Counselling Schedule
-
పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలో 94.57 శాతం పాస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎనిమిది విశ్వవిద్యాలయాలు, వాటి పరిధిలోని పోస్టు–గ్రాడ్యుయేట్ కాలేజీల్లో వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీపీగేట్) ఫలితాలను శుక్రవారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి విడుదల చేశారు. సెట్లో 94.57 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించినట్టు ఆయన వెల్లడించారు. మొత్తం 45 కోర్సులకు సంబంధించిన ఈ సెట్‌ను గత నెల 6 నుంచి 16వ తేదీ వరకూ నిర్వహించారు. 73,342 మంది పరీక్షకు దరఖాస్తు చేస్తే, 64,765 మంది పరీక్షకు హాజరయ్యారు.వీరిలో 61,246 మంది (94.57 శాతం) ఉత్తీర్ణులయ్యారు. పీజీ సెట్ పరీక్ష రాసిన వారు, అర్హత సాధించిన వారిలో బాలికలే ఎక్కువగా ఉన్నారు. బాలురు 21,757 మంది పరీక్ష రాస్తే, 20,569 మంది పాసయ్యారు. బాలికలు 43,008 మంది రాస్తే 40,677 మంది పాసయ్యారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో వైస్ చైర్మన్ ప్రొఫెసర్ మహమూద్, ఉస్మానియా యూనివర్సిటీ రిజి్రస్టార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, మండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, సెట్ కనీ్వనర్ పాండు రంగారెడ్డి పాల్గొన్నారు. 12 నుంచి కౌన్సెలింగ్: ఉమ్మడి ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు ఈ నెల 12 నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు సెట్ కనీ్వనర్ పాండురంగారెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. విద్యార్థులు సరి్టఫికెట్లను ఆన్లైన్లో వెరిఫికేషన్ కోసం అప్లోడ్ చేయాలని సూచించారు. కాలేజీల్లో చేరేటప్పుడు మాత్రమే ఒరిజినల్ సరి్టఫికెట్లు ఇవ్వాలని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 42,192 పీజీ సీట్లున్నాయని, ఈ సంవత్సరం మరో 2 వేల సీట్లు అదనంగా వచ్చే వీలుందని తెలిపారు. 278 కాలేజీలు కౌన్సెలింగ్ పరిధిలోకి వస్తాయని వెల్లడించారు. -
కసరత్తు చేస్తే... కోరుకున్న సీటు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 21 నుంచి ఎంసెట్ తొలిదశ కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలుకానుంది. 1.56 లక్షల మంది ఇంజనీరింగ్ సీట్ల కోసం పోటీపడనున్నారు. 21, 22 తేదీల్లో స్లాట్ బుకింగ్, రిజిస్ట్రేషన్ ఉంటుంది. 23వ తేదీ నుంచి ఆన్లైన్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. కన్వీనర్ కోటా కింద దాదాపు 75 వేల సీట్లు ఉంటే, మరో 35 వేల వరకు మేనేజ్మెంట్ కోటా సీట్లున్నాయి. మొత్తం 1.10 లక్షల సీట్లున్నా, బీటెక్‌లో చేరుతున్నది ఏటా 80 వేల మందే ఉంటున్నారు. 58 శాతం వరకూ కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ కొత్త కోర్సులైన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ వంటి కోర్సుల్లోనే చేరుతున్నారు. ఈసారి డిమాండ్ లేని బ్రాంచీల్లో సీట్లు తగ్గాయి. దీంతో ఆచితూచి ఆప్షన్లు ఇవ్వాలని, గతంలో జరిగిన కౌన్సెలింగ్‌లను అధ్యయనం చేసి తమ ర్యాంకు ఆధారంగా ఒక అంచనాకు రావాలని, అప్పుడు టాప్ కాలేజీ కాకపోయినా కోరుకున్న బ్రాంచి దక్కే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అభ్యర్థులు ఎన్ని ఆప్షన్లయినా పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి చివరి వరకు ఇచ్చే ప్రాధాన్యతలు కీలకంగా మారనున్నాయి. టాప్ ర్యాంకుల్లో ఇలా.. ఆప్షన్లు ఇచ్చే విషయంలో తికమకపడి అస్పష్టతతో ఆప్షన్లు ఇస్తుంటారు. దీంతో కొంతమంది అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉంది. మొదటి దశ కౌన్సెలింగ్‌లో 500లోపు ఎంసెట్ ర్యాంకర్లు ఆప్షన్లు ఇస్తారు. వీళ్లల్లో చాలామంది ఆయా కోర్సుల్లో చేరే అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్లకు జేఈఈ వంటి ర్యాంకులు కూడా వచ్చి ఉంటాయి. 500–1000 లోపు ర్యాంకులు వచ్చిన విద్యార్థుల్లో 25% వరకే వచ్చిన సీటులో చేరుతుంటారు. అంటే వర్సిటీ క్యాంపస్ కళాశాలల్లోనో, టాప్ ప్రైవేట్ కాలేజీల్లోనో చేరతారు. 1000–1500 ర్యాంకులు వచ్చిన విద్యార్థుల్లో 50% పైగా టాప్ టెన్ కాలేజీల్లో నచ్చిన బ్రాంచిలో చేరే వీలుంది. ఇక 1500 నుంచి 5 వేల ర్యాంకు వరకు వచ్చిన ఓపెన్ కేటగిరీ విద్యార్థులు ఇతర టాప్ కాలేజీ ల్లో కన్వీనర్ కోటా కింద అవకాశం దక్కించు కునే అవకాశం ఉంటుంది. వీరిలో 80% వచ్చిన సీటును వదులుకోవడం లేదు. ఏదో ఒక బ్రాంచిలో ఇష్టం లేకున్నా చేరి తర్వాత కౌన్సెలింగ్‌లో నచ్చిన బ్రాంచి దక్కించుకునే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. 10 వేల ర్యాంకు తర్వాత... విద్యార్థులు డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్ కోర్సు, టాప్ కాలేజీలకే తొలి ఆప్షన్ ఇస్తారు. ఇలాంటప్పుడు 10 వేల పైన ర్యాంకు వచ్చిన వారు కాస్త ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. గత ఐదేళ్ళ ఎంసెట్ కౌన్సెలింగ్‌ను పరిశీలిస్తే... 40 వేల ర్యాంకుపైన వచ్చిన వాళ్లు కూడా టాప్ కాలేజీలకు మొదటి ఆప్షన్ ఇస్తు న్నారు. కొంతమంది పోటీ ఉన్న బ్రాంచికి కాకుండా, సివిల్, మెకానికల్, ఈఈఈ వంటి బ్రాంచిలకు ప్రాధాన్యత ఆప్షన్లుగా ఇస్తున్నారు. పోటీ లేదని, సీటు వస్తుందని భావిస్తారు. 10 వేల ర్యాంకు తర్వాత కూడా సీటు వచ్చే కాలేజీ ల్లో ఆప్షన్లు ఇవ్వడం లేదు. దీంతో వాళ్ల తర్వాత ర్యాంకు వారు ఆ కాలేజీలకు ఆప్షన్లు ఇస్తే వారికి సీటు వెళ్తుంది. వారు చేరితే టాప్ కాలేజీల్లో సీటు రాక తర్వాత కౌన్సెలింగ్‌లో ఆప్షన్లు ఇచ్చినా ప్రయోజనం ఉండటం లేదు. సరైన అంచనా అవసరం ►ఆప్షన్లు ఇచ్చే ముందు తమకు వచ్చిన ర్యాంకు ప్రకారం గతంలో ఎక్కడ, ఏ కాలేజీలో సీటు వచ్చిందనే దానిపై ప్రాథమిక అంచనాకు రావాలి. వాటిల్లో నచ్చిన బ్రాంచిని ఎంపిక చేసుకునేందుకు మొదటి ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ►ఈసారి మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ సీట్లు తగ్గాయి. అయితే పోటీ పెద్దగా ఉండే అవకాశం కన్పించడం లేదు. అంతా కంప్యూటర్ సైన్స్ గ్రూపుల వైపు వెళ్తున్నారు. కాబట్టి డిమాండ్ లేని కోర్సులు కోరుకునే వారు మంచి కాలేజీకి ప్రాధాన్యత ఇవ్వొచ్చు. ►వెయ్యిలోపు ర్యాంకులు వచ్చిన వారికి కౌన్సెలింగ్‌లో వచ్చే సీటు సాధారణంగా మంచి కాలేజీలోనే అయి ఉంటుంది. కాబట్టి కోరుకున్న కాలేజీ, బ్రాంచి.. తర్వాత జరిగే కౌన్సెలింగ్‌లో అయినా దక్కుతుందనే ధీమాతో ఉండొచ్చు. వీళ్ళు తుది దశ కౌన్సెలింగ్ వరకు వేచి చూసి, ఆ తర్వాతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడం మంచిది. -
ఇంజనీరింగ్ క్లాసులు ఇంకా ఆలస్యం
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ ఈ నెల 20 తర్వాత మొదలయ్యే అవకాశముందని రాష్ట్ర సాంకేతిక విద్యామండలి వర్గాలు తెలిపాయి. షెడ్యూల్ త్వరలో ప్రకటిస్తామని, దీనికోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. మరోవైపు మొదటి కౌన్సెలింగ్‌లో సీటు దక్కిన విద్యార్థులు దాన్ని రద్దు చేసుకునే గడువును పొడిగించాలని మండలి నిర్ణయించింది. వీటితోపాటే యాజమాన్య కోటా సీట్ల భర్తీ గడువునూ పెంచనున్నట్టు తెలిసింది. రెండో విడత కౌన్సెలింగ్ ఈ నెల 15 నుంచే మొదలుపెట్టాలని నిర్ణయించినప్పటికీ దసరా నేపథ్యంలో తేదీని మార్చాలని యోచిస్తున్నారు. మరోవైపు కోర్టు ఆదేశంతో ఇంజనీరింగ్ సీట్ల పెంపుపై స్పష్టత కూడా రాలేదు. జేఎన్టీయూహెచ్ దీనిపై నిర్ణయం వెలువరిస్తే రెండో దశ కౌన్సెలింగ్‌లో 70 శాతం సీట్లు చేరాల్సి ఉంటుంది. ఇందుకు తగ్గట్టుగా ఈబీసీ కోటా సీట్లు ఖరారు చేయాలి. వీటన్నింటికీ ప్రభుత్వం నుంచి అనుమతి రావాలి. ఈ ప్రక్రియ వల్ల మరికొంత జాప్యమయ్యే అవకాశముందని అధికారులు అంటున్నారు. జాతీయ సీట్లపైనా స్పష్టత తొలి విడత కౌన్సెలింగ్‌లో ఇంజనీరింగ్, ఫార్మసీ, బయోటెక్నాలజీ తదితర గ్రూపులకు 61,169 సీట్లు కన్వీనర్ కోటా కింద కేటాయించారు. గడువు ముగిసే నాటికి 46,322 మంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. ఇంజనీరింగ్, సైన్స్ గ్రూపుల్లో 38,796 సీట్లుండగా.. 37,073 సీట్లు కేటాయించారు. కంప్యూటర్ సైన్స్ అనుబంధ గ్రూపుల్లో చాలామంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. జేఈఈ ర్యాంకుల ఆధారంగా రాష్ట్రం నుంచి ప్రతీ ఏటా 1,500 మంది వరకూ ఐఐటీ, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లోకి వెళ్తున్నారు. అయితే రెండో దశ కౌన్సెలింగ్ ఆలస్యం కావడం, నిట్, ఐఐటీ సీట్ల కేటాయింపులో స్పష్టత రావడంతో ఎన్ని సీట్లు ఖాళీ అవుతాయనేది తెలిసే వీలుందని అంచనా వేస్తున్నారు. దీనికితోడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ అండ్ ఎంఎల్ వంటి కొత్త కోర్సుల్లో జేఎన్టీయూహెచ్ అనుమతి లేకుండానే సీట్ల పెంపుపై హైకోర్టు ప్రైవేటు కాలేజీలకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై యూనివర్సిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాక.. సర్కార్ అనుమతిస్తే మరో 4 వేల సీట్లు పెరిగే వీలుంది. ఇప్పటివరకైతే సీట్ల పెంపుపై జేఎన్టీయూహెచ్ విముఖంగా ఉంది. నవంబర్ చివరినాటికైనా కష్టమే.. మొదటి ఏడాది ఇంజనీరింగ్ తరగతులు నవంబర్ మొదటి వారం నుంచి ప్రారంభించాలనుకున్నారు. కౌన్సెలింగ్ షెడ్యూల్ ఎప్పటికప్పుడు మారుతోంది. యాజమాన్య కోటా భర్తీ వివరాలను ఈనెల 15లోగా పంపాలని ఆదేశించిన రాష్ట్ర అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ మండలి.. ఈ గడువును పొడిగించే యోచనలో ఉంది. అదీగాక కోర్టు తీర్పు ద్వారా పెరిగే 30 శాతం సీట్ల వివరాలను నియంత్రణ మండలికి పంపాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తవ్వడానికే నవంబర్ రెండో వారం పడుతుందని, ఈ ప్రకారం నవంబర్ చివరినాటికైనా క్లాసులు మొదలుకావడం కష్టమేనని ఓ అధికారి వ్యాఖ్యానించారు. -
టీఎస్ ఎంసెట్ అడ్మిషన్స్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎంసెట్ అడ్మిషన్స్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 30 నుంచి సెప్టెంబర్ 9వరకు ధ్రువపత్రాల స్లాట్ బుకింగ్ చేపడుతున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ విభాగం మంగళవారం వెల్లడించింది. సెప్టెంబర్ 4 నుంచి 11 వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని తెలిపింది. సెప్టెంబర్ 13 వరకు వెబ్ఆప్షన్స్ నమోదు.. సెప్టెంబర్ 15న మొదటి విడత సీట్ల కేటాయింపు జరుపుతామని చెప్పింది. సెప్టెంబర్ 15 నుంచి 20 వరకు కాలేజీల్లో ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలని ఓ ప్రకటనలో పేర్కొంది. (చదవండి: రేవంత్‌ను నమ్మడం కరెక్టేనా?: మంత్రి ప్రశాంత్ రెడ్డి) -
డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త
సాక్షి, కడప ఎడ్యుకేషన్: డీఎస్సీ–2018 జిల్లాస్థాయి పోస్టుల భర్తీకి కసరత్తు ప్రారంభమైంది. తొలి విడతగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పాఠశాల విద్యాశాఖ నుంచి బుధవారం ప్రొవిజినల్ జాబితా జిల్లాకు చేరింది. స్కూల్ అíసిస్టెంట్ ఇంగ్లీష్, గణితం, సోషల్, సైన్సు, బయోలాజికల్ సబ్జెక్టుల్లో జాబితా వచ్చినట్లు తెలిసింది. 2018 డిసెంబర్ 24 నుంచి 28 వరకు ఆన్లైన్లో డీఎస్సీ మొదటి విడత పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే. 24, 26, 27 తేదీలలో 102 స్కూల్ అసిస్టెంట్(నాన్ లాంగ్వేజెస్) పోస్టులకు.. 28న 11 భాషా పండితుల పోస్టులకు 7739 మంది పరీక్షను రాశారు. రెండవ విడతలో ఎస్జీటీలకు 18 నుంచి 31 వరకు పరీక్షలను నిర్వహించారు. 78 సెకండ్ గ్రేడ్ టీచర్ పోస్టులకు 15,278 మంది పరీక్ష రాశారు. పోస్టుల వివరాలు ఇలా... జిల్లా పరిషత్, గవర్నమెంట్ మేనేజ్మెంట్లలో 187 పోస్టులు, మున్సిపాలిటికి సంబంధించి 39 పోస్టులను భర్తీ కానున్నాయి. భాషా పండితులు, వ్యాయాయ ఉపాధ్యాయ పోస్టులపై న్యాయస్థానంలో వ్యాజ్యం ఉన్నందున స్పష్ట్టత రావాల్సి ఉంది. ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ఇందుకు రెండ్రోజుల సమయం కేటాయించారు. అనంతరం స్థానికంగా ధ్రువవత్రాలను పరిశీలిస్తారు. వీరిలో అనర్హులుంటే తొలగించి వారి స్థానాల్లో తదుపరి వారికి అవకాశం కల్పిస్తారు. అనర్హుల స్థానంలో ఎంపికైన వారు ధ్రువపత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి.పరిశీలించి ఎంపిక జాబితాను రూపొందిస్తారు. ఇలా పోస్టుల సంఖ్య అనుగుణంగా అభ్యర్థులు ఎంపికయ్యే వరకు ప్రక్రియ సాగుతుంది. నియామక షెడ్యూల్ ఇలా.... ఆగస్టు 5 వరకు స్కూల్ అసిస్టెంట్, ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 4 వరకూ ఎస్జీటీలకు కౌన్సెలింగ్‌ను నిర్వహించి నియామక ఉత్తర్వులు జారీ చేసేలా షెడ్యుల్‌ను రూపొందించారు. ఎస్జీటీలకు సంబంధించి ఆగస్టు 2 నుంచి అభ్యర్థుల ఎంపిక జాబితా ప్రకటిస్తారు. 6,7 తేదీలలో సర్టిఫికెట్స్ అప్లోడ్ చేస్తారు. 29న తుది జాబితా ప్రకటిస్తారు. ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 1న వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. సెప్టెంబర్ 4న పోస్టుంగ్ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. -
పాలిసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల
హైదరాబాద్: తెలంగాణ పాలిసెట్-2016 కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను గురువారం అధికారులు విడుదల చేశారు. మే 20 నుంచి కౌన్సిల్ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. పాలిసెట్ కౌన్సిలింగ్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ► మే 20 నుంచి 28 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ► మే 23 నుంచి 30 వరకు ఆప్షన్ల ఎంపిక ► మే 31న ఆప్షన్ల మార్పులు, చేర్పులకు అవకాశం ► జూన్ 1న సీట్ల అలాట్మెంట్ ► కాలేజీలో రిపోర్ట్ చేయడానికి జూన్ 8 వరకు గడువు ► జూన్ 9 నుంచి పాలిసెట్ తరగతులు ప్రారంభం. -
ఉపాధ్యాయుల బదిలీలకు తెర
నల్లగొండ: ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ ముగిసింది. విమర్శలకు తావు లేకుండా సాఫీగా సాగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈనెల 6న ప్రారంభమైన కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకారం 18వ తేదీ నాటికి పూర్తి కావాలి. వివిధ కారణాలతో రెండు రోజులపాటు పొడిగించారు. ఈ సారి జరిగిన బదిలీల్లో రేషనలైజేషన్ అంశం ఉపాధ్యాయులను ఉక్కిరిబిక్కిరి చేసింది. భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలల మనుగుడ ప్రశ్నార్థకం చేసేవిధంగా రేషనలైజేషన్ చేపట్టడం ద్వారా జిల్లాలో మంజూరైన పోస్టుల్లో చాలావరకు విద్యార్థులు లేక మిగిలిపోవడంతో వాటిన్నింటిని డీఈఓ పూల్‌లో ఉంచారు. దీంతో డీఎస్సీలో ఎస్జీటీ పోస్టులకు అవకాశం లేకుండా పోయింది. స్కూల్ అసిస్టెంట్లలో వివిధ సబ్జెక్టుల్లో ఖాళీలు ఉన్నాయి. మొత్తం జరిగిన బదిలీల్లో ఎక్కువ మంది ప్రధానోపాధ్యాయులు బదిలీ అయ్యారు. 8 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న హెచ్ఎంలు 50 శాతం వరకు స్థానం చలనం పొందారు. స్కూల్ అసిస్టెంట్లు 30 శాతం మంది బదిలీ కాగా ఎస్జీటీలు 20 నుంచి 25 శాతం వరకు బదిలీ అయ్యారు. కౌన్సెలింగ్ చివరి రోజైన మంగళవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు ఎస్జీటీల కౌన్సెలింగ్ పూర్తిచేశారు. దీంతో కౌన్సెలింగ్ ప్రక్రియ మొత్తం పూర్తయినట్టు డీఈ ఎన్.విశ్వనాథరావు వెల్లడించారు. -
ఫలితాలొచ్చాయ్
ఏలూరు సిటీ :డీఎస్సీ-14లో భాగంగా నిర్వహించిన టెట్ కమ్ టెర్ట్ ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థుల మార్కుల వివరాలను ఏపీడీఎస్సీ.కామ్ వెబ్సైట్లో పొందుపరిచారు. కేటగిరీ పోస్టులు, సబ్జెక్టుల వారీగా కటాఫ్ మార్కులు, పోస్టుల భర్తీకి కోసం చేపట్టే కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేస్తారని డీఈవో డి.మధుసూదనరావు చెప్పారు. పాఠశాలల పునఃప్రారంభమయ్యే నాటికే కౌన్సెలింగ్ పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. జిల్లాలో 662 పోస్టులు ఉండగా, 28వేల 761 మంది టెట్ కమ్ టెర్ట్ పరీక్షలు రాశారు. సబ్జెక్ట్‌ల వారీగా చూస్తే.. స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలో 17,193, స్కూల్ అసిస్టెంట్ భాషా పం డిట్ పోస్టులకు 4,608 మంది, భాషాపండిట్ పోస్టులకు 4,041 మంది, పీఈటీ పోస్టులకు 31మంది, ఎస్జీటీ పోస్టులకు 2,888 మంది పరీక్షలు రాశారు. టెట్ మార్కుల గందరగోళం డీఎస్సీ-14 పరీక్షలో ఫలితాలు విడుదలైనా టెట్ మార్కుల విషయంలో అభ్యర్థులు కొంత గందరగోళానికి గురవుతున్నారు. ప్రస్తుతం టెట్ కమ్ టెర్ట్ పరీక్ష నిర్వహించారు. గతంలో టీచర్ టెట్ రాసిన అభ్యర్థులకు ఆ పరీక్షలో అత్యధికంగా లభించిన మార్కుల ఆధారంగా వెయిటేజీ ఇవ్వగా, కొత్తగా టెట్ కమ్ టెర్ట్ పరీక్ష రాసిన అభ్యర్థులకు ఏ విధంగా మార్కులు ఇచ్చారనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై డీఈవో మధుసూదనరావును వివరణ కోరగా.. గతంలో టెట్ రాసి, ఇప్పుడు టెట్ కమ్ టెర్ట్ రాసిన రాసిన అభ్యర్థులకు దేనిలో ఎక్కువ మార్కులు వస్తే వాటినే వెయిటేజీగా ఇచ్చి ఉంటారని అభిప్రాయపడ్డారు. దీనిపై విద్యాశాఖ అధికారులకూ సరైన అవగాహన లేకపోవటంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టెట్ కమ్ టెర్ట్ పరీక్ష నిర్వహించిన దృష్ట్యా గతంలో టెట్ పరీక్ష మార్కులను వెయిటేజీగా ఇవ్వటం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కటాఫ్ మార్కులు, కౌన్సెలింగ్ షెడ్యూల్, విధి విధానాలు ప్రకటిస్తే గానీ దీనిపై నెలకొన్న గందరగోళానికి తెరపడే అవకాశం లేదంటున్నారు.