కసరత్తు చేస్తే... కోరుకున్న సీటు | TS EAMCET 2022: First Phase Counselling Will Start From 21st August | Sakshi
Sakshi News home page

కసరత్తు చేస్తే... కోరుకున్న సీటు

Published Fri, Aug 19 2022 1:28 AM | Last Updated on Fri, Aug 19 2022 1:28 PM

TS EAMCET 2022: First Phase Counselling Will Start From 21st August - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 21 నుంచి ఎంసెట్‌ తొలిదశ కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలు­కానుంది. 1.56 లక్షల మంది ఇంజనీరింగ్‌ సీట్ల కోసం పోటీపడనున్నారు. 21, 22 తేదీల్లో స్లాట్‌ బుకింగ్, రిజిస్ట్రేషన్‌ ఉంటుంది. 23వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ ఆప్షన్లు ఇచ్చుకో­వచ్చు. కన్వీనర్‌ కోటా కింద దాదాపు 75 వేల సీట్లు ఉంటే, మరో 35 వేల వరకు మేనేజ్‌­మెంట్‌ కోటా సీట్లున్నాయి.

మొత్తం 1.10 లక్షల సీట్లున్నా, బీటెక్‌లో చేరుతున్నది ఏటా 80 వేల మందే ఉంటున్నారు. 58 శాతం వరకూ కంప్యూటర్‌ సైన్స్, దాని అనుబంధ కొత్త కోర్సులైన ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్, సైబర్‌ సెక్యూరిటీ, డేటా సైన్స్‌ వంటి కోర్సు­ల్లో­నే చేరుతున్నారు. ఈసారి డిమాండ్‌ లేని బ్రాంచీల్లో సీట్లు తగ్గాయి. దీంతో ఆచితూచి ఆప్షన్లు ఇవ్వాలని, గతంలో జరిగిన కౌన్సెలింగ్‌లను అధ్యయనం చేసి తమ ర్యాంకు ఆధారంగా ఒక అంచనాకు రావాలని, అప్పుడు టాప్‌ కాలేజీ కాకపోయినా కోరుకున్న బ్రాంచి దక్కే అవకాశం ఉంటుందని నిపుణులు సూచి­స్తున్నారు. అభ్యర్థులు ఎన్ని ఆప్షన్లయినా పెట్టుకు­నే అవకాశం ఉంది కాబట్టి  చివరి వరకు ఇచ్చే ప్రాధాన్యత­లు కీలకంగా మారనున్నాయి. 

టాప్‌ ర్యాంకుల్లో ఇలా..
ఆప్షన్లు ఇచ్చే విషయంలో తికమకపడి అస్పష్టతతో ఆప్షన్లు ఇస్తుంటారు. దీంతో కొంతమంది అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉంది. మొదటి దశ కౌన్సెలింగ్‌లో 500లోపు ఎంసెట్‌ ర్యాంకర్లు ఆప్షన్లు ఇస్తారు. వీళ్లల్లో చాలామంది ఆయా కోర్సుల్లో చేరే అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్లకు జేఈఈ వంటి ర్యాంకులు కూడా వచ్చి ఉంటాయి. 500–1000 లోపు ర్యాంకులు వచ్చిన విద్యార్థుల్లో 25% వరకే వచ్చిన సీటులో చేరుతుంటారు.

అంటే వర్సిటీ క్యాంపస్‌ కళాశాలల్లోనో, టాప్‌ ప్రైవేట్‌ కాలేజీల్లోనో చేరతారు. 1000–1500 ర్యాంకులు వచ్చిన విద్యార్థుల్లో 50% పైగా టాప్‌ టెన్‌ కాలేజీల్లో నచ్చిన బ్రాంచిలో చేరే వీలుంది. ఇక 1500 నుంచి 5 వేల ర్యాంకు వరకు వచ్చిన ఓపెన్‌ కేటగిరీ విద్యార్థులు ఇతర టాప్‌ కాలేజీ ల్లో కన్వీనర్‌ కోటా కింద అవకాశం దక్కించు కునే అవకాశం ఉంటుంది. వీరిలో 80% వచ్చిన సీటును వదులుకోవడం లేదు. ఏదో ఒక బ్రాంచిలో ఇష్టం లేకున్నా చేరి తర్వాత కౌన్సెలింగ్‌లో నచ్చిన బ్రాంచి దక్కించుకునే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. 

10 వేల ర్యాంకు తర్వాత...
విద్యార్థులు డిమాండ్‌ ఉన్న కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సు, టాప్‌ కాలేజీలకే తొలి ఆప్షన్‌ ఇస్తారు. ఇలాంటప్పుడు 10 వేల పైన ర్యాంకు వచ్చిన వారు కాస్త ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. గత ఐదేళ్ళ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ను పరిశీలిస్తే... 40 వేల ర్యాంకుపైన వచ్చిన వాళ్లు కూడా టాప్‌ కాలేజీలకు మొదటి ఆప్షన్‌ ఇస్తు న్నారు. కొంతమంది పోటీ ఉన్న బ్రాంచికి కాకుండా, సివిల్, మెకానికల్, ఈఈఈ వంటి బ్రాంచిలకు ప్రాధాన్యత ఆప్షన్లుగా ఇస్తున్నారు.

పోటీ లేదని, సీటు వస్తుందని భావిస్తారు. 10 వేల ర్యాంకు తర్వాత కూడా సీటు వచ్చే కాలేజీ ల్లో ఆప్షన్లు ఇవ్వడం లేదు. దీంతో వాళ్ల తర్వాత ర్యాంకు వారు ఆ కాలేజీలకు ఆప్షన్లు ఇస్తే వారికి సీటు వెళ్తుంది. వారు చేరితే టాప్‌ కాలేజీల్లో సీటు రాక తర్వాత కౌన్సెలింగ్‌లో ఆప్షన్లు ఇచ్చినా ప్రయోజనం ఉండటం లేదు. 

సరైన అంచనా అవసరం
ఆప్షన్లు ఇచ్చే ముందు తమకు వచ్చిన ర్యాంకు ప్రకారం గతంలో ఎక్కడ, ఏ కాలేజీలో సీటు వచ్చిందనే దానిపై ప్రాథమిక అంచనాకు రావాలి. వాటిల్లో నచ్చిన బ్రాంచిని ఎంపిక చేసుకునేందుకు మొదటి ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. 

ఈసారి మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్‌ సీట్లు తగ్గాయి. అయితే పోటీ పెద్దగా ఉండే అవకా­శం కన్పించడం లేదు. అంతా కంప్యూటర్‌ సైన్స్‌ గ్రూపుల వైపు వెళ్తున్నారు. కాబట్టి డిమాండ్‌ లేని కోర్సులు కోరుకునే వారు మంచి కాలేజీకి ప్రాధాన్యత ఇవ్వొచ్చు. 

వెయ్యిలోపు ర్యాంకులు వచ్చిన వారికి కౌన్సెలింగ్‌లో వచ్చే సీటు సాధారణంగా మంచి కాలేజీలోనే అయి ఉంటుంది. కాబట్టి కోరుకున్న కాలేజీ, బ్రాంచి.. తర్వాత జరిగే కౌన్సెలింగ్‌లో అయినా దక్కుతుందనే ధీమాతో ఉండొచ్చు. వీళ్ళు తుది దశ కౌన్సెలింగ్‌ వరకు వేచి చూసి, ఆ తర్వాతే సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయడం మంచిది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement