7 నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తొలిసారిగా వెబ్‌కౌన్సెలింగ్ ద్వారా నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల బదిలీల్లో మైనస్ పాయింట్లూ పరిగణనలోకి తీసుకోనున్నారు. బదిలీలకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి ఆర్పీ సిసోడియా ‘ఏపీ టీచర్స్ (రెగ్యులేషన్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్స్) రూల్స్’ పేరుతో జీవో నెంబర్ 63 విడుదల చేశారు. పనితీరు కింద ప్లస్ పాయింట్లతో పాటు లోపాలుంటే మైనస్‌పాయింట్లను పరిగణిస్తామని పేర్కొన్నారు. బదిలీల కోసం విభాగాల వారీగా జిల్లా, జోన్ల కమిటీలు ఏర్పాటుచేస్తున్నారు. బదిలీ షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ రూపొందిస్తారు.
అసెంబ్లీ సమావేశాలు, టీచర్స్‌డే కారణంగా సెప్టెంబర్ 7 నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభ మవుతుందని అధికారవర్గాలు వివరించాయి. 2015 ఆగస్టు 1 నాటికి ఒకే స్కూల్లో 8 ఏళ్లు సర్వీసు పూర్తయిన టీచర్లు, అయిదేళ్లు సర్వీసు చేసిన హెడ్మాస్టర్లు (రెండేళ్లలో రిటైర్‌కానున్న వారికి దీన్నుంచి మినహాయింపు). బాలికల హైస్కూళ్లలోని 50 ఏళ్ల లోపు పురుష హెచ్‌ఎంలు, టీచర్లు రెండేళ్లు సర్వీసు పూర్తిచేసిన వారు బదిలీ దరఖాస్తుకు అర్హులు. రేషనలైజేషన్లో వేరే స్కూలుకు మారే టీచర్లు సర్వీసుతో సంబంధం లేకుండా బదిలీ దరఖాస్తు చేయొచ్చు. స్కూళ్లున్న ప్రాంతాలను బట్టి కేటగిరీ 1కి 1, కేటగిరీ 2కు 2, కేటగిరీ 3కి 3, కేటగిరీ 4కి 5 పాయింట్లు. హెచ్‌ఆర్‌ఏ, రోడ్డు కనెక్టివిటీలను అనుసరించి ఆయా జిల్లాల కలెక్టర్లు ఈ కేటగిరీలను నిర్ణయిస్తారు.