నల్లగొండ: ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ ముగిసింది. విమర్శలకు తావు లేకుండా సాఫీగా సాగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈనెల 6న ప్రారంభమైన కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకారం 18వ తేదీ నాటికి పూర్తి కావాలి. వివిధ కారణాలతో రెండు రోజులపాటు పొడిగించారు. ఈ సారి జరిగిన బదిలీల్లో రేషనలైజేషన్ అంశం ఉపాధ్యాయులను ఉక్కిరిబిక్కిరి చేసింది. భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలల మనుగుడ ప్రశ్నార్థకం చేసేవిధంగా రేషనలైజేషన్ చేపట్టడం ద్వారా జిల్లాలో మంజూరైన పోస్టుల్లో చాలావరకు విద్యార్థులు లేక మిగిలిపోవడంతో వాటిన్నింటిని డీఈఓ పూల్‌లో ఉంచారు.
దీంతో డీఎస్సీలో ఎస్జీటీ పోస్టులకు అవకాశం లేకుండా పోయింది. స్కూల్ అసిస్టెంట్‌లలో వివిధ సబ్జెక్టుల్లో ఖాళీలు ఉన్నాయి. మొత్తం జరిగిన బదిలీల్లో ఎక్కువ మంది ప్రధానోపాధ్యాయులు బదిలీ అయ్యారు. 8 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న హెచ్‌ఎంలు 50 శాతం వరకు స్థానం చలనం పొందారు. స్కూల్ అసిస్టెంట్లు 30 శాతం మంది బదిలీ కాగా ఎస్జీటీలు 20 నుంచి 25 శాతం వరకు బదిలీ అయ్యారు. కౌన్సెలింగ్ చివరి రోజైన మంగళవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు ఎస్జీటీల కౌన్సెలింగ్ పూర్తిచేశారు. దీంతో కౌన్సెలింగ్ ప్రక్రియ మొత్తం పూర్తయినట్టు డీఈ ఎన్.విశ్వనాథరావు వెల్లడించారు.
ఉపాధ్యాయుల బదిలీలకు తెర
Published Wed, Jul 22 2015 1:29 AM | Last Updated on Sun, Sep 3 2017 5:54 AM
Advertisement