుత్వం జీఓ నంబర్ 45ని విడుదల చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 30 లోపు విద్యార్థులున్న 194 పాఠశాలలను 262 పాఠశాలల్లో విలీనం చేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. వీటిల్లో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించినున్నారు. కేవలం హేతుబద్ధీకరణ పేరుతోనే సూమారు 800 మందికిపైగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయనున్నారు. ఈ నేపధ్యంలో అధిక సంఖ్యల్లో ఉపాధ్యాయులకు స్థానచలనం తప్పదని స్పష్టమవుతోంది. పనితీరు ప్రతిభ ఆధారంగా బదిలీ పాయింట్లు సీఎం ప్రకటన నేపధ్యంలో ముందుగా ఉపాధ్యాయుల పనితీరును వివరాలను సిద్ధం చేసుకొని బదిలీ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేయనున్నారు. ఉపాధ్యాయ పనితీరును గుర్తించే ప్రక్రియలో విద్యార్థి ఉత్తీర్ణత శాతంతోపాటు, స్థానిక నివాసం, టీచర్ పిల్లలను వాళ్లు పనిచేసిన స్కూళ్లలో చదివించడం వంటి టీచర్ వ్యక్తగత వృత్తిప్రమాణాలకు మార్కులు వేసి వారికి ప్రాధాన్యం ఇస్తారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇలాంటి పద్ధతిని పాటించడంతో టీచర్లు ఆందోళన చెందుతున్నారు. ఆరు స్థాయిల్లో ... బదిలీల ప్రక్రియను మొత్తం ఆరు స్థాయిల్లో నిర్వహించనున్నారు. ముందుగా .. ఇప్పటికే ఉన్న ఖాళీలు, ఎనిదేళ్లు ఒకేచోట సర్వీసు కలిగిన వారి ఖాళీలు, హేతుబద్ధీకరణ ఖాళీలను ప్రదర్శిస్తారు. అనంతరం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు మూడు రోజులు సమయం ఇస్తారు. ఉపాధ్యాయుడు దరఖాస్తు చేసిన ప్రింట్‌ను తీసుకొని సంబంధిత ధ్రువీకరణవపత్రాలతో మండల విద్యాశాఖాధికారి, ప్రధానోపాధ్యాయులకు సమర్పించి నిర్ణరించుకోవాలి. వారు వాటిని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి పంపుతారు. అనంతరం తాత్కాలిక సీనియార్టీ జాబితాను ఎన్టైటిల్మెంట్ పాయింట్లతో వెబ్సైట్లో ఉంచుతారు. దీనిపై దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయుల సెల్‌ఫోన్‌కు పాస్వర్డ్ వస్తుంది. అనంతరం ఆన్లైన్లోనే తాము పనిచేదలుచుకున్న, కోరుకున్న పాఠశాలల వివరాలను నమోదు చేయాలి. అవసరమైతే రెండుసార్లు వాటిని మార్చుకొనే అవకాశం కూడా కల్పిస్తున్నారు. వెబ్‌కౌన్సెలింగ్ ద్వారా సీనియారిటీలో తమ కిందనున్న వారు ఖాళీ చేసిన స్థానాలను సైతం ఎంపిక చేసుకొనే వెసులుబాటు కల్పిస్తారు. గతంలో ఈ తరహా సదుపాయం ఉండేదికాదు. ఆంగ్ల మాధ్యమం పాఠశాలలను కోరుకున్న వారు ఇకపై ఆ పాఠశాలలోనే పనిచేయాల్సి ఉంటుంది. వెబ్‌కౌన్సెలింగ్ ముగిసిన ఐదు రోజుల్లో బదిలీ ఉత్తర్వులు పంపుతారు. ఉపాధ్యాయుల సెల్‌నంబర్లకు కూడా సంక్షిప్త సమాచారం పంపే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కౌన్సెలింగ్ నిర్వహణకు సిద్ధం డీఈఓ హేతుబద్ధీకరణ, వెబ్‌కౌన్సెలింగ్ ప్రక్రియలను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు డీఈఓ జి.కృష్ణారావు తెలిపారు. తొలిసారి వెబ్‌కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు నిర్వహిస్తుండటంతో కొందరికి అవగాహనలేదని ముందుగానే టీచర్లకు శిక్షణ ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. కౌన్సెలింగ్‌పై స్పష్టమైన సెడ్యూల్ రానందున ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నామని తెలిపారు. ఎప్పుడు కౌన్సెలింగ్ నిర్వహించమన్నా సిద్ధం ఉన్నామని డీఈఓ స్పష్టం చేశారు. -
ఉపాధ్యాయుల బదిలీలకు తెర
నల్లగొండ: ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ ముగిసింది. విమర్శలకు తావు లేకుండా సాఫీగా సాగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈనెల 6న ప్రారంభమైన కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకారం 18వ తేదీ నాటికి పూర్తి కావాలి. వివిధ కారణాలతో రెండు రోజులపాటు పొడిగించారు. ఈ సారి జరిగిన బదిలీల్లో రేషనలైజేషన్ అంశం ఉపాధ్యాయులను ఉక్కిరిబిక్కిరి చేసింది. భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలల మనుగుడ ప్రశ్నార్థకం చేసేవిధంగా రేషనలైజేషన్ చేపట్టడం ద్వారా జిల్లాలో మంజూరైన పోస్టుల్లో చాలావరకు విద్యార్థులు లేక మిగిలిపోవడంతో వాటిన్నింటిని డీఈఓ పూల్‌లో ఉంచారు. దీంతో డీఎస్సీలో ఎస్జీటీ పోస్టులకు అవకాశం లేకుండా పోయింది. స్కూల్ అసిస్టెంట్లలో వివిధ సబ్జెక్టుల్లో ఖాళీలు ఉన్నాయి. మొత్తం జరిగిన బదిలీల్లో ఎక్కువ మంది ప్రధానోపాధ్యాయులు బదిలీ అయ్యారు. 8 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న హెచ్ఎంలు 50 శాతం వరకు స్థానం చలనం పొందారు. స్కూల్ అసిస్టెంట్లు 30 శాతం మంది బదిలీ కాగా ఎస్జీటీలు 20 నుంచి 25 శాతం వరకు బదిలీ అయ్యారు. కౌన్సెలింగ్ చివరి రోజైన మంగళవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు ఎస్జీటీల కౌన్సెలింగ్ పూర్తిచేశారు. దీంతో కౌన్సెలింగ్ ప్రక్రియ మొత్తం పూర్తయినట్టు డీఈ ఎన్.విశ్వనాథరావు వెల్లడించారు.